Site icon Sanchika

ఓ మాట…!

[dropcap]మా[/dropcap]ట్లాడాల్సిన చోట మౌనం పిరికి తనానికి ప్రతీక

ప్రతీ మాటకూ పెడర్థాలు తీస్తున్నావనుకో
అనువుగాని చోట అనకూడని మాటన్నావనుకో
పెదవులు దాటిన మాట ఎటెల్తుందో తెలియదు
తలలు తెగే దాకా వచ్చినా రావచ్చు

మనుషుల మధ్య వేడి మాటల వడి-సడి పెరిగింది
వారి మనసుల్లో తడి ఇగిరింది

మాట ఇఛ్చి నిలుపుకోలేకుంటే
నీవు బ్రతికున్నా చచ్చిన వాడి కిందే లెక్క
నీ ఆస్తులు-అంతస్తులు, ఆడంబరాలు
వెలగబెట్టిన దర్జా అంతా దగ్దమైనట్టే

మాట ఇవ్వలేం – ఇస్తే నిలుపుకోలేమని భయం
ఎవడో ఇఛ్చిన మాటకు వాడిని కట్టుబడేలా చేయలేం

మాటి-మాటికీ మాట మారుస్తాం
ఇంత కన్నా చేతకాని తనమేముంది మనలో
అయ్యో మరిచి పోయామని నమ్మ పలుకుతాం
కానీ ఇలా చాన్నాళ్లు సాగదు.
ఓ నాడు మాటే తూటాలా తిరగబడి మన తాట తీస్తుంది.

To read between the lines అన్నట్లు
మాటల మాటున పరమార్థం తెలుసుకోకపొతే
ఉచిత కుచ్చు టోపీలు పెట్టి వెళతారు మన తలల మీద
అర్థం చేసుకోలేని వారితో ఓ మంచి మాటన్నా
అశుభం మీద వేసిన రాయిలా కంపవతుంది

మాటకు మాట దూస్తే మంటై లేస్తుంది
మనిషికీ-మనిషికీ మధ్య మాట కరువైతే
ఇక ప్రచ్ఛన్న యుద్ధం మొదలైనట్లే

నీ మాట గొంతుక నొక్కేస్తున్నారంటే
దగా-దోపిడీ మొదలైందన్న మాటే

Exit mobile version