Site icon Sanchika

ఓ మనసా రిలాక్స్ ప్లీజ్

[dropcap]ఆ[/dropcap]త్మ సంతృప్తియే ఆనందమయ జీవనానికి సోపానం. ఆది లేనిదే ఎన్ని వేల కోట్లు సంపాదించినా అవన్నీ వ్యర్థం. మానవుల అభ్యున్నతికి అసలే మాత్రం దోహదం చెయ్యవు. మానసిక ప్రశాంతత ఎంతో ముఖ్యమైనది, అమూల్యమైనది. మన సమాజంలో కోట్లకు పడగలెత్తిన వారెందరో మానసిక ప్రశాంతత లేక నరక ప్రాయమైన జీవితం అనుభవించడం, అందులో కొందరు హఠాన్మరణమో లేక ఆత్మహత్యలు చేసుకోవడమో మనం చూస్తునే వున్నాం.  వారికి భిన్నంగా మానసిక ప్రశాంతత అనుభవిస్తున్న వారు చక్కని ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ఎటువంటి చీకు చింతా లేక సంపూర్ణ ఆరోగ్యంతో జీవించిన వారూ మన మధ్య ఉన్నారు. ఏ మార్గంలో నడవాలో నిర్ణయించుకోవలసిన బాధ్యత మనదే.

పూర్వ కాలంలో మానవులు తన క్షేమమే కాక పరుల క్షేమాన్ని కూడా మనస్ఫూర్తిగా కాంక్షించేవారు. ఇతరులకు తమకు తోచిన విధమైన సహాయం కూడా చేసేవారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వలన ఒకరి కష్టాలను మరొకరు పంచుకునేవారు. సమస్యలు ఎదురైనప్పుడు అందరూ కలిసికట్టుగా ఎదుర్కొనేవారు. అందుకే ఆనాడు మన సమాజం అంత ఆరోగ్యకరంగా వుండేది. తమ నోటి వెంత ఒక అపశకునపు మాట కుడా రానిచ్చేవారు కాదు. మరి ఇప్పుడో? ప్రతీ వారికి స్వార్థం, అసూయా, ఈర్షాద్వేషాలు పెచ్చు పెరిగిపోయాయి. ఇతరుల కష్టాలను పంచుకోవడం అటుంచి వారి నీడ కూడా కిట్టని పరిస్థితి వచ్చేసింది. ప్రతీ వారికి ఇతరులు నాశనమైపోవాలి, తాము మాత్రమే బాగుపడాలన్న స్వార్థం వచ్చేసింది. ఆందరి మనసులలో విషతుల్యమైన ఆలోచనలే! మనస్సు రోగగ్రస్థమైపోవడం వలన ఆ ప్రభావం శరీరం మీద కుడా పడుతోంది. రాత్రికి రాత్రి కోట్లు సంపాదించెయ్యాలన్న దురాశ అన్నింటా కల్తీకి దారి తీస్తోంది. తత్ఫలితంగా ప్రతీ రోజు బాగవని కొత్త రోగాలెన్నో పుట్టుకొస్తున్నాయి. డాక్టర్లు, ఫార్మసిస్టులు లక్షలకు లక్షలు సంపాదించేస్తున్నారు. ప్రజల అనారోగ్యమే కొంత మంది పాలిట కల్పవృక్షమై పోయింది. యోగా, ధ్యానం, సాత్వికాహారం, ఆశావహ ధృక్పథంల వలన మానసిక స్థైర్యం అమితంగా పెరుగుతుంది. అందువలన కష్టాలను ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విజయం లభించడం వలన కలిగే సంతోషం వర్ణనాతీతం. వీటనిటి మూలంగా మన ఆరోగ్యం మెరుగౌతుంది. ప్రముఖ సింధీ యోగి అయిన శ్రీ సాధు వాశ్వాని “నీకు ఆనందం పొందాలని వుందా? అయితే ముందు ఇతరులకు ఆనందం పంచి ఇవ్వు. ఇతరులకు పంచి ఇచ్చిన ఆనందం వెయ్యింతలై తిరిగి నీ వద్దకే వస్తుంది” అని ప్రభోధించేవారు. ఈ కాలంలో స్వార్థం, అసూయాద్వేషాలే పరమార్థంగా బ్రతుకుతున్న వారందరూ నేర్చుకొని తుచ తప్పక పాటించ వల్సిన సూక్తి ఇది.

Exit mobile version