[box type=’note’ fontsize=’16’] ‘శారద’ రచించిన ‘రక్త స్పర్శ’ కథని ఓ మంచి పాత కథ అంటూ ఈ వ్యాసంలో విశ్లేషిస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు. [/box]
‘రక్త స్పర్శ’ (1963) – శారద (ఎస్. నటరాజన్)
[dropcap]తె[/dropcap]లుగు సాహిత్యములో చాలా విలక్షణమైన రచయిత, శారద అనే కలము పేరుతో రచనలు సాగించి పిన్న వయస్సులోనే స్వర్ఙ్గసుడైన ఎస్.నటరాజన్ నేటి తరానికి పూర్తిగా పరిచయము లేని, వినని పేరు. ఈయన కష్టజీవి, కష్టాల కొలిమిలో సమ్మెట దెబ్బలు తింటూ అనారోగ్యముతో పోరాడుతూ బ్రతుకు ఈడ్చిన అసాధారణ సాహిత్య చిరంజీవి. పదమూడేళ్ల వయస్సులో మధుకరము (భిక్షాటన) చేసుకుంటూ ఏడోతరగతి చదువుతూ పస్తులుండ లేక మద్రాసు మహానగరాన్ని వదలి 1937వ సంవత్సరములో తండ్రితో పాటు బ్రతుకు తెరువు కోసము ఆంధ్ర ప్యారిస్‌గా పేరెన్నిక గన్న తెనాలి రైల్వే ప్లాట్‌ఫారమ్ మీద కాలు మోపాడు. తెనాలికి ఆంధ్ర ప్యారిస్ అనే పేరు రావటానికి కారణము అప్పటికే తెనాలి ఎంతో మంది మహనీయ కళాకారులతో, సాహితీకారులతో విలసిల్లేది. అటువంటి తెనాలిలో భాగమై శారద పేరు చెబితే తెనాలి గుర్తు వచ్చేటట్లుగా మలచుకున్నాడు.
అవసరానికి మించిన గురువు, ఆకలికి మించిన రుచి లేదన్నట్లు తెనాలి చేరిన బాలుడు తెలుగు భాషను మమకారంతో అప్యాయముగా నేర్చుకున్నాడు. పద్యాలూ వల్లె వేయటం, గజేంద్ర మోక్షము కంఠస్థము చేయటమే కాకుండా చక్కగా పాడేవాడు. బ్రతుకు తెరువు కోసము అయన చేయని పని అంటూ లేదు. కాఫీ హోటల్‌లో సర్వర్‌గా చేస్తూ చదుకున్న వాడిలా కనిపించిన ప్రతివారినీ… “అన్నా తెలుగు పుస్తకాలుంటే ఇవ్వు చదివి ఇస్తాను”, అని అడిగేవాడు. ఆ క్రమములో త్రిపురనేని, కొడవటిగంటి, చలం, గోపీచంద్ వంటి రచయితల రచనలు చదువుతూ రంగస్థల కళాకారుల మధ్య తిరుగుతూ తన పరిధిని పెంచుకుంటూ తెలుగు భాష మీద పటుత్వాన్ని పెంచుకున్నాడు, దారిద్యము నేర్పిన అనేక అనుభవాలతో తనదైన శైలిలో రియలిజం ఆధారముగా రచనా వ్యాసంగము కొనసాగించేడు. అన్‌రియలిస్టిక్ ఆశతో పగలంతా పనిచేస్తూ రాత్రులు ఏడెనిమిది సంవత్సరాల పాటు అవిశ్రాంతముగా రచనలు చేస్తూ ఆశించిన రూకలు సంపాదించ లేకపోయినా, “ఎవరో తెనాలి హోటల్ బాయ్ శారదట, మంచి రచయిత” అన్న గుర్తింపు సాధించాడు. రచయితగా ఉన్న కాలములో అనారోగ్యము, ఆకలిదప్పులు అనేక రకాల ఈతి భాధలు ఈయన ఇంట కాపురము చేశాయి. ఇవేవి అయన రచనా వ్యాసంగాన్ని ప్రభావితము చేయలేదు. అయన కష్టాల కొలిమి నుండే సాహిత్యము జాలువారింది. పేరు సంపాదించుకున్నప్పటికీ డబ్బు సంపాదించుకోలేక 32 సంవత్సరాల వయస్సుకే తెలుగు సాహిత్యములో ఒక తమిళుడు తెలుగు నేర్చుకొని అనారోగ్యముతో అనేక ఈతి భాదలు అనుభవిస్తూ సాహితి చిరంజీవిగా శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు జీవించిన 32 ఏళ్ళ కాలములో సుమారు ఇరవై ఏళ్ళు తెనాలికి తెలుగు సాహిత్యానికి అంకితము ఇచ్చాడు.
తన రచనల ద్వారా తెలుగు నవలా సాహిత్యములో నిఖార్సైన వాస్తవికతను పాఠకులకు చూపిన సృజనకారుడు నటరాజన్ ఉరఫ్ శారద. తొలిసారిగా నటరాజన్ (శారద) రచన – జులై 1946లో ‘ప్రపంచానికి జబ్బు చేసింది’ అనే వ్యంగ రచన ప్రజాశక్తి పత్రికలో నటరాజన్ పేరుతో ప్రచురించ బడింది. 1948 జనవరిలో జ్యోతి సంచికలో ‘గొప్పవాడి భార్య’ అనే వ్యంగ కధనం శారద పేరుతో ప్రచురితము అయింది. అప్పటినుంచి నటరాజన్ కలము పేరు శారదగా స్థిరపడింది. తెల్ల అర చేతుల లాంగ్ క్లాత్ చొక్కా, ఎగ గట్టిన తెల్ల లుంగీ, పై జేబులో బీడీ కట్ట అగ్గిపెట్టె, చేతిలో కాగితాలు, అట్ట – పొడుగైన బక్క పలుచని ఆకారము, అందముగా దువ్వినట్లుండే ఒత్తు జుట్టు ఇదీ శారద స్వరూపము. హోటళ్లలో పనిచేసేటప్పుడు పెసరట్టు తయారీలో ఎక్స్‌పర్ట్. తెనాలిలో ఈయన పనిచేయని హోటల్ లేదని చెప్పవచ్చు. పెసరట్టు మీద కమ్యూనిస్టు పార్టీ గుర్తులు వేసేవాడు. అది చూసిన హోటల్ ఓనర్లు శారద ఒంటి మీద పెసరట్లు వడ్డించేవారు. హోటళ్లలో పనిచేసే ఇతర వర్కర్లకు శారద హీరో. ఎందుకంటే ఎన్నోన్నో చదువుతాడు, దేశవిదేశ రాజకీయాల గురించి చెబుతాడు, పద్యాలూ చదువుతూ మధ్యలో ఛలోక్తులు వేస్తూ ఉండేవాడు. వీటన్నికి తోడు అతనో కవి అంటే రాతగాడు. ఈయన జీవన యానంలో తెనాలిలో ఆయనకు సహకరించిన మిత్రులు తోటి సహచరులు అయన కుటుంబ జీవనము మొదలైన అంశాలను ఆయనతో వ్యక్తిగత పరిచయము ఉన్న వ్యక్తుల ద్వారా సేకరించిన సమాచారంతో ‘విహారి’ అనే రచయిత గారు ఒక పుస్తకాన్ని వ్రాస్తే సిపి బ్రవున్ అకాడమీ వారు దానిని ప్రచురించారు. నటరాజన్‌ను పూర్తిగా తెలుసుకోవాలంటే ఆ పుస్తకాన్ని చదవాలి.
ప్రస్తుతము ‘శారద కథలు’ అనే సంకలనం నుండి రక్త స్పర్శ (1963) అనే కథ గురించి మాట్లాడుకుందాము. ఈ కథ పూర్తిగా మధ్యతరగతి లక్షణాలను ప్రతిబింబించేది. అంటే అక్క తమ్ముడు మధ్య ఏర్పడే ఆర్థిక లావాదేవీలు. ఒక ప్రముఖ కవి అన్నట్లు మానవ సంబంధాలు అన్ని డబ్బు చుట్టూ పరిభ్రమిస్తుంటాయి అన్న సత్యాన్ని ఈ కథలో రచయిత చెపుతాడు. ఈ కథకు ఉపోద్ఘాతముగా మధ్య తరగతి లక్షణాన్ని వివరిస్తాడు. జీవితమంటే మజాకా కాదు అది ఒక అగ్ని గుండము. సంఘము ఒక వ్యక్తి జీవితాన్ని బాగుచేసినా, నాశనము చేసినా తన పని తానూ సంతోషించటమే సంఘము నైజము. సంఘానికి ఆత్మ ఉన్నదో లేదో అనేది నిర్ణయము కానీ విషయము, సంఘము తన లక్ష ఆత్మల్ని కోటి ఉద్దేశాలను వికృతంగా ప్రదర్శిస్తుంది. జేబులు కొట్టేవాణ్ణి దొంగ అని కోర్ట్‌లో శిక్షిస్తుంది. వ్యాపారములో మోసముతో నైనా లక్షలు ఆర్జించేవాడిని అదృష్టవంతుడని పొగుడుతుంది. ఒకణ్ణి చంపితే నేరమని, పదిమందిని చంపితే పరాక్రమమని మెచ్చుకుంటుంది. ఇదీమధ్య తరగతి లక్షణము. ఇంక కథలోకి వద్దాము.
కొత్తపేట మూడోలైను చివర పెంకుటింటికి చెందిన కరణము గారి అంతక్రియలు స్మశానంలో దక్షిణపు వైపు మూలగా జరుగుతున్నాయి. ఆయన కొడుకు ప్రసాదరావు, కూతురు (పెద్దది) అనసూయ మాత్రమే బంధువులు. భార్య పోవటం, మళ్లా పెళ్లి చేసుకోకపోవటంతో కరణము గారు వంటరి జీవితము కూతురు కొడుకుతో గడుపుతున్నాడు. కరణీకం వదులుకున్నా కరణము గారు అన్న పేరు స్థిరపడిపోయింది.
మాట మంచితనము వల్ల చుట్టాలు పక్కాలు ఎవరు రాకపోయినా ఇరుగు పొరుగున ఉన్నసాంబయ్య గారు, అవధాన్లు గారు ఇతరులు పూనుకొని అంత్యక్రియలు జరిపించారు. ఎందుకంటే కరణము గారు పోయేనాటికి అనసూయకు పదిహేను ఏళ్ళు, ప్రసాద రావుకు పన్నెండేళ్ళు. పెద్దది కాబట్టి తమ్ముణ్ణి ఓదార్చింది, తండ్రి పెట్టె వెతికితే దొరికిన డబ్బు అవధాన్లు గారి చేతిలో పెట్టి మిగతా కార్యక్రమాలు జరపమని చెప్పింది. పాపము అవధాన్లు గారు ఆ పైకము లెక్కపెట్టి తీసుకొని పాతికరూపాయలు తిరిగి అనసూయ చేతిలో పెట్టి కర్మకాండ అంతా చేయించాడు.
కరణముగారు పోయిన రెండు నెలలకు పొలము చేసే రైతు వచ్చి పెళ్ళికావలసిన ఆడపిల్ల, చదువుకోవాల్సిన మగపిల్లవాడు ఎలా బ్రతుకుతారో అని సానుభూతి చూపించి కౌలు డబ్బులు నూట ఎనభై రూపాయలు చేతిలోపెట్టి అనసూయ బలవంతము మీద భోజనము చేసి జాగ్రత్తలు చెప్పి వెళ్ళి పోయాడు. అనసూయ తమ్ముడిని ఫస్టు ఫారమ్ చదవటానికి హైస్కూల్లో చేర్పించింది. అవధానిగారు అయన భార్య వాళ్లకు పిల్లలు లేకపోవటంతో వీళ్లకు అండగా ఉంటూ కరణము గారి ఇంట్లో ఒక భాగము అద్దెకి ఇప్పించి నెలకు ఎనిమిది రూపాయలు వచ్చే వీలు కల్పించాడు అవధాని గారు. అంతటితో ఊరుకోకుండా అనసూయకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
తల్లిదండ్రి ఆస్తిపాస్తులు లేని మేనమామ ఇంట్లో ఉంటూ పాతిక రూపాయల ఉద్యోగము చేస్తున్న యువకుడిని వరుడిగా తెచ్చి వెండి చెంబులు, పట్టుబట్టలు, పెండ్లి ఖర్చులతో పెళ్ళి జరిపించాడు. ఈ పెళ్లి వల్ల వరుడు వెంకట్రావు కూడా కరణము గారి ఇంట్లోనే ఉంటాడు. వెంకట్రావు నెమ్మదస్తుడు అనసూయతో అన్యోన్యముగా ఉంటూ బావమరిది ప్రసాదరావు చదువుకు సహకరిస్తూ ఉంటున్నాడు. ఇది చూసిన ఆవథాని గారు సంసారము సజావుగా జరుగుతున్నందుకు చాలా సంతోషించారు.
తమ్ముడిని బిఏ చదివించాలని అనసూయ కోరిక. సంవత్సరము గడిచిందో లేదో ఒకరోజు వెంకట్రావుకు తలనొప్పి ప్రారంభమయి జ్వరము తగిలింది. డాక్టర్ ట్రీట్‌మెంట్ ఇప్పించినా ఫలితము లేకపోయింది. వెంకట్రావు చనిపోయినాడు. ఇంకేముంది మొగుడు పోయిన దుఃఖముతో ఉన్న అనసూయను వెంకట్రావు బంధువులు ఈ ముదనష్టపు పెళ్లి చేసుకోబట్టే చచ్చాడు అని తిట్లు శాపనార్ధాలు పెట్టి వెంకట్రావు అంత్యక్రియలు అయిపోయినాక ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోయారు. మళ్ళీ అవధాన్లు గారు, అనసూయ ప్రసాదరావు మిగిలారు. పదిహేడు ఏళ్లకే అనసూయ విధవరాలుగా మిగిలింది. అవధానిగారికి ఎలా ఓదార్చాలో అర్థము కాలేదు. రోజులు గడిచిన కొద్దీ జరిగిన వాటిని మరచిపోక పోతే జీవితము దుర్భరమవుతుంది. ఇప్పుడు అనసూయకు తమ్ముడి అభివృద్దే ముఖ్యమైన ధ్యాస. జీవితములో సుఖ భాగ్యాలకు తిలోదకాలు ఇచ్చి సంఘనీతికి బద్ధురాలై నూరేళ్ళు నిండిన వయోవృద్ధురాలుగా అనసూయ కనపడసాగింది. కానీ భర్త కలిగించిన కొత్త సుఖావశేషము ఆమెను అర్థము కానీ ఆందోళనలో పడేసింది. అయినప్పటికీ ఆ ఆందోళనను పక్కకు నెట్టి తన దృష్టిని పూర్తిగా తమ్ముడు ప్రసాదరావు పైనే కేంద్రీకరించి, వాడు ఒక్కొక్క క్లాసు ఎదుగుతుంటే సంతోషించింది.
కానీ ప్రసాదరావు మాత్రము అక్క త్యాగాన్ని కష్టాన్ని గుర్తించకుండా సిగరెట్లు సినిమాలకు అలవాటు పడ్డాడు. ఫలితముగా చదువు బోల్తా కొట్టింది. అయినప్పటికీ తన కష్టాలను తమ్ముడికి తెలియనివ్వకుండా అడిగినంత డబ్బు ఇస్తూ చదువుకు తోడ్పడుతున్నాని అనుకుంటుంది పాపము అనసూయ. తమ్ముడి దుబారా ఖర్చులకు డబ్బు అవసరమైతే అవధానిగారు ద్వారా పొలము చేసే రైతుకు కబురుచేసి రెండు సార్లు పైకము తెప్పించుకుంది. అవధానిగారు “ఇలా దుబారా అయితే ఎలాగమ్మా?” అని హెచ్చరించాడు. “నాకు వాడి అవసరాల కన్నా ఏది ఎక్కువ కాదు బాబాయ్. వాడికోసము అడగాల్సి వచ్చింది” అని అనసూయ అవధానిగారితో అంటుంది. ఆ విధముగా రైతు రామిరెడ్డి కొడుకు శేషిరెడ్డి పైకము తీసుకొచ్చిఇస్తాడు. శేషిరెడ్డి మంచి చెడు తెలిసిన పల్లెటూరి రైతు బిడ్డ. నెమ్మదిగా కరణము గారు పొలము తాకట్టు పెట్టిన సంగతి తాకట్టు విడిపించుకోకపోతే వచ్చే యేడు పంట రాదు అని చావు కబురు చల్లగా చెప్పాడు.
ఇదేమి ఖర్మరాబాబు అని దిగుపడుతున్న అనసూయను శేషిరెడ్డి ఓదార్చి ఈ కిత్తా పంట డబ్బులు రెండు వందల యాభై ఇచ్చి తాకట్టు విడిపిద్దాము అని చెపుతాడు. తాకట్టు విడిపోతుంది. మరి తమ్ముడి చదువు తిండి తిప్పలు ఎలా? అని అనసూయ ఆందోళన చెందుతుంటే, “భయపడకండమ్మా ముందు మా ఆయ్యా పైకము కడతాడు తర్వాత నెమ్మదిగా మనము సర్దుకోవచ్చు” అని భరోసా ఇస్తూ, “మీరు కొంచము పొదుపుగా కాలము వెళ్ళబుచ్చాలి” అని సలహా ఇచ్చి సినిమాకు వెళతాడు. అద్దెకు ఉంటున్నఅన్నపూర్ణమ్మతో తన కష్టాలు చెప్పుకుంటున్నప్పుడు తమ్ముడు హడావుడిగా వచ్చి “అన్నం పెట్టు, రెండవ అట సినిమాకు పోవాలి” అని అక్క దగ్గర డబ్బులు తీసుకొని వెళతాడు.
ప్రసాదరావు ఆ ఏడూ పరీక్ష తప్పుతాడు, అయినప్పటికీ అనసూయ ఏమి అనదు. ప్రసాదరావు ఖర్చులు పెరుగుతున్నాయి రెండు మూడు వందల రూపాయల ఖర్చు కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేయటము, కొత్తవాళ్లు రావటము జరిగింది. కొత్తగా వచ్చిన 30 ఏళ్ల సోమసుందరం వ్యాపారస్తుడు. ఇల్లు కట్టుకుంటూ ఆ ఇల్లు పూర్తి అయేవరకు ఇక్కడ ఉండటానికి పదిహేను రూపాయల అద్దెకు దిగాడు. భార్య గర్భిణీ అవటముతో పుట్టింటికి పంపి హోటల్లో భోజనము చేస్తూ కాలము గడుపుతున్నాడు. సోమసుందరం అనసూయ అందానికి కాస్త చలించాడు కానీ అనవసరము అయినా సిగ్గు ఘోష నియమాలు లేని అనసూయ ఇవేమి పట్టించుకోలేదు. సోమసుందరం అనసూయను ఎలాగైనా పలకరించాలని తాపత్రయ పడుతూ చివరికి, “ఏమండి మంచి నీళ్లు ఇస్తారా?” అని అడగటం సంభాషణ ఇంకాస్తా పొడిగించి హోటల్ భోజనము తినలేకపోతున్నానని అనటం; “పోనీలెండి నేనే వండిపెడతాను ఏమంత భాగ్యము” అని అనసూయ అనటం జరిగింది. అయితే సోమసుందరం ఆశయము అంతటితో ఆగలేదు. స్త్రీ అందునా ఒంటరి స్త్రీ కంటబడితే మగవాడు తన నిజ స్వరూపము చూపక మానడు. క్రమముగా అనసూయలో కూడా కొద్దిగా మార్పు రావటము, కారణము ఏదైనా అనసూయ ఒళ్ళు గగుర్పాటుకు లోనవటము సోమ సుందరము ఆశయము నెరవేరటం జరిగినాయి. ఒక రాత్రి అనసూయ సోమసుందరముతో తన ఆర్థిక పరిస్థితిని ఇబ్బందులను హృదయము ద్రవించేలా చెప్పుకుంటే సోమసుందరం తక్షణమే నాలుగు వందల రూపాయలు ఇచ్చి,”నువ్వు డబ్బుకు ఇబ్బంది పడకు, లోకులు నిన్ను ఆడిపోసు కుంటారన్న భయము కూడా వద్దు. అన్ని నేను చూసుకుంటాను” అని భరోసా కూడా ఇచ్చాడు. “పోదురు లోకము నన్నేమైనా ఉద్ధరించిందా? తమ్ముడు చదువు పూర్తి అయి వాడు సంపాదనపరుడు అయితే అందరు అప్పుడు అందరూ మూగుతారు” అని ధైర్యముగా చెప్పింది “అయితే మనకు చిక్కేలేదు” అని సోమసుందరం అంటాడు.
ప్రసాదరావు చదువు ఎస్.ఎస్.ఎల్.సి. లో పడింది. అక్కని సైకిల్ కొనిపెట్టమని అడుగుతాడు. సోమసుందరం భార్య రావటము వల్ల అనసూయకు సోమసుందరాన్ని ఏకాంతముగా కలవటం కుదరలేదు. సోమసుందరం భార్యతో అనసూయను తెగ పొగుడుతూ ఏ మాత్రము అనుమానము రాకుండా మేనేజ్ చేస్తున్నాడు. అనసూయ కూడా ఇద్దరి మధ్య వున్నా వయో భేదమును బట్టి సోమసుందరాన్ని ‘మామయ్యా గారు’ అని సంభోదిస్తూ సోమసుందరం బావి దగ్గర స్నానము చేస్తున్నప్పుడు, “మామయ్యా గారు తమ్ముడు సైకిల్ కావాలని అంటున్నాడు. పైకము ఇస్తాను ఒకటి బేరము చేసి కొనిద్దురూ” అన్నది లోక్యముగా. “సరే దానిదేముంది కొన్నాక లెక్క చెపుతాను డబ్బులు ఇవ్వచ్చు” అని సోమసుందరం అంటాడు. ఎవరికీ అనుమానము రాకుండా వ్యవహారాన్ని అనసూయ నడిపింది.
పొలము చేసే రైతు కొడుకు శేషిరెడ్డి తరచుగా అనసూయ ఇంట్లో మకాము వేస్తున్నాడు. శేషిరెడ్డి కాస్త ఉన్నవాడనే చెప్పవచ్చు ఒకరోజు రాత్రి పదిగంటలకు సినిమాచూసి అనసూయ ఇంటికి వస్తాడు అనసుయ అతనికి భోజనము పెట్టింది భోజనము చేస్తున్న శేషిరెడ్డి కళ్ళు అన్ని అనసూయ మీదే ఉన్నాయి.
కానీ ధైర్యము చాలలేదు. వసారా లో పడుకున్న శేషిరెడ్డి దగ్గరకు అనసూయ వచ్చి, “బాబుకు ఫీజ్ కట్టాలి ఎల్లుండి కల్లా వంద కావలి సర్దగలవా?” అని అడిగింది. “దానిదేముంది సర్దుతాను” అని చెప్పాడు. అనసూయ శేషిరెడ్డిలో మార్పుకి సంతోషిస్తూ మంచినీళ్లు కావాలా అని అడిగి తెచ్చిన అనసూయ చేయి, శేషిరెడ్డి ఏమయితే అది ఐందిలే అని సరదాగా పట్టుకున్నాడు. అనసూయ నిరాకరించలేదు. తెల్లారినాక శేషిరెడ్డి తన ఊరు వెళ్లి వందకి వందన్నర తెచ్చి అనసూయ చేతిలో పెట్టాడు. “సాలుకి ఇంత అని చెల్లేసు కుందువుగానిలే” అని మర్యాదకు అంది. అర్థము చేసుకున్నశేషిరెడ్డి కూడా హుందాగా సరే అని వెళ్ళాడు.
తానూ చేస్తున్నది నీతి బాహ్యమైనది అని తెలిసిన రెండు కారణాలచేత మానలేక పోతుంది. శరీరము అన్న తరువాత కోర్కెలు ఉంటాయి. వాటిని నిరోధించే బలము 21 సంవత్సరాలు కూడా నిండని తనకు లేవు, రెండోది తన ప్రియులు తనను గౌరవముగా చూస్తూ తన ఆర్థిక అవసరాలు తీరుస్తున్నారు. తానూ అంత డబ్బును న్యాయమార్గములో సంపాదించటం అసాధ్యము అని అనసూయకు తెలుసు. ఆ విధముగా తనకు తానూ ధైర్యము చెప్పుకుంటూ కాలము గడుపుతుంది. అనసూయ గుణము నోరు మంచిది అవటం వల్ల ఏ రకమైన ఇబ్బంది ఇతరులతో రాకుండా మేనేజ్ చేస్తూ ఉంటుంది. సోమసుందరం గారి కూతురు బారసాల కార్యక్రమములో లోపల ఉండి అనసూయ అంతా తన చేతుల మీదుగా నడిపించింది.
ప్రసాదరావు స్కూలికి వెళ్ళేదారిలో ఒక బీద ప్లీడర్ గుమాస్తా కూతురు సీతతో ప్రేమ వ్యవహారాలు మొదలు పెట్టాడు. సీత ప్రసాదరావు తనను పెళ్లాడతానని వాగ్దానము చేయించుకొని డబ్బులు తీసుకోవటం మొదలు పెట్టింది. సీతను ప్రసాదరావు ప్రేమిస్తున్న సంగతి తెలిసినా కూడా సీత తల్లిదండ్రులు ఏమి అనలేదు. ఖర్చు లేకుండా ఒక పిల్ల పెళ్లి అవుతుంది అన్న ఆశ వాళ్లకు పాపము. ప్రసాదరావు కష్టపడి మాయ మాటలు చెప్పి సీతను లొంగదీసుకున్నాడు. పాపము సీతకూడా తనను పెళ్లి చేసుకుంటాడు అన్న నమ్మకంతో ప్రసాదరావు కౌగిట్లో ఒరిగిపోయింది.
ఇది జరిగిన రెండు నెలలకే పై చదువులకని ప్రసాదరావు మద్రాసు వెళ్లాలని మాయ మాటలు చెప్పి మద్రాసు వెళ్ళిపోయాడు. ప్రసాదరావు మద్రాసు వెళ్ళినప్పటినుండి అనసూయకు వాడి పెళ్లి దిగులు పట్టుకుంది. ఎక్కడ ఏ ఆడపిల్ల వలలో పడతాడో అన్న భయము. అవధాని గారి సలహా మేరకు అనసూయ వాడి పెళ్లి విషయము సోమసుందరం గారికి అప్పజెప్పింది. ఆయన కూడా అదెంత పని మా చుట్టాల్లో అమ్మాయిని చూసి పెళ్లి చేసేద్దామని భరోసా ఇచ్చాడు. అలాగే అన్నమాట ప్రకారము వాళ్ళ చుట్టాల్లో ఒక సంబంధము చూసాడు. అనసూయ ఆ వివరాలను ప్రసాదరావుకు వ్రాసింది. పిల్ల తండ్రి ఆస్తిపరుడు, పలుకుబడి గలవాడు. పిల్ల బాగానే ఉంటుంది. ఈ విషయాలు ఉత్తరము ద్వారా తెలుసుకున్నప్రసాదరావు బోలెడు సంతోషించాడు. సీతను మరచిపోయాడు కానీ సీత ఉత్తరాలు వ్రాస్తూ ఉంది. సీత వ్రాసిన ఉత్తరాల్లోని ఒక విషయము ప్రసాదరావును కలవర పెట్టింది, అది ఏమిటి అంటే సీత గర్భవతి. ఎట్లాగయినా తనను పెళ్లి చేసుకొని గట్టెక్కించామని వేడుకుంటూ ఉత్తరము వ్రాసింది. కానీ ఒక్క క్షణము సీత గుర్తుకు వచ్చిన ఇలాంటివి లెక్క చేయకూడదని నిర్ణయానికి వచ్చి పెళ్లి సంబంధానికి అంగీకారము తెలుపుతూ అక్కకు ఉత్తరము వ్రాసి పెళ్లి కుదిరిన సందర్భముగా కులాసాగా స్నేహితులతో టీ పార్టీ చేసుకున్నాడు.
మనము సంఘము అని పిలిచినా లోకము అని పిలిచినా నలుగురు ఒకచోట చేరి పోచికోలు కబుర్లు అవి కూడా ఇతరుల గురించి మాట్లాడుకోవటం మానవ నైజము. అలాగే ఒకరోజు సోమసుందరం గారి అధ్యక్షతన దీక్షితులు, అవధాన్లు గారు, కళ్యాణసుందరము, ఇతరులు సమావేశము అయి చర్చలో అనసూయ ఖర్చుల గురించి చర్చకు వచ్చింది. అవధాన్లు గారు సోమసుందరం ఉండటం వలన అనసూయకు మాట రాకుండా సర్దారు. ఆ విషయము అవేళ రాత్రి సోమసుందరము అనసూయతో, “నిన్ను ఏ మాత్రము ఆక్షేపించటానికి వీలు లేకుండా చేసాను. అయినా నీ తెలివితేటలూ సామాన్యంగావు”, అని మెచ్చుకోలుగా చెపుతాడు. పనిలో పనిగా ఒక ఇల్లు అమ్మకానికి వచ్చింది నీ పేరునా కొనమంటావా అని సోమసుందరం అడుగుతాడు. తమ్ముడి పెళ్లి తరువాత తనకంటూ ఓ జానెడు కొంప ఉండొద్దా, కొనండి అని అనసూయ చెపుతుంది. అయితే కొనేస్తానని సోమ సుందరం భరోసా ఇస్తాడు.
ప్రసాదరావు పెళ్ళికి ఏర్పాట్లు అన్ని జరిగినాయి. కట్నము వెయ్యినూట పదహార్లు, అల్లుడికి 50/- రూపాయల రిస్ట్ వాచ్, పైగా బ్యాంకులో ఉద్యోగమూ ఇప్పిస్తానని మాట కూడా ఇచ్చాడు పెళ్లికూతురు తండ్రి. ప్రసాదరావు చదువు పూర్తిచేసుకొని మదరాసు నుండి వచ్చాడు. అనసూయ పెళ్ళికి ముందు అంటే స్నాతకానికి ముందు సత్యనారాయణ వ్రతము చేసి అందరిని భోజనాలకు పిలిచింది. పాపము అవధాన్లుగారికి కరణము గారు గుర్తుకు వచ్చి బాధపడ్డాడు. అనసూయ కుడా చాటుగా కళ్ళు ఒత్తుకుంది. ఈ సందట్లోనే ఎవరో మెల్లగా పక్కనున్నఆవిడతో, “విన్నావా? ప్లీడరు గుమాస్తా కూతురు సీత నిన్న రాత్రి బావిలో పడి చచ్చిందిట” అంటుంది, ఎందుకు అని పక్కావిడ అడుగుతుంది. “ఏముంది కాలుజారింది” అని చెపుతుంది. ఈ విషయము ఆనోటా ఈనోటా ప్రసాదరావు చెవికి చేరింది. కాసేపు మౌనముగా ఉండి ఆ తరువాత పూర్తిగా సీతను మరచిపోయి ఏమి ఎరగనట్టు ఉన్నాడు. కానీ పెళ్లి పీటల మీద ఉన్నంతసేపు సీత రూపము తన ముందే నిల్చున్నట్లు ఉండేది. అధర్మము అలా కనిపిస్తుందని గుండె రాయి చేసుకున్నాడు.
సీత ఎందుకు చచ్చిందో విచారించే తీరిక ఓపిక ఎవరికీ ఉంది? ఒకవేళ ప్రసాదరావే సీత మరణానికి కారణమని ఈ నిర్జీవ సంఘానికి తెలిసినా, ఆడది తొందరపడితే మగవాడు ఊరుకుంటాడా అని సమాధానము చెప్పుకుంటారు. ఎంత దాచిన ఏ విషయమయిన ఎన్నాళ్ళో దాగదు. అనసూయకు ప్రసాదరావు చేసిన ఘనకార్యము వల్లే సీత చనిపోయిందని ప్రసాదరావు మద్రాసు వెళ్లినాక తెలిసింది. లోలోపల బాధపడింది. కోపము వచ్చింది. సీత విషయము ఇంతకన్నా ఏ మాత్రము పోక్కలేదు, కారణము దౌర్భాగ్యుడైన ప్లీడర్ గుమస్తా ఊరు వదిలి వెళ్లి పోవటమే. అక్క పంపే డబ్బుతోను మామగారు పంపే డబ్బుతోను ప్రసాదరావు మద్రాసులో కాపరం పెట్టి హుషారుగా చదువు కొనసాగిస్తున్నాడు. భార్య రాజ్యము పట్ల పూర్తిగా ఆకర్షితుడైనాడు. కొన్నాళ్ల పాటు తమ్ముడి దగ్గర ఉండి కొత్తకాపురానికి కావలసినవన్నీ సమకూర్చి అనసూయ తిరిగి వచ్చింది. తరువాత రాజ్యము తన లోపల కుములుతున్న విషయాలను భర్త దగ్గర ఒక్కొక్కటే బయట పెట్టనారంభించింది “ఏమండి విన్నారా? మీ అక్కయ్య తన పేరా రెండెకరాలు కొనుక్కుదిట కదా?” అని ఆశ్చర్యము కలుగజేయాలన్న స్వరముతో. కొనుక్కుంటే తప్పేంటని ప్రసాదరావు మందలింపుగా భార్యతో అంటాడు. “తప్పేమీలేదు పరువు పోతే చాలదా?” అని నెమ్మదిగా మంట పెట్టింది. “మీ ఆక్కయ్యకు డాబా, ఆ పొలాలు, చేతి గాజులు మెళ్ళో గొలుసు ఎలా వచ్చాయి” అని ఆశ్చర్యముగాను ద్వేషము తోనూ భర్తను తన వైపు మరల్చుకొనే బుజ్జగింపు స్వరముతో భర్తను రాజ్యము నిలదీసింది. ఈ మాటలు వినేటప్పటికీ ప్రసాదరావు గుండె ఒక నిముషము ఆగినంత పని అయింది ఆతను ఇదివరకే ఊళ్ళో విన్న గాలి వార్తల వల్ల అక్క ప్రవర్తన మీద కాస్త అనుమానముగా ఉన్నాడు. “ఇంతకీ నువ్వు ఏమంటావు”అని భార్యను ప్రశ్నిస్తాడు. భర్త పూర్తిగా తన వైపుకు వచ్చాడని నిర్ధారణకు వచ్చిన రాజ్యము చాలా చక్కగా ఉపదేశము చేసినట్లు వదిన గారి మీద ఉన్న అక్కసు అంతా చాలా లౌక్యముగా భర్త ముందు వెళ్లగక్కింది. తల తిరిగిన ప్రసాదరావు మరుసటిరోజే మద్రాసు నుంచి ఊరు బయలుదేరాడు. హఠాత్తుగా దిగిన ప్రసాదరావును చూసిన అనసూయ కంగారుపడి కుశల ప్రశ్నలు వేస్తుంది. ప్రసాదరావు గుండెను కుదుటపరచుకొని, “కోప్పడకు అనసూయ, నీకింత డబ్బు ఎక్కడిది?” అని సీరియస్‌గా అడిగాడు. ఎప్పుడు పేరు పెట్టి పిలిచి ఎరగని తమ్ముడు ఈ విధముగా డబ్బు ఎక్కడిది అని అడిగేసరికి తమ్ముణ్ణి తేరిపారా చూసి పరిస్థితి అర్థము చేసుకొని తన సహజమైన శాంత గుణముతో, “ఇప్పుడా జిజ్ఞాస అకస్మాత్తుగా ఎందుకు వచ్చింది?” అని అడిగింది “ముందు డబ్బు సంగతి చెప్పు నా జిజ్ఞాస సంగతి తరువాత చెపుతాను”అని కోపముగా అంటాడు. అనసూయకు భయము పోయి చాలా ఏళ్ళు అయింది కాబట్టి తమ్ముడి కోపానికి ఏ మాత్రము భయపడలేదు. శాంతముగా “మనకు పొలాలు ఉన్న సంగతి తెలియదా?” అని అంటుంది “ఈ పదేళ్ల నుంచి నా ఖర్చు నీవు కొన్న డాబా, పొలాలు అన్ని పొలాల ఆదాయమని నన్ను నమ్మమంటావా?” అని ప్రసాదరావు గర్జించాడు. “నీవు నన్ను జమా ఖర్చుల అడగటానికి వచ్చావా? లోకము తరుఫున వకాల్తా పుచ్చుకొని వచ్చావా? నీకింద వందలు వేలు ఖర్చు అవుతుంటే అప్పుడు ఊరుకొని ఇప్పుడు లెక్కలు అడుగుతున్నావా? నేను ఏమి చేసిన నీ బాగు కోసమే ఇప్పుడు ఇలా నన్ను నిలదీసే హక్కు నీకు లేదు” అని అనసూయ నిక్కచ్చిగా చెప్పింది. ప్రసాదరావు ఏమి మాట్లాడలేకపోయినాడు కానీ అతనిలో పనిచేస్తున్న సంఘ మర్యాద ఊరుకోనివ్వలేదు.
“నన్ను ఇలా అన్యాయమైన డబ్బుతో అభివృద్ధి చెయ్యాలని నిన్నుఎవరు బలవంత పెట్టారు? నేను ఏ మోహము పెట్టుకొని నలుగురిలో తిరగగలను? నా పరువు మర్యాద పోయినాక ఈ బ్రతుకెందుకు? డబ్బెందుకు?” అని నిష్ఠురంగాను పశ్చాత్తాపము కలిపిన స్వరముతో అంటాడు. “నేను చేసిందల్లా నావరకూ ఉంటుంది. నన్ను ఆక్షేపించే ధైర్యము ఎవరికీ లేదని ఇదివరకే ఋజువయింది. ఉంటే నీకు పెళ్లి అయ్యేది కాదు. నీవు నా గురించి దిగులు పడనవసరం లేదు. నేను అవినీతిగా ప్రవర్తించాను, సరే నువ్వు వెనక్కి తిరిగి ఆలోచించు. నీ మూలముగా ఒక నిండు ప్రాణము తనతో ఒక శిశువును కూడ బావిలో దూకి ప్రాణాన్ని తీసుకుంది. నువ్వేమి న్యాయము చేసావని నన్ను ఆక్షేపిస్తున్నావు? నేను ఎవరిని ఆత్మహత్య లకు పురిగొల్పలేదు, ఎవరిని మోసము చేయలేదు. ఒక ఆడపిల్ల ప్రాణము తీసిన నువ్వు మర్యాదస్తుడిగా తిరిగే నీకు నేను అమర్యాద చేసిన దాన్ని అయినాను కదా?” అని అనసూయ కోపముతో వణికి పోయింది.
ఎదురు దాడి ఊహించని ప్రసాదరావు చప్పున లేచి నుంచుని, “నువ్వు పెంచి పెద్ద చేసినందుకు నిన్ను ఏమి అనకుండా వెళ్ళిపోతున్నాను. ఇక నీ ఇష్టము” అనేసి గబగబా వెళ్లి పోయాడు. అనసూయ తమ్ముడు వెళ్లిన వైపే చూస్తూ పిచ్చిదానిలా నిలబడి పోయింది. ఆమె కళ్ళ నుండి అప్రయత్నముగా కన్నీళ్లు ధారగా ప్రవహించినాయి. ఎంతైనా రక్తస్పర్శ కదా, తమ్ముడు దూరము అయినాడని బాధతో వచ్చిన కన్నీళ్లు అవి.
ఒక మహానుభావుడు అన్నట్లు “బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్”. అదే తెలుగులో రక్త స్పర్శ.