[box type=’note’ fontsize=’16’] “కిరణాన్నై వచ్చిన నాకు వెలుగును చేసి నిలుపుకునే కాసింత చోటిస్తే చాలు” అంటున్నారు డా. విజయ్ కోగంటి “ఓ మెరుపునై నిలిచే చోటు కోసం…” కవితలో. [/box]
[dropcap style=”circle”]అ[/dropcap]వును
మొత్తం మొత్తం గా
నా కిరణాల గుంపులన్నీ
నీకే కావాలంటావు
అది నాకిష్టమే
వాటితో ఒక పొదరిల్లు కట్టి
నా మాటలనే పలకరిస్తూ
ఉండిపోతానంటావు
అదీ నాకిష్టమే
నేనేమో
వర్ణ వర్ణాలుగా చీలి
ఆకుల మీద
నీటి అలల మీద
సాలె గూళ్ళ మీద గూడా
మెరుస్తూ నిలిచి
బయటకు రాలేకుంటాను
ఆ చోటులన్నీ
ఎలా నాకోసం నిలిచాయో
నేనూ అలా ఎందుకు
అలవాటుగా నిలిచి పోతానో
నాకూ తెలియదు
అన్ని రంగుల ఛాయలూ తెచ్చి
ఒకే జ్వలిత కిరణమౌతూ
నీ ముందే నిలవాలనీ ఉంది
మళ్ళీ ఇంకొక సరికొత్త వర్ణాన్నై పోయినా సరే
అన్ని చోట్లా నిలిచిపోతున్నందుకు
నన్నెవరూ క్షమించకున్నా సరే
కిరణాన్నై వచ్చిన నాకు
వెలుగును చేసి
నిలుపుకునే కాసింత చోటిస్తే చాలు.