ఓ నవ సమాజ ఆశాకిరణమా… ఎవరు నీవు…?!

0
2

[box type=’note’ fontsize=’16’] ఇటీవల హైదరాబాద్లో ఎర్రగడ్డ ప్రాంతంలో జరిగిన సంఘటన ప్రేరణతో ఈ కవిత రచించారు కవయిత్రి. [/box]

[dropcap]వీ[/dropcap]రుడా! శూరుడా! ధీరుడా!
మహాయోధుడా! యువకుడా ఎవరునీవు?!
పెనుగాలిలా – ఉప్పెనలా – హుద్ హుద్ తుఫాన్‍లా –
ఒక్కసారిగా ముష్కరుడి పై విరుచుకుపడ్డావు… ఎవరునీవు…?!
యే ఒక్కరు… ఒక్క అడుగు ముందుకు వెయ్యిడానికి….
భయకంపితులై… చిరుప్రయత్నమైన చేయకుండా –
అలా స్థాణువులై, నిశ్చేష్టులై, నిర్వీర్యులై, నిస్సహాయులై దిష్టిబొమ్మల్లా నిలుచున్న…
ఆక్షణాన్న… ఆ భయంకర క్షణాన…
కాలభైరవునిలా, రుద్రమూర్తిలా….
మహోగ్ర ఆక్రోశ అగ్ని కెరటంలా…
ఎటునుంచి వచ్చావు వీరుడా!
అందరూ ఉలిక్కిపడేలా చేశావు…
ఏమని అక్షరీకరించను?! – నీ సాహసోపేతం…?
– నిజమౌ… మానవత్వం… నీదేనోయ్ – అననా!
మందు మైకంతో మస్తిష్కం సరిగ్గా లేక
పరువుకోసం… కులకుష్టి “కత్తి”తో
కన్న కూతుర్నే నడిరోడ్డున నరుకుతోన్న నరకాసురుడ్ని
వాయువేగంతో వచ్చి ఢీకొన్నావు…
ఏ అస్త్రశస్త్ర ఆయుధం లేని నువ్వు –
మనస్థర్యమే ఆయుధంగా ముట్టడించావు
ఆ అబల ప్రాణం నిలిపావు…
ఎవరు నీవు? ఎవరు నీవు అజ్ఞాతవీరుడా!
నవశక్తి, యువశక్తి, భుజశక్తి
అక్కరకు రాని ఒట్టి పర్యాయపదాలే.
ఒక్కరంటే ఒక్కరైనా కానరాని కార్పొరేటు మాయాజాలంలో
అంతటా “ఆత్మ” దరిద్రులతో పరివ్యాప్తమైన వర్తమాన భారతంలో
ఎక్కడ నుంచి పుట్టుకువచ్చావు….? ఏ తల్లి… ఏ తండ్రి… కన్నారు నిన్ను?
ఏ గురువు దగ్గర మానవీయ పాఠాలు నేర్చుకున్నావు?
ఇంతటి మొక్కవోని మానవత్వం, నిస్వార్థ సాహసం
ఎట్లా పుణికి పుచ్చుకున్నావు? సర్వత్రా ఘోరక్రూర ఘాతుకాలు ప్రతినిత్యం జరుగుతూనే ఉన్నా –
ఆపే ‘యోధుడు’ లేని ఈ దేశంలో
పొంచివున్న విపత్తును సైతం లెక్క చేయక –
అత్యంత భీభత్స ఘటనా స్థలానికి…
పిడుగువై, అరివీర భయంకరుడవై ముందడుగు వేసావు.
ఎవరునీవు కుర్రవాడా!
వీరాభిమన్యుడు, వీరశివాజీల గురించి చరిత్రల్లో చదివాం…
అవార్డులు, రివార్డులు ‘నీ సాహసం’ ముందు…
బలాదూర్ బలదూర్ యోధుడా!
ఏమయితేనేం చరిత్ర సృష్టించావు…
‘చావు’ కంటే “చేవే” శ్రేష్టమని నిరూపించావు.
ఇక్కడ ‘బొంగరాలు’లా వ్యక్తులు
ఉంగరాలు ప్రదర్శనలే తప్ప
బాలచంద్రులు – భగత్‌సింగ్‌లు కరువైన తరుణంలో
ఒకే ఒక ‘తెగింపు’తో ముందుకు దూకావు…
భయం వేసింది కుమారా! ఆ మహా సంకట క్షణాన –
నిజంగా భయం వేసింది…
ఆ దుష్టుడు కత్తే నిన్ను కబళిస్తే!?
లేదు… లేదు… వీరుడా… అలా… ఎన్నటికీ జరగదుగాక జరగదు.
ఇలా అనుకుంటూ పోతే –
వీరులనేవారు మిగలరు ఈ భువిపై…
నీ శౌర్యం – ఒక ‘దిక్సూచి’
నీ దూకుడే ఒక ‘ఒరవడి’
ఈ నిరాశా నిస్తార నాసిరక సంఘంలో
కదన శంఖం పూరించిన – ఓ ధనుంజయా!
కోటి గొంతులు నిన్నే స్మరించుకుంటున్నాయి….
కోటి చేతులు నిన్నే ఆహ్వానిస్తోన్నాయి.
నీ అసమాన పరాక్రమానికి ఇవేనా జోహార్లు!
గెలిచావు వీరుడా! గెలిచావు!
యావత్ జాతికి సరిక్రొత్త సందేశాలు ఇచ్చావు.
యింతకీ – నీవు ఎవరివో తెలిస్తే?!
నీ శిరస్సుకి – సాహస నెమలిపింఛం పెట్టాలని…
నీ కంఠానికి ‘వీరగంధం’ పూయాలని…
మీదు మిక్కిలి అభిలాష గా ఉంది యువకుడా!
యోధుడా! వీరుడా…
ఓ! నవ సమాజ ఆశాకిరణమా!? ఇంతకీ నీవు ఎవరు….?!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here