Site icon Sanchika

ఓ పసిబిడ్డలా.. రా

[మాయా ఏంజిలో రచించిన ‘come, and be my baby’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(అత్యాశ, దురలవాట్లు, మూఢనమ్మకాలతో నిండిన ఆనాటి అమెరికన్ ఆఫ్రికన్ సమాజాన్ని, తన జాతి ప్రజలను ఉద్భోదించి రాసిన కవిత. బయటి ప్రపంచపు వ్యామోహాలను, ఆందోళనలను బయటే వదిలి పెట్టమని, ప్రేమ వల్లనే శాంతి నెలకొంటుందని చెప్పే కవిత!!)

~

[dropcap]ర[/dropcap]హదారులన్నీ
ఎక్కడికీ వేగంగా వెళ్ళని
పెద్ద పెద్ద కార్లతో నిండి ఉన్నాయి

చుట్టూ జనాలేమో
దేన్నైనా కాల్చేస్తామన్నంతగా
ధూమపానంలో మునిగి ఉన్నారు

మరికొందరు
కాక్ టెయిల్ గ్లాసులచుట్టూ
తమ జీవితాలనే చుట్టేసుకున్నారు

ఎక్కడ మలుపు తిరగాలో తెలియక
నువ్వు ఆశ్చర్యపోతూ కూర్చుంటావు
నాకది అర్థమయ్యింది
రా.. నా ఒళ్ళోకి .. ఓ పసిబిడ్డలాగా..

కొంతమంది ప్రవక్తలు
రేపు ఈ లోకం
అంతమవబోతుందని చెప్పారు

మరికొందరు
ఒకటి రెండు వారాల సమయం ఉందని అంటున్నారు
వార్తాపత్రికలు,ఎన్నో రకాల
భయాందోళనలను విరజిమ్ముతున్నాయి

ఏం చెయ్యాలో తెలియక
నువ్వేమో ఆశ్చర్యపోతూ కూర్చుంటావు
నాకర్థమయింది
రా.. ఓ పసిబిడ్డలా.. నా ఒళ్ళోకి!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


మాయామాటలు కొన్ని:

  1. మనం ఎన్నో పరాజయాలను ఎదుర్కొనవచ్చు, కానీ ఓడిపోకూడదు. ప్రభావశీలురైన ప్రముఖులెందరో నమ్మశక్యం కాని అవరోధాలెన్నింటినో ఎదుర్కొన్నారు. ఆ చీకటి క్షణాల నుంచే జీవితాన్ని ఎదుర్కొని ఎదగడం నేర్చుకోవాలి.
  2. ప్రేమ హద్దులను లెక్క చెయ్యదు. అడ్డంకులను ఎదుర్కొని అది ముందుకే సాగుతుంది.
  3. సీతాకోకచిలుక అందాన్ని అబ్బురంగా చూస్తూ ఆనందిస్తాం. అది పురుగుగా దాటిన ఎదుగుదల దశలను చాలా అరుదుగా గుర్తిస్తాం.
  4. మహిళ అందం ముఖ సౌందర్యానికి సంబంధించినది కాదు. ఆమె అందం హృదయంలో ప్రతిఫలిస్తుంది.
  5. పరిచయాలకు, స్నేహానికి మధ్యన స్పష్టమైన తేడా ఉంది. తెలిసిన వారందరూ స్నేహితులు కాలేరు. వారు చిరకాల పరిచయస్థులుగా మిగిలిపోతారు. నిజమైన స్నేహంలో, మిత్రత్వంలో ఒకరు మరొకరి నుంచి స్ఫూర్తి ని పొందుతారు. విలువలు పెంపొందించుకుంటారు.
  6. నీ చుట్టూరా జరిగే ఎన్నో సంఘటనలను నువ్వు అదుపు చెయ్యలేకపోవచ్చు. అందువలన నీ విలువ తగ్గించబడదని గుర్తించు. నీకు నచ్చని విషయాలను మార్చుకునే ప్రయత్నం తీవ్రంగా చెయ్యి. ఎవరి మీదా ఫిర్యాదు వద్దు. వేరొకరి చీకటి మేఘంలో రంగుల హరివిల్లై వెలిగేందుకు ప్రయత్నించు.
Exit mobile version