[dropcap]అ[/dropcap]నఘ ఫోన్ చేయగానే ఆఘమేఘాల మీద ఊరికి బయలుదేరాడు కృష్ణాజీ.
“మొన్నేకదా వెళ్లొచ్చారు. ఇంతలో ఏం ముంచుకుపోయిందని మళ్లీ వెళుతున్నారు? వారం పది రోజుల తర్వాత ఇద్దరం కలిసి వెళదాం” అని భార్య ఎంతగా నచ్చ చెప్పినా ఆయన వినిపించుకోలేదు. అప్పటికప్పుడు కూతురు అల్లుడి కోసం రకరకాల వస్తువులు కొని బస్సెక్కాడు.
ఆరు నెలల క్రితం ఆనఘకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపాడు. అల్లుడు రఘువీర్ ఏదో ప్రయవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. దూరప్రాంతాల నుంచి మంచి సంబందాలొచ్చినా అన్నిటికంటే దగ్గర… బస్సెక్కితే రెండు మూడు గంటల్లో చేరుకోవచ్చు. అటు కూతురికీ, ఇటు తనకీ ఇద్దరికీ సులువుగా ఉంటుందని ఈ సంబంధం వైపు మొగ్గు చూపాడు.
“పిల్లల్ని చదువుల పేరుతో అమెరికాకో, ఆస్ట్రేలియాకో పంపుతున్నాం. వాళ్లు చదువులయినా వెనక్కి తిరిగి రావడం లేదు. మనమూ ఫారిన్ సంబంధాలు చేసి దూరంగా ఉంచేస్తున్నాం. అదృష్టమంటే నీదేనయా దగ్గర్లో సంబంధం చేశావు” అంటూ స్నేహితులందరూ తెగ మెచ్చుకున్నారు.
అనఘ ఇల్లంతా శుభ్రంగా ఉంచేది. ఎప్పటికేది అవసరమో అన్నే కొనుక్కొచ్చి అమర్చేది. ఆమె అడిగింది కృష్ణాజీ ఏ రోజు కాదనే వాడు కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇంటి బాధ్యతలన్నీ తనే చూసేది. జీతం తెచ్చి తను భార్య చేతిలో ఉంచినా, నిర్వహణ బాద్యతలన్నీ ఆమె చెప్పుచేతల్లో ఉండేవి. అమ్మా నాన్నలనే కాదు తమ్ముడినీ అదుపు ఆజ్ఞల్లో ఉంచేది.
ఆమె ఇంటి నుంచి వెళ్లపోయాక, తన శరీరంలో ఒక ముఖ్యమైన భాగాన్ని కోల్పోయినట్టుగా అనిపించింది కృష్ణాజీకి. అందుకే ఏదో ఒక రకంగా వారానికో పది రోజులకో వెళ్లి కూతురిని చూసొస్తున్నాడు. గంట, రెండు గంటల ఆమె సమక్షంలో ఉండి వచ్చేస్తున్నాడు. మెట్టినింట్లో ఆమె కెలాంటి కష్టం కలగకూడదని ఆమె కన్నీ సమకూర్చి పెడుతున్నాడు.
కాపురం పెట్టగానే…
ఫ్రిజ్, డబుల్ కాట్‌తో పాటు ఇంటికి అవసరమైన సామానంతా ఇచ్చాడు.
“నాన్నా! వెండి కంచం ఇవ్వలేదని అత్తగారు పక్కింటి ఆవిడ దగ్గర కామెంట్ చేశారు” అని కూతురు చెబితే. అప్పటి కప్పుడు చేయించి పంపాడు. ఆషాడపట్టీగా తమకు ఆనవాయితీ లేకపోయినా బంధువులబ్బాయి అమెరికా నుంచి వస్తుంటే అతనితో డిజిటిల్ కెమరా తెప్పించాడు. వరలక్ష్మీ వ్రతానికి ముత్యాల హారం చేయించాడు.
“మన తాహతేంటో చూసుకోవాలిగా ఉన్నదంతా దోచి కూతురుకి పెడితే రేపు మన సంగతేంటి? పెళ్లి కోసం భారీగా అప్పు చేశారు. ఈ పెట్టుపోతలకి స్నేహితుల దగ్గర చేబదుళ్ళు తీసుకుంటున్నారు. ఇవ్వన్నీ తీరాలి కదా.. రేపో మాపో రిటైరవుతున్నారు. పిల్లాడు ఇంకా చేతికందలేదు. రెండేళ్లు చదివితే గానీ ఇంజనీరింగ్ పూర్తి కాదు. ఇవేమీ మీరు ఆలోచించరా?” అని భార్య రోజూ గొడవ చేస్తోంది.
“ఆరోగ్యం బాగలేదు డాక్టర్ దగ్గరకి వెళ్లమంటే మాత్రం… వాళ్ల దగ్గరకు వెళితే మనల్ని పీల్చి పిప్పి చేస్తారు. కార్పొరేట్ అస్పత్రుల సంగతి నీకు తేలీదు అంటూ వైద్యాన్ని మాత్రం వాయిదా వేస్తారు.”
భార్య సణుగుళ్లు కృష్ణాజీకి అలవాటైపోయింది.
“ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం. పిచ్చి మొహమా మన అమ్మాయి కోసమేగా?” అంటూ వాటిని కొట్టిపారేస్తున్నాడు. చెప్పి చెప్పి ఆమెకు విసుగొచ్చింది. సంసార భారాన్ని మోసేవాడు ఆయననే కదా… రోజూ తగవు పెట్టడం దేనికని చెప్పడం మానుకుంది.
కృష్ణారావు ఊరు చేరుకునే సరికి మధ్యాహ్నమైంది. ఆటో ఎక్కి కూతురింటికి వచ్చాడు. ఆదివారం కావటంతో అల్లుడు రఘువీర్ ఇంట్లోనే ఉన్నాడు. హాలులో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. మామగారిని చూడగానే లేచి నిలబడి మర్యాదపూర్వకంగా లోపలికి ఆహ్వనించాడు. చేతిలో ఉన్న బ్యాగును అందుకుని పక్కన నున్న టీపాయ్ పైన ఉంచాడు. తనే స్వయంగా లోపలకు వెళ్లి చల్లని మంచి నీళ్లు తెచ్చి అందించాడు. అల్లుడి ప్రవర్తనకు ముచ్చటేసింది. మరి కాసేపటికి అనఘ వచ్చింది. తండ్రిని చూడగానే తెగ సంతోషపడిపోతూ ఆయన పక్కన కూర్చుని కబుర్లు చెప్పుటం ప్రారంభించింది. లోపల వంటి పనితో సతమతమవుతున్న అత్తగారు ఏమైనా అంటారేమే నన్న ఆలోచన లేకుండా కబుర్లు చెబుతున్న కూతురి ప్రవర్తన ఆయనకు కాస్త ఇబ్బందిగా అనిపించిది. పుట్టింట్లో ఎలా ఉన్నా ఫరవాలేదు. అత్తగారింట్లో ఉన్నప్పుడు నడతలో ఎన్ని జాగ్రత్తలు పాటించాలి అని ఆయనకు మనసులో అనిపించింది. “పనిలో ఉన్నావు కదమ్మా, నేను చల్లబడిన తర్వాత బయలుదేరతా. ఈలోపు నువ్వు అన్నీ చక్కబెట్టుకునిరా” అని ఆమెను అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశాడు. అనఘ కదలలేదు. “వంట అంతా మా అత్తగారే చేస్తారు. నేను చేసినా ఆమెకు నచ్చదు. అందుకే పనంతా ఆమకు అప్పగించేస్తా” అంది. వెనకా ముందూ చూడకుండా మాట్లాడుతున్న కూతురి వంక అదోలా చూశాడు కృష్ణాజీ.
కూతురు అల్లుడు చెరో పక్కన కూర్చుని కుశల ప్రశ్నలు వేస్తుంటే ఆయన ఓపిగ్గా సమాధానం చెప్పాడు. మరి కాసేపటికి భోజనానికి పిలుపొచ్చింది.
“నాన్నా అవుట్‌స్కర్ట్స్‌లో కొత్తగా లేఅవుట్ వేశారు. ప్లాట్లు కడతారట. మీ అల్లుడు తీసుకోవాలని ముచ్చటపడుతున్నారు. నువ్వేమైనా డబ్బు సర్దగలవేమోనని అత్తగారు అడుగుతున్నారు.” ఉదయం ఫోన్లో కూతురు చెప్పిన విషయం మనసులో మెదిలింది. అల్లుడు ఆ విషయం ప్రస్తావిస్తాడేమోనని ఎదురు చూశాడు. ఆ ప్రస్తావనేదీ లేకుండా మాములు కబుర్లు నడుమ భోజనం పూర్తయింది.
***
సాయంత్రం కాస్త చల్లబడగానే తీరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు కృష్ణాజీ.
“నేను బస్టాండు దగ్గర దింపుతాను” అంటూ రఘువీర్ స్కూటర్ తీసుకుని బయలుదేరాడు. తను వద్దన్నా అల్లుడు ఒప్పుకోలేదు.
“మీరు బాగా చిక్కిపోయారు. ఆరోగ్యం సరిగా లేనట్టుంది” అన్నాడు రఘువీర్ మార్గమధ్యంలో.
“అవును బాబూ! కాస్త నీరసంగా ఉంటోంది త్వరగా అలిసిపోతున్నాను. బహుశా వయసు పైన పడడం వల్ల కాబోలు” కృష్ణాజీ చెప్పసాగాడు.
“మీకే వయసయిందని మామగారూ, ఈ రోజుల్లో 70 ఏళ్ల వాళ్లు కూడా చురుగ్గా ఉంటున్నారు. బీపి, షుగర్ లాంటి వేమైనా ఉన్నాయేమో పరీక్షించుకున్నారా? టెస్టులేమైయినా చేయించారా?” మద్యలోనే అడ్డుకున్నాడు రఘువీర్.
మామగారి జవాబు కోసం ఎదురు చూడకుండా నేరుగా ప్రైవేటు హాస్పటల్ దగ్గర స్కూటర్ నిలిపాడు. “ఒక్క గంట ఇక్కడ ఉండి వెళదాం” అన్నాడు. తన భయాలను బయటపెట్టే అవకాశం కృష్ణాజీకి ఇవ్వలేదు. నేరుగా కౌంటర్ దగ్గరకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించాడు. వైద్య పరీక్షలు చేయించి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆయన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులన్నీ కొని కవర్ చేతిలో పెట్టాడు. పర్సులో నుంచి తీసి డబ్బులివ్వబోతే ససేమిరా అన్నాడు.
“మీరు రాత్రి ఇల్లు చేరేసరికి బాగా పొద్దుపోతుంది. టిఫిన్ చేసి బస్సు ఎక్కారంటే మంచిగా నిద్ర పడుతుంది” అని చెప్పి బలవంతంగా టిఫిన్ పెట్టించి బస్ ఎక్కించాడు.
ఈ మర్యాదలన్నీ కాదు.
బస్సు ఎక్కే ముందు అల్లుడు చెప్పిన నాలుగు మాటలు కృష్ణాజీని కదిలించాయి.
“మామగారు! మీరు మంచిగా పెళ్లి చేశారు. ఇంటికి కావలసినవన్నీ అమర్చారు. ఇంకేం ఖర్చు పెట్టకండి. నేను, అనఘా సుఖంగా ఉన్నాం. ఇంటికి ఏమైన అవసరమైనా నేను చూసుకుంటాను. పిల్లలు పుట్టేలోగా అన్నీ అమర్చుకుంటాం. ఇప్పటి వరకూ మీరు చేసిన దానికి థాంక్స్” అన్నాడు రెండు చేతులు జోడిస్తూ.
కృష్ణాజీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
“ఇతను అల్లుడు కాదు. నాకు రెండో కొడుకు. నా కూతురు చాలా అదృష్టవంతురాలు” అని తృప్తిగా అనుకున్నాడు.
మధ్యాహ్నం సంగతులు కళ్ల ముందు మెదిలాయి.
భోజనాలయ్యాక హాలులో దివాన్ మీద నడుం వాల్చాడు. తెలియకుండానే గాఢ నిద్ర పట్టేసింది. ఇంతలో హఠాత్తుగా మెలుకవ వచ్చింది. పక్క గదిలో నుంచి కూతురు, అల్లుడు మాటలు వినబడుతున్నాయి. అనఘ ఎదో అంటోంది.
“నువ్వు అనవసరంగా మామగారిని ఇబ్బంది పెట్టకు. ఇప్పటికే మన మీద చాలా ఖర్చు పెట్టారు” అని రఘువీర్ అభ్యంతరం చెబుతున్నాడు.
“మీకేం తెలియదు ఊరుకోండి. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే మనం ఆస్తులు సమకూర్చుకోవట మెలా?” ఎదురుతిరిగింది అనఘ. ఆమెకు నచ్చ చప్పే ప్రయత్నం చేస్తున్నాడు అల్లుడు.
“నీ కోరికలు తీర్చకోడానికి నన్ను మా వాళ్లని విలల్లని చేస్తావా? ఇంత కంటే దారుణం ఇంకొకటి ఉంటుందా?” అన్నాడు రాఘవీర్.
“తప్పదు మరి. చెట్టుకు కాయులున్నప్పుడే కోసుకోవాలన్న విషయం మీకు తెలియాదా?” అంది అనఘ.
“నాన్నగారు ఈ నెలలోనే రిటైరవుతారు. పి.ఎఫ్ గ్రాట్యూటీ భారీగా వస్తాయి. ముందుగా మనం జాగ్రత్త పడకపోతే డబ్బు హారతి కర్పూరమవుతుంది. మనకు పైసా దక్కదు.”
“నువ్విలా ప్రవర్తించావంటే ఇక నేను చూస్తూ ఊరుకోను. మామగారికి విషయం చెబుతా” రఘువీర్. బెదిరించాలని చూశాడు గానీ అతని పప్పులు ఉడక లేదు.
“మీరేం చెప్పినా మా నాన్న వినరు. నేనంటే ఆయనకు అంత ఇష్టం. కొండ మీద కోతిని తెచ్చి ఇవ్వమన్నా వెనకా ముందు చూడకుండా తెస్తారు, తెలుసా” గర్వంగా చెప్పింది అనఘ.
ఆ తరువాత అల్లుడు ఏమంటాడోనని ఎదురు చూశాను. అతడి వైపు నుంచి స్పందన లేదు. బహుశా భార్యతో వాదించడం ఇష్టం లేక మౌనం దాల్చి ఉంటాడనుకున్నాను.
కాసేపటికి అనఘ బయటకొచ్చింది. నిద్ర పట్టక అటూ యిటూ కదలుతున్న తనని చూసి ప్రేమగా పలకరించింది.
“టీ తాగాతారా?” నాన్నా అనడిగింది.
మౌనంగా తలాడించాడు తను. ఇంట్లోకి వెళ్లి రెండు కప్పులు తెచ్చి టీపాయ్ ముందుంచింది. ఒకటి తను తీసుకుని రెండోది తన కందించింది. ఆమెలో ఎలాంటి తడబాటు కనిపించలేదు.
అర్ధగంట తర్వాత….
“అమ్మాయ్ సంక్రాంతి పండక్కి నువ్వూ అల్లుడు ఇంటికి రండి. డబ్బు చేతికి రావాలసింది ఉంది. నా సంతోషం కోసం మీకిస్తాను” అని చెప్పి బయటకొచ్చాడు.
బస్సు వేగంగా పరుగులు తీసింది. కృష్ణాజీ ఆలోచనలు అంతే వేగంగా పరుగు పెడుతున్నాయి. ఆ ఆలోచనల నిండా కూతురు, అల్లుడు.
కూతురు తనను కాయలున్న చెట్టుతో పోల్చిన విషయం గుర్తుకొచ్చింది. ఆ కాయల్ని స్వార్థంతో గానీ, మరో రకంగా గానీ తన బిడ్డ తింటే తప్పు పట్టవలసిన పనేం ఉంది. ఇంకొకరు కాదు గదా ఆ సొత్తును సొంతం చేసుకునేది అనుకుంది ఆ తండ్రి హృదయం.