ఓ ఉదయం

1
2

[మణి గారు రచించిన ‘ఓ ఉదయం’ అనే రచనని పాఠకులకి అందిస్తున్నాము.]

భానుడు, రాత్రిదేవి ఒడిలోంచి లేచి ఎర్ర కలువ రెక్కల తెరలు తొలగిస్తూ నెమ్మదిగా బయటకి, వస్తున్నాడు. ఇంక అంతా సందడి, సంభ్రమాలు మొదలు అయినాయి.

పక్షులు వైతాళికులై మేలుకొలుపు గీతాలు పాడుతున్నాయి. వాటి రెక్కల చప్పుళ్ళు పక్క స్వరాలై, వాటి గీతాలకి మరింత మధురిమలు చేరుస్తున్నాయి.

సార్వభౌముని ఆహ్వానించడానికి ప్రకృతి అంతా ఆయుత్తమవుతుంది. నిశ్శబ్దం, వేదాలని, మౌనరాగాలతో ఆలపిస్తుంది. ఇంక, గాలి, మంగళ వాయిద్యాలతో ఆహ్వానం పలుకుతుంది.

శుద్ధ స్ఫటిక సంకాశము ఆయన తనువు. ఎర్రని తెరలమధ్య, ఎర్రని రంగుతో మెరిసిపోతూ బయటకి వస్తాడు. కాసేపటికి ఎర్రరంగు, ఆయన తెల్లని రంగు వెలుగులతో బంగారు రంగు గా మారుతుంది. అలా రంగు రంగులు ఆయన తనువు పై ప్రతిఫలిస్తుంటే రంగులు. మార్చుకుంటూ ఆకాశములో ప్రయాణము మొదలు పెడతాడు.

పారిజాతం ప్రతిరోజూ రాత్రి అంతా ముస్తాబు అవుతుంది,ఈ క్షణం కోసం. భానుడు ఆకాశగమనానికి ఆయుత్తమయే ఈ క్షణంకోసం.

ఒంటినిండా తెల్లని ఎర్రని కాంతుల పూవుల అలంకారాలతో,. ఎర్రరేకులు కాస్త పక్కకి జరుగుతూ ఉండగానే పరవశంతో నాట్యంచేస్తుంది. అలంకారాలు అన్నీ ఒక్కక్కోటే రాలడం కూడా పట్టించుకోకుండా. ఆడి ఆడి అలిసి సాలసి భానుడి వేడికి అందాలు అలంకారాలు రాలి స్థాణువుగా మిగిలిపోతుంది. అయినా, నాట్య సంభావనా సంభ్రమానందంలో కాస్త కూడా నీరసం రాదు దానికి. చిరువెచ్చని కాంతులలో మళ్ళీ శక్తి పుంజుకొని పగటి వెలుగులలో స్నానం చేసి రాత్రి శృంగారానికి ఆయుత్తమవుతుంది.

చీకటి తెరలు ఉదయపు ఊపిరికి వేడెక్కి మంచు బిందువులై నెలరాలుతాయి.

ఇంక మంచు లోని అర్ద్రతనంతా గాలి తనలో నింపుకొని చెమ్మగా అంతటా నింపేస్తుంది. మంచు బిందువు లని రేకులపై అలంకరించుకున్న పూలు ఆనందములో తమ సౌరాభ్యాలతో గాలిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.

అన్నీ మొక్కలు, చెట్లు సంతోషంతో ఆకులు, కొమ్మలు ఊపుతూ సందడి చేస్తాయి, గాలిని అలింగనం చేసుకొని. భానుడు, నును వెచ్చని కిరణాలతో అందరిని, అన్నిటిని సృజిస్తూ పలకరిస్తూ, అందరిలో ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని, పుష్టిని నింపుతూ ముందుకు వెళ్తాడు.

ఆయన పలకరింపులకి పులకరిస్తూ తనువులని శక్తితో నింపుకుంటూ సందడులు చేస్తుంది భువి, చర చరా ప్రపంచము, అంతా.

ప్రతి ఉదయం. ఒక అనుభూతి. ఒక అలౌకిక రాగం. ఒక అద్భుత నాట్యం.

భానుడు దర్బారు నుంచి కొలువు ముగించి రథ ఆశీనుడై కాంతిపుష్పాల మార్గాలలో ప్రయాణము మొదలు పెడతాడు. విరివిప్పిన నెమలిలా విచ్చుకున్న సహస్ర కిరణాలు, వాటి వెనుక ఆయన అశ్వాలు పరుగులు పెడతాయి, కాంతి పుంజాల రంగులని, అన్ని వైపులా విరజిమ్ముతూ. రత్నాలు పొదిగిన రంగులతో మెరిసే తివాసి మీద, వంది మాగదుల స్తోత్రాలు మంగళవాయిద్యాల మధ్య సార్వభౌముడులా ముందుకు సాగుతాడు.

చరాచరమంతా ఆయన దారిలో మొగిరిల్లి ఆయన కృపకి కృతజ్ఞతలు చెప్పుకుంటాయి. కష్ట సుఖాలు చెప్పుకుని, ఆయన అభయంలో, ఓదార్పు పొందుతాయి. జై జై లు పలుకుతాయి

అలా జయ జయ ధ్వనిలతో నిండిన నిశ్శబ్దంతో ముందుకు సాగుతాడు భానుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here