[dropcap]ఓ[/dropcap] భారతమాత
రత్నఖచిత సింహాసన అధిష్టాన దేవత
సస్యశ్యామల వజ్రవైడూర్య జీవనదుల ప్రదాత
విశ్వగురువుగా విలసిల్లిన నీవు
విలువల జ్ఞానం పంచిన నీవు
యుగసంధి కాలంలో
సుషుప్తిలో ఉన్నావా??? అమ్మా???
సంధికాలం ముగిసి
నేడు సందేశం పంచ
ప్రపంచమంతా వెలుగులు పంచ
మళ్ళీ జాగ్రదావస్థలోకి వచ్చావా తల్లీ?
దేదీప్యమాన నీ కాంతిలో
దేశాలన్నీ సౌఖ్యమొందునమ్మా!
ప్రచండమైన నీ వెలుగులో
ప్రపంచమంతా మురిసిపోవునమ్మా!!
శాంతి సౌమనస్య నీ భావంలో
ప్రజలంతా పరిఢవిల్లుదురమ్మా!!!
సందేహం లేదు తల్లీ
నీవు మేల్కొంటే
ఈ ప్రపంచం మేల్కొన్నట్లే…..
మారణహోమాలు కాదు మానవతా భావాలు
మరల ఈ పుడమిపై వర్ధిల్లునమ్మా!!
అణ్వాయుధాలు కాదు అన్నవస్త్రాలు
మరల ఈ పుడమిపై వర్ధిల్లునమ్మా!!
మతవిద్వేషాలు కాదు మమతానురాగాలు
మరల ఈ పుడమిపై వర్ధిల్లునమ్మా!!
సామ్రాజ్యవాదం కాదు సాంస్కృతికత
మరల ఈ పుడమిపై వర్ధిల్లునమ్మా!!
సంఘర్షణలు కాదు సమన్వయాలు
మరల ఈ పుడమిపై వర్ధిల్లునమ్మా!!
ఓ విశ్వజననీ
ఓ విజయ భారతమాత
నీవు మేల్కోనాల్సిందే….
ప్రపంచాన్ని మేల్కొల్పాల్సిందే……