ఓదార్పు

0
3

[శ్రీ షేక్‌ మస్తాన్‌ వలి రచించిన ‘ఓదార్పు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]హోబిల క్షేత్ర సోయగాలను ఆస్వాదించి, బస్సులో నంద్యాల చేరిన రంగారావు, ఆయన శ్రీమతి అనంత, ఆమె అక్కయ్య మాలతి అందరు కలసి రైల్వేస్టేషన్‌ వెయిటింగ్‌ రూంకు చేరి సామాన్లు ఒద్దికగా సర్దుకున్నారు. అప్పటికి రాత్రి ఎనిమిదైంది. ఇక వాళ్ళు ఎక్కవలసిన గుంటూరు, సికింద్రాబాద్‌ పాసెంజర్‌ బండి రాత్రి ఒంటిగంటకు గాని రాదు. కాబట్టి నిరీక్షణ తప్పదు.

“అనంతా! అలా వెళ్ళి పండ్లేవైనా దొరుకుతాయేమో చూసి.. తీసుకొస్తా! మీరు సామాన్లవి జాగ్రత్తగా చూసుకుంటుండండీ!” రంగారావు బయటి కెళ్ళటానికి సిద్ధమయ్యాడు.

“మంచిది! త్వరగా తెమలిరండీ! అక్కడే ఎవరి మాటల్లోనో తలదూర్చి గంటలకొద్ది కాలయాపన చేయకండీ! అసలే.. మీరు సంభాషణ ప్రియులు! అదే నా భయం!” అనంత భర్తను ఎత్తి పొడిచింది.

“అంతొద్దు లేవోయ్‌! పరాయి ఊర్లో ఎంతుండాలో.. అంతే వుంటాను! నువ్వేమి కంగారు పడకు! నే వెంటనే వస్తానుగా!” అనే హామీతో రంగారావు వెయిటింగ్‌ హాల్‌ నుండి బయటకు నడిచాడు.

కాసేపటి క్రితం వాన జల్లులు పడటం వల్లనేమో, ఫ్లాట్‌ఫారమంతా తడి పొడిగా మారి వుంది. ఆపై అవేవో చెత్త కుప్పలు తడిసి, వాటి నుండి ఒక రకమైన వెగటు వాసన వస్తుంది.

ఇక రెండో ఫ్లాట్‌ఫారంపై ఆగి వున్న గూడ్స్‌ ట్రెయిన్‌ యింజన్‌ అడ్డూ ఆపు లేకుండా రొద చేస్తుంది. ఎంతసేపటికీ రైల్వే వారు దానిని పంపేందుకు ప్రయత్నిస్తున్న దాఖలాలు లేవు. కారణమేమైనా కానివ్వండి, దాని శబ్దం మాత్రం బండ్ల రాకపోకలపై జారీ అవుతున్న ప్రకటనలను సరిగ్గా వినపడకుండా చేస్తుంది. దాంతో విసుగు భరించలేని రంగారావు స్టేషన్‌ మాస్టర్‌కు ఫిర్యాదు చేద్దామనుకున్నాడు. అయితే ఆయన రూం మూసేసి వున్నందున ఆ పని చేయలేకపోయాడు. ఇక ఫ్టాల్‌పారంపై పండ్లేవి దొరకనందున అతను సరాసరి స్టేషన్‌ బయటకు వెళ్ళి ఓ డజను అరటిపండ్లు కొని యథాస్థానానికి చేరాడు. ఆపై వారందరు మఠం నుండి ప్యాక్‌గా తెచ్చుకున్న భోజనం పేపర్‌ ప్లేట్లల్లో వడ్డించుకొని, తినే కార్యక్రమం ముగించుకొని తీరిగ్గా కూర్చున్నారు.

వెయిటింగ్‌ రూం కేర్‌టేకర్‌ రాత్రి డ్యూటీకి రిపోర్ట్‌ చేసింది. పేరు రంగమ్మ. ఓ మోస్తరు ఎత్తున్న ఆమె చామనఛాయలో నున్నగా దువ్విన జుత్తుతో, ఊదా రంగు నూలు చీర, రవికల్లో వుంది. నుదుట బొట్టు లేదు. తాళిబొట్టు స్థానంలో వ్రేలాడుతున్న తెల్లపూసల దండ మెడ బోసితనాన్ని కప్పేస్తుంది. ఆమె వయస్సు ఇరవై ఏడు. చదువు మూడో తరగతి.

ఇక తెల్లవారి గాని ఆమె కొలువు ముగియదు. రాత్రి తిండికై తెచ్చుకున్న క్యారియర్‌ భద్రపరచి పనిలో నిమగ్నమవబోయింది. కాని ఆమె మనస్సంతా కల్లోలంగుంది. ఎంత వద్దనుకున్నా.. ఆ సమయంలో గతం ఒకే గుర్తుకు రాసాగింది. దానికి తోడు జ్వరంతో యింటివద్ద ఒంటరిగా పడున్న పదేళ్ళ కూతురి దుస్థితి తలచుకుంటుంటే.. ఆమె ఎదలో ముల్లు గుచ్చుకున్నట్లయింది.

‘నిజంగా.. తలరాత తననెంతగా మోసం సేసింది!.. సుకంగా మొదలయిన తన బతుకు ఆకరికిట్టాగెందు కయింది? మురిపెంగా పెంచుకున్న ఒక్కగానొక్క నలుసుకు వల్లు బాగులేకుంటే.. యింటి కాడుండి దాని మంచి సెడు సూసుకునే అదురుట్టం తనకు లేకపోయా! పోనీ.. యీ కట్టాలన్నీ ఎవరితోనన్న సెప్పుకోవాలన్నా.. యినే వాడే లేడే! పాడు జనమ!’ ఆలోచనలు పిప్పి చేస్తుంటే రంగమ్మకు అదేదో ‘మనిషీ.. వున్నా! మనసూ.. వుందీ! చెప్పుకునేందుకు.. నీవే లేవు!’ అనే పాట గుర్తొచ్చి కళ్ళు ఒక్కసారిగా సజలాలయ్యాయి.

ఆ పరిస్థితిలో ఆమెకు విధి నిర్వాహణ కష్టంగానే ఉంది. అయినా తప్పదు! జీవనోపాధి కదా!

‘ఏది ఏమైనా.. కట్టం, సుకం యిని అయ్యోపాపం.. అనే ఒక మంచి మనిసి దొరికితే.. ఎంత బాగుండు!’ మనస్సు పరి పరి విధాల పోతున్నా సంబాళించుకొని ఆమె వెయిటింగ్‌ రూంకు వచ్చిన ప్రయాణికుల వివరాలు నిర్ణీత రిజిస్టర్‌లో నమోదు చేయించ సాగింది. ఆ సందర్భంగా ఆమే “అమ్మా! అయ్యా! పేరు, టిక్కెట్‌ వివరాలు తప్పులేకుండా రాయండీ! టిక్కెట్‌ లేకుంటే.. యిక్కడ వుండటానికి కుదరదు!” అనే సంగతి ఒకటికి రెండుసార్లు చెప్తుంది. అప్పుడామె మాటలు జోరుగా వున్నా ముఖంలో ఉదాసీనత కనబడుతుంది. ఆ క్రమంలో పాసెంజర్లందరు అయిపోగా మిగిలివున్న రంగారావు వైపు యథాలాపంగా చూసింది.

అప్పుడు రంగమ్మకెందుకో తను యింతకుముందు దాక వెతుక్కుంటున్న ఓదార్పు ఆయన వద్ద లభించగలదనే ఓ నమ్మకం కల్గింది. ఆమె అంచనాకు తగ్గట్టే ఎదుటివాళ్ళ భావోద్వేగాలను గమనించి పరామర్శించే స్వభావం గల రంగారావు తన సహజ ధోరణిలో “వంట్లో ఆరోగ్యం బాగా లేదా.. ఏంటమ్మా? చాలా నీరసంగా కనిపిస్తున్నావ్‌!” అని పరామర్శ మొదలుపెట్టాడు.

“ఆఁ! ఏదోలేయ్యా!” ఆమె నిర్లిప్తంగంది.

“అది సరే! నే తెలియక అడుగుతాను! నీకీ పని మీ ఆయన ఉద్యోగం చేస్తూ చనిపోయినందున వచ్చిందా.. ఏంటమ్మా?” ముత్తయిదువ లక్షణాలకు భిన్నంగున్న ఆమె వేషధారణని బట్టి నిజస్థితి ఊహించిన రంగారావు ప్రశ్నించాడు.

అనుకున్నట్లే లభించిన ఎదుటి వ్యక్తి లాలనకు చలించిన రంగమ్మ, “అవునయ్యా! మా ఆయిన నాలుగేళ్ల కితం కాలం సేసాడు! ఆ.. పైనే డిపార్టుమెంటోల్లు నన్నీ పన్లో పెట్టారు!” అంటూ పుస్తకం ప్రక్కన పెట్టింది.

“అయ్యో! యింత చిన్న వయస్సులో అలా.. ఎందుకు జరిగిందమ్మా!” అతను సంభాషణ పొడిగించాడు.

“అదో.. పెద్ద కతయ్యా!” ఆమె ముఖం వివర్ణమయింది.

“అయినా.. చెప్పమ్మా! వింటాను!” అతను అక్కడే వున్న చెక్క బల్లపై కుదురుగా కూర్చున్నాడు.

“మా ఆయన డిపార్టుమెంట్‌లో గేంగ్‌మన్‌గా పనిచేసేవాడు! మాకు కూతురు పుట్టి, దానికి ఆరేళ్ళు వయస్సు వచ్చేదాక ఆయన బాగానే వుండేవాడు! పగలంతా లైన్‌ మీద పన్జేసి పొద్దుగూకే యాలకు యిల్లు చేరేవాడు! యిక అందరం తానాలు సేసి సికారుకో.. సినిమాకో ఎల్లేవాల్లం! పదిరోజులకో సారి యింటి సరుకులకు గాను లెక్కగట్టి డబ్బులిచ్చేవాడు! యిస్కూల్‌ నుంచి కూతురు రాగానే.. తెగ ముద్దుసేసేవాడు! అది.. ఏమడిగినా తెచ్చిచ్చేవాడు! అలా.. మంచిగా వున్నోడు ఎలా నేర్చుకున్నాడో గాని ఒకరోజు బ్రాంది తాగి యింటికొచ్చాడు!”

“మరి అదేంటని నువ్వు నిలదీయలేదా.. అమ్మా?”

“నిలదీయటమేంది.. ఏకంగా తగాదే పెట్టుకున్నా! దానికి బదులుగా.. ఎవడో సావాసగాడు తాపించాడని, ఈ ఒక్కసారికి సెమించమని బతిమాలాడు! పోనీలే అని సరిపెట్టుకున్నా! అయితే మల్లా.. మల్లా.. అదే తప్పుసేసి తాగొచ్చేవాడు! ఇక లాభం లేదని.. ఓ రోజు గట్టిగా నిలేసా! అప్పుడాయన.. నే మొగాడ్ని.. మొగుడ్ని.. నా యిట్టం! అని కరాకండిగా సెప్పాడు! యిక ఆ కాడ్నించి రోజూ మొదలెట్టాడు! అలా.. అలా.. అది ఎసనమైంది! దాంతో జీతం డబ్బులు సరిపోయేవి కావు! ఆ పై మెల్లమెల్లగా నావంటిమీది నగలు ఒకటొకటిగా కుదవ పెట్టటం మొదలెట్టాడు!”

“అక్కడే.. పొరపాటు చేశావమ్మాయ్‌! అసలు నగలివ్వకుండా బాగా తిరుగుబాటు చేసుండాల్సింది!”

“అదీ.. అయిందయ్యా! అప్పుడాయన కోపంతో అటు నన్ను యిటు కూతుర్ని పడేసి తన్నటం మొదలెట్టాడు! యిక.. బరి తెగిత్తే వున్న పరువు కాత్త వూడిద్దని ఆయన సెప్పినట్టే సేసేదాన్ని!”

“ఆయ్యో.. పాపం! మరి తర్వాత ఏమైంది?” అతను విషయాన్ని పొడిగించాడు.

“ఇక సెప్పేదేముందయ్యా! ఏడాది తిరక్కముందే ఆయన ఆరోగ్గేం మరింత సెడింది! రైలు ఆసుపత్రిలో సూపిత్తే కాలేయం పాడయి.. కేన్సరయిందని తేల్సి శానా మందులే యిచ్చారు! కాని.. నయం కాలే! ఈలోగా మదరాసు పెద్దాసుపత్రికి తీసుకపోతే మంచిదని ఎవరో సెప్పారు. దాంతో ఆయనకంటే ఎక్కువేముందని మిగిలున్న కొద్ది నగలు అమ్మి.. అదీ సేసాం! అక్కడా శానా రోజులే వుంచారు! ఊఁ! హలాఁ! అయినా.. కుదర్లే! ఇక లాబం లేదు.. యింటికెల్లండని సెప్పాక తిరిగొచ్చేసాం! ఇక జబ్బుతో.. పన్లోకెల్లలేక ఆయన సెలవు పెట్టాడు! అలా.. అలా.. సూస్తుండంగానే.. అటు డబ్బు, దస్కం యిటు నగా నట్రా.. అన్నీ అయిపోయాయి! చివరిగా.. ఆయన రైలు ఆసుపత్రిలో మంచం పాలై.. రోగిగా మిగిలిపోయాడు!”

“అట్టాగా! మరి ఈ మధ్య కాలంలో మీకు తిండి తిప్పలు ఎలా.. జరిగాయమ్మా?” రంగారావు సందేహం వెలిబుచ్చాడు.

“అక్కడికే వత్తన్నానయ్యా! పరిత్తిలు యిసమించటంతో మా ఆయన తెలిసినోల్లందరి దగ్గర యీలున్న కాడికి అప్పులు సేసాడు! అవి.. తడిసి మోపెడై మూడు లచ్చలయ్యాయి!”

“మరి ఆ స్థితిలో నన్నా.. అతను తప్పు తెలుసుకున్నాడా?”

“ఆఁ! అదేనయ్యా.. సిత్రం! సావు మీదికొచ్చాక ఆయన్లో బెమ్మగేనం పుట్టుకొచ్చింది! ఓ రోజు మద్దేనపు యాల ఆసుపత్రిలో నా సేతులు రెండు పట్టుకొని.. తాగుడు ఆపాలని నువ్వెంత పాకులాడినా యినకుండా నీకన్నేయం సేసానే అమ్మె!” అని ఆపై బిడ్డను వాటేసుకొని.. నాకేదయినా అయితే.. నా బంగారాన్ని ఎవరు సూత్తారమ్మె!” అని బొల బొలా ఏడ్చాడు! దానికి నేను.. వుద్దోగస్తుడు పోతే.. ఆయింటావిడకు డిపార్టుమెంటోల్లు ఏదైనా .. పని యిత్తారంట గదయ్యా.. అని అడిగా! అప్పుడాయనేమన్నాడో తెలుసా.. అయ్యా?” ఆమె క్షణకాలమాగింది.

“ఏమన్నాడేంటీ?” అతను కుతూహలంగా చూశాడు.

“అదేనమ్మే.. నా బాధ! మా రైలోళ్ళు శానమంది మంచోల్లు గాదే! నువ్వు సూత్తే వయసులో వున్నావాయా! ఆ ముగాల్లాంటోల్లతో నీ వెట్టా నెగ్గుక రాగలవే!.. అని ఒకే దిగులు పడ్డాడు! ఆ తరువాత రెండు నెలలకు జబ్బు ఎక్కువై పక్కలోనే పీక్కోని పైకెల్లి పోయాడు! సచ్చేముందు.. బిడ్డ సెయ్యి నా సేతిలో పెడుతూ దీనంగా ఆయన సూసిన సూపులు నేనిప్పటికి మరిసి పో లేకున్నానయ్యా..!” ఆమె గొంతు బొంగురుపోయింది. కళ్లు సజలాలయ్యాయి. ఆమె రెండు చేతులతో కన్నీరు తుడుచుకో సాగింది.

“ఏడ్వద్దు లేమ్మా అన్నింటికి ఆ దేవుడే వున్నాడు! మరి.. ఆయన చనిపోయిన తర్వాత డిపార్టుమెంటు వాళ్ళు డబ్బులేమన్నా యిచ్చుంటారే?” రంగారావు విషయాన్ని దారి మళ్ళించాడు.

“ఆ! యిచ్చారయ్యా! కాని అవి ఏ మూలకొచ్చాయ్‌! ఆయన పోగానే అప్పులోల్లు ఎగబడ్డారు! ఎలాగో.. కూత్త.. కూత్త.. సర్ది మిగిలింది తర్వాత యిత్తనని సర్దిసెప్పా! అటు సుట్టాలందరు సూసి సూడనట్టయ్యారు! ఇటు బిడ్డ సూత్తే.. ఎదిగే పిల్లాయే! దాని సదువూ.. సాగించాలాయె! దాంతో.. గుండె నిబ్బరం సేసుకొని ఆయన సావు సాంగేలు సేసి, ఆపై యూనియన్‌ పెద్దల సాయంతో మెల్లగా వుద్యోగం సంపాదించి కాలం గడుపుతున్నా!”

“ఇందులో జీతమేమాత్రం వస్తుందేంటి?”

“నెలకు పదహారు వేలిత్తారయ్యా! అందులో కొంత బాకీలకు కట్టి మిగిలిన దాన్లో నా బిడ్డ నేను బతుకుతున్నాం!”

“మంచిదమ్మా! మరి ఎలాగో కష్టపడి కూతుర్ని బాగా చదివించు! నీకు ఆసరాగా నిలుస్తుంది! అది సరే.. యిప్పుడెందుకు నీరసంగున్నావ్‌?” రంగారావు ఆమెపై జాలి కనబరిచాడు.

“అదా! నా బిడ్డకు రెండురోజుల నుండి ఒకే జొరం! యింటికాడ ఒక్కదాన్నే వదిలేసొచ్చా! పైగా మా ఆయన గుర్తొచ్చి.. మనసంతా ఒకే దిగాలుగా వుంది! యింత కట్టంలో వున్నా మమ్మల్ని పలకరించే దిక్కే.. లేడయ్యా! పాపం! నువ్వు శానా మంచోడ్లాగున్నావ్‌! నా కట్టమంతా.. యిన్నావ్‌! నన్ను.. ఓదార్సావు! అయినా నా బాధ నీకెందుకు లేయ్యా మీ అందరి యివరాలు యిందులో రాయి!” అంటూ రంగమ్మ రిజిస్టర్‌ రంగారావు ముందుంచింది. అతను జేబునుండి టిక్కెట్లు తీసి పుస్తకంలో.. అవసరమైన సమాచారం నింపాడు.

ఇక కావలసిన వేళలో కావలసినంత ఓదార్పు రంగారావు లాంటి మంచి వ్యక్తి నుండి అయాచితంగా లభించినందుకు ఆనందించిన రంగమ్మ, అతనివైపు కృతజ్ఞతగా చూసి “అక్కడున్న పెద్ద బెంచ్‌లపై దుప్పట్లు పరుచుకొని హాయిగా పడుకోండయ్యా! మీ ట్రెయిన్‌ వచ్చేముందుగా.. లేపుతా!” అని చెప్పి తన సీటుకు చేరింది.

కష్టకాలంలో ఓ అబలను ఓదార్చిన ఆనందంతో రంగారావుకు ఎనలేని తృప్తి కల్గింది. దాంతో అతను సంతోషంగా కుటుంబ సభ్యులవైపు కదిలాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here