ఒడ్డుకి చేరిన నావ…!!

67
2

[dropcap](క[/dropcap]థాకాలం – 1970వ దశకం.)

జోగయ్య ఒక పాత తరం దొంగ. ఆ రోజు రాత్రి 12 గంటలవుతుంది. దొంగతనం చేసేందుకు వెళ్ళడానికి తయారవుతున్నాడు జోగయ్య. ఒక నల్లచారల గళ్ళలుంగీ మోకాళ్ల క్రిందకు వేలాడే విధంగా కట్టుకున్నాడు. పనిలో పడ్డ తరువాత లుంగీ జారిపోకుండా వుండేందుకు వెడల్పాటి నల్లటి పట్టెడ లాంటి బెల్టు పెట్టుకున్నాడు. వెడల్పాటి నల్లటి అడ్డ చారల బనీను వేసుకున్నాడు. ఎవరైనా పట్టుకున్నా తప్పించుకుని పారిపోయేందుకు అనువుగా, కాళ్లకు చేతులకు వంటాముదాన్ని పట్టించాడు. మెడ చుట్టూ ఒక నల్లచారల మఫ్లర్ చుట్టుకున్నాడు. కళ్ళకు పెద్ద కంతలున్న గంత కట్టుకున్నాడు. ఆ కళ్లగంతను చూపు సరిగా కనపడేటట్లు సర్దుకున్నాడు. ఒక జోలె మాదిరి పెద్ద సంచిని కుడి భుజానికి, గుండ్రంగా చుట్టిన పెద్ద తాడుని ఎడమ భుజానికి తగిలించుకున్నాడు. చిన్నపలుగు పారను, ఇతర చిన్న చిన్న పనిముట్లున్న సంచిని, చేతుల్లోకి తీసుకున్నాడు. మొత్తానికి దొంగతనానికి వెళ్లేందుకు సర్వసన్నద్ధుడుయ్యాడు జోగయ్య. ఆ రోజుకి ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం, తను దొంగతనం చేయాలని ఎంచుకున్న ఇంటికి బయలుదేరాడు జోగయ్య.

***

లోకనాధం ఒక పాతతరం పోలీసు కానిస్టేబుల్. ఆ రోజు రాత్రి 12 గంటలవుతుంది. దొంగలను పట్టుకునేందుకు వెళ్ళడానికి తయారవుతున్నాడు లోకనాధం. ముందుగా అరచేతుల ఖాకీ చొక్కా ధరించాడు. మోకాళ్ల క్రింద వరకున్న ఖాకీ నిక్కరును ధరించి, చొక్కాను నిక్కరులోనికి జొప్పించి, వెడల్పాటి ఇటుక రంగు బెల్టు పెట్టుకున్నాడు. మెడ చుట్టూ నశ్యం కలర్ మఫ్లర్ చుట్టుకున్నాడు. కాళ్ళకు మోకాళ్ళ క్రింద వరకున్న లేత ఆకు పచ్చరంగు మందంగా వున్న మేజోడులు తొడుక్కుని ఇటుకరాయిరంగు బరువైన ఫుల్ బూట్లు వేసుకుని లేసులు కట్టుకున్నాడు. జేబులో పోలీసు విజిల్ పెట్టుకున్నాడు. ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న పోలీసు టోపిని తలపై పెట్టుకుని, అక్కడే వున్న లాఠీని కుడి చేతిలోకి, పొడుగాటి తెల్లటి బ్యాటరీ లైటుని ఎడమ చేతిలోకి తీసుకుని, ఒకసారి తనను తాను నిలువెత్తు అద్దంలో తనలోని పోలీసు ఠీవిని, దర్జాను తనివి తీరా చూసుకుని ఒకింత గర్వంతో మురిసిపోయాడు.

మొత్తానికి డ్యూటీ ఎక్కడానికి సమాయత్తమై, ఇంటి బయటనే వున్న పాత సైకిలెక్కి, విజిల్ ఊదుతూ బయలుదేరాడు లోకనాధం.

***

జోగయ్య తను దొంగతనం చేయాలనుకున్న ఇంటి కిటికీ ఊచలను, తనతో తెచ్చుకున్న పనిముట్లను ఉపయోగించి, తన హస్తలాఘవంతో వంచేసి, సునాయాసంగా ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో వున్న భార్యాభర్తలు తమ శయన మందిరంలో వున్న పట్టెమంచంపై పడుకుని గాఢ నిద్రలో మునిగివున్నారు. చెరో వైపు తిరిగి ఎడమెడంగా శయనిస్తున్నారు.

బీరువా తాళాలగుత్తి, ఆ ఇంటి గృహిణి తలగడ క్రింద ఉన్నట్లు గమనించాడు జోగయ్య. వాటిని తీసుకోవాలంటే కొంచెం కష్టమనిపించింది. అయినా, ప్రయత్నం చేయాలి, కాని, ఆ క్రమంలో ఆ ఇల్లాలికి నిద్రాభంగమై లేచి కూర్చుంటుందేమో… తనను చూసి పెద్దగా కేకలు వేస్తుందేమో… తను దొరికిపోతానేమో… అని తటపటాయిస్తూ… కొంచెం సేపు ఆలోచించుకోగా… తనకో ఉపాయం తట్టింది.

ఆ ఇల్లాలు భుజంపై రెండు మూడు సార్లు గట్టిగా తట్టాడు జోగయ్య. వెంటనే మేలుకున్న ఆమె, వెనక్కి తిరిగి భర్తనుద్దేశించి…

“ఏంటండీ…? ఏంటి…?” అని గట్టిగా అరిచింది కోపంగా.

ఆ అరుపుకు ఉలిక్కిపడి లేచిన భర్త… “ఏంటే… మంచి నిద్ర చెడగొట్టావు…!” విసుగ్గా అన్నాడు.

“ఆ…! చేసేదంతా చేసి, ఏమీ తెలియనట్లు నాటకమా…!” అంది వెటకారంగా.

“నాటకమేంటే…? దేన్ని గురించి చెప్తున్నావు!” అమాయకంగా అడిగాడు.

“అబ్బో! యేషాలో…!! అయినా ఈ వయసులో మీకేవేం పాడు బుద్ధులు! విపరీతం కాకపోతేనూ!” వ్యంగ్యంగా అంది.

“ఆ… ఏంటో! నువ్వు మాట్లాడేదాంట్లో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు!” అంటూ మరల నిద్రలోకి జారుకున్నాడు భర్త.

భార్యాభర్తలిద్దరూ అలా గొడవ పడుతున్న సమయంలో, భార్య తలగడ క్రింద వున్న బీరువా తాళాల గుత్తిని చాకచక్యంతో తస్కరించాడు జోగయ్య. ఆ భార్యాభర్తలిద్దరూ మరలా పూర్తిగా నిద్రాదేవి ఒడిలో ఒదిగిపోయారని నిర్ధారించుకున్న తరువాత, తన పని మొదలెట్టాడు జోగయ్య.

బీరువాలోని బంగారు ఆభరణాలను, వెండి వస్తువులను, నగదును జాగ్రత్తగా తన సంచిలో సర్దుకుని, నెమ్మదిగా, అడుగులో అడుగువేసుకుంటూ, ఆ యింటి నుండి బయటపడ్డాడు జోగయ్య. అలా బయటికొచ్చిన జోగయ్య… అటూ ఇటూ చూసుకుంటూ ఎవరి కంటా పడకుండా చీకట్లో, నక్కి నక్కి నడుస్తూ, ఇంటి దారి పట్టాడు.

***

అప్పుడే విజిల్ ఊదుతూ సైకిల్‌పై వస్తున్న పోలీస్ కానిస్టేబిల్ లోకనాధాన్ని చూశాడు దొంగ జోగయ్య. ఒళ్ళంతా కంపించింది. చెమటలు పట్టాయి. కానిస్టేబిల్ కంట పడకుండా తప్పించుకు పారిపోవాలని పరుగు లంఘించుకున్నాడు జోగయ్య. కాని అప్పటికే లోకనాధం, జోగయ్యను చూడనే చూశాడు. వెంటనే సైకిలును వేగంగా తొక్కుతూ జోగయ్యను వెంబడించాడు. ఇది గమనించిన జోగయ్య తన పరుగు వేగాన్ని మరింతగా పెంచాడు. లోకనాధం సైకిలును ఇంకా వేగంగా తొక్కుతున్నాడు. ముందు జోగయ్య వెనుక లోకనాధం. బాగా ఆకలితో వున్న పిల్లి ఎలుకను వెంబడిపడినట్లు, ఆకలికి తట్టుకోలేని పులి మేక వెంబడి పడినట్లు లోకనాధం సైకిలుపై వేగంగా వెళుతున్నాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి లోకనాధం వైపు చూశాడు జోగయ్య, ఇద్దరి మధ్యా దూరం క్రమంగా తగ్గుతుండడం గమనించిన జోగయ్య….

‘ఇంకేముంది… కాసేపట్లో దొరికిపోతాను, కాని అలా జరగకూడదు… ఎలాగైనా పారిపోవాలి!’ అనుకుంటూ తనలోని శక్తినంతటిని కూడగట్టుకుని మరింత వేగంగా పరుగెత్తుతున్నాడు.

‘ఎలాగైనా ఈ రోజు ఈ దొంగను పట్టుకుని తీరాలి…’ అనే కృతనిశ్చయంతో వున్న లోకనాధం, తన శక్తి మేరకు సైకిలును అత్యంత వేగంగా నడుపుతున్నాడు.

జోగయ్యకు దమ్ము చాలడంలేదు. పెద్ద వయసు కదా! ఊపిరి కూడా అందడం లేదు. లోకనాధం పరిస్థితి కూడా దాదాపు అలాగే వుంది. తనకీ వయసు మీద పడింది కదా! శ్వాస అందడం లేదు. గుండె అత్యంత వేగంగా కొట్టుకుంటుంది.

అటు జోగయ్య, ఇటు లోకనాధం, ఇక మందుకు కదలలేకపోతున్నారు. జోగయ్య రోడ్డు ప్రక్కనే వున్న ఒక సిమెంటు బల్లపై కూలబడ్డాడు. లోకనాధం కూడా అదే బల్లపై జోగయ్య ప్రక్కనే తల పట్టుకుని కూర్చున్నాడు. ఇద్దరూ కొంత సేపు ఏమీ మాట్లాడకుండా నేల వైపు చూస్తూ సేదదీరుతున్నారు. కాసేపటికి పరిస్థితి మెరుగు పడింది. జోగయ్య తనతో తెచ్చుకున్న మంచి నీళ్ళ సీసామూత తీసి గటగటా తాగాడు. తల తిప్పకుండా ఆ సీసాను అలాగే లోకనాధానికి అందించాడు. నాలుక పిడస గట్టుకున్నట్లు గమనించిన లోకనాదం, ఆ సీసాను తన చేతిలోకి తీసుకుని, అందులో మిగిలి ఉన్న నీటిని గొంతులో పోసుకుని పెద్ద పెద్ద గుటకులు వేస్తూ తాగి, ఆ సీసాను తిరిగి జోగయ్య చేతికందించాడు.

తరువాత ఇద్దరూ ఒకరినొకరు తేరిపారా చూసుకున్నారు. గతంలో రెండు మూడు సార్లు జోగయ్యను పట్టుకున్నాడు లోకనాధం. ఏవో మాటల్లో పెట్టి తప్పించుకున్నాడు జోగయ్య. ఎప్పటికైనా ఒక దొంగను పట్టకోవాలని పట్టుదలతో ఉన్న లోకనాధానికి అలా ప్రతిసారీ నిరాశే మిగిలింది.

“ఓరినీ…! ఈ ఊరి మొత్తానికి నువ్వొక్కడివే దొంగవా? ఎప్పుడు చూసినా నువ్వే నాకు దొరుకుతుంటావు! మీ దొంగల ముఠాలోని వాళ్లు, వేలం పాటలో ఒక్కొక్క ఊరిని ఒక్కొక్కరు పాడుకున్నట్లున్నారే! ఆ వేలంపాటలో ఈ ఊరిని నువ్వు పాడుకున్నావా? అంతే అయ్యుంటుందిలే!!…” ఆశ్చర్యంగా అన్నాడు లోకనాధం.

“చాల్ చాల్లెండి… మీ వెటకారం…! మీరు మాత్రం… ఈ ఊరి మొత్తానికి మీరొక్కరే పోలీసు అన్నట్లు, ఎప్పుడూ మీరే నన్ను పట్టుకుంటారు!…” అంతే ఆశ్చర్యంగా అన్నాడు జోగయ్య.

“ఈసారి నువ్వు నా నుండి తప్పించుకోలేవు! నిన్ను నాతో తీసుకెళ్ళి పోలీసుస్టేషన్ బొక్కలో వేస్తా!”

“అలాగే కానివ్వండి… ఇంతకీ మీ పేరేంటి?”

“నా పేరుతో నీకేంటి పని? నేనొక పోలీసుని, నువ్వొక దొంగవు! అంతే!”

“అయితే నేను మిమ్మల్ని పోలీసు అని పిలవాలా? తల్లిదండ్రులు ప్రేమతో పెట్టిన మంచి పేరుండగా పోలీసు అని ఎలా పిలవలి సార్!”

“అయినా మనం… మనం పేర్లు పెట్టి పిలుచుకోవాల్సిన అవసరం లేదు! నువ్వొక దొంగవి! నేనొక పోలీసుని… అంతే…!”

“నిజమే సార్… కాదనను! కాని అంతకంటే మందు మనం మనుషులం సార్! ఆ తర్వాతే మీరు పోలీసైనా, నేను దొంగనైనా!”

“ఇంతకు ముందే రెండు మూడు సార్లు కలుసుకున్నాం! అప్పుడడగలేదు… నా పేరుని! ఇప్పుడెందుకయ్యా నీకు!”

“అవును… అంతకు ముందే రెండు మూడు సార్లు కలిశాం కదా! అందుకే ఇప్పుడు మనం స్నేహితులయ్యాం! మీ గురించి నేను నా గురించి మీరు తెలుసుకోవాలి కదా సార్!”

“ఏంటి? ఏం మాటాడుతున్నావ్? దొంగకి, పోలీసుకి స్నేహమా!! ఎక్కడైనా పిల్లికి ఎలుకకి, పులికి మేకకు స్నేహం కుదురుతుందా? నీ పిచ్చిగాని!!”

“పిల్లి ఎలుక, పులి మేక… అవి… జంతువులండీ! కాని, మనం మనుషులం కదా!!”

“ఇక ఆ మాటలన్నీ పక్కన బెట్టి, నడువ్, పోలీసు స్టేషన్‌కి!”

“ఇంకో అయిదు నిమిషాలాగండి సార్! వెళ్దాం! సరే… ఒక్క విషయం చెప్పండి సార్! ఈ వయసులో కూడా మీకీ కష్టాలేంటి సార్! రాత్రంతా డ్యూటీ చేస్తూ దొంగలను పట్టకోవల్సిందేనా?!”

“అవును… అది… నా వృత్తి! అందుకు నేను బాధపడడం లేదు. మరి నీ మాటేంటి? ఇంత వయసొచ్చినా, ఈ దొంగతనాలు చేస్తుండాల్సిందేనా? మానుకోలేవా?”

“మానుకుందామనే అనుకుంటాను సార్! కాని… బాగా అలవాటైన ఈ వృత్తిని అంత తొందరగా మానబుద్ధి కావడం లేదు సార్!”

“అంటే… దొంగతనాలు మానేసి, గౌరవప్రదంగా జీవించాలనుకోవడం లేదా? శేషజీవితంలో ఒక మంచి వ్యక్తిగా సమాజంలో జీవనం సాగించాలని అనిపించడం లేదా? ఒక్కసారి బాగా ఆలోచించుకో!” అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు, అర్జునుడికి జ్ఞానబోధ చేసినట్లు పరిపరి విధాలా చెప్పాడు లోకనాధం జోగయ్యకి… ఆసక్తిగా విని కూడా, తన కేమీ పట్టనట్లు, సంభాషణను మార్పు చేస్తూ…

“సార్! మీరెప్పుడు రిటైర్ అవుతున్నారు సార్!” అడిగాడు జోగయ్య.

“ఈ సంవత్సరాంతానికి రిటైర్ అవుతాను!”

“అందుకు మీరు ఇప్పటి నుండే దిగులు పడుతున్నారా?”

“లేదు… లేదు… అందుకు దిగులు పడడం లేదు… కాని!”

“కాని… ఏంటి సార్? మరింక దేనికైనా దిగులు పడుతున్నారా?”

“రిటైర్ అయ్యేలోపు కనీసం ఒక్క ప్రమోషన్ అయినా సంపాదించగలనో లేదో అని ఒక దిగులుంది!”

“అవునా! అయితే మీకు ప్రమోషన్ ఎలా వస్తుంది? అందుకు మీరేం చేయాలి?”

“కనీసం ఒక్క దొంగనైనా పట్టుకుని అరెస్టు చేయాలి! జైల్లో పెట్టాలి!”

“అయితే ఈ సారి మీకు ప్రమోషన్ తప్పకవస్తుంది సార్!”

“అదెలా!!??”

“ఇప్పుడు నన్ను పట్టుకున్నారు కదా! అరెస్టు చేయండి! జైల్లో పెట్టండి! అంతే!! మీకు ప్రమోషన్ గ్యారంటీ!”

“ఆ! నువ్వు కాలాంతకుడివి! నిన్ను స్టేషన్ దాక తీసుకెళ్ళగలనో లేదో!”

“ఎందుకలా?!”

“ఇంతకు ముందు నీతో నాకున్న అనుభవం, నాతో అలా చెప్పిస్తుంది!!”

“ఈసారి అలా జరగదులే సార్! ఆ… అన్నట్లు నా పేరు జోగయ్య! మరి మీ పేరు?!”

“పేరు చెప్పందే వదిలేట్లు లేవు కదా! నా పేరు లోకనాధం!”

“హమ్మయ్యా! మొత్తానికి మీ పేరు చెప్పారు! సరే… లోకనాధం గారూ! ఇప్పుడు మీ స్టేషన్‌కు వెళ్దామా!”

“సరే… పద!”

“సార్! ఒక్క నిమిషం!”

“మరలా ఏమైంది జోగయ్యా!”

“ఏం లేదు సార్! మీరిక్కడే వుండండి! నేనలా వెళ్లి కాలు మడుసుకొని ఇలా వెంటనే వస్తా!”

“సరే! అఘోరించు!”

మొత్తానికి అక్కడ నుండి అంతర్ధానమయ్యాడు జోగయ్య. తిరిగి ప్రత్యక్షమవుతాడని వేయికళ్ళతో ఎదురు చూస్తున్నాడు లోకనాధం. సమయం అర్ధగంట దాటింది. వెంటనే వస్తానన్న జోగయ్య ఇంత వరకు రాలేదు. ఇక వస్తాడనే ఆశలు సన్నగిలుతున్నాయి. ప్రమోషన్ వస్తుందనే ఆశలు ఆవిరైపోయాయి… అయినా వాడు వెళ్లొస్తానంటే… పంపించేయడమేనా? ఒకవేళ పంపినా… నేనూ వాడితో పాటు వెళ్ళాల్సింది కదా! వాడు తిరిగొస్తానంటే నేను గుడ్డిగా నమ్మడమేంటి? నా అమాయకత్వం కాకపోతేనూ! అసలు ఒక దొంగకు నీతీ నిజాయితీ వుంటాయా? అలా ఉంటాయని నమ్మి వాడ్ని పంపించడం నా చేతకానితనం! ఏం చేస్తాం! నేను రిటైర్ అయ్యేలోపు ప్రమోషన్ తీసుకోవడం అసంభవంలా వుంది. ఇక ఇక్కడ రానివాడి కోసం వేచియుండటం వృథా! స్టేషన్ కెళ్ళి సంతకం పెట్టి ఇంటికెళ్ళి కాసేపు పడుకోవడం బెటర్! అనుకుంటూ తనను తాను నిందించుకుని సైకిలెక్కాడు.

అంతలో వెనక నుండి కేకలు!

“సార్… సార్! లోకనాధం గారూ! ఆగండి సార్! వచ్చేస్తున్నాను!”

ఆ కేకలు విని వెనక్కి తిరిగి చూసిన లోకనాధం రొప్పుకుంటూ పరుగెత్తుకుని వస్తున్న జోగయ్యను చూడగానే ఆశ్చర్యంతో స్థాణువులా మారాడు. తను చూస్తుంది కలా! నిజమా!! అని తేల్చుకునే లోపే జోగయ్య వచ్చి…

“సార్! నేను తిరిగి రాననుకున్నారా? నిజమే సార్! రాకూడదనుకునే కొంచెం దూరం పరిగెత్తాను సార్! అప్పుడు… ఎందుకో… మీరు చెప్పిన విషయాలన్నీ నా మనసులో మెదిలాయి. ఇకపై ఈ దొంగతనాలు మానేసి, ఒక మారిన మనిషిలా, ఒక మంచి వ్యక్తిగా ఈ సమాజంలో జీవించాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. వెంటనే వెనక్కి మళ్లి మీ దగ్గరకు పరుగు పరుగున వస్తున్నాను సార్! మరో మాట! మీరు నాకు చేసిన ఈ మేలును నా జన్మలో మరిచిపోను. అందుకు ప్రతిగా నా వల్ల మీకూ మంచి జరగాలి. అందుకే, నన్ను అరెస్టు చేసి, జైల్లో పెట్టండి… మీకు ప్రమోషన్ వస్తుంది…! ఇప్పుడు సంకెళ్లు వేయండి సార్!” అంటూ చేతులు చాచాడు జోగయ్య.

‘అంటే… దొంగల్లో కూడా జోగయ్య లాంటి మంచివాళ్ళు, నిజాయితీపరులు ఉన్నారు! దేవుడు చాలా గొప్పవాడు!…’ అని మనసులోనే అనుకుని, జోగయ్యకు సంకెళ్ళు వేసి, తనతో పాటు స్టేషన్‌కు తీసికెళ్ళాడు. లోకనాధం.

***

“ఆ! జోగయ్యా…! కొంచెం సేపు ఆ బల్ల మీద కూర్చో!”

“వద్దు లెండి సార్! నేనొక దొంగని! నాకు మర్యాదలేంటి? నా స్థానం… అదుగో… ఆ గోడకానుకుని కిందనే కూర్చుంటాను! మీరు మీ పని చూసుకోండి సార్!”

“సరే! నీ ఇష్టం!” అని చెప్పి, జోగయ్యపై ఎఫ్.ఐ.ఆర్, కట్టడంలో రైటర్‌కి సహాయపడుతున్నాడు లోకనాధం.

అప్పుడే… ఇన్‌స్పెక్టర్ గారు స్టేషన్ లోకి ప్రవేశించారు.

“గుడ్ మార్నింగ్ సార్!” అంటూ అక్కడున్న వారందరూ ఇనస్పెక్టర్ గారికి సెల్యూట్ చేస్తూ లేచి నిలుచున్నారు.

“ఆ! ఆ! గుడ్ మార్నింగ్!! ఏంటి విశేషాలు?” అడిగారు ఇన్‌స్పెక్టర్ గారు.

లోకనాధం ఏదో చెప్పబోతుండగా, రైటర్ కల్పించుకుని…

“సార్! ఈ రోజు పెద్ద విశేషమే ఉంది సార్!” అన్నాడు.

“అవునా! ఏంటా విశేషం?”

“ఒక దొంగ, దొంగతనం చేసి, సొత్తుతో సహా పారిపోతుంటే… మన కానిస్టేబిల్ లోకనాధం గారు తెగించి, ఆ దొంగని వెంబడించి, పట్టుకుని, అరెస్టు చేసి స్టేషన్‌కి తీసుకొచ్చారు సార్! అడుగో… అక్కడ గోడకానుకుని కూర్చున్నాడు… వాడే… ఆ దొంగ సార్!” అని జరిగినదంతా వివరించాడు రైటర్.

దొంగను తేరిపార చూసిన ఇన్‌స్టెక్టర్ గారు, లోకనాధం వైపు తిరిగి…

“లోకనాధం గారూ! నిజంగా మీరు దొంగని పట్టుకున్నారంటే నమ్మలేకపోతున్నాను! ఏది ఏమైనప్పటికి మీకు నా అభినందనలు!” అన్నారు.

“ధన్యవాదాలండి!”
“ఇక ఈసారి మీ ప్రమోషన్‌ని ఎవరూ ఆపలేరు…! నేను రికమెండ్ చేసి మీకు ఆతి త్వరలో ప్రమోషన్ ఇప్పిస్తాను!”

“మీ దయ సార్!”

“అన్నట్లు యఫ్.ఐ.ఆర్ రెడీ అయిందా?”

“రెడీగా వుంది సార్!” అంటూ యఫ్.ఐ.ఆర్. కాపీని ఇన్‌స్పెక్టర్ గారికి అందించాడు రైటర్.

యఫ్.ఐ.ఆర్.ని పూర్తిగా చదివి, సంతృప్తి చెందిన మీదట, దాని పైన సంతకాలు పెట్టారు ఇన్‌స్పెక్టర్ గారు.

“అన్నట్లు… లోకనాధంగారు! ఈ రోజు 11 గంటలకు మనిద్దరం ఆ దొంగని కోర్టుకు తీసుకెళ్దాం… శిక్ష పడేటట్లు చూద్దాం!”

“అలాగే సార్!”

అప్పుడే స్టేషన్ లోని వాళ్ళందరికీ ‘టీ’ తెప్పించాడు రైటర్. లోకనాధం ‘టీ’ ఇచ్చే కుర్రాడికి చెప్పి జోగయ్యకు కూడా ‘టీ’ ఇప్పించాడు. ‘టీ’ తాగడానికి మొహమాటపడుతున్న జోగయ్యను చూసి ఏం పరవాలేదు.. తాగమంటూ సైగలు చేశాడు లోకనాధం.

***

లోకనాధం, ఇన్‍స్పెక్టరు గారు జోగయ్యను వెంటబెట్టుకుని అనుకున్న టైంకి కోర్టుకు చేరుకున్నారు. అప్పటికే జడ్జిగారు మరో కేసు తాలూకు వాదోపవాదనలు వింటున్నారు. ఆ తరువాత, ఇన్‌స్పెక్టరు గారు, జోగయ్యను బోనులో నిలబెట్టి, జరిగిన వృత్తాంతాన్ని జడ్జిగారికి వివరించి, దొంగ జోగయ్యకు తగిన శిక్ష విధించాలని కోరారు.

అంతా విన్న జడ్జిగారు, శిక్ష ఖరారు చేసేముందు, జోగయ్య నుద్దేశించి…

“చివరిగా నువ్వేమైనా చెప్పుకోవాలని అనుకుంటున్నావా?” అని అడిగారు.

అందుకు బదులుగా జోగయ్య మాట్లాడుతూ…

“అయ్యా ఇక్కడ కానిస్టేబుల్ లోకనాధం గురించి చెప్పదలచుకుంటున్నాను సార్!”

“అనుమతిస్తున్నాను… చెప్పు!”

“నన్ను అరెస్టు చేసిన లోకనాధం గారు నాకు అనేక విషయాలు చెప్పి, ఈ దొంగతనాలు మానేసి, పరివర్తన చెందిన మనిషిగా, ఇకపై గౌరవప్రదంగా జీవించమని నాకు ప్రబోధం చేశారు. వారి మాటలన్నీ శ్రద్ధగా విన్న నాకు జ్ఞానోదయమైంది. వారు చెప్పినట్లే భవిష్యత్తులో మంచి వ్యక్తిగా జీవించాలని నిర్ణయించుకున్నాను. అదే జరిగితే… గత పది సంవత్సరాలుగా నాకు దూరంగా ఉన్న నా భార్యా పిల్లలు, అందరూ నన్ను చేరుకుంటారు. మేమంతా కలిసి సంతోషంగా బతుకుతాము. మరో విషయం సార్! నాకున్న ఆస్తిలో, నేనూ నా కుటుంబం మనుగడ కోసం సరిపడా నాకు ఉంచి, మిగతా ఆస్తిని ప్రభుత్వం తీసుకోవాలని, దాంతో సమాజసేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా చేస్తే నా జన్మ ధన్యమవుతుంది సార్! నేను చెప్పాలనుకున్నది అంతే సార్!” అంటూ రెండు చేతులు జోడించి జడ్జిగారికి దణ్ణం పెట్టాడు జోగయ్య.

జోగయ్య చెప్పిన మాటలు విన్న జడ్జిగారు, తన తీర్పును భోజన విరామం తరువాత వెలువరిస్తానని తెలిపి తన ఆసనం నుండి లేచి వెళ్ళారు. అక్కడున్న వారందరూ భోజనం చేసేందుకు కోర్టు హాలు నుండి బయటికి నడిచారు.

***

అందరూ ఎదురు చూస్తుండగా, జడ్జిగారు తిరిగి ప్రవేశించి తన ఆసనంలో కూర్చుని…

“ఆర్డర్! ఆర్డర్!!…” అన్నారు. కోర్టు ఆర్డర్ లోకి వచ్చిన తరువాత జోగయ్య కేసులో తీర్పు చెప్పడం మొదలెట్టారు. జోగయ్య చేతులు కట్టుకుని, బోనులో వినమ్రంగా నిలబడి వున్నాడు.

“నిజానికి జోగయ్యది కేసు చాలా చిన్న కేసు… కాని ఇదొక ప్రత్యేకతను సంతరించుకుంది. కానిస్టేబిల్ లోకనాధంగారు చేసిన ప్రబోధం మూలంగా, జోగయ్య పరివర్తన చెందాడు. ఇకముందు దొంగతనాలు మానేసి గౌరవప్రదంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. అంతే కాదు… తన ఆస్తిలో కొంత ఉంచుకుని మిగతాది ప్రభుత్వానికి ఇస్తున్నాడు. దాంతో ప్రభుత్వమే సమాజసేవా కార్యక్రమాలు నిర్వహించి, ఆపన్నులకు సాయమందించాలని కోరాడు. ఇది నిజంగా ఊహించని పరిణామమైనా, ఆశించదగినదనేది వాస్తవం. అందుకే, ఈ కోర్టు జోగయ్యను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అతని పైన ఉన్న కేసును కొట్టివేస్తూ, జోగయ్యను బేషరతుగా విడుదల చేయాలని పోలీసు శాఖను ఆదేశిస్తుంది.”

“అలాగే కేవలం ఒక దొంగను పట్టుకోవడమే కాకుండా… ఆ దొంగలో పరివర్తనను తీసుకొచ్చి, ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన కానిస్టేబిల్ లోకనాధంగారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తుంది ఈ కోర్టు.

అలాగే లోకనాధాన్ని ఉచిత రీతిన సత్కరించాలని, పదోన్నతిని కల్పించడానికి పరిశీలించాలని పోలీసు శాఖను కోరడమైనది!!” అని తీర్పును వెలువరించారు జడ్జిగారు.

జోగయ్య రెండు చేతులు జోడించి మరొక్కమారు జడ్జిగారికి నమస్కరించి బోనులో నుండి బయటికొచ్చాడు. లోకనాధం కూడా కృతజ్ఞతా పూర్వకంగా జడ్జిగారికి నమస్కరించాడు.

జడ్జిగారి అనుమతితో, జోగయ్య, లోకనాధం, ఇన్‌స్పెక్టరుగారు… సంతోషంగా కోర్టు హాలు నుండి బయటకు నడిచారు.

***

సముద్రపు అలల ఒడిదుడుకుల తాకిడికి ఎదురొడ్డి ఒడ్డుకి చేరిన నావలా… జోగయ్య, లోకనాధంల జీవిత నౌకలు ఓ దరికి చేరాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here