అడుగడుగునా అనుభూతిని అందించే ‘ఒదిగిన కాలం’

0
3

[డా. నోరి దత్తాత్రేయుడి గారి ఆత్మకథ ‘ఒదిగిన కాలం’పై సమీక్ష అందిస్తున్నారు శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ.]

గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలో ఎక్కడ కాన్సర్ విషయంలో చికిత్స గానీ, పరిశోధన గానీ వచ్చినప్పుడు ఒక్క పేరు ఎక్కువ సార్లూ, మరింత గట్టిగానూ వినిపిస్తూ వస్తోంది. అదే డా. నోరి దత్తాత్రేయుడు! వీరు మన తెలుగు వారవటం మనందరికీ మరింత గర్వకారణం.

ఇటలీకి చెందిన సినీ రచయిత, దర్శకుడు ఫెడరికో ఫెల్లినీ ఒక మాట అంటారు – కళాస్వరూపాలన్నీ ఆత్మకథలే. ముత్యపు చిప్ప యొక్క ఆత్మకథ ముత్యంగా మెరుస్తుంది!

ఆత్మబలం, దైవబలం, సంకల్పబలం – ఈ మూడూ కలిసి ఊసులాడుకునే చోట ఒక ఆసక్తికరమైన కథ తప్పకుండా కనిపిస్తుంది. ఒక ఆత్మకథలో ఆ మూడూ సజీవంగా ముందరికి వచ్చి ఆకట్టుకున్నప్పుడు అది ముందర నిలబడ్డ చరిత్ర కాకుండా నడుస్తున్న చరిత్రలా అడుగడుగునా అనుభూతిని అందిస్తుంది.

‘ఒదిగిన కాలం’ దత్తాత్రేయుడి గారి చరిత్ర. (ఓ విధంగా మరో దత్త చరిత్ర!).

మంటాడ నుంచి ఆయన మాన్‌హటన్‌కు ప్రయాణం చేసిన తీరు, ఆయన బాల్యం గడిచిన రోజులు, వారి మాతృమూర్తి ఇందరిని పెంచి పెద్ద చేసి ఎంతో గుండె నిబ్బరంతో ఎవరికీ ఏ లోటూ రాకుండా చూసుకోవటం, వీరి పెద్దన్నయ్య, వరుసగా అన్నలందరూ కుటుంబం యొక్క బాధ్యతలను అందిపుచ్చుకున్న తీరు, వీరిని చదివించిన తీరు, కుటుంబంలోని అందరి మధ్యన గల అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు – జీవితమంటే ఎటువంటి పోరాటమో, ఎటువంటి సంఘర్షణయో చాలా సున్నితంగా మన ముందుంచుతుంది. డాక్టర్ గారు ఈ నేపథ్యాన్ని చిన్ని చిన్ని సంఘటనలతో ఒక కథా రచయిత లాగ చెప్పటం వలన అక్కడి నాటకీయత, వాస్తవాలతో కలిసిన చిత్రీకరణ మనలను ఆలోచింప చేస్తుంది.

కర్నూలు మెడికల్ కాలేజీలోని సంఘటనలు, మధ్య మధ్యలో ఒక శివాలయంలో ఆయనకి కలిగిన అనుభవాలు ఆయిన వ్యక్తిత్వాన్ని ముందుకు తీసుకొని వస్తాయి.

డాక్టర్ గారు కేవలం ఒక తత్వవేత్తగా కాకుండా ఒక వైద్యునిలో మెండుగా ఉండవలసిన ఒక మానవతావాదిగా కూడా కనిపిస్తారు.

సృజనశీలులు చాలా రంగాలలో కనిపిస్తారు. అలా కనిపించిన వారందరూ సమాజానికి పెద్దగా ఉపయోగ పడ్డవారు కాకపోవచ్చు. కాన్సర్ చికిత్సలో తారాస్థాయికి చేరుకునే ఒక దృఢ సంకల్పం గల దత్తాత్రేయుడుగారు ఆధునిక ఆంకాలజీ రంగంలో అద్భుతమైన సృజనశీలులు! ఈశ్వరుడు సృజనాత్మకతను చాలామందికి ప్రసాదించినా కరడుగట్టిన మానవతావాదులకు తక్కువగానే ఇస్తాడన్న ఆలోచన దత్తాత్రేయుడు గార్ని తలచుకున్నప్పుడు తప్పు అనిపిస్తుంది!

పెద్ద పెద్ద నాయకులు, సినీ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు న్యూయార్క్‌కు వెళ్లి ఆయన దగ్గర వైద్యం చేయించుకుని అక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టలేదు. తిరిగి వాళ్ల దేశాలకి వెళ్లి వారి నిర్వహణలో ఎన్నో సంస్థలను స్థాపించి మానవాళికి సేవలనందిస్తున్నారు. భాగ్యనగరం లోని శ్రీమతి బసవతారకం ఆసుపత్రి ఇలా ఏర్పడిన ఒక ఆధునిక సంస్థ.

దత్తాత్రేయుడు గారు స్నేహశీలి. ‘స్నేహధనమే మూలధనం’ అనే శీర్షిక క్రింద ఆయిన అనుభవాలను చెబుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక అంతర్జాతీయ సదస్సులో అమెరికాలోని స్లోఆన్ కెటరింగ్ మెమోరియల్ హాస్పటల్ లోని ఒక విభాగం అధ్యక్షుడు ఆయన్ని “డాక్టర్ నోరి, ఎపుడైనా అమెరికా వస్తే నన్ను తప్పకుండా కలవండి..” అన్న మాట చెప్పారు. ఇది ఆయన జీవితంలో మేలి మలుపు! ఈ సందర్భంలో ఆయనతో కలిసి అధ్యయనం చేసిన మిత్రులను తలచుకోవటం విశేషం. సామాన్యంగా గొప్ప గొప్ప సంఘటనలు మంచి మిత్రుల సాంగత్యంలో జరగటం మనం ఎందరి చరిత్రలలోనో చూస్తాం.

సెలెబ్రటీ అనో, లేక ఇంకెవరో అనో ఆయన ఎన్నాడూ వ్యత్యాసాలు చూపించలేదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే సినీ నటి శ్రీదేవి లాంటి వాళ్లు కూడా అమెరికాలో ఉన్నంత సేపు వారింట్లో ఒక సభ్యులు గానే మసలుకున్నారు! ఎన్.టి.రామారావు గారితో అనుబంధాన్ని ఆయన ‘తారక మంత్రము కోరిన దొరికెను’ అనే శీర్షికలో చెప్పారు. లోతుగా ఆలోచిస్తే బసవతారకం ఆస్పత్రి లాంటిది ప్రజలకు కోరినా దొరికేదా?!

దత్తాత్రేయుడి గారి జీవితంలో ఆయనను దెబ్బతీయాలనుకున్న వారూ లేకపోలేదు. వాటిలోంచి బయటపడేందుకు కొంత కాలం పట్టినా విజయం చివరికి ఆయననే వరించింది. “పరిశ్రమించే తత్త్వం, పనిలో నాణ్యత, నిబద్ధత – ఇవి మాత్రమే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకువెళతాయిని నమ్మే వ్యక్తిని నేను” అని చెబుతూ డబ్బు కన్నా గౌరవం ఎంతో ప్రధానం అని అన్నారు. ఇటువంటివి వారు శిర్డీ సాయినాథుని పట్ల ఆయన భక్తి, సాయినాథుడు ఆదుకుంటూ అవసరమైన చోట్ల మంచి వ్యక్తులను పరిచయం చేయటం వంటివి ఉటంకించిన ‘శ్రద్ధ, సహనం ఉంటే, ఆయనే నడిపిస్తారు’ అనే శీర్షికలో చదవవచ్చు.

‘ఆ రోజు వస్తుంది’ శీర్షిక క్రింద కాన్సర్‌లో తీసుకోవలసిన జాగ్రత్తలు, భవిష్యత్తులో ఇది కేవలం ఒక మామూలు జబ్బుగా పరిణమించగలదనే మాటలు చెప్పారు. ఆయన అన్నట్లు గానే ఇటీవల జపనీస్, అమెరికన్ శాస్త్రజ్ఞుల పరిశోధనల వలన ‘ఇమ్యునోథెరపీ’ అనే ఆధునిక చికిత్స ప్రారంభమైంది. ఇది ఒక ‘గేమ్ ఛేంజర్’ గా అందరూ గుర్తించారు (ఈ పరిశోధనకు జపాన్, అమెరికన్ శాస్త్రజ్ఞులకు నోబెల్ బహుమతి లభించింది). ఈ అంశం వైపు సూచన ప్రాయంగా దత్తాత్రేయుడు గారు ప్రిసిషన్, టార్గెటెడ్, డిజైనర్ డ్రగ్స్ గురించి వివరించారు.

కాన్సర్ వైద్యం విషయంలో ఏవిధంగా ప్రభుత్వం వారు ఎందుకు వెళ్లాలి అనే విషయాలు చాలా చక్కగా, నిర్దేశాత్మకంగా ‘ఇలా ముందుకు వెళదాం’ అనే శీర్షికలో చెప్పారు.

‘ఒదిగిన కాలం’ చదువవలసిన పుస్తకం. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనకు తెలియటమే కాకుండా ఒక పట్టుదల గల వ్యక్తి మానవ సంకల్పంతో, దైవబలంతో ఎలా స్థితప్రజ్ఞునిలా ముందుకు దూసుకుని వెళ్లగలడని అర్థం చేసుకోగలుగుతాము.

డాక్టర్ గారి వివరణ సరళంగా, సహజంగా ఉంటుంది. అమెరికా లోని జీవన విధానం మీద, ఆయన వాహనం మీద అక్కడక్కడ హాస్యోక్తులు కూడా చూడగలం.

ఈ పుస్తకానికి రచన సహకారాన్ని పప్పు అరుణ అందించారు.

నిరంతరం సత్కర్మలను ఆచరించేవారు దేనినీ వెతుక్కోరు. ప్రపంచం వారిని వెతుక్కుంటుంది!

కాలం కూడా కొద్దిగా ఆగి ఒదిగిపోతుంది!

***

ఒదిగిన కాలం (ఆత్మకథ)
రచన: డా. నోరి దత్తాత్రేయుడు
ప్రచురణ: సాహితీమిత్రులు
పేజీలు: 232
వెల: ₹ 600.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.
ఆన్‍లైన్‌‍లో:
https://www.telugubooks.in/products/dr-nori-datthathreyudu-odiginakaalam-sweeya-athmakatha
https://www.amazon.in/-/hi/Dr-Nori-Dattatreyudu/dp/8194989159

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here