Site icon Sanchika

ఒగ మాట

[dropcap]”రా[/dropcap]మన్నా… రామన్నా మన దేశములా దిల్లీ లాని మర్కజ్ సమావేశాలకి పోయి వచ్చిన వాళ్ళనింకానే కరోనా కాయిలా శానా అయిందటా. అవునా నా?”

“అవునురా”

“దక్షిణ కొరియాలాని ‘డేగు’ అనే పేటలా కరోనా కాయిలా వచ్చిందే ఆడయమ్మ ఒగ చర్చిలా దేవుని ప్రార్థనలకి పోయి ఆడవుండే వాళ్ళకంతా కాయిలా అంటిచ్చినంటా నిజమేనా?”

“నిజంరా”

“కరోనా కాయిలాకి దిగులు పడి మన తిరుపతి వెంకట రమణ సామి గుడి కూడా మూసీసిరంటా” అని నేను అన్నింది తడువు (తక్షణం) “ఏడుకొండల సామి గుడే కాదురా మన దేశంలాని గుడులు, మసీదులు, చర్చిలు అట్లే బూలోక దేవుళ్ళ మందిరాలు, మఠాలు అన్నీ మూసేసి శానాళ్లాయె” అనె.

“మడి (మరి) బూలోకములో వుండే పెద్ద పెద్ద సాములు, ముల్లాలు, మౌలీలు, పాద్రీలు, బిషప్‌లు, దేవుని కూడా మాట్లాడేవాళ్ళు, దేవుని అవతారాలు, నడిచే దేవుళ్ళు, కాయిలాల చిటికిలా మేలు చేసే ఫాదర్‌లు వీళ్లంతా ఏమి చేస్తా వుండారునా, ఈ కరోనా సమాచారం దేవునికి చెప్పి దాన్ని చంపి పారేసి గుడి, మసీదు, చర్చిలను తీయవచ్చు కదా? అయినా దేవుని మొక్కే తావే కాయిలాలు అంటుకొంటే ఎట్ల? దీన్ని ఎట్ల అర్థము చేసుకొనేదినా?” అంట్ని.

“‘రేయ్’, ఈ గుడి, మసీదు, చర్చిలలా వుండే వాళ్ళంతా బలే పుంగు (ఉత్త) సాములు. వీళ్లకి ఒగర్ని చూస్తే ఇంగొకరికి అయ్యేల్లే. ఎబుడు చూసినా తిట్టుకొనేది, కొట్టుకునేది. జనాల రక్తాన్ని ఏరులు పారిచ్చి పాటలు పాడి పరవసించేది ఇదే పని. మనిషిని మనిషిగా చూడని వీళ్లని చూసి దేవునికి శానా బేజారయి ఆ తావుల్ని ఇడసిపెట్టి శాన్నాళ్లాయ. ఇబుడు ఆ తావుల్లా దేవుడు లే గీవుడూ లే. దాన్నింకానే కరోనా కాయిలా అంత దైర్యముగా దేవున్ని మొక్కే తావుల్లానే పుట్టబడి అయి పిల్లలు పెడతా బూలోక మంతా పారాడతా జనాల ఉసురు తీస్తా వుండేది” ఇలావరిగా చెప్పే అన్న.

“ఎట్లా లత్తనాకొడుకులు రామన్నా వీళ్ళు. దేవున్ని కూడా గుడి, మసీదు, చర్చిల నింకా తరిమేసింది కాకుండా ఏమీ తెలీని నెంగినాయాళ్లు మాద్రిగా పుంగుమాటలు చెప్తారు కదనా” కోపముగా అంట్ని.

“ఈ పుంగుమాటలు పోయి కరోనా కాయిలా తావ చెప్పమనరా” ఇంగా కోపముగా అనె అన్న.

మా ఇద్దరి కోపము ఇంగా జాస్తి అయి కోటా పేటా దాటేకి సురువాయ. అంతలానే ఆడంతా కరోనా కాయిలా వుందనే గేణం వచ్చి మెల్లగా పోయి మామిడి మాను నీడలా కూకొనె.

“ఇబుడెట్లనా కరోనా కాయిలా నింకా తప్పించుకొని బతికి బట్టకట్టేది” అంట్ని.

“మూతికి బట్ట కట్టుకొనాలరా, చేతిని సబ్బునీళ్ళలా బాగా కడుక్కోవాలరా. ఏడపడితే ఆద తిరగాలడి ఎగిరిపడి విగురుకొనే కన్నా కడుపు అంత ఉడుకు కూడు తిని కొంపల్లానే వుండాలరా” అనె.

“మడి దేవుడు తిరగా గుడి, మసీదు, చర్చిలకి రావాలంటే ఏమి చేయాలనా?”

“దాని ఒగ ఉపాయము వుందిరా. ప్రతి గుడి, మసీదు, చర్చి – కుల, మత భేదాలు లేకుండా కరోనా కాయిలా వచ్చిండే వాళ్ల సేవకి అంకితము కావాలా. ఆ సేవ ఎట్లుండాలంటే మతము కన్నా మనిషి, మానవత్వం పెద్దది అన్నెట్ల వుండాల. అబుడు దేవుడే జీవుడై, జీవుడే దేవుడై తనకు తానుగా ఆ తావులకి వచ్చి చేరుతాడురా” బో గొప్పగా చెప్పే రామన్న.

“సరెనా! ఈ మాట పోయి గుడి, మసీదు, చర్చిల తావ చెప్పి వస్తానునా” అంటా ఆడనింకా లేస్తిని. మరసిపోవద్దండన్నా, మీరు ఒగ మాట వాళ్లకి చెప్పండనా…!

***

ఒగ మాట = ఒక్క మాట

Exit mobile version