[box type=’note’ fontsize=’16’] “ఇది తెలుగు ఒరిజినల్ కాకపోయినా మన స్థలకాలాలకు నప్పే విధంగా ఈ చిత్రాన్ని తీసినందుకు అభినందించాల్సిందే!” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘ఓ బేబీ’ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]
“మిస్ గ్రాని” అన్న ఒక కొరియన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు ” ఓ బేబి” పేరుతో. నందిని రెడ్డి దర్శకత్వంలో. మనకున్న మంచి దర్శకులలో ఆమె ఒకరు. ఇది తెలుగు ఒరిజినల్ కాకపోయినా మన స్థలకాలాలకు నప్పే విధంగా ఆమె ఈ చిత్రాన్ని తీసినందుకు అభినందించాల్సిందే!
కథ చిన్న పిల్లల చందమామ కథలా వున్నా, పూర్తి వినోదంతో పాటు మన ఆలోచనలను కూడా రేకెత్తించే విధంగా వుంది. బేబక్క (లక్ష్మి) వొక 70 యేళ్ళ విధవరాలు. చిన్నప్పుడే పెళ్ళి అయ్యి, యేడాదికే భర్తను పోగొట్టుకుంటుంది. ప్రస్తుతం కొడుకు శేఖర్ (రావు రమేశ్), కోడలు మాధవి (ప్రగతి), మనవడు రాకి (తేజ), మనవరాలు దివ్య (అనీష) లతో వుంటుంది. మెడికల్ కాలేజిలో కొడుకు జెరియాట్రిక్స్ ప్రొఫెసర్. అదే కాలేజీలో బేబి తన చిన్నతనం నుంచీ మిత్రుడైన చంటి (రాజేంద్ర ప్రసాద్) తో వొక కేంటీను నడుపుతూ వుంటుంది. చాలా మంది ముసలమ్మల లాగా ఆమెకు కూడా పెత్తనం చెలాయించటం అలవాటు. కొడుకును చదువుకోవట్లేదని కేకలేస్తున్న కోడలి ముందే మనవడిని వెనకేసుకు రావడం లాంటివి చేస్తూ కోడలికి మనస్తాపం కలిగిస్తుంది అనాలోచితంగా. అది కోడలి గుండెపోటుకు కారణమవుతుంది. ఇక తను అత్తగారితో వుండలేనని తెగేసి చెప్తుంది. శేఖర్ యెవరికీ సర్ది చెప్పలేక నలిగిపోతాడు. విషయం తెలుసుకున్న బేబి తనే ఇంటినుంచి వెళ్ళిపోతుంది. వొక మాయల మాంత్రికుడు (జగపతి బాబు) ఇచ్చిన వినాయకుని బొమ్మ అయిష్టంగానే తీసుకుంటుంది. ఆమె మనసులో వున్న కోరిక ప్రకారమే ఆమె పాతికేళ్ళ పడుచుగా మారిపోతుంది, ఆ మహిమ గల వినాయకుని బొమ్మ అనుగ్రహంతో. దీని తర్వాత రకరకాల సన్నివేశాలు, వొక పక్క నవ్విస్తూనే మరో పక్క మనకు కథ కొత్త దారుల్లోకి తీసుకెళ్తుంది. ఆ మిగతా కథ తెర మీద చూడాల్సిందే తప్ప చెప్పుకోలేము.
నందిని రెడ్డి దర్శకత్వం ఇదివరకే చెప్పుకున్నట్టు బాగుంది. రాజేంద్ర ప్రసాద్, లక్ష్మి, రావు రమేశ్ లు బాగా నటించడం కొత్తగా చెప్పాలా యేం! అయితే నాకు ఆశ్చర్యం కలిగించింది సమంత నటన. వయసు 24 అయినా ఆ body language అంతా 70 ఏళ్ళదానిలా వుంది; మాట కూడా అలాగే. మనవడికి సంగీతం ఇష్టం. బేబికి చిన్నప్పుడు సంగీతం ఇష్టమున్నా ఇంట్లో నేర్చుకోనివ్వలేదు. కాబట్టి ఆమె మనవడిని ప్రోత్సహిస్తూ వుంటుంది. సమంతగా మారాక తను పాడుతుంది కూడా. పాటలు మిక్కి జె మేయర్ సంగీతంలో బాగున్నాయి. శ్రావ్యంగా. పదాలు కూడా అర్థవంతంగా. ఇక లక్ష్మి భూపాల్ సంభాషణలు, కొన్ని పాటల్లో సాహిత్యమూ చాలా బాగున్నాయి.
ఇదివరలో “ఖూబ్ సూరత్” అని హృషికేష్ ముఖర్జీ చిత్రం వచ్చింది. అందులో ఇంటి పెద్ద అయిన దీనా పాఠక్ ఇంటిమొత్తం మీద పెత్తనం చెలాయిస్తూ వుంటుంది. వొక జైలు లాగా తయారు చేస్తుంది ఇంటిని. కోడలి చెల్లెలైన రేఖ వచ్చాక ఆ ఇంట్లో అల్లర్లు, నవ్వులూ వస్తాయి. చివరిదాకా వినోదం పంచాక ఆ పెద్దావిడ అలా యెందుకు వుండాల్సి వచ్చిందో తెలుస్తుంది. నిజంగానే ఈ పెద్ద వాళ్ళను సరైన పధ్ధతిలో అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది. తామెంచుకున్న పధ్ధతిలో వాళ్ళు పొరపాట్లూ చేస్తారు, మనస్సులూ నొప్పిస్తారు. ఇందులో బేబి కోడలిని బాధపెట్టినట్టుగా. అయితే ఆ కోడలికి తన మాట విని, అర్థం చేసుకుని పక్కన నిలబడే భర్త వుండీ లేకపోవడంతో బాధ గుండెపోటు వరకూ వెళ్తుంది. కాబట్టి దోషి బేబి వొక్కతే కాదు. ఇదివరకు బాలచందర్ ఇలాంటి సున్నితమైన అంశాల చుట్టూ కథలు అల్లేవాడు. ఇప్పుడు ఈ చిత్రం.
వొక వ్యాపార చిత్రానికి వున్నట్టే ఇందులోనూ సినేమేటిక్ సౌలభ్యాలు చాలా వాడుకున్నారు. కాని పైన చర్చించిన వాటితో పోలిస్తే అవి అసలు పట్టించుకునేంతగా లేవు.
నాకు ఆశ్చర్యంగా ఇది నాలుగో తెలుగు చిత్రం, వరస పెట్టి చూడటం, సమీక్ష వ్రాయటం. అయ్యబాబోయ్ తెలుగు సినెమాకి మంచి చిత్రాలు వచ్చేశాయా, లేక ఇది మూడు నాళ్ళ ముచ్చటా? అలా కాదనే భావిద్దాం.