[dropcap]నా[/dropcap]రాయణకు బాగా డబ్బు పొలాలు ఉన్నాయి. కానీ బీద వారికి అవసరం ఉన్న వారికి ఏ మాత్రం సహాయపడే వాడు కాదు. అదిగాక వాళ్ళ వీధిలో ఎవరికైనా కష్టం వస్తే ఎక్కడ డబ్బు అడుగుతారో అని వారి కంట పడకుండా తప్పించుకో తిరిగేవాడు. తెలిసిన వారికి జబ్బు చేస్తే అసలు పరామర్శించేవాడు కాదు.
నారాయణ వీధి లోని వారు నారాయణ లోభ గుణాన్ని, సంకుచిత స్వభావాన్ని బాగా గమనించారు.
ఒకరోజు నారాయణ పక్కింట్లోని పరంధామయ్య అనే పెద్దాయనకు కాలికి దెబ్బ తగిలి నడవలేక కుర్చీలో కూర్చుని మూలగసాగాడు. అప్పుడే నారాయణ అటు వెళుతూ బాధ పడుతున్న పరంధామయ్యను చూసి కూడా చూడనట్లు వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న శంకరం నారాయణను గమనించి అతని బుద్ధిని అర్థం చేసుకున్నాడు.
మొదట పరంధామయ్యకు వైద్యం చేయించడానికి ఆసుపత్రికి తీసుక వెళ్లాడు శంకరం. తరువాత నారాయణలో మార్పు తీసుకరావాలని నిశ్చయించాడు.
మరుసటి రోజు శంకరం పక్క వీధిలో పోతున్నప్పుడు ఒక వింత దృశ్యం గమనించాడు. ఓ కుక్క పిల్లి పిల్లలకు పాలు ఇస్తోంది. ఆ కుక్క జాలి గుండె శంకరానికి అర్థం అయింది. కుక్క పిల్లితో శతృత్వం మరచి పిల్లి పిల్లలకు పాలు ఇవ్వడం చూసిన శంకరం బుర్ర ఆలోచించసాగింది. కొందరు మనుషులు తోటి మనుషులకు తమ పరిధిలో సహాయ పడకుండా స్వార్థంతో బతుకు తున్నారు.
మరి కుక్క శతృత్వం మరచి పిల్లి పిల్లలకు పాలు ఇస్తోంది. అది ఎంతో గొప్ప అపురూప దృశ్యంగా శంకరానికి కనబడ సాగింది.
వెంటనే శంకరం నారాయణ వద్దకు వెళ్లి “గుడికి పోయి వస్తున్నా, ఇదుగో ప్రసాదం” అంటూ రెండు కమలా పండ్లు ఇచ్చాడు.
పండ్లు తీసుకుంటే శంకరం డబ్బు అడుగుతాడేమోనని నారాయణ ఆలోచించసాగాడు. నారాయణ ఆలోచనల్ని శంకరం గమనించాడు.
“నారాయణా, నీకు ఒక మంచి దృశ్యాన్ని చూపిస్తాను. ఆ దృశ్యం మనల్ని ఆలోచింప చేస్తుంది. సరదాగా నాతో రా చూపిస్తాను”అని చెప్పాడు శంకరం.
“అమ్మయ్య, డబ్బులు అడగలేదని, అది చాలునని అనుకుంటూ శంకరంతో బయలు దేరాడు.
శంకరం సరాసరి ఆ కుక్క వద్దకు తీసుకు వెళ్లాడు. అదృష్టం కొద్దీ కుక్క పిల్లి పిల్లలకు పాలు ఇస్తూనే ఉంది!
ఆ అద్భుత దృశ్యాన్ని నారాయణకు చూపిస్తూ శంకరం ఈ విధంగా చెప్పాడు.
“చూశావా నారాయణా, కుక్క పిల్లితో తన శతృత్వం మరచి తల్లి లేని ఆ పిల్లలకు పాలు ఇస్తోంది. మరి మనలో కొందరు అన్నీ ఉండి తోటి వాడికి సహాయపడరు. అంత అల్పజీవి అయిన కుక్కే పిల్లి పిల్లలకు కడుపు నింపుతుంటే ఉన్నతులైన మనుషులం లేని వారికి, అవసరం ఉన్న వారికి సహాయం చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది, ఆలోచించు” అని చెప్పాడు.
నారాయణలో సహాయ సహకారాలను గురించిన ఆలోచనలు మొదలు అయ్యాయి. కుక్క పిల్లి పిల్లల దృశ్యం అతనిని బాగా కదిలించింది.
“కుక్క పిల్లి పిల్లల ప్రేమ దృశ్యాన్ని చూపి ఎన్నో ఆలోచనలు రేకెత్తించావు. మరి మనం కూడా అవసరం ఉన్న వాడికి సహాయం చేస్తే మనకు ఆనందం అవసరం ఉన్న వారికి చేయూత లభిస్తుంది కదా! ఈ బ్రతుకుకు సార్థకత లభిస్తుంది” అని శంకరంతో చెప్పాడు నారాయణ.
నారాయణలో మారిన ఆలోచనలకు శంకరం ఎంతో సంతోషించాడు. ఇద్దరూ ఇంటి వైపు ఆనందంగా అడుగులు వేశారు.