Site icon Sanchika

ఒక దేవత

[dropcap]”చం[/dropcap]దనా! నాకు ఎంటెక్‌లో సీటు రాలేదు. మావూరు వెళ్లిపోతున్నా. చివరిగా ఒకసారి కలుసుకోవాలనుకుంటున్నా. నీకు అభ్యంతరం లేకపోతే యూనివర్సిటీ గార్డెన్‌కి రాగలవా? ప్లీజ్.” అంటూ మెస్సేజ్ పంపిన జయదేవ్‌కి ఓకే చెప్పింది చందన.

ఆ రోజుతో ఆమె ఎగ్జామ్స్ పూర్తి చేసింది. ఆ సాయంకాలమే విశాఖపట్నం వెళ్ళిపోతుంది.

కేంటీన్‌లో లంచ్ చేసి బయటకు వస్తుంటే కనిపించాడు దేవ్.

“సారీ! నాకెంత బుద్ధిలేదో చూడు. మహత్తరమైన అవకాశం కలసి లంచ్ చేసే భాగ్యం కోల్పోయాను.” అన్నాడు.

“ఏమో బిల్లు ఇవ్వాలని భయపడ్డవేమో….” అంది నవ్వుతు.

‘ఈ అమ్మాయి చాలా తెలివిగలది, యిట్టే కనిపెట్టేస్తుంది…..’ అనుకున్నాడు దేవ్.

“సరే , మీ వూరు వెళ్లి ఏమి చేస్తావ్?” కొంతదూరం వచ్చి చెట్లకింద బెంచ్ మీద కూర్చుని అడిగింది.

“నాన్నగారు ఎవరో ఫ్రెండుని అడిగి మావాడికి వుద్యోగం వేయించమంటారు…. అది వచ్చేదాకా వెయిట్ చేయడమే!” అన్నాడు దేవ్.

“అదే నీలో నచ్చనిది. అన్నిటికీ ఎవరిమీదో ఆధారపడతావ్. స్వంతంగా సంపాదించుకోలేవా?”

“మా అమ్మానాన్నలు అక్కలు చిన్నవాడినని ముద్దుచేసి ఇలా తయారు చేసారు” తప్పు వాళ్లదే అన్నట్టు చెప్పాడు.

“చాలా బాగుంది. సరే అలాగే చేయి. నాకు నాలుగింటికి ట్రైన్. ఇంకా ఏమైనా చెబుతావా? వెడదామా….” వాచ్ చూసుకుని అంది చందన.

“చందన… నేను అర్హుణ్ణి అవునో కాదో నాకు తెలియదు….. నీకు ఎంటెక్ సీటు గ్యారంటీ. నాకంటే ఎక్కువ డిగ్రీ. నన్ను పెళ్లి చేసుకుంటావా?” ఎలాగో చెప్పేడు మనసులోమాట.

“చూడు దేవ్! నాకు డిగ్రీ ఎక్కువ అని కాదు. నిన్ను అడుగడుగునా పుష్ చేయాలి. మీ నాన్న గవర్నమెంట్ జాబ్. బాగా సంపాదించారని చాలామంది అంటారు. అయినా నీకు డబ్బు లెక్కపెట్టి ఇస్తారు. నువ్వు అడగలేవు. కనీసం నాకు కాఫీ కూడా ఆఫర్ చేయలేదు నాలుగేళ్ళ పరిచయంలో. నేనే ఇచ్చాను చాలాసార్లు. మా నాన్నగారు ఆ మాత్రం స్వేచ్ఛ ఇచ్చారు. నాకు అఫర్ చేయడం వదిలేయ్. చదువుకోవాలని అడగలేవు. నీ అవసరాల కోసం కూడా అడగలేవు. వాళ్ళ భయంతోనే చదివావు తప్ప నీకో ధ్యేయం, దూరదృష్టి లేదు. ఆత్మాభిమానం లేదు. మీ అమ్మగారు ఏదో పెళ్లి సంబంధం కూడా చూసేవుంటారు. మూడు ముళ్లు వేసేయ్. వాళ్ళ కోసం వుద్యోగం, వాళ్ళ కోసం పెళ్లి. నేను ఒప్పుకున్నా వాళ్ళకి మా సంబంధం నచ్చదు. మా నాన్న గారు స్కూల్ టీచర్. డబ్బు సంపాదించే వుద్యోగం కాదు. ట్యూషన్ చెప్పరు. ఆయనకు కొన్ని ఆదర్శాలు వున్నాయి. నీకు నాకు సరిపడదు.” చెప్పింది చందన.

“అంతే అంటావా?” అమాయకంగా అన్నాడు దేవ్.

ఇపుడైనా, వాళ్ళు ఒప్పుకోకపోతే మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం… అంటాడేమో… అని ఆశపడింది చందన.

అబ్బే, అంత ఆలోచనే ఉంటే ఇలా ఎందుకు ఉంటాడు.

“అంతే! వాళ్ళకి నచ్చినట్టుచేసి సంతోషంగా వుండు. నీకు కావలసింది నువ్వు సంతోషంగా ఉండటం కాదు. ఇంత అమాయకుడిని నేను భరించలేను.” నిర్మొహమాటంగా చెప్పింది చందన.

“నువ్వు మా వాళ్ళని ఒప్పించలేవా…” అన్నాడు ఎలాగో నోరు విప్పి.

“నేనా…. ఏమంటున్నావ్…. ఇంటికి వస్తే మాటాడకుండా మొహం తిప్పుకున్నారు. మా నాన్నగారి గురించి నువ్వు చెబితే లేచి వెళ్లిపోయారు. అలాటివారిని నేను ‘మీ ఇంటికి కోడలు అవుతా.. మీ అబ్బాయికి భయం అడగలేడు….’ అని చెప్పాలా… వద్దులే!” అంటూ చివ్వునలేచి వడివడిగా తన స్కూటీ పార్క్ చేసిన చోటికి వెళ్ళిపోయింది చందన.

అక్కడే శిల్పంలా బిగుసుకుపోయి కూర్చున్నాడు దేవ్, తానేమి పోగొట్టుకున్నాడో అర్థం కానీ అయోమయస్థితిలో .

చందనకి చెంపలమీదుగా జారింది. ‘కనీసం నా కోసం తెగిస్తాడేమో.. అనే చిన్న ఆశను సమూలంగా తుంచేసిన ఆ మనిషిని ఇక తల్చుకోను’ అనుకుంది దృఢంగా!

చందన తెలివితేటలూ చొరవ కష్టపడి సాధించే గుణం చూసి ఏరికోరి ఆమె పనిచేసే కంపెనీ సీఈఓ – హారిసన్ హెరాల్డ్ పెళ్లి చేసుకోమని అడగటంతో మనస్ఫూర్తిగా ఒప్పుకుని అమెరికా వెళ్ళిపొయింది.

ఇద్దరు స్వంతంగా కంపెనీ ప్రారంభించి బిలియన్లకు అధిపతులయ్యారు. నలుగురు పిల్లలతో సంతోషంగా వున్నారు.

కాలగమనంలో ముప్ఫై ఏళ్ళు గడిచిపోయాయి.

***

దేవ్ వాళ్లమ్మ చెప్పిన బంధువుల అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. అతడి ఆలోచనలు పద్ధతులు మారలేదు. కానీ భార్య దుర్గ పడనీయదు.

ఆమె చెప్పినట్టు వినకపోతే ఇల్లు పీకి పందిరి వేసేది. ఒకప్పుడు అమ్మ నాన్నలు చెప్పినట్టు విన్నాడు. ఇప్పుడు ఆమె చెప్పినట్టు వింటున్నాడు.

పెద్దకొడుక్కి అచ్చం దేవ్ బుద్ధులే. ……ఆ మాట పట్టుకుని ఇరవై నాలుగు గంటలూ సాధిస్తుంది దుర్గ.

“మీనాన్న తెలివితేటలూ వచ్చాక ఇంతకంటే ఏం బాగుపడవు. చవట సన్నాసి” అంటుంటే బాధగా వుండేది.

“మామగారి ఆస్తి చూసుకుని ఏదో బాగుపడిపోతానని ఈ దిక్కుమాలిన పెళ్లి చేసింది మా అమ్మ. అనుభవిస్తున్నది నేను. ‘చెబితే తెలుసుకోడు, చెప్పకపోతే మన్నుతిన్న వానపాము’. ఇంకా నయం, అమ్మాయిలిద్దరికీ నా పోలిక వచ్చింది. జీవితాంతం మీ ఇద్దరితో వేగాలని నా నెత్తిన రాసేడు దేవుడు….” అంటూ ఓపిక ఉన్నంత వరకూ అరుస్తుంది.

చందన గుర్తువచ్చి ఎన్నిసార్లో దిగులుపడేవాడు. తన బలహీనత తన జీవితాన్ని బలి తీసుకుందని ఆలస్యంగా తెలుసుకున్నాడు.

‘చందనా, నిన్ను తలచుకుని నా కొడుకుని మంచి దారిలో పెడతాను’ అనుకున్నాడు.

వాడి పేరు చంద్ర చూడ్. దుర్గ పెట్టుకున్నపేరే అది కాకతాళీయంగా.

“నాన్నా…. చందూ! స్నేహితులను పోగొట్టుకోవద్దు. సరదాగా రెస్టారెంటుకి తీసుకెళ్ళు. బర్త్ డే పార్టీలు, మ్యూజిక్ కాన్సెర్ట్స్ ఎంజాయ్ చేయి. అమ్మాయిలు మనకంటే తెలివిగలవాళ్ళు. నీ చెలెళ్ళు ఎలాగో అలాగే గౌరవించు. వాళ్ళకి ఏమి చేస్తే సంతోష పడతారో అది చెయ్.” అని చెప్పేవాడు. అన్నిటికీ స్వేచ్ఛ ఇచ్చాడు. డబ్బు అడగకపోయిన ఇచ్చాడు. ‘నా తప్పు దిద్దుకున్ననా……. కనీసం నలభై ఏళ్ళకైనా’ అని తర్కించుకునేవాడు.

కొన్నాళ్ళకి దుర్గ కూడా మారింది. కొడుకు బాగుపడేందుకు భర్త పడే తాపత్రయం తెలుసుకుంది.

దుర్గకి భయపడి అత్తమామలు హరిద్వార్ వెళ్లిపోయారు. మేము ఎప్పటికి తిరిగి వచ్చేది లేదని ఎదురు చూడవద్దని చెప్పేరు.

కోడలు వచ్చిన ఏడాదికే గ్రహించుకున్నారు, దూరంగా ఉండాలని.

“ఎక్కడున్నా నువ్వు సుఖంగా ఉండాలి చందనా. నీ నిర్ణయం సబబే. నువ్వు నాకు ‘మార్గదర్శి’వి. నాలో మార్పు తెచ్చిన ‘దేవత’వి. నిన్ను భార్యగా చూడకూడదు” అనుకున్నాడు గౌరవ ప్రదంగా.

Exit mobile version