Site icon Sanchika

ఒక నీటి బిందువు

[హిందీలో శ్రీ అయోధ్యా సింహ్ ఉపాధ్యాయ్ ‘హరిఔధ్’ రచించిన ‘ఏక్ బూంద్’ అనే కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీ కస్తూరి రాజశేఖర్.]

[dropcap]ఒ[/dropcap]త్తయిన మేఘాల పొత్తిళ్లలోంచి
ఒక్క నీటి చుక్క
క్రిందకు జారి పోతోంది-
‘ఇల్లెందుకు దాటానం’టూ పిల్ల మనసు
తల్లడిల్లుతోంది!

‘దైవం నా తలరాత ఏమి రాశాడో?
నేను నిలుస్తానా –
లేక ధూళిలో కలుస్తానా?
అగ్గిలో బుగ్గి అవుతానా –
కలువ మొగ్గలో కుదురుకుంటానా?
అని తలపోస్తూ తపిస్తోంది!

అప్పుడే గాలివాటుగా ఆ వర్ష బిందువు
ఆ సాగర గర్భం జేరింది –
అందమైన ఆల్చిప్ప నోరు తెరచింది –
అందులో ముద్దుగా జారి
ముత్యమై మెరిసింది!

మనిషి కూడా అంతే..
ఇంటి సుఖాల ఒడి వీడాలంటే
ఆలోచనల అలజడి –
సంకోచాల సందడి!

కానీ,
బంధాల బంధనాల్లోంచి బయటపడితే సాహసమే శ్వాసనిస్తుంది –
అనుభవం అందలాన్నిస్తుంది!

అది
ముత్యమల్లే మారే వర్షబిందువు –
నీవు
ముల్లోకాలు గెలిచే హర్ష సింధువు!

~

హిందీ మూల కవిత:

एक बूंद
ज्यों निकल कर बादलों की गोद से
थी अभी एक बूंद कुछ आगे बढ़ी
सोचने फिर फिर यही मन में लगी
आह क्यों घर छोड़ कर मैं यों बढ़ी।
दैव मेरे भाग्य में है क्या बदा
मैं बचूंगी या मिलूंगी धूल में
या जलूंगी गिर अंगारे पर किसी
चू पड़ूंगी या कमल के फूल में।
बह गई उस काल कुछ ऐसी हवा
वह समुंदर ओर आई अनमनी
एक सुंदर सीप का मुंह था खुला
वह उसी में जा पड़ी मोती बनी।
लोग यों ही हैं झिझकते सोचते
जबकि उनको छोड़ना पड़ता है घर
किंतु घर का छोड़ना अक्सर उन्हें
बूंद लौं कुछ ओर ही देता है कर।
∼ अयोध्या सिंह उपाध्याय ‘हरिऔध’

మూలం: అయోధ్యా సింహ్ ఉపాధ్యాయ్ ‘హరిఔధ్’
స్వేచ్ఛానువాదం: కస్తూరి రాజశేఖర్

 

Exit mobile version