Site icon Sanchika

ఒక పర్యటన వంద అనుభవాలు-2

[box type=’note’ fontsize=’16’] “గాలి.. నీరు.. ఆకాశం..భూమి.. నాలుగు పంచభూతాలను ఆలింగనం చేసుకొని చేసిన ప్రయాణమది. రెండు జీవితాలకు సరిపడా అనుభవాన్ని అందించింది” అంటూ తమ కోల్‌కతా, డార్జిలింగ్, గ్యాంగ్‌టక్ పర్యటన గురించి వివరిస్తున్నారు కోవెల సంతోష్‌కుమార్. [/box]

డార్జిలింగ్

[dropcap]జూ[/dropcap]న్ 16, 2018.. కోల్‌కత్తా నుంచి గ్యాంగ్‌టక్, డార్జిలింగ్ ప్రయాణం ప్రారంభమైంది. కోల్‌కతా లోని సెల్దా రైల్వే స్టేషన్ నుంచి కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ఎక్కాం. భోజనాన్ని పార్శిల్ చేసుకొన్నాం. తినేసి పడుకున్నాం. దాదాపు పదకొండు గంటల ప్రయాణం. రాత్రి ఎలా సాగిందో గాఢనిద్రలో ఉన్న మాకు తెలియనేలేదు. తెల్లవారేసరికి న్యూ జెల్పాయ్‌గురిలో దిగాం.

ముందుగానే ట్రావెల్ ప్యాకేజీ మాట్లాడుకొన్నందున మేం దిగేసరికి 9 సీట్ల కారు రెడీగా ఉన్నది. సామాను కారుపైన కట్టుకొని బయలుదేరాం. న్యూజెల్పాయ్‌గురి నుంచి ముందుగా గ్యాంగ్‌టక్ వెళ్లడం లక్ష్యం. ముందుగా అనుకొన్న ప్లాన్ ప్రకారం ఆరోజు గ్యాంగ్‌టక్‌కు వెళ్లడం రెస్ట్ తీసుకోవడమే తప్ప మరే ప్రోగ్రాం లేదు. అందువల్ల దారిలోనే కొన్ని చూసుకొంటూ వెళ్లాలని నిర్ణయించుకొన్నాం. డ్రైవర్‌తో మాట్లాడి.. దారిలో ఉన్న దర్శనీయ స్థలాలను చూపించాలని కోరాం. అలా మా ప్రయాణం మొదలైంది.

‘కలింపాంగ్’ మీదుగా సాయంత్రానికి గ్యాంగ్‌టక్ చేరుకోవాలని నిర్ణయించుకొన్నాం. ముందుగా మా సైట్‌సీయింగ్ ఒక నర్సరీతో మొదలైంది. కలింపాంగ్ వెళ్లే దారిలో కాక్టస్ నర్సరీ ఒకటి ఉన్నది. ఇంత గొప్పగా ఉన్న కాక్టస్ మొక్కల కలెక్షన్ దేశంలో మరెక్కడా లేదేవెూ. ఒక్కొక్కటి ఒక్కో వెరైటీ.. అసలు దాని నిర్వహణే అద్భుతం.

ఫాలీ గార్డెన్‌లో ఈ కాక్టస్ మొక్కల్ని పెంచుతున్నారు. ఇక్కడి ప్రతి మొక్కా ఒక అద్భుతంగా కనిపిస్తుంది. అసాధారణంగా ఉండే ఈ నర్సరీని చూడాల్సిందే. నర్సరీలో యథాతథంగా ఫొటోసెషన్ జరిగింది.

అక్కడి నుంచి బయలుదేరాం. దారిలో ‘ఫొదాంగ్’ బౌద్ధ ఆరామం చేరుకొన్నాం. ఫొదాంగ్ కలింపాంగ్‌లో కచ్చితంగా చూడాల్సిన బౌద్ధారామం ఇది. టిబెట్ బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన ఆరామం ఇది. 18 శతాబ్దంలో నిర్మించిన ఈ ఆరామం మూడంతస్థుల్లో ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ధ్యానమందిరం ఉంటుంది. రెండో అంతస్థులో బౌద్ధుల గురువు పద్మసంభవుడి విగ్రహం అద్భుతంగా కనిపిస్తుంది. ఇకపైకి వెళ్లిన తర్వాత చుట్టుపక్కల అందాలను చూడాల్సిందే తప్ప వర్ణనకు అది ఎంతమాత్రం అందదు. ఎంతో అద్భుతమైన ప్రదేశం. మా మొత్తం పర్యటన అంతా ప్రకృతి సౌందర్యాన్ని చూసి అందులో తరించడంతోనే సరిపోయింది. కొండలు.. సన్నని రహదారులు.. లోయలు.. నదీ ప్రవాహం.. ఎన్నని చెప్పేది. ఎంతని రాసేది.. ఒక్కో ప్రాంతం ఒక్కో అనుభూతిని ఇచ్చింది.

    

అనంతరం మా ప్రయాణం డెలో పార్క్‌వైపు సాగింది. సముద్రమట్టానికి దాదాపు 5590 అడుగుల ఎత్తున ఉన్న కొండపైన ఉన్న పార్క్ అది. అదొక అనిర్వచనీయమైన అనుభూతి. డెలో పార్క్‌కు వెళ్తున్నకొద్దీ మబ్బులు మమ్మల్ని దాటిపోతున్నాయి.. మేము మబ్బులపైకి వెళ్తున్నాం. మబ్బులు మమల్ని ఆలింగనం చేసుకొంటున్నాయి. కొండపైన చూసేందుకు నిజానికి ఏమీలేదు. ఒక చిన్న బిల్డింగ్.. దాని చుట్టూ ఓ లాన్ వేశారు. పక్కనే పనిచేయని ఓ విన్ టేజ్ బండిని పెట్టారు. కుడివైపున నాలుగు మెట్లు కట్టి కాస్త ఎత్తున కొంత చదునుచేశారు. ఇక కొండకు ఉన్న ఎత్తుపల్లాలు.. పొడువాటి చెట్లు వాటిమధ్య నడక.. మనకింద మేఘాలు.. ఒక అద్భుతమైన వాతావరణం.. కేవలం ఆ వాతావరణాన్ని చూసేందుకే వెళ్లాలి. అ చల్లదనంలో.. చలిగాలుల మధ్య.. మబ్బులతో దోబూచులాడుతూ.. ఐస్‌క్రీం తింటే ఎంత అద్భుతంగా ఉంటుంది? మేం అదే చేశాం.అరగంట ఉన్నామేవెూ.. కానీ.. ఎన్నిరోజులైనా మరచిపోలేని స్థలం అది. అక్కడికి మధ్యాహ్నం అయింది.

దారిలో తనకు తెలిసిన హోటల్‌లో భోజనానికి డ్రైవర్ ఆపాడు. అక్కడ భోజనం చేసి రిఫ్రెష్ అయ్యాం. చుట్టూ అడవి.. కొండలపై పోడు వ్యవసాయం. పొలాల్లో కూరగాయలు పండించుకొని.. రొడ్డుపైనే అమ్ముతున్న దృశ్యాలు.. ప్రతి శబ్దం వినసొంపైనదే.. ప్రతి దృశ్యం చూడచక్కనిదే. భోజనం అనంతరం మా గమ్యం గ్యాంగ్‌టక్. గ్యాంగ్‌టక్‌లోని ‘రుమ్‌టెక్ హోమిస్టే’  అనే హోటల్ అనబడే ఇంట్లో మాకు బస. చేరుకొనేసరికి సాయంత్రం 6గంటలు దాటింది. గ్యాంగ్‌టక్ ఒక కొండపై.. రుమ్‌టెక్ మరోకొండపై.. అద్భుతంగా.. విచిత్రంగా ఉంటుంది. అసలు సిక్కిం అంటేనే.. నాలుగైదు కొండల సమాహారం. ఆయా కొండలపైనే ఊళ్లు వెలిశాయి. వ్యవసాయం ఉన్నది. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలంటే.. ఒక కొండ దిగి.. మరో కొండ ఎక్కాల్సిందే. ఆ విధంగా మేం గ్యాంగ్‌టక్ నగరానికి ఎదురుగా ఉన్న మరో కొండపై ఉన్న రుమ్‌టెక్ చేరుకున్నాం. గట్టిగా 25 అడుగుల వెడల్పు కూడా లేని రోడ్డు.. పక్కన ఎలాంటి బ్యారికేడ్‌లు లేవు.. నిరంతరం కొండలపైనుంచి నీళ్లు నిరాఘాటంగా పడుతున్నాయి. ఆ తడికి.. రాపిడికి కొండచరియలు అక్కడక్కడా విరిగిపడుతున్నాయి. ఆ రోడ్డులో పదిహేను కిలోమీటర్ల ప్రయాణాన్ని దాదాపు గంటన్నరకు పైగా చేసి మొత్తానికి మాకు కేటాయించిన హోమిస్టే చేరుకొన్నాం.

రుమ్‌టెక్ చేరుకొనేసరికి చీకటి పడింది. మాకు కేటాయించిన హోటల్‌కు రోడ్డు మీది నుంచి సరైన దారికూడా లేదు. రోడ్డు పైనుంచి ఓ ఫర్లాంగు ఉంటుందేవెూ.. కొండ లోపలికి దిగుతూ వెళ్లాం. అసలే చీకటి.. పెద్దలు పిల్లలు అంతా ఉన్నారు. కొత్త వాతావరణం. నిరంతర నీటి ప్రవాహంతో నేలంతా చిత్తడిచిత్తడిగా ఉన్నది. చుట్టూ వందకు పైగా అడుగుల ఎత్తులో చెట్లు.. మధ్యలో సన్నని దారి.. కారు డ్రైవర్ ఫోన్‌తో స్పందించిన హోటల్‌లోని పనివాళ్లు రోడ్డుపైకి వచ్చి సామాను తీసుకొని ముందుకు నడుస్తుండగా మేం వెనుక బయలుదేరాం. మొత్తానికి హోటల్‌లోకి చేరుకొన్నాం. ఆ పూటకు రెస్ట్. . మేం ఏ ట్రావెల్ ఏజెంట్‌నైతే మొత్తం ట్రిప్‌కు బుక్‌చేసుకున్నావెూ.. ఆ ట్రావెల్ ఏజెంటుకు సంబంధించిన హోటలే అది. మనలాగా పిల్లర్లతో.. కాంక్రీట్‌తో కట్టింది కాదు.. పూర్తిగా చెక్కే అక్కడ నిర్మాణసాధనం. ఫ్లోరింగ్‌తోసహా చెక్కతోనే దాన్ని నిర్మించారు. ఒకవేళ కొండచరియలు విరిగిపడ్డా పెద్దగా నష్టం కలుగకుండా ఉండేందుకు ఈ పనిచేశారు. హోటల్‌లో ఎవరూ లేరు.. మేం తప్ప. మాకోసం మూడు గదులను కేటాయించారు. సామాన్లన్నీ ఆయా రూముల్లో సర్దుకొన్నాక.. నిదానంగా కూర్చున్నాం. అపుడు తెలిసింది.. ఒక్కొక్కరిని జలగలు పట్టుకొన్నాయని. నెమ్మదిగా రక్తం పీలుస్తున్నాయి. రోడ్డు నుంచి హోటల్‌కు వచ్చిన దారిలో జలగలు కాళ్లను పట్టుకున్నట్టున్నాయి. కానీ మేం అప్పుడు గమనించలేదు. లోపలికి వచ్చి కూచున్నాక కానీ అర్థం కాలేదు. ఒక్కసారిగా అందరిలో భయంపుట్టింది ఒక్కొక్కటి పీకేశాం. ఇంతలోనే హోటల్ మేనేజర్ తమ్ముడు వచ్చి.. ‘సర్.. వాటిని చంపొద్దు.. నేను తీసుకొంటాన’న్నాడు. ఆశ్చర్యమేసింది. జలగల్ని ఏం చేసుకొంటాడు? వీటిని ఏం చేస్తారు? తింటారా? అని అడిగా.. ‘లేదు సర్.. వారానికి ఒకసారి నేను జలగలతో ట్రీట్‌మెంట్ తీసుకుంటా.. సేకరించిన జలగలన్నింటినీ శరీరంపై పాకించుకుంటా.. ఈ జలగలు మనకు నష్టంచేసేవి కావు. శరీరంలోని చెడురక్తాన్ని మాత్రమే పీలుస్తాయి. దీనివల్ల శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుందే తప్ప మరే ఇతర ఇబ్బందులు రావు’ అని చెప్పాడు. అతను చెప్పింది నిజమే కావచ్చు.. కానీ మనకు అలాంటి అలవాటు లేకపోవడంతో ఒకరకమైన జుగుప్స కలిగిన మాట నిజమే.. కానీ అతను చెప్పిది నిజమే కదా.. ఇంతకంటే గొప్ప ప్రకృతి చికిత్స ఏముంటుంది? ఇక దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దని డిసైడ్ అయిపోయాం.

కాసేపటికి మేనేజర్ అనేవాడు వచ్చాడు.. రాత్రికి వంట ఏం చేయాలని అడిగాడు. అది మామూలు హోటల్ కాదు. ప్రత్యేకంగా టూరిస్టులను పంపిస్తేనే దానికి గిరాకీ. ఓ నలుగురు పనివాళ్లుంటారు. ఆ కొండలపై కొన్నికూరగాయలు పండిస్తుంటారు. వాటిని కోసి వండిపెడుతుంటారు. కొంత సామాను హోటల్ యజమాని పంపిస్తుంటాడు. వాటితో గడిపేస్తుంటారు. అందుకే దాన్నిహోమిస్టే అన్నారు. రాత్రికి వంటేం చేయాలని అడిగారు. మేము సహజంగానే శాకాహారం.. మా మిత్రుడు మాంసాహారం ఆర్డరిచ్చారు. వాడి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయింది. మాంసమంటే కొండ కిందకు వెళ్లి తేవాలన్నాడు. వాళ్లు తెమ్మని చెప్పారు. మా దగ్గర డబ్బులు లేవు.. మీరివ్వండి ప్యాకేజీలో కట్‌ చేసుకొండి అన్నారు. ఓ వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించాం. ఆ తర్వాత ఎవరి గదుల్లోకి వెళ్లి కాసేపు విశ్రమించాం. రిఫ్రెష్ అయ్యాక నేను కిందకు వచ్చా.

   

ముందున్న పెద్ద హాల్‌లో ఏర్పాటుచేసిన వస్తువులను చూస్తూ ఉన్నాం. అక్కడ రెండు కొమ్ములు కనిపించాయి. అవేంటని హోటల్ వాళ్లను అడిగితే హిమాచల్‌లో దున్నలాగే కనిపించే యాకీ కొమ్ములవి. వాటితో కాసేపు సరదాగా గడిపాం. తలకు రెండువైపులా పెట్టుకొని ఫొటోలు దిగాం. అక్కడ పెద్దపులి బొమ్మ, చేతి కర్ర, సిక్కింకే ప్రత్యేకమైన టోపీలు, గ్రామ్‌ఫోన్ రికార్డు, టేప్ రికార్డు.. వందేండ్ల క్రితం నాటి కత్తి ఆకారంలోని వైన్ బాటిల్, ఇలా చాలా వస్తువులే కనిపించాయి. వాటన్నింటినీ.. పరికించి.. పరీక్షించి.. పరిశీలించి యథాస్థానంలో ఉంచాం. అప్పటికి పదయింది. వంటయిందనిపించారు. తిండి తినేశాం. కోల్‌కతా మాదిరిగానే.. ఇక్కడ కూడా పప్పుకట్టు అని మనం పప్పు ఉడికించిన తర్వాత నీళ్లను అంటామే.. ఆ పప్పు కట్టునే వాళ్లు దాల్ అన్న పేరుతో వడ్డిస్తారు. భోజనాలయ్యాక నిద్రకు ఉపక్రమించాం.

మర్నాడు ఉదయాన్నే కారులో మళ్లీ కొండలపైకి.. కిందకు కలిపిన ట్రెకింగ్. ముందుగా మా ప్రయాణం తేండాంగ్‌హిల్ వైపు సాగింది. సన్నని దారులు.. రెండు వాహనాలు తప్ప మరొకదానికి చోటుండే పరిస్థితి లేనే లేదు. కిందకు పెద్ద పెద్ద లోయలు.. వేల అడుగుల లోతు.. అంచనాకు కూడా అందవు. రోడ్డుకు హద్దుల్లో కనీసం సెక్యూరిటీ కోసం బ్యారికేడ్లు కూడా లేవు. ఆ దారిపై అక్కడి డ్రైవర్లకు అలవాటే. మనం ఒక మలుపు తిరిగి మరో మలుపులోకి వెళ్లిన తర్వాత మనం వచ్చిన దారిని చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ దారిలో ఎట్లా వచ్చాం అన్న భయం వేస్తుంది. పైనుంచి చిన్న చిన్న కొండచరియలు నిరంతరం పడుతూనే ఉన్నాయి. నిరంతరంగా నీటి ధార జలపాతమై జాలువారుతూనే ఉన్నది. మనం మిగతాప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట జలపాతం చూస్తే ఆహా.. ఓహో అనుకుంటాం. కానీ.. సిక్కింలో అణువణువునా జలపాతాలే.. కొండపైనుంచి నిరంతరం పడిపోయే రాళ్లు.. 24 గంటల పాటు వాటిని తొలిగించే వ్యవస్థ.. వీటి మధ్యలో మా ప్రయాణం. ఇప్పుడు ఊహించుకుంటేనే అబ్బురమనిపిస్తుంది. ప్రయాణించినంతసేపూ మాకేమీ తెలియలేదు. ఆ తర్వాత ఫొటోలు చూశాక ఇలా ప్రయాణించామా? అని అనిపించింది. నిజంగా ఆ అనుభవం ఎప్పటికీ మరిచిపోలేనిది.

రుమ్‌టెక్ నుంచి బయలుదేరిన మేము తెన్‌డాంగ్ హిల్ వైపు ప్రయాణించాం. అంటే మేం ఉన్నది ఒక కొండ.. అది దిగి.. మరో కొండ ఎక్కాలి. కొండ దిగడానికి ఒక గంట.. ఆ తర్వాత ఎక్కడం.. తెన్‌డాంగ్ హిల్‌పై అద్భుతమైన పద్మసంభవుడి దేవాలయం ఉన్నది. ఈ ప్రాంతాన్ని నామ్‌చీ అంటారు. ప్రయాణం సాగుతున్నంతసేపూ కారులో అంతా ఏదో మాట్లాడుకుంటున్నారు. నాకు.. మా వీరభద్రుడికి సిక్కిం ప్రజల జీవన విధానం చూసి ఆశ్చర్యమేసింది.. బాధేసింది. మా ప్రయాణం సాగిన సమయం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతం. మా కారు వెళ్తున్న దారిలో అప్పుడే పాఠశాలకు వెళ్లే విద్యార్థినీ విద్యార్థులు నడుచుకుంటూ వెళ్తున్నారు. కొందరు కొండ కిందనున్న స్కూల్‌కి దిగుతున్నారు. మరికొందరు ఎక్కుతున్నారు. భుజానికి బరువైన పుస్తకాల బ్యాగుతో నడుస్తున్న వాళ్లను చూస్తుంటే ఆశ్చర్యమేసింది. మైదాన ప్రాంతంలో అరకిలోమీటర్ నడవడానికి కూడా ‘కాళ్లు కందిపోతాయ’ని అనుకునే పిల్లలు.. వారి తల్లిదండ్రులున్న ఈ కాలంలో వాళ్లు అలా నడిచిపోతుంటే నిజంగా బాధేసింది. వాళ్ల ముఖాల్లో ఎలాంటి మనోభావాలు కనిపించలేదు. కిలోమీటర్ల కొద్దీ నడిచిపోవడానికి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులున్నట్లు కనిపించలేదు. అక్కడ ద్విచక్రవాహనాలు అడపాదడపా కనిపించాయే తప్ప ఆ కొండలు.. గుట్టలు ఎక్కిదిగడానికి భారీ వాహనాలే సరైనవి. అక్కడ ముఖ్యమంత్రి ఇల్లు కూడా ఒక కొండపై రాళ్లను తొలిచి కట్టిందే. అన్నింటి కంటే చిత్రమైనది మాకు దారిలో కనిపించిన అర ఇంచు నీటి పైపులు. ఎక్కడ మొదలయాయ్యో తెలియదు. ఎక్కడ ముగింపో అర్థం కాలేదు. మనకు కరంటు స్తంభాల వెంబడి పదుల సంఖ్యలో కేబుల్ వైర్లు కుప్పలుగా కనిపించినట్లు అక్కడ నీటిపైపులు ఉన్నాయి. ఏ ఇంటికి ఆ ఇంటికి ప్రత్యేక పైప్‌లైన్ ఎక్కడి నుంచో వేసుకోవాలి. అవి మంచినీటి పైపులని మా కారు డ్రైవర్ చెప్పాడు. ఇది మరీ ఆశ్చర్యం. ఓ వైపు కొండలపైనుంచి నిరంతరం దూకే జలధార కనిపిస్తుంటే.. మంచినీళ్లకోసం కేబుల్‌వైర్లమాదిరి పైపులు వేసుకోవడం ఏమిటి? పోనీ ప్రభుత్వం అండర్‌లైన్‌లో ప్రధాన పైప్‌లైన్ వేసి నల్లా కనెక్షన్ ఇవ్వవచ్చుకదా? అలా ఏమీ లేకుండా ఓపెన్‌గా ఈ పైప్‌లైన్‌లు వేసుకోవడం మాకు అర్థం కాలేదు. దానికి జవాబూ దొరకలేదు. ఏమైనా అక్కడ ప్లంబర్లకు బలే గిరాకీ ఉన్నట్లు మాత్రం అర్థమైంది.

వీటన్నింటినీ చూసుకుంటూ మా ప్రయాణం సాగింది. దారిలో పోడు వ్యవసాయం.. కూరగాయల అమ్మకాలు.. చుట్టూ పచ్చదనం.. వాతావరణంలో చల్లదనం.. కొండల చుట్టూ పరిక్రమణం.. మొత్తం మీద నామ్చి పట్టణానికి సమీపంలో సిక్కింలకు అతి ముఖ్యమైన.. అతి పెద్దదైన బౌద్ధారామానికి చేరుకున్నాం. బుద్ధుడి ప్రథమశిష్యుడైన ముఖ్యుడైన పద్మసంభవుడి భారీ విగ్రహాన్ని దర్శించడం అపూర్వమైన అనుభూతి. సముద్రమట్టానికి దాదాపు ఏడువేల అడుగుల ఎత్తున నెలకొని ఉన్న పద్మసంభవుడి ఆలయం. దాదాపు 118 అడుగుల ఎత్తైన పద్మసంభవుడి విగ్రహం ఇక్కడ ఉన్నది. మబ్బుల్లో అప్పుడే కనిపించి.. అప్పుడే అదృశ్యమయ్యే సన్నివేశం చూడాల్సిందే తప్ప అక్షరాలకు అందనిది. నామ్చీ అంటే సిక్కిమీస్ భాషలో ఆకాశమంత ఎత్తు అని అర్థం. నిజంగా పద్మసంభవుడి ఆలయం అకాశాన్ని అంటిపెట్టుకునే ఉన్నట్టు అనిపించింది. పద్మసంభవుడిని స్థానికులు గురు రింపోచె అని పిలుస్తారు. ఇక్కడ అద్భుతమైన ధ్యాన మందిరం ఉన్నది. ఇక్కడ లభించినంత  ప్రశాంతత మరెక్కడా లభించదేవెూ. ఇక్కడి రాక్ గార్డెన్ కూడా చూడ చక్కనిది.

     

అక్కడి నుంచి బయలుదేరిన మేము ఇంతకంటే ఎత్తై ప్రదేశానికి బయలుదేరాం. మా ప్రయాణం సుమారు ఎనిమిదివేల అడుగుల ఎత్తున అద్భుతమైన చార్‌ధామ్ ఆలయం ఉన్నది. భారతదేశంలో ప్రముఖమైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, ఋషికేశ్, హరిద్వార్, ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఇలా అనేకానేకాలయాల నమూనాలను యథాతథంగా నిర్మించిన ప్రదేశమిది. ఇది సామాన్యమైంది కాదు. ఇక్కడ దాదాపు 108 అడుగుల ఎత్తున్న అత్యద్భుతమైన మహాదేవుడి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. అంతేకాదు.. అక్కడ ద్వారకలోని శ్రీకృష్ణ మందిరం నమూనా.. పూరీ జగన్నాథుడి ఆలయ నమూనా.. 18 అడుగుల కార్తికేయుడి విగ్రహం, సాయిబాబా మందిర నమూనా..అన్నీ ఒక్కచోట విశాలమైన ప్రదేశంలో నిర్మించారు. పర్యాటకులకు వసతి సౌకర్యాలు, డార్మెటరీలు.. సకలం ఇక్కడ ఏర్పాటుచేశారు. భారతదేశంలోని సమస్తమైన ఆధ్యాత్మిక సంపద సిక్కిం భూభాగంలో ఆకాశపుటంచులపై మానవనిర్మితం కావడం నిశ్చయంగా అత్యద్భుతం. కొండపైకి నిర్మాణ మెటీరియల్ ఎలా తీసుకెళ్లారన్నది ఆశ్చర్యమే.. కొండపైకి మామూలు ప్రయాణికుల వాహనాలు వెళ్లడమే సాహసం. ఇలాంటి ఆలయాలు.. అద్భుత నిర్మాణాలు మైదాన ప్రాంతాల్లో నిర్మించారంటే సాధ్యమనుకోవచ్చు. కానీ.. కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతమైన నిర్మాణ కౌశలంతో అంత భారీ నిర్మాణాలను చేపట్టడం ఎట్లా సాధ్యమైందంటే ఆశ్చర్యమేస్తుంది. ఎప్పటికీ ఇది సమాధానం దొరకని ప్రశ్నే. ఎంతమాత్రం అనుకూలం కాని వాతావరణం. ఎప్పుడు వెలుతురు ఉంటుందో.. ఎప్పుడు వెలుతురు ఉండదో తెలియని పరిస్థితి. ఎప్పుడు మబ్బులు కమ్ముకుంటాయో.. ఎప్పుడు విచ్చుకుంటాయో అర్థం కాని పరిస్థితి. ఆహారానికి కూడా ఎంతో దూరం వెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి వాతావరణంలో.. సముద్రమట్టానికి అంత ఎత్తులో.. వందలాది కార్మికులను పెట్టి నిర్మాణాన్ని చేపట్టడం నిజంగా సాహసం. పూర్తిచేయడం అద్భుతం. ఆలయాన్ని చూసిన అనంతరం తిరిగి రుమ్‌టెక్ (మేం బసచేసిన ప్రాంతం) బయలుదేరాం. మార్గమధ్యంలో ఒక వేణుగోపాలస్వామి ఆలయాన్ని చూశాం. చిన్న ఆలయం.. 2017లో నిర్మించారు. ఒక యోగి పుంగవుడు పూనుకొని నిర్మించినట్లుగా అక్కడివాళ్లు చెప్పారు. సరే.. మళ్లీ కొండ దిగాలి.. కొండెక్కాలి. మార్గమధ్యంలో మేమే కూరగాయలు కొనుక్కొన్నాం. ఎందుకంటే మేమే వండుకొందామని నిర్ణయించుకొన్నాం కాబట్టి. దారిలో వెళ్తుంటే రోడ్డుకు ఒక పక్క మక్కజొన్న కంకులు కాల్చి అమ్ముతున్నారు. డ్రైవర్‌కు తినాలనిపించి ఒకచోట ఆపాడు. అక్కడ అమ్మకానికి ఉన్న మొక్కజొన్నలు ఎంత లేతగా ఉన్నాయో.. వాటినమ్ముతున్న పూబోణులు కూడా అంతే లేతగా కనిపించారు. బాలరసాలసాల నవపల్లవ కోమల..కన్నియల్లాగా ఆహ్లాదాన్ని అందించారు. మక్కలు కాలుస్తూ.. గలగలా మాట్లాడుతూ.. కాలిన కంకులకు నిమ్మ ఉప్పు రాసి చేతికి ఇస్తున్న అమ్మాయిలను చూస్తూ అలాగే ఉండిపోవాలనిపించింది. మొత్తం మీద మొక్కజొన్న కంకులు తినుకుంటూ.. మళ్లీ కొండెక్కి వసతిగృహానికి చేరుకున్నాం. ఆ రాత్రి మేమే వండుకొని తిన్నాం. ఏంచేస్తాం మరి..

మర్నాడు ఉదయాన్నే నాథులా పాస్‌కు ప్రయాణం.. భారత టిబెట్ సరిహద్దు.. చైనా ఆధీనంలో ఉన్నది కాబట్టి దాన్ని మనం భారత్ చైనా సరిహద్దుగానే భావించాలి. ఇందుకు ముందుగానే పాస్‌లు బుక్‌చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో మమ్మల్ని ట్రావెల్ ఏజెంట్ కొంత ఇబ్బంది పెట్టాడు. ముందుగా బుక్‌చేస్తామని చెప్పి.. ఆ తర్వాత ప్యాకేజీలో లేదనడం.. అతనితో గొడవపడి ఒప్పించడం జరిగిపోయాయి. ముందురోజు చార్‌ధామ్‌కు వెళ్లేముందే.. మా తొమ్మిదిమంది ఆధార్‌కార్డులు.. ఫొటోలు ట్రావెల్ ఏజెంట్ పంపించిన దూతకు అందించాం. తెల్లవారుజామున ఏడుగంటలకు మేం బయలుదేరాం. ఎనిమిది కల్లా కొండ దిగాం. ముందురోజు మా గుర్తింపు డాక్యుమెంట్లు తీసుకున్న ఏజెంట్ మాకు అనుమతి పత్రాన్ని అందజేశాడు. గ్యాంగ్‌టక్‌లో మా సామాన్లన్నీ అతనే ఒక హోటల్‌కు షిఫ్ట్ చేశాడు. మేం కొండ దిగిన వాహనం అక్కడే ఆగిపోయింది. మమ్మల్ని వేరే వాహనానికి బదిలీ చేశారు. గ్యాంగ్‌టక్‌లో ఎక్కువగా ట్యాక్సీ డ్రైవర్లు మహిళలు ఉండటం వారికి ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలుండటం ఇక్కడ గమనించాం. అక్కడ డ్రైవర్లు మరో తిరకాసు పెట్టారు. ఈరోజు మంగళవారం నాథులాపాస్‌కు అనుమతి ఉండదు కాబట్టి వెళ్లడానికి వీలుకాదని.. దాని దగ్గరకు మాత్రమే వెళ్లగలమని చెప్పారు. మళ్లీ గొడవ.. కారు మొత్తానికి ఓ ఐదువేల రూపాయలు చెల్లిస్తే దొడ్డిదారిన తీసుకెళ్తామని అన్నారు. సహజంగానే మనసులోని చూడాలనే ఉత్కంఠ మమ్మల్ని సదరు ముడుపు చెల్లించడానికి ప్రేరేపించింది.

మొత్తం మీద మా ప్రయాణం మొదలైంది. దాదాపు సముద్రానికి పదివేల అడుగుల ఎత్తునకు వెళ్తున్నాం. అక్కడ వాతావరణంలో ఆక్సిజన్ శాతం పది కంటే మించదని ముందే వికీలో చూసి తెలుసుకున్నాం కాబట్టి ఉత్కంఠ మరీ పెరిగింది. పైకి వెళ్తున్నకొద్దీ ఒక విచిత్రమైన అనుభూతి. మొత్తం సైనిక స్థావరం.. పొరుగుదేశపు సరిహద్దును చూడబోతున్నామనే ఆసక్తి మమ్మల్ని ఉత్తేజితులను చేస్తున్నది. దారిపొడవునా సైనికుల గుడారాలు.. వాటిని పహరా కాస్తున్న జవానులు.. చుట్టూ కొండలు.. కాస్త దూరం వెళ్లాక కాస్త మంచి దారి ఏర్పడింది. సైనిక వాహనాలు తిరిగేందుకు డబుల్ రోడ్డును నిర్మించారు. పైకి వెళ్తున్నకొద్దీ చల్లదనం పెరుగుతున్నది. మబ్బులు మా వాహనాన్ని తచ్చాడుతూ వెళ్తున్నాయి. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ముందుగా మా కారు దారిలో ఉన్న బాబా మందిరానికి తీసుకెళ్లాడు.

ఈ మందిరం నాథులాపాస్‌కు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ విచిత్రమేమంటే ఇక్కడ ఉన్న మందిరంలో ఉన్న దేవుడు మామూలుగా మనం చూసే బాబా కాదు. హర్భజన్‌సింగ్ అనే సైనికుడి గుడి అది. విధి నిర్వహణలో మరణించిన వీరసైనికుడి స్మారకంగా నిర్మించిన దేవాలయం అది. ఒక సైనికుడికి ఆలయ నిర్మాణం జరగడం దేశంలో మరెక్కడా కనిపించదు. అక్కడికి వచ్చే భక్తులు ఆ సైనికుడికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆయనకు విగ్రహం ఏర్పాటుచేసి పూజాదికాలు చేస్తారు. ఆయన వాడిన వస్తువులు.. యూనిఫాం, బూట్లు, మంచం, ఇతర వస్తువులను పక్కనే ఉన్న ప్రత్యేక గదిలో ఏర్పాటుచేశారు. పక్కన ఆయన విగ్రహం ఉన్నది. ఆ విగ్రహానికి కదిలే చేతులు, కాళ్లు కూడా ఉన్నాయి. మరో గదిలో వాటర్ బాటిల్స్ వందల సంఖ్యలో ఉంచారు. ఈ వాటర్ బాటిల్స్ ఇక్కడ మొక్కుకు చిహ్నం కావచ్చు. మేం వెళ్లిన టైం మధ్యాహ్నం పన్నెండు అయింది. ఆ సైనిక బాబాకు లంచ్ (నైవేద్యం) ఏర్పాటుచేశారు. చక్కగా ప్లేట్లో సమస్త పదార్థాలను ఉంచారు. ఒక సైనికుడు ఆహార పదార్థాలతో ఉన్న ప్లేట్‌ని తీసుకొని గదిలోకి వెళ్లాడు. వెంట తీసుకువచ్చిన మంచినీటితో ఆయన చేతులను కడిగాడు. రుమాలుతో తుడిచాడు. విగ్రహం ముందు భోజనాన్ని ఉంచాడు. పక్కనే టేబుల్ ఫ్యాన్‌ను ఆన్‌చేశాడు. తర్వాత బయటకు వచ్చి తలుపులు మూశాడు. తాము పెట్టిన నైవేద్యాన్ని సైనికబాబా స్వయంగా స్వీకరిస్తాడని అక్కడ ప్రబలమైన విశ్వాసం. మరణించినప్పటికీ ఆయన అమరుడై రోజూ సైనిక విధులను సరిహద్దుల్లో నిర్వహిస్తున్నాడని, ఈ దేశానికి రక్షణగా ఉన్నాడని నమ్మకం. ఒక వీర జవానుకు దైవత్వాన్ని ఆపాదించేంత గౌరవం దక్కడం కంటే అద్భుతం మరేముంటుంది చెప్పండి?

ఈ బాబా మందిర్ సమీపంలోనే నూరు అడుగుల ఎత్తైన స్తంభంపైన భారత జాతీయ పతాకం సగర్వంగా ఎగురుతున్నది. పక్కనే ఒక షాపింగ్ సెంటర్, ఒక సైనిక మ్యూజియంను ఏర్పాటుచేశారు. వాటిని చూసుకొని.. షాపింగ్ సెంటర్‌లో తారాదేవి విగ్రహాన్ని కొనుక్కొని బయలుదేరాం. అప్పటికి భోజనసమయం కావడంతో నాథులాపాస్‌కు దగ్గర్లోని కొన్ని ధాభాల దగ్గర మా కారు ఆగింది. అక్కడ దిబ్బరొట్టెల కంటే మందంగా ఉన్న రొట్టెలు.. మ్యాగీలు తప్ప మరేమీ లభించలేదు. తినేవాళ్లు తిన్నారు.. తిననివాళ్లు వదిలేశారు. మా అన్నయ్య కొడుకు అనిరుధ్.. వాంతులు చేసుకొని కొంత ఆగంచేశాడు. మొత్తానికి లంచ్ అయిందనిపించుకొన్నాం. ఇంకా మీదకు వెళ్తే చల్లదనం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అక్కడే జాకెట్లు అద్దెకు ఇస్తున్నారు. ఒక్కొక్కటి వందరూపాయలు. తలా ఒకటి తీసుకొని.. వేసుకొని బయలుదేరాం..

కిలోమీటర్ దూరం వెళ్లాక ఒక సరస్సు తగిలింది. దాని పేరు చాంగు లేక్. అచ్చం మానస సరోవరం లాగానే స్వచ్ఛమైన జలాలతో నిండి అద్భుతంగా ఉంది. అక్కడ మొదటిసారి యాక్ జంతువును చూశాం. హిమాలయాల్లోనే తిరిగే జంతువు ఇది. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. స్థానికంగా బరువును వెూయడానికి.. ఇతర పనులకు దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. పెద్ద పెద్ద కొమ్ములు.. భారీ ఉన్నితో బలిష్ఠమైన దేహం కలిగి ఉంటుంది. మేం అక్కడ దిగాం. మా అమ్మాయి ఆనందలక్ష్మిని ఈ యాక్‌పై ఎక్కించాం. యాభై రూపాయలు తీసుకొన్నాడు.

అక్కడే సిక్కిం సంప్రదాయ దుస్తులు ధరింపజేశాం. చాలా చాలా అందంగా కనిపించిన మా అమ్మాయిని చూసి మా దిష్టే తగులుతుందనిపించింది. మా అమ్మాయికి ఉన్న ధైర్యం మావాడికి లేకుండాపోయింది. యాక్‌పైకి ఎక్కనంటే ఎక్కనన్నాడు. వాడికి (మా వాడి పేరు ఆనంద వల్లభ) ఎప్పుడు సరిహద్దులకు వెళ్దామా? సైనికులను చూద్దామా? అవకాశముంటే వారితో మాట్లాడుదామా? అన్న ఆరాటమే ఉన్నది. అరగంట సమయం అక్కడ తెలియకుండానే గడిచిపోయింది. అక్కడికి మరో మూడు కిలోమీటర్ల దూరంలో నాథులాపాస్ ఉంది. కారు అక్కడికి బయలుదేరింది. అక్కడికి చేరుకున్న క్షణం ఒకవిధమైన భావోద్వేగం ప్రతి ఒక్కరిలో కలిగింది. మా కుటుంబవెూ.. మా మిత్రుడు వీరభద్రుడి కుటుంబానికో మాత్రమే ఈ అనుభూతి పరిమితం కాలేదు. భారతీయుడిగా పుట్టి అక్కడికి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఉద్వేగానికి గురయ్యారంటే సహజం. మామూలుగా రోజూవారి పనుల్లో తలమునకలై ఉండే మనలో దేశభక్తి ఒక్క ఉదుటున ఎలా పెల్లుబికి వస్తుందో అక్కడ అడుగుపెట్టగానే సహజంగా కలిగే భావోద్వేగం చెప్తుంది. డ్రైవర్లు ముందుగా చెప్పినట్లు అక్కడ మంగళవారమని.. రానివ్వరనడానికి ఎలాంటి సంకేతాలు కనిపించలేదు. అక్కడ ఉన్న ఎత్తై న ప్రదేశంపైకి మెట్లెక్కి వెళ్లాం. మెట్లెక్కుతుంటేనే ఆక్సిజన్ లెవల్స్ తగ్గి.. ఆయాసం మొదలైంది. అక్కడ ఉన్న జవానులు ముందే హెచ్చరిస్తున్నారు. నెమ్మదిగా మెట్లు ఎక్కండి.. వేగంగా ఎక్కవద్దు.. ఇబ్బంది పడుతారని స్పష్టంగా చెప్తున్నారు. వారి మాటమేరకు నిదానంగా పైకి ఎక్కాం. సుదీర్ఘకాలంగా ఉన్న కల నెరవేరినట్టయింది. సరిగ్గా చైనా సరిహద్దుకు ఆరు ఇంచుల దూరంలో నిలుచున్నాం. ఒక సన్నని ఇనుప తీగే అడ్డం. అటువైపు చైనా సైనికులు.. ఇటువైపు మన జవానులు. మేం నిలుచుని ఉన్న ప్రాంతానికి కూతవేటు దూరంలోనే డోక్లాం సరిహద్దు ఉన్నది. అక్కడి నుంచి అది కనిపిస్తున్నది. అంతకు కొద్దిరోజుల ముందే డోక్లాం సరిహద్దుల్లో చైనా రహదారి నిర్మాణాన్ని చేపట్టడం.. అది వివాదం రేగడం వంటి వార్తల్ని చూసి ఉన్నాం కాబట్టి.. దాన్ని చూడగానే ఒకరకమైన భావోద్వేగం కలిగింది. అక్కడ జవానులు సరిహద్దు ప్రాంత ప్రత్యేకత గురించి మాకు వివరించారు. వాళ్లు వివరిస్తుండగానే చైనా సైనికుడు అటువైపునుంచి మా ఫొటోలు తీసుకొని వెళ్లాడు. భారతీయ పర్యాటకులపైన ఒక నిఘా అన్నమాట. భారత చైనాల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు ఇరు దేశాల అధికారులు, సైనిక కమాండర్లు చర్చించుకునే ప్రదేశాన్ని కూడా చూశాం. పర్యాటకులు ఉత్సాహంగా జైహింద్ నినాదాలుచేశారు. అక్కడ ఎంతసేపు ఉన్నా వెనక్కి రావాలనిపించలేదు. ఒక టూరిస్టు దొంగతనంగా కెమెరా తీసుకువచ్చి ఫొటోలు తీసే ప్రయత్నంచేశాడు. జవానులు ఆ కెమెరాను లాక్కుని మొత్తం డాటాను డిలిట్‌చేశారు. సరిహద్దుల్లో, భద్రతాపరంగా సున్నితమైన ప్రాంతాల్లో ఫొటోలు తీయడం నిషేధం. మనం.. టూరిస్టులుగా వెళ్తాం.. ఫొటోలు తీస్తాం.. ఫేస్‌బుక్కులు, వాట్సప్‌లు, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంలలో పోస్ట్ చేస్తాం. ఇదంతా మనకు సరదా.. కానీ ఆ ఫొటోలు వైరల్ అయితే.. డెమొగ్రాఫికల్ చిత్రాలు శత్రువుల చేతికి చిక్కితే దానివల్ల జరిగే పరిణామాలు అనూహ్యం. అందుకే ఏ రకమైన ఫొటోగ్రఫీనైనా అక్కడ నిషేధించారు. మెల్లిగా మెట్లు దిగి వచ్చాం. అక్కడ మరో సైనికుడితో మా ఆనంద మాట్లాడింది. అతని చేతిలోని గన్ గురించి అడిగి తెలుసుకుంది. అప్పుడే భారత భూభాగంలోకి సరుకులు తీసుకువచ్చిన సుమారు 30 ట్రక్కులు అన్‌లోడ్ చేసి వెనక్కి మళ్లాయి. ఒకదాని వెంట మరొకటి చైనాలోకి బయలుదేరాయి. వాటిలోని డ్రైవర్లు మాకు టాటాలు బైబైలు కూడా చెప్పారు. కైలాస్‌మానస సరోవర యాత్రకు వెళ్లే యాత్రికులను ఇక్కడి నుంచే చైనా అనుమతిస్తుంది. మన భారత సైనికులు యాత్రికులను నాథులా వరకు తీసుకొని వచ్చి చైనా సైనికులకు అప్పగిస్తారు. అక్కడి నుంచి చైనా సైనికులు యాత్రను సుసంపన్నంచేస్తారు. తిరిగి నాథులా వద్ద భారత్‌లో వదిలేస్తారు. నాథులాపాస్‌ను చూసిన అనంతరం తిరిగి మా యాత్ర గ్యాంగ్‌టక్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకుంది. హోటల్‌లో భోజనం చేసిన అనంతరం.. అక్కడే ఉన్న గ్యాంగ్‌టక్ మార్కెట్‌లోకి వెళ్లి కాసేపు షాపింగ్‌చేశాం. తిరిగి హోటల్‌కు వచ్చి తిని పడుకున్నాం.

తెల్లవారి డార్జిలింగ్ ప్రయాణం మొదలైంది. ట్రావెల్ ఏజెంట్‌కు మిగిలిన డబ్బులు అక్కడే ఇచ్చి బయలుదేరాం. ఈ టూర్‌లో మా ప్రయాణపు తుది మజిలీ ఇది. దాదాపు ఆరు గంటల ప్రయాణం. గ్యాంగ్‌టక్ కొండ దిగి సిలిగురిమీదుగా మా ప్రయాణం సాగింది. ఈ సారి మార్గంలో తేయాకుతోటలు చూడటం జరిగింది. దారి పొడవునా తేయాకు తోటలే.. యావద్దేశానికి టీపొడి ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది.

మధ్యలో తీస్తానది. ఈ తీస్తా నది గురించి ముందుగానే ప్రస్తావించాల్సి ఉండింది.  ఇప్పటికి కానీ వీలుపడలేదు. చైనా నుంచి భారత్ మీదుగా బంగ్లాలోకి ప్రవహించే అతి పెద్ద నది ఇది. ఈశాన్య రాష్ట్రాలకు ప్రధాన జలవనరు ఇదే. నిజానికి మా ప్రయాణం యావత్తూ ఈ నది చుట్టూనే సాగింది. ఓ పక్క ప్రవాహం.. మరోపక్క రహదారిపై మా ప్రయాణం. తీస్తానదీ ప్రవాహం అత్యంత వేగంగా సాగుతుంది. కొండలు, గుట్టలను దాటుకుంటూ అతివేగంగా సాగే ఈ ప్రవాహం అత్యంత ప్రమాదకరమైంది. గ్యాంగ్‌టక్ నుంచి ప్రారంభమైన మా ప్రయాణం తీస్తా ఒడ్డునే ఉన్న ఓ హోటల్ దగ్గర ఆగింది. అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్నాం.

అక్కడి నుంచి బయలుదేరి కొద్దిదూరం వెళ్లాక రివర్ రాఫ్టింగ్ జోన్ ఉన్నది. ఒక బోటు.. అయిదుగురు సభ్యులు.. 4800 రూపాయలు.. ఫొటోలకు ఆరు వందల రూపాయలు.. మేం రెండు బోట్లు మాట్లాడుకున్నాం. ఈ రివర్ రాఫ్టింగ్ ఒక గొప్ప అనుభూతి. నదీ ప్రవాహ వేగానికి పైకి కిందకు పడుతూ.. లేస్తూ వెళ్తుంటే బోటు లోకి నీళ్లు వచ్చి పడుతుంటే.. నలభై నిమిషాల పాటు రివర్ రాఫ్టింగ్ చేశాం. అందరూ బలే ఎంజాయ్ చేశారు. ఫొటోలు దిగారు. మధ్యాహ్న భోజనం అనంతరం (లోకల్ ధాభాల్లాంటి హోటల్‌లో) బయలుదేరి డార్జిలింగ్ చేరేసరికి సాయంత్రం అయింది. హోటల్‌లో సామాన్లు పెట్టుకొన్న అనంతరం డార్జిలింగ్‌లో లోకల్ మార్కెట్‌కు బయలుదేరి వెళ్లాం. దాదాపు రెండు గంటలపాటు మార్కెట్‌లో షాపింగ్‌చేశాం. వారం తర్వాత ఇక్కడ కాస్త మనదైన ఫుడ్ దొరికింది. అక్కడ తిన్నాక కాస్త హాయి అనిపించింది. ఆ తర్వాత తిరిగి మేం బసచేసిన హోటల్‌కు చేరుకున్నాం.

ఉదయాన్నే నాలుగున్నర గంటలకు టైగర్‌హిల్స్‌కు మా ప్రయాణం మొదలైంది. సుమారు 45 నిమిషాల పాటు ప్రయాణంచేసి టైగర్‌హిల్స్ చేరుకున్నాం. అక్కడ సూర్యోదయం చూడాలని తాపత్రయం. అక్కడి నుంచి చూస్తే హిమాలయాల్లో రెండో అతిపెద్ద పర్వతమైన కంచన్‌జంగా పర్వతాన్ని చూడాలని కోరిక. టైగర్ హిల్స్ వ్యూపాయింట్‌లో గంటకుపైగా వేచిచూశాం. మబ్బులు విపరీతంగా కమ్ముకోవడం వల్ల రెండింటినీ చూడటం మా వల్ల కాలేదు. ఉసూరుమంటూ కిందకు వచ్చి తిరిగి ప్రయాణమయ్యాం.

డార్జిలింగ్ పట్టణంలో అతి పెద్ద బౌద్ధారామం ఉన్నది. దాన్ని చూడటానికి ఎన్ని కన్నులున్నా సరిపోవు. ఇది బెంగాల్ పరిధిలోకి వస్తుంది. ఎంత అద్భుతమైన ఆరామమిది. చూసి తీరాల్సినది. అత్యంత విశాలమైన ప్రాంగణం.. చుట్టూ పూల మొక్కలు.. మధ్యలో అపూర్వమైన భవనం.. భవన గోడలపై చూడచక్కని పెయింటింగ్‌లు.. అన్నీ కలిస్తే.. బౌద్ధారామం. ప్రధానమైన మందిరానికి పక్కన ధర్మ చక్రాలు ఉన్న గది ఉన్నది. అందులో ఎనిమిది చక్రాలు ఉన్నాయి. ఒక్కో చక్రం ముందు ఒక్కో బౌద్ధ భిక్షువు కూర్చొని వాటిని తిప్పుతూ ఉన్నారు. సందర్శకులు వెళ్తే వారితో వాటిని తిప్పిస్తున్నారు. దాని పక్కన ప్రధాన మందిరం. అందులో బుద్ధుడి శిష్యులైన పద్మ సంభవుడు, తార, ఇతర శిష్యుల భారీ విగ్రహాలు ఉన్నాయి. భారతీయ సంప్రదాయంలో తారకు అత్యంత ప్రాధాన్యమున్నది. దశమహావిద్యల్లో తార రెండో విద్య. ధ్వనికి, వాక్కుకు అధిదేవత బౌద్ధుల సంప్రదాయంలోనూ తార పద్మసంభవుడి తర్వాత రెండో అతి ముఖ్యురాలైన శిష్యురాలు. అనంతమైన జ్ఞానానికి ప్రతీకగా ఈమెను భావిస్తారు.  తాంత్రిక విద్యల్లోనూ, ఉపాసనల్లోనూ తార విద్యాసంబంధమైంది. ఈ విగ్రహాలను ఎంతచూసినా తనివితీరదు. ఇది బౌద్ధుల జ్ఞాన మందిరం. ధ్యానానికి, విద్యకు ఆలవాలంగా ఇది ఉన్నది. చాలా చాలా గొప్ప ఆరామమిది. అది చూశాక మా ప్రయాణం తిరిగి మొదలైంది. పాతిక కిలోమీటర్లు వెళ్లాక మార్గమధ్యంలో మాకు ఒక తేయాకు తోట తగిలింది. అక్కడ టీ గార్డెన్‌లోపలికి వెళ్లాం.

మా ఆనంద మళ్లీ అక్కడ తేయాకు మహిళ డ్రెస్ వేసుకుంది. యాభై రూపాయలు.. వీపుకు బుట్ట కూడా తగిలించుకుంది. అక్కడి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని మా అమ్మాయి కాస్త హడావిడి చేసింది. అక్కడ తేయాకు పొడి రకరకాల ఫ్లేవర్‌లలో కొన్నాం. స్థానికంగా పండించిన మసాలాలు కూడా అమ్ముతున్నారు. వాటిని కూడా కొన్నాం. ఆ తర్వాత మా ప్రయాణం న్యూ జెల్పాయ్ గురివైపు సాగింది. మార్గంలో మరో మజిలీ అనుకోకుండా తగిలింది. అది నేపాల్ సరిహద్దు. మా డ్రైవర్ అక్కడ ఆపాడు.

మా ఆధార్ కార్డు చూపించి నేపాల్ సరిహద్దు దాటి నేపాల్ భూభాగంలో కాలువెూపాం. ఒకటిన్నర కిలోమీటర్ మేర లోపలికి వెళ్లాం. అక్కడ నేపాలీలు దొంగ సొమ్ములు అమ్ముతున్నారు. రాడో వాచ్‌లు రేబాన్ గ్లాస్‌లు, కాప్మొటిక్స్, బూట్లు, పర్‌ఫ్యూమ్‌లు.. అబ్బో బోలెడు ఉన్నాయి. అక్కడ మా వీరభద్రుడు ఓ ఆరువేలు సమర్పించుకొన్నాడు. నాకూ ఓ రెండువేల చమురు వదిలింది. ఈ పేరుతో విదేశాల్లో కూడా కాలువెూపామని కూడా అనిపించుకొన్నాం.. ఇది మా చివరి మజిలీ.. అక్కడి నుంచి సాయంత్రానికి న్యూజెల్పాయ్‌గురికి చేరుకున్నాం. రాత్రి భోజనం చేసుకొని కలకత్తాకు రైల్లో బయలుదేరాం. తెల్లవారేసరికి కలకత్తా చేరుకొన్నాం. అక్కడి నుంచి రామకృష్ణమఠం చూసుకొని ఎయిర్‌పోర్ట్ చేరుకొన్నాం. మధ్యాహ్నం 3.15 గంటలకు ఇండిగో విమానం బయలుదేరింది. కొద్దిదూరం వెళ్లిందో లేదో.. వాతావరణం బాగాలేదు.. సీటు బెల్టులు పెట్టుకొండి అంటూ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఇదో కొత్త అనుభవం. సినిమాల్లో చూడటం తప్ప తెలియని అనుభవం.. ఎటు తిరిగిందో.. ఎక్కడెక్కడ పైలట్ తిప్పాడో కానీ.. మొత్తం మీద గంట ఆలస్యంగా విమానం హైదరాబాద్‌కు చేరుకుంది. క్షేమంగా ఇంటికి చేరుకున్నాం. జీవితాంతం నెమరువేసుకుని ఆనందించే అత్యద్భుతమయిన అనుభవాలను పదిలంగా హృదయంలో మూటకట్టుకున్నాం.

Exit mobile version