ఒక ప్రశ్న

0
2

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి సరిగ్గా పన్నెండుగంటలప్పుడు మెలుకువ వచ్చింది సాగర్‌కి!

ప్రక్కన భార్య పల్లవి హాయిగా నిద్రపోతుంది. వాళ్ళకి పెళ్ళయి రెండు సంవత్సరాలు అవుతుంది. ఇంకా పిల్లలు పుట్టలేదు.

సాగర్ డిగ్రీ చదువుకుని ఓ కార్పోరేట్ ఆఫీస్‌లో ఆఫీస్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. 

నిద్రపోవాలని కొద్దిసేపు  ప్రయత్నించాడు. నిద్రరావడం లేదు.

అర్ధగంట ప్రయత్నించాక ..ఇక లాభం లేదనుకుంటూ.. మంచం దిగి ఢాబా పైకి చేరుకున్నాడు.

ఆరోజు పౌర్ణమి కావడంతో వినీల గగనసీమలో ‘జాబిలమ్మ’ అందంగా కదులుతుంది. వెన్నెల వెలుగులు జగతి అంతటా నిండిపోగా.. కదులుతున్న మబ్బులు అప్పుడప్పుడు జాబిలమ్మని దాస్తూ మళ్ళీ దూరమవుతూ దోబూచులాడుతున్నట్లుగా సాగుతుంటే.. ఆకాశం వైపు చూస్తూ నిలబడ్డాడు సాగర్.

చల్లని గాలి రివ్వున వీస్తుంది. దగ్గర వున్న మల్లెపందిరి నుండి  హాయైన పరిమళాలు అక్కడంతా వ్యాపిస్తున్నాయి. అతడి మనస్సుకి ఆహ్లాదాన్ని అందిస్తుంది అక్కడ వున్న వాతావరణం. ఏకాంతంగా కూర్చున్నాడు.

ఆలోచనలు గతంలోకి దారితీశాయి.

***

“పల్లవి” భర్త పిలుస్తుంటే.., “ఆ వస్తున్నా..” అంటూ అతడి ఎదురుగా నిలబడింది పల్లవి ఏంటి అన్నట్లుగా చూస్తూ..!

“నా బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ తీసుకురా..”

“అలాగే” అంటూ బీరువా తీసి బ్యాంక్ పాస్ బుక్ అతడికి అందించింది.

అది రెండువేల పద్దెనిమిదవ సంవత్సరం.. అప్పటికి  పెళ్ళయి వాళ్ళకు రెండు నెలలు అవుతుంది. కొత్తగా కాపురం ప్రారంభించారు.

అప్పటి వరకూ వుంటున్న బ్యాచ్‌లర్ రూం ఖాళీ చేసి…  ఇప్పుడు వుంటున్న ఇంట్లోకి కొత్తగా గృహప్రవేశం చేశాడు సాగర్ పల్లవితో కలసి!

సాగర్ వాళ్ళ అత్తమామలు,తల్లిదండ్రులు రెండురోజులు వుండి వెళ్ళారు, త్వరలో తీపికబురు చెప్పాలని ఇద్దరికీ పదేపదే సూచిస్తూ..

నవ్వుకున్నారు ఇద్దరూ..సాగర్,పల్లవి ఒకరినొకరు చూసుకుంటూ!!

తను నిత్యం ఆఫీస్‍లో బిజీగా వుండడం.. రోజు అలసిపోయి ఇంటికి రావడం.. భార్య అందించిన కమ్మని కాఫీ త్రాగుతూ, టీ.వీ చూస్తూ కాలక్షేపం చేయడం.. అలా అలా రోజులు రొటీన్‌గా సాగుతున్నాయి!

ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా గడుస్తున్నాయి రోజులు.

కాని గత కొంతకాలంగా జీవితంలో ఏదో వెలితి అతడిని వెంటాడుతుంది!?

ఈ మధ్య పల్లవి కూడా అంత హుషారుగా వుండడం లేదు. కారణమేంటని తను పలువిధాలుగా అడిగినా తన నుండి ఎటువంటి సమాధానం రావడం లేదు.

‘ఏమై వుంటుంది?’ తనని తనే ఎన్నో సార్లు ప్రశ్నించుకున్నాడు. ఆఫీస్‌లో పని ఒత్తిడి..ఎప్పుడూ వుండేదేకదా!? ఇంటికెప్పుడు వచ్చినా ఒకింత ఆ సీరియస్‌నెస్ అలాగే వుంటుంది. ఉద్యోగం చేసే ఎవరైనా తనలాగే వుంటారుకదా!! అదే ప్రాబ్లమా!? లేదు..

అప్పుడప్పుడు తను ఆఫీస్ నుండి ఇంటికి ఆలస్యంగా రావడం కారణమా.. మరి ఆఫీస్‌లో పని భారం ఎక్కువగా వున్నప్పుడు తప్పదు వుండవలసి వస్తుంది! ఎటువంటి కారణం తనని ఇబ్బందికి గురి చేస్తుందో అర్థం కావడం లేదు అతడికి!

అత్తయ్య, మామయ్య.. తన తల్లిదండ్రులు కాల్ చేసినప్పుడు మాత్రం పల్లవి ఆనందంగా మాట్లాడుతుంది. ఎప్పుడూ తనలాగే వుంటే బాగుంటుంది. ఆ మాటే సాగర్ పల్లవితో అంటే.. ఏమీ మాట్లాడదు.

ఇలాంటి గజిబిజి ఆలోచనలతో ఈ మధ్య సాగర్‌కి నిద్ర సరిగ్గా పట్టడం లేదు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి!?.. అసలు సమస్య ఏంటి!?

పల్లవి ఎందుకలా చేస్తుందో పరిపరివిధాలుగా ఆలోచిస్తున్నాడు.

***

ఓ గంట తరువాత కిందకి వచ్చి పడుకున్నాడు.

ప్రశాంతంగా నిద్రిస్తున్న పల్లవి.. మోములో మాత్రం ఏదో అలజడి!

అర్థం కాకపోయినా.. ముద్దొచ్చింది అతడికి.

తనని అల్లకల్లోలం చేస్తున్నా ఆ ప్రాబ్లం ఏంటో..

ఎలాగైనా తన మనస్సుని ఇబ్బందికి గురిచేస్తున్న సమస్యని ఛేదించాలి అనుకుంటూ నిద్రపోయాడు.

***

పల్లవి మనస్సులో జనించిన ఆ సమస్యని తెలుసుకోగల తెలివి తన తల్లికి వుందనుకుంటూ.. తల్లికి జరుతుతున్నది చెప్పాడు.

అంతా విన్న ఆమె నవ్వుతూ “అలాగేలేరా.. నువ్వు నిశ్చింతగా వుండు. కోడలు పిల్ల సంగతి నేను చూసుకుంటాను కదా!” అంది.

తేలిక పడ్డ మనస్సుతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.

***

రెండు రోజుల తరువాత పల్లవి తనని పెళ్ళైన కొత్తలోలా పలకరించడం అతడికి విస్మయం కలిగించిన అంశం! పల్లవి అలా నవ్వుతూ, తుళ్ళుతూ తనతో మాట్లాడడం తన్మయంగా చూస్తూ ఆనందంగా వున్నాడు సాగర్.

తల్లిదండ్రులు ఇద్దరూ వున్నప్పుడు తల్లిని అడిగాడు “అమ్మా ఏం జరిగింది?” అంటూ.

ఆ సమయంలో సాగర్ వాళ్ళ నాన్నగారు టి.వి. చూడ్డంలో లీనం అయ్యాడు. పల్లవి వంటింట్లో వంటపనిలో బిజీగా వుంది.

“తరువాత చెబుతా లేరా.. మేము ఊరు వెళ్ళే రోజు ..సరేనా?” అంటున్న తల్లితో అలాగే అన్నట్లుగా తలూపాడు సాగర్.

తల్లిదండ్రులని ట్రైన్ ఎక్కించడానికి రైల్వేస్టేషన్‌కి వెళ్ళాడు సాగర్. ట్రైన్ రావడానికి ఇంకా నలబై నిమిషాల సమయం వుంది. అప్పుడు సమయం ఉదయం ఆరున్నర. నల్గొండ రైల్వేస్టేషన్ ఖాళీగా వుంది. ప్రయాణికులు ఇంకా స్టేషన్‌కి రాలేదు. వాళ్ళు గుంటూరు వెళ్ళాలి. రంగారావుగారు దూరంగా నిలబడి న్యూస్ పేపర్ చదువుకుంటున్నారు.

పచ్చగా మెరుస్తున్న అక్కడి ప్రకృతి..  సూర్యోదయం.. పక్షుల కిలకిలారావాల సందడి.. అప్పుడప్పుడూ వినిపిస్తున్న కోయిలమ్మల కమ్మని కుహూ కుహూ రాగాలు.  కలగలిపి.. అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా వుంది.

“అమ్మా చెప్పు ఇప్పుడైనా, ఏం జరిగింది?” బెంచి పై తల్లి ప్రక్కనే కూర్చుంటూ.. అనునయంగా అడిగాడు సాగర్.

“నేను తనని అట్టే ఇబ్బంది పెట్టక జాగ్రత్తగా మీ ప్రాబ్లం గురించి అడిగాను. తను అడిగిన ఒక ప్రశ్న.. ‘శశిరేఖ ఎవరు?’ అని. అంతే ఒక్కసారిగా ఉలిక్కి పడడం నా వంతైంది.” అంది సావిత్రి.

“అదీ..అదీ..” సాగర్ అంటూ చెప్పబోతుంటే..

“ఆగరా.. చెబుతాను. తను అడిగిన ప్రశ్న వినగానే నాకు సమస్య పూర్తిగా అర్థం అయ్యింది. కాని అదే ప్రశ్న నిన్ను అడిగి వుంటే ఏం జరిగేదో తెలియదు. నన్ను అడిగింది తగిన సమాధానమే చెప్పాను.”

“అదే.. ఏం చెప్పావు అమ్మా?”

“సాగర్ కాలేజ్‌లో వుండగా కవిత్వం వ్రాసేవాడు. అప్పట్లో తన ఊహాసుందరి పేరు శశిరేఖ. చాలాకాలం.. ఆ అమ్మాయినే ఊహించుకుని కవిత్వం వ్రాస్తున్నానని చెప్పేవాడు. ఓ పెళ్ళిలో నిన్ను చూశాడట. తన స్వప్నసుందరి ఆ ఊహాసుందరి నువ్వేనని మాకు చెప్పాడు. మీరా ఆర్థికంగా వున్నవాళ్ళు.  ఆ రోజుల్లో మీ నాన్న సంబంధం గురించి అడిగితే కాదన్నాడు. మేము తరువాత రెండు మూడు సంబంధాలు చూశాము.  సాగర్.. ఇక పెళ్ళి ఊసులు కట్టిపెట్టి వుద్యోగ బాధ్యతల్లో బిజీ అయ్యాడు.  ఆర్థికంగా కూడా అభివృద్ధి సాధించడం ప్రారంభించాడు. డిగ్రీ పూర్తి చేసిన సాగర్ ఆ తరువాత ఉద్యోగం చేసుకుంటూనే పి.జి.కూడా పూర్తిచేసి, తను పనిచేస్తున్న ఆఫీస్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇంతలో మీ నాన్న కూడా పెళ్ళికి సరే అనడం.. సాగర్ కూడా నిన్నే చేసుకుంటానని పట్టుబట్టడంతో.. మీ పెళ్ళి జరిగింది అంటూ చెప్పాను.” అంది సావిత్రి కుమారుడితో.

“మరి అదే విషయాన్ని నన్నే అడగవచ్చుకదా?” అన్నాడు సాగర్.

“మరి రెండేళ్ళుగా తనతో కలసి కాపురం చేస్తున్నావు కదా..ఆ పిల్ల మనస్సు గ్రహించలేదుకదా.. మరి నిన్నేమనాలి!?”

మౌనంగా వుండిపోయాడు. కొద్దిసేపటి తరువాత మామూలుగా అయిపోతూ..

“అదీ నిజమే అమ్మా. ఆఫీస్ పనుల్లో పడి.. తన మనస్సు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. జీవితం కెరియర్ గురించే ఆలోచిస్తూ.. నా మనస్సుకి ఇష్టమైన కవిత్వాన్ని దూరం చేసుకున్నాను. నేను అప్పట్లో వ్రాసుకున్న డైరీ కూడా ఎక్కడో పెట్టి మర్చిపోయాను. డైరీ ఈ మధ్య కనిపించడం లేదు. ఆ డైరీ వుందో, లేదో కూడా తెలియదు.” అన్నాడు నిరాశగా సాగర్.

“ఆ డైరీ ఆ అమ్మాయి దగ్గరే వుంది. ఇంటికి వెళ్ళాక అడుగు” అంది సావిత్రి ప్రశాంతమైన వదనంతో!

తల్లిదండ్రులని ట్రైన్ ఎక్కించి హుషారుగా ఇంటికి వెళ్ళాడు.

చిరునవ్వులతో ఎదురయింది పల్లవి.

వెళ్ళగానే అడిగాడు.. “పల్లవి! డైరీ ఇస్తావా?”

మారుమాట్లాడలేదు.. డైరీ తెచ్చి అతడికి ఇచ్చింది. ఒక్కసారి డైరీని తడిమి చూసుకున్నాడు. పేజీలు తిప్పుతూ కవితల వైపు సంబరంగా చూసుకున్నాడు.

అప్పుడప్పుడూ పల్లవి వైపు చూస్తున్నాడు.

“కవితలన్నీ చాలా బాగున్నాయి..” మెచ్చుకోలుగా అతడివైపు చూస్తూ అంది పల్లవి.

“థ్యాంక్ యూ” అన్నాడు చిరునవ్వుతో.

“మీరు వ్రాసిన కవితలు నాకు ఎంతగానో నచ్చాయి. కాని మీరు ఇలా రచనలు చేస్తారని నాకు ఎప్పుడూ చెప్పలేదు.”

“అవును.. నిజమే.”

“కానీ ..ఇక ముందు మీరు మరెన్నో మంచి కవితలు వ్రాయాలి. అలాగని నాకు మాట ఇవ్వండి. ‘నాకు సాహిత్వం, సంగీతం అంటే ఎంతో ఇష్టం’ అని మీకెన్నో సార్లు చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను. అలాగేనా?” అడిగింది.

“ఓ.కే” అన్నాడు ఆమె చేతులని తన చేతుల్లోకి తీసుకుంటూ.. సంతోషంగా నవ్వింది పల్లవి భర్త వైపుచూస్తూ.

“నా రచనా వ్యాసాంగాన్ని తిరిగి ప్రారంభిస్తాను. అందర్ని అలరించే ఎన్నో కమ్మని కవనాలు లిఖిస్తాను. నా ఊపిరి చివరి వరకూ.. నీ తోడుగా నిరంతరం సాగుతూనే వుంటాయి నా కవనాలు.. సరేనా!?” అంటూ ప్రేమగా నుదుటిపై ముద్దాడాడు. వెన్నెల్లు తన కన్నుల్లో తొణికిసలాడుతుండగా.. తృప్తిగా భార్య వైపు చూసుకుంటూ.. భార్య బహుమతిగా అందించిన పసిడి వర్ణంలో మెరుస్తున్న పెన్(కలం) అందుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here