ఒక ప్రేమకథ

0
2

[dropcap]చి[/dropcap]న్నారి సీత తోటలో ఆడుకుంటున్నది. జనకుని భార్య, సీతమ్మకు తల్లి, రత్నమాల సమీపం లోనే కూర్చుని చూస్తూ ఉన్నది. ఉన్నట్టుండి సీతమ్మకు ఏం తోచిందో ఏమో తల్లి వద్దకు వచ్చి “అమ్మా! నిన్నటి లాగా బంతి చేసివ్వవా ఆడుకుంటాను.” అన్నది. “అలాగేమ్మా!” అంటూ ఆమె తోటలోని పువ్వులతో బంతి చేసి ఇచ్చింది. చిన్నారి సీత పూల బంతిని పైకీ, కిందికీ, కిందికీ పైకీ ఎగరేసి ఆడుకుంటూంది. ఉన్నట్టుండి ఆమె చేతిలో నుంచి బంతి ఎగిరి వరండా లోని చక్రాల పెట్టి కిందకి పోయింది.

“అమ్మా! బంతి పడిపోయింది తీసివ్వవా!” అమ్మ నడిగింది సీత.

“ఉండమ్మా తీసిస్తాను” అంది ఏదో పరధ్యానంలో తల్లి.

అలా అందే గాని అమ్మ ఎంతకీ తీసివ్వదే! చాలా సేపు చూసిన సీత పెట్టె దగ్గరకు వెళ్లి దాని క్రిందకు వంగి చూసింది. బంతి పెట్టె అడుగున చాలా లోపలి వెళ్ళిపోయి చేతికి అందేలా లేదు. చేసేది లేక పెట్టెనే పక్కకు తోద్దామని చూసింది. పెట్టె నెమ్మదిగా పక్కకు జరిగింది. సీత బంతిని తీసుకొని ఎప్పట్లాగా అడుకుంటూంది. అప్పుడే అటు వచ్చిన తండ్రి జనకుడు ఆశ్చర్య పోయాడు. శివుని విల్లు ఉంచిన ఆ పెట్టెను ప్రక్కకు జరుపుదామని చూశాడు. అబ్బో! కొంచెమన్నా కదిలితే కదా! ఏదో ఆలోచించుకుంటూ లోపలికి నడిచాడు జనకుడు.

***

చాలా రోజులు గడిచాయి. అంతఃపురసౌధం నుండి దూరంగా కనపడే నదిని చూస్తున్నది నవ యవ్వనవతి సీత. నగరంలో ఉన్న మామూలు మనుషుల్లాగా తను కూడా ఆ నదీ జలాలలో తనివితీరా తడవాలనీ, ఉరకలు పరుగులు పెట్టే నీళ్ళల్లో గెంతులు వేస్తూ ఆటలాడుకోవాలనీ ఎన్నాళ్ళుగానో కోరిక. అంతఃపురం లోని కట్టుబాట్ల వల్ల నదిలో స్నానం మాట అటుంచి కనీసం బయటికైనా వెళ్లగలిగితే అదే పదివేలు. అల్లారు ముద్దుగా చూసుకునే తండ్రిగారిని అడుగుదామని ఎన్నోసార్లు అనుకుంది. ఆయనను చూడగానే ప్రేమతో పాటు అదో రకమైన భయం. ఎలా అడగాలి? ఆయన కాదంటేనో!..

కాదనే అంటారు.. అవుననే మాటే ఊహించరానిది. కాదనీ వద్దనీ అంతఃపుర స్త్రీలకు ఇది తగదనీ వారిస్తారు. ఇంతే జరిగేది. హుఁ! ఈ జన్మకింతేలే.. ఎలాగూ స్వయంవరం ప్రకటించారు. రేపీపాటికల్లా ఎవరో ఒకర్ని వరించి వివాహం చేసుకోవాల్సిందే! సరదాలూ సంతోషాలూ మరిచిపోవాల్సిందే! ఇలా దీర్ఘాలోచనలో పడ్డ సీత తన ప్రక్కనే తల్లి రత్నమాల వచ్చి నిలబడ్డది కూడా గమనించలేదు. ఎప్పుడూ దిగులెరుగని తన గారాల పుత్రిక సీతను అలా చూసేటప్పటికి రత్నమాల కంగారు పడింది. “ఏం తల్లీ! సీతా! ఎందుకమ్మా అలా ఉన్నావు!” అంటూ ఆందోళనగా అడిగింది.

ఉలిక్కిపడ్డ సీత తన కంగారును కప్పిపుచ్చుకుంటూ “అబ్బే! ఏమీ లేదమ్మా! ఊరికే ఏదో ఆలోచన.. అంతే!” అన్నది.

“అదే ఏమిటి తల్లీ చెప్పకూడదా! రేపో మాపో పెళ్ళైతే అత్తవారింట ఈ స్వాతంత్య్రం ఉండదు తల్లీ! అడుగడుగునా తలవంచుకొని అన్నిటికీ భర్త దగ్గర అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నీ సరదాలూ సంతోషాలూ తీర్చుకోవాల్సింది ఇప్పుడే. నీకేం కావాలో అడుగమ్మా!” అని ఊరడిస్తూ అడిగేసరికి ఇక సీతమ్మ భయపడుతూనే “అమ్మా! దూరంగా కోసీ నది కనిపిస్తున్నది కదూ! అందులో స్వేచ్ఛగా తనివితీరా జలకాలాడాలని నాకు ఎప్పటి నుండో కోరిక. నేను రాజకుమార్తెను కదా! ఈ నా కోరిక ఎలా తీరుతుందమ్మా?” అన్న సీతమ్మ అమాయకత్వానికి రత్నమాలా దేవి జాలిపడింది. సీతతో అనునయంగా అంది. “నీ కోరిక అసాధ్యమేమీ కాదమ్మా! రాజకుమార్తెలు సామాన్యులలాగా బాహాటంగా నదికి వెళ్లడం కష్టమే. కానీ మన అంతఃపురం నుండి కోసీ నదీ తీరాన ఒక మారుమూల జనసంచారం లేని ఏకాంత ప్రదేశానికి ఒక రహస్య మార్గం ఉన్నది. ఆపత్సమయాలలో వాడుకోవటానికి ప్రతీ కోటలోనూ ఇటువంటి మార్గాలుంటాయి. ఈ రోజు నీవు చెలికత్తెలతో కలిసి ఎవరికీ తెలియకుండా అక్కడికి వెళ్లి జలకాలాడి రావచ్చు. సంతోషంగా వెళ్లి రా తల్లీ!” అంటూ చెలికత్తెలను పిలిపించింది. సీత ఆనందానికి పట్ట పగ్గాలే లేకపోయాయి. ఒక్కసారిగా తల్లిని కౌగలించుకొని “అమ్మ.. మా మంచి అమ్మ” అంటూ ఆమెని తిప్పేసింది. “ఉండు తల్లీ! కళ్ళు తిరుగుతాయి.” అంటూ నవ్వుకొంది రత్నమాల.

***

విశ్వామిత్ర మహర్షి కోరిన మీదట యజ్ఞ యాగాలను రాక్షసుల బారినుండి కాపాడడానికి దశరథ మహారాజు ఆయన వెంట వెళ్ళమని తన పుత్రులు రామలక్ష్మణులను పంపించాడు. అనుకున్నవిధంగానే రామలక్ష్మణులు అసమానమయిన ధైర్య సాహసాలు చూపి రాక్షసుల పొగరు దింపి వాళ్లకు గర్వభంగం కావించారు. దానితో పాటు తాటకీ సంహారం జరిగింది. మారీచసుబాహులకు గర్వభంగమూ, అహల్యామాతకు శాపవిమోచనమూ జరిగింది. సంతుష్టుడైన విశ్వామిత్రుడు తిరుగు ప్రయాణంలో విదేహ రాజ్యపు రాజధాని మిథిలకు వెళ్ళి జనక మహారాజు చేస్తున్న యజ్ఞాన్ని చూద్దామన్నాడు. ఆ ప్రకారమే మిథిలా నగరానికి చేరుకున్న రామలక్ష్మణులు విశ్వామిత్రునితో బాటు నగర శివార్లలో కోసీనదీ తీరాన ఒక ప్రశాంతమైన ప్రదేశంలో లక్ష్మణుడు అప్పటికప్పుడు ఏర్పాటు చేసిన కుటీరంలో బస చేశారు.

సాయంసమయమవడంతో విశ్రాంతిగా కూర్చుని ప్రకృతి అందాలను చూస్తూ ఉన్నాడు రాముడు. తమ్ముడు లక్ష్మణుడు కందమూలాలు తెస్తానంటూ వెళ్ళాడు. గురువుగారు కుటీరంలో విశ్రమిస్తున్నారు. ఒంటరిగా ఉన్న నవయువకుడు రాముడు. అవతారపురుషుడైనప్పటికీ మానవుని రూపంలో మాయా మోహంలో ఇరుక్కోక తప్పదు. రామావతార లక్ష్యం నెరవేరాలంటే జరుగవలసినది సీతా దేవితో రాముని వివాహమూ, రావణ సంహారమూ. దానికి తగ్గట్టు గానే ప్రకృతీ, విధాతా నడుచుకోవాలి. తానే రాసిన నాటకంలో రాముని మనసులో సీతనూ, సీత మనసులో రాముణ్ణీ నిలపాలి.

కొండలూ, గుట్టలూ, పర్వతాలూ పగలంతా పనిచేసి వచ్చి అలసి సొలసి పడుకున్న పల్లె పడతుల వలె ఉన్నాయి. కొండల పైన శిఖరాల్ని చుంబిస్తూ తెల్లనీ, నల్లనీ మేఘాలు. ఒక సారి పసిపాపకి పాలిస్తున్న తల్లి లాగా, ఒక సారి ప్రియుని ఒడిలో సేద తీరుతున్న ప్రియురాలిలాగా, పరిగెడుతున్న జింకలాగా.. ఓహ్! ఎంత అందం. ఎన్ని రోజులు ఎన్ని పదాలతో వర్ణించినా చూస్తేనే గాని, సొంతం చేసుకుంటేనే గాని అనుభవైకవేద్యం కాని సౌందర్యం. అందమైన ప్రకృతి రాముని మనసులో ఏవేవో తలపులను రేపుతోంది. కొంచెంసేపు వనవిహారం చేద్దామని అనిపించింది.

ఆ రోజు చైత్ర శుద్ధ విదియ. ఉగాది పండుగ దాటి రెండే రోజులయ్యింది. మామిడి చెట్లనిండా వేలాది చిన్న చిన్న పిందెలు. వేప చెట్ల ఆకులను కనిపించనివ్వకుండా నిండుగా పూత పూశాయి. తమ కాయల భారంతో తామే వంగిన చింత చెట్లూ, పువ్వులన్నీ రాల్చేసి భవబంధాలు తెంచుకున్న భక్తుని లాగా వినమ్రంగా తలవంచుకున్న పారిజాతవృక్షాలు. అడవి అందాలను తిలకిస్తూ వెళుతూ ఉంటే ఒక చక్కని సెలయేరు కనిపించింది రామునికి. దాహం తీర్చుకుందామని దోసిలి ఒగ్గాడు రాముడు. సెలయేరు పులకించిపోయింది. ఇన్ని యుగాలకి నా జన్మ ధన్యమైంది కదా అనుకొన్నది. తీయని జలాలను ఆయనకిచ్చింది. దాహం తీరిన రాముడు ప్రక్కనే ఉన్న ఒక మర్రి చెట్టుచూశాడు. ఆ చెట్టుకు ఊడలూ వేళ్ళూ నేలమీద వ్యాపించి ఉన్నాయి. ఒక లావుపాటి ఊడపై కూర్చున్నాడు రాముడు. మర్రి చెట్టు కంగారు పడి ఆ ఊడను మెత్తని పరుపులా చేయమనీ, నా తండ్రికి ఏ కష్టమూ రాకూడదనీ దేవుణ్ణి వేడుకొంది. తన మొరాలకించాడేమో దేవుడు.. రాముడు హాయిగా చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నాడు. లోకాభిరాముణ్ణి, దశరథ రాముణ్ణి, ఇనకుల తిలకుణ్ణి, చక్రధారిని, చతుర్భుజుని, లక్ష్మీకాంతుని నా ఒడిలో కూర్చోబెట్టుకున్నానే అని గర్వపడిందా మర్రి చెట్టు. మరుక్షణమే నా స్వామికి సమర్పించడానికి నా వద్ద పూలైనా లేవే! అనుకొంటూ చింతించింది. అంతలో మలయమారుతం వీచింది. మర్రిచెట్టు పక్కనే ఉన్న పారిజాతం తన పూలను శ్రీ రామచంద్ర ప్రభువు పాదాలపై జారవిడిచింది. ఇన్నాళ్లకు రాముడు గురువులతోనో, తండ్రితోనో కాక ఒక్కడే వచ్చి దర్శనమిచ్చాడని వరుణుడు పులకించి ఆయన తిలకిస్తున్న సరస్సుపై సన్నటి తుంపరను చల్లాడు. ఆకాశం అంచున సూర్యుడు అస్తమించే సమయమైంది. అస్తమించాలా వద్దా అని క్షణకాలం ఆగాడు సూర్యుడు. ఆకాశం సంజ కెంజాయరంగు పులుముకొంది. జలకాంతులు సంగమించి ఇంద్ర ధనుస్సు ఆవిష్కరించింది. ఆ అందాలను చూస్తున్న రాముని మనసు చెప్పలేని ఆనందంతో, సంతోషంతో పొంగిపోయింది.

అక్కడికి కొంత దూరాన, రెండు ప్రక్కలా చెట్లు ఎత్తుగా పెరిగి ఉన్నాయి. మనుషులు కనిపించనంత ఒత్తుగా ఎవరో కావాలని పెంచినట్టు కాలిబాటకిరువైపులా వరసగా ఉన్నాయి. అక్కడే ఒక చిన్న గుట్టలాంటి కొండ ఉంది. కోటలోని మార్గద్వారం నుండి సీతాదేవీ, చెలికత్తెలూ పచ్చని అడవిలోకి ప్రవేశించారు. అప్పటి వరకూ ఒక అడవిగా మాత్రమే ఉన్న ఆ అడవి మనోహరంగా, తాదాత్మ్యం పొందిన భక్తురాలిగా మారిపోయింది. వేల అడుగుల ఎత్తునా కొన్ని వేల అడుగుల లోతునా అందం. లక్షల జన్మలు ఎత్తినా మనిషి సృజించలేని అందం. ఆదిమధ్యాంతరహితుడు అరక్షణంలో ఆలోచనా మాత్రాన సృజించిన సౌందర్యం. పాల తెలుపు ఎందుకూ పనికిరానంత తెల్లని మంచు, నారాయణుని కంటే నల్లగా ఉన్న కొండల మీంచి ముద్దలు ముద్దలుగా ముక్కలు ముక్కలుగా జారిపోతుంటే దోసిళ్లలో పట్టుకుని తాగాలనిపించేంత అందం. ఆత్మ సౌందర్యమో, పరమాత్మ సౌందర్యమో ఇదేనేమో. ఒకేసారి ఘనమూ, సూక్ష్మమూ, ఒకేసారి స్వరమూ, నిశ్శబ్దమూ, ఒకేసారి ఎత్తూ, లోతూ, ఒకేసారి వీణా వేణు నాదాలూ, మృదంగ తరంగ ధ్వనులూ ఒకేసారి ఆకాశమూ, లోయలూ కంటికి కనిపించే, వినిపించే సౌందర్యం, మనసునిండా సౌందర్యమై పొంగిపోయి పొర్లి పోయే సౌందర్యం. మనసులో తెలియని భావం ఆనందమో దుఃఖమో తెలియని అద్వైత భావం. ఆత్మలోనుండే పరమాత్మను దర్శించినప్పటి ఆనందం. ఒళ్ళంతా పులకరించి జలదరించి ఒక్కసారి వణుకు పుట్టి చుట్టూ ఏం జరుగుతోందో కనిపించని వినిపించని తాదాత్మ్య స్థితి. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి.. అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సరఃప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంకమందు రమాకాంతునితో క్రీడించే సకలార్థ ప్రదాయిని, సాక్షాత్ శ్రీ మహావిష్ణుహృదయనివాసి, క్షీర సముద్రోద్భవి, భూమిజగా, జనకమహారాజు గారాల పట్టిగా పెరిగి నా పుణ్యవశాన నన్ను కరుణించిందని అడవి పొంగిపోతోంది. నా జలాలను ఎప్పుడు తాకుతుందో నా జన్మ ఈ నాటికి ధన్యమై మరు జన్మలేని మోక్షం లభిస్తుందని నదీమతల్లి ఉర్రూతలూగుతూ సంతోషంతో ఉరకలెత్తుతోంది.

ఒక పక్క స్వయంభువు, ఇంకొక పక్క అయోనిజ. తమ బిడ్డలను కరుణించడానికే విచ్చేసిన సుందర దృశ్యం. సదా విష్ణు హృదయ నివాసి సీతామాత రామునికి కనిపించకుండా, అనుక్షణమూ లక్ష్మీ కాంతుడైనవానికి సీతమ్మనూ కనపడనివ్వకుండా అడ్డంగా ఉన్న చెట్లన్నీ “అయ్యో! ఇక్కడనుండి కదలగలిగితే అడ్డు తొలగుతాము కదా అనుకుంటున్నప్పుడు.. సీతామాలచ్చి, ఆ జలజాత.. చెంగు చెంగున గెంతుతూ ఒకసారి నీళ్లు తల మీద పోసుకొంటూ ఒకసారి చెలులపై పోస్తూ, ఒక సారి బుడుంగున ములుగుతూ, ఒక సారి మచ్చెకంటిలా తేలుతూ జలకాలాడుతున్న వేళ ఆ జలజాత తనుస్పర్శతో పులకితమైన నది జల జలా పారడం మరచి నిశ్చలంగా తన్మయత్వంతో నిలచిపోయింది. సర్వ ప్రాణికోటీ ఆ కమనీయ దృశ్యాన్ని ఆ అతిలోక సౌందర్యపు ఆవిర్భావాన్ని తదేకంగా చూచి మోక్షము పొందిన వేళ, ఆ త్రిలోక వందిత, వేదవతీదేవి జలక్రీడలు ముగించి పట్టువస్త్రాలు ధరించి వెనుకకు మరలుతున్నప్పుడు.. విధాత ప్రోద్బలంతో ఆ శ్రీరామచంద్రమూర్తి దృష్టి అటు మరలింది. నవయౌవనవతి, సర్వ శుభలక్షణ సమన్వితా, బంగరు రంగు దేహముపై శ్వేతవర్ణపు పట్టు చేలాంచలముతో, సమున్నత పయోధరాల భారానికి కొద్దిగా వంగి నడుస్తున్న సింహమధ్యమ, అపురూప సౌందర్యవతి సీతాదేవి మబ్బులలో మెరుపు వలె చెలికత్తెల మధ్యనుండి వడి వడిగా సాగిపోతూ కన్పించినది. మదనుని శరములు రాముని తాకాయి. “హా! ఏమి ఆ సౌందర్యము! ఇట్టి భువనైక సుందరిని ఎక్కడా చూచి ఉండలేదే!” అనుకున్నాడా మోహనమూర్తి.

వడి వడిగా నడచిపోతున్న సీతకు ఎందుకో ఒళ్ళు ఝల్లుమన్నది. కారణమేమో అని ఓరకంట చూచిన జానకికి తనవైపే చూస్తున్న భువనమోహన సుందరుడు, పురుషులనే మోహ పరవశులను చేసే నీలమేఘశ్యాముడు, ముల్లోకాలనూ పులకింపచేసే జగన్మోహనస్వామి కనిపించాడు. లోక కళ్యాణమే పరమార్థమైన ఆ ఇరువురి చూపులూ కలిసిన శుభ ముహూర్తాన ప్రకృతి పులకించి సహర్షమై సన్నని జల్లులతో జయ జయ ధ్వానాలు చేసింది.

***

సభా ప్రాంగణమంతా జనంతో కిట కిటలాడుతోంది. ‘సీతాదేవి స్వయంవరమంట’ అంటూ ఆ జనమంతా చిన్నస్వరాలతో మాట్లాడుకున్నా కోలాహలంగానే ఉంది. రాజు గారికి ఎదురుగా ఎడమ కుడి వైపుల రెండు వరసలలో వివిధ దేశాల నుండి వచ్చిన వీరులు కూర్చున్నారు. ఎడమవైపు గవాక్షంలో పట్టమహిషి రత్నమాలాదేవీ, కుడివైపు గవాక్షంలో చెలులతో కూడిన సీతాదేవీ కూర్చున్నారు.

వంది మాగధుల కైవారాల నడుమ జనకమహారాజు సభాస్థలిని ప్రవేశించాడు. సభాసదులంతా గౌరవపురస్సరంగా లేచి నించున్నవారందరి అభివాదాన్నీ స్వీకరించిన మహారాజు కూర్చోమని సైగ చేసి సింహాసనం మీద ఆశీనుడయ్యాడు. సభ లోని కోలాహలం సద్దుమణిగాక ఇలా అన్నాడు.

“సభాసదులారా! దేశ దేశాలనుండి అసమాన వీరాధివీరులు విచ్చేశారు. వారందరికీ స్వాగతం. మా ముద్దుల పుత్రిక సీత వినయాధిక సకల సద్గుణ సంపన్నురాలు. సౌందర్యమునందు శ్రీమహాలక్ష్మికీ, శ్రీ గౌరీమాతకూ సాటి రాగలదు. అట్టి మా ఏకైక పుత్రికను చేపట్టు వీరుడు, అదిగో ఆ ప్రాంగణములో కనపడుతున్న శివ వరప్రసాదిత ధనుస్సును ఎక్కుపెట్టగలవాడై ఉండాలి. ఆ విల్లునెట్టి ఎక్కు పెట్టి ఈ భూజానిని కైపట్టవలసినదిగా వీరులందరినీ ఆహ్వానిస్తున్నాను.” అంటూ ఆసనం మీద కూర్చున్నాడు. సభ అంతా నిశ్శబ్దమైంది. ఏ స్వయంవరమంటే స్వయంవరమే కదా ఇటువంటి వీరత్వపరీక్షలుంటాయని కొంతమంది ఊహించక వెనుకాడారు. ఊహించినవాళ్ళు సిద్ధమయ్యారు. మరికొంతమంది ఇంతటి శివ వరప్రసాదితమైన ధనువునెత్తడానికి మేమెంతటివారమని వెనుకకు తిరిగిపోయారు. ఒకరొకరుగా వీరులు వస్తున్నారు. ధనుస్సు మీద చెయ్యి వేసి ఇసుమంతైనా కదల్చలేక తలవంచుకొని నిష్క్రమిస్తున్నారు. గురువు గారు శ్రీ రామచంద్రుని చూసి సాభిప్రాయంగా తల పంకించారు. గురువుగారికి నమస్కరించి శ్రీరాముడు ముందుకు కదిలాడు. సీతమ్మ ఓరకంట చూసింది. శ్రీరాముని శక్తి సామర్థ్యాల మీద ఆమెకు కొంచెం కూడా అపనమ్మకం లేదు. వరమాలతో లేచి నిలబడింది. సభాసదులంతా ఆశ్చర్యంగా చూడసాగారు. దశరథ తనయుడు అలవోకగా విల్లెత్తి ఎడమ చేతిలో పట్టుకున్నాడు. కుడిచేతితో నారిని పట్టి లాగి ధనుస్సుకింది భాగంలో కడదామని వంగినాడు.

ఉరుములు ఉరిమినట్టూ, మెరుపులు మెరిసినట్టూ, పిడుగులు పడినట్టూ, ప్రళయకాల ఝంఝామారుతం వీచినట్టూ తోచి సకలజనులూ బిత్తరపోయారు. సభాస్థలి కంపించగా, ఆకాశమందుండి పుష్పవృష్టి కురవగా ఆనందంతో చెమర్చిన కన్నులు తుడుచుకుని చూసిన జనకుని కనులకు ముగ్ధమోహనాకారుడు, నవమన్మధుడు, బహిరంతరింద్రియాలకు ఏక రూపంగా తోచే సౌందర్యపు ప్రతీక, శ్రీరామచంద్రప్రభువు.. చేతిలో విరిగిన శివధనుస్సుతో సీతమ్మ వంక అనురాగదృక్కులతో చూస్తున్న దృశ్యం కనిపించింది. వైదేహి అడుగులో అడుగు వేసుకుంటూ, వెన్నుని చెంతకు చేరి ఒకింత సిగ్గుతో నిలబడింది. చిరునవ్వుతో శ్రీరాముడు తల పంకించగా సీతా మహాసాధ్వి ఆయన గళ సీమలో పుష్పమాల వేసింది. జనకుడు ఆమె చేతినందుకుని రాముని చేతిలో ఉంచాడు. ప్రకృతి పులకించగా దేవదుందుభులు మ్రోగగా, మరొక్కసారి పుష్పవృష్టి కురిసింది. “శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి!” గురువు విశ్వామిత్రుడు ఆశీర్వదించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here