ఒక రోజు కథ

0
2

[శ్రీ బివిడి ప్రసాదరావు రాసిన ‘ఒక రోజు కథ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“మీ అబ్బాయి వెరీ గుడ్, నైస్” తమకంగా చెప్పింది మిసమిస.

అంతలోనే.. తన మోనిటర్ మీది.. అబ్బాయి సురాగ్.. ఫేడవుట్ కావడంతో.. మిసమిస దిగులయ్యింది.

అప్పటికి సురాగ్ తండ్రి దండాకోర్.. మిసమిస ముందున్న మోనిటర్ మీదికి తిరిగి వచ్చాడు.

మిసమిస మదిలో సురాగ్ రూపం తచ్చాడుతూనే ఉంది.

అతడి లైట్ రోజ్ కలర్ లిప్స్ తడి.. మిసమిసను తడవ తడవగా గిలిగింతలు పెడుతూనే ఉంది.

“హలో.. వాట్ నెక్స్ట్.” అడుగుతున్నాడు దండాకోర్.

“ఆఫ్ మినిట్.” కుర్చీలోంచి లేచింది మిసమిస.

వెళ్లి.. ఐస్ స్టోరేజ్ బేగ్ నుండి ఒక గ్లాస్ కంటైనర్ తీసుకుంది. దాని లోంచి ఒక క్యాప్సుల్ తీసుకొని.. ఆ కంటైనర్‌ని తిరిగి బేగ్‌లో పెట్టేసింది. తన తీసుకున్న క్యాప్సుల్‌ని తన నాలుక మీద పెట్టుకుంది. అది మెల్లిగా కరుగుతోంది. ఆ క్యాప్సుల్.. టు ఫిఫ్టీ యంయల్ వాటర్‌కు సమానం.

కదిలి.. వాల్ ఓవెన్‌లో స్టోర్ చేసుకున్న.. రేపర్ చుట్టిన ఓ ఐటమ్‌ని తీసుకుంది.

తిరిగి వచ్చి.. కుర్చీలో కూర్చొని..

రేపర్ లోని ఐటమ్‌ని తీసుకొని.. దానిని బుగ్గన పెట్టుకుంది. అప్పటికే నాలుక మీది క్యాప్సుల్ పూర్తిగా కరిగి పోయింది.

మిసమిస బుగ్గన పెట్టుకున్నది.. ఒక ఆర్టిఫిసియల్ మస్కిల్ యాక్యుయేటర్. దానిని సన్నటి వెచ్చదనంతో పాటు ఆస్వాదిస్తోంది.

ఆ ఆర్టిఫిసియల్ మస్కిల్ యాక్యుయేటర్.. ఒన్ ట్వటీ ఫైవ్ గ్రామ్స్ మీట్‌కు సమానం.

ఇవన్నీ గుర్తించిన దండాకోర్‌కి ఒళ్లు మండింది.

“తాగడం.. తినడం ఐందా” అడిగాడు జోరుగా.

అదేమీ పట్టించుకోనట్టు..

“ఇక.. మీ అబ్బాయి ఎర్నింగ్స్ చెప్పండి.” ట్రాన్స్‌లో ఉన్నట్టుగా.. అడగ్గలిగింది మిసమిస.

“మావాడు క్లౌడ్ ఏరియా లూప్ సెక్షన్ కనెక్టివ్ ఒరిజినేటర్ ఎట్ ఆపిల్ స్పేష్ ప్లస్ టు లేయర్..” బిక్కుబిక్కుగా చెప్పుతున్నాడు దండాకోర్.

“ఆగండాగండి.” అంటూనే.. దండాకోర్‌ను తన మోనిటర్ మీద లెఫ్ట్ కార్నర్‌కు తోసేసి..

టచ్ పాడ్‌న స్లగ్గిష్ పెన్నుతో ఏవేవో గీసేస్తోంది మిసమిస.

ఈ గేప్‌లో..

ఎర్త్ మీది హిల్స్ నడుమ నుండి పీక్కుపోయి.. స్పేస్ సర్ఫేస్ ఈస్ట్ మూలన లైక్ ఇతిహాసాల త్రిశంకు లెక్కన.. తమ వాళ్లు పడేసిన తమ దైవంకి.. దండాకోర్ గభేలున మనసున..

‘ఓ రిచ్చెస్ట్ గాడూ.. ఈ సంబంధం కుదిరేలా చూడవయ్యా. అలా ఐతే.. ముచ్చటగా ముగ్గురు నీ డివోటీస్‌ని నా ఖర్చులతో ఈడ నుండి ఆడకు తీసుకు వస్తాను. నీ ఆదాయాన్ని పెంచుతాను.’ గడగడా మొక్కేసుకున్నాడు.

మిసమిస తన ముందున్న మోనిటర్ మీద్ది చదివేసి.. బుగ్గన పెట్టుకున్న ఆర్టిఫిసియల్ మస్కిల్ యాక్యుయేటర్ కరిగి పోగా.. మిగిలిన దాని కొద్దిపాటి పార్టికల్స్‌ను సర్రున గుటకేసేసి..

“ఓ. మీ అబ్బాయిది.. ఒన్ క్రోర్ పియం శాలరీయా. ప్చ్.” తేలిగ్గా అనేసింది మిసమిస.

దండాకోర్ గందికగా..

“శాలరీ కాదు. మా అబ్బాయిని చూసుకోండి. మా బిడ్డని కాదు కానీ.. మా వాడు మిస్టర్ వెస్ట్ స్కై గా ఎంపికయిన వాడు. మంచి హేండ్సమ్. చూసారుగా.” గొప్పగా చెప్పాడు.

“అవునవును. మీ అబ్బాయినే చూసి.. మీతో ఇలా మీటింగ్‌కి వచ్చా. బట్ ఎర్నింగ్ కూడా బాగుండాలిగా.” చెప్పింది మిసమిస.

“అదే. ఆ ఎర్నింగే సరిగ్గా ఉంటే.. మా వాడి డిమాండ్ వేరే లెవెల్‌గా ఉండేది. ఒన్స్ అపానే టైంలో పాపులరై చెలరేగిన ‘తగ్గేదేలే’ డైలాగ్‌ని నేను ఇప్పుడు మరీ గట్టిగా యూజ్ చేసుకునే వాడ్ని.” చెప్పగలిగాడు దండాకోర్.

ఆ వెంబడే..

“ఎనీవే, నేటికి, అంటే.. మా వాడు పెళ్లి చూపుల నిమిత్తం మీ మోనిటర్ మీదికి తెచ్చినంత వరకు, మా వాడి క్రింద ఆచి తూచి లెక్కనైనా రవుండ్‌గా తొభై కోట్ల అరవై ఏడు లక్షల వరకు నాకు ఖర్చు అయ్యింది..” చెప్పి ఆగాడు.

“సరే సరే. మీ డిమాండ్ ఏమిటి. మీ అబ్బాయిని ఎంతకు సేల్ చేయబోతున్నారు.” అడిగేసింది మిసమిస.

“అబ్బే, తొందరెందుకు. విషయంకు వద్దాం. మీకు తెలియందా. సెకెండ్ సెకెండ్‌కు ధరలు పెరుగుతున్నాయే తప్ప, దేని ధరైనా రవ్వంత.. అఁ.. రవ్వంత తగ్గిన దాఖలాలు ఎక్కడైనా నమోదవుతున్నాయా.” చెప్పుకు పోతున్నాడు దండాకోర్.

మిసమిస విసవిసలాడిపోతోంది.

“పైగా పెళ్లీడుకు వచ్చిన అబ్బాయిల శాతం ఇప్పుడు ఎంత. అందుకు కేలిక్యులేటర్ అవసరం పడుతోందా. ఆఁ. ఫింగర్స్.. ఫింగర్స్ మీద లెక్కించేయవచ్చు.” రెచ్చిపోతున్నాడు దండాకోర్.

ఆ వెంబడే..

“ఆ రోజుల్లో.. ఆడబిడ్డల్ని వదిలించుకొని మగబిడ్డల్నే కనేవారట. మరి ఈ రోజుల్లో.. అందుకు పూర్తి రివర్స్.. మగబిడ్డల్ని వదిలించుకొని ఆడబిడ్డల్నే కంటున్నారాయే. ఆడపిల్ల పెళ్లి ఇప్పుడు గగనం.” చెప్పుకుపోతున్నాడు.

టక్కున అడ్డై..

“ముందు మీ అబ్బాయి రేటు తగలెట్టండి.” జోరుగా అడిగేసింది మిసమిస.

“అబ్బే, తొందరెందుకు. నేను నేటికి అనుగుణంగా నడుచుకోగల మనిషిని..” దండాకోర్ తన నసని కొనసాగిస్తున్నాడు.

అడ్డై..

“మీ అబ్బాయిని పక్కకి తోసేసి.. మీరు మాట్లాడడం ఈ రోజుల్లో నాకు వింతగా ఉంది మరి.” నెమ్మదిగానైనా అనేసింది మిసమిస.

ఆ వెంబడే..

“నాకు వర్క్ అపాయింట్మెంట్ ఒకటి ఉంది. తేల్చేయండి.” చెప్పింది.

“అబ్బే, తొందరెందుకు. అబ్బాయిని చూపించాలి కనుకనే మా వాడిని మోనిటర్ మీదకి తెచ్చాను. అంతే. చెప్పొచ్చేదేమిటంటే.. ఈ పెళ్లి చూపుల తతంగంకై మా ఆడవాళ్లు వస్తామన్నారు..”

అడ్డై..

“వాళ్లనీ మోనిటర్ మీద ఎగ్జిబిట్ చేయవలసింది.” వెటకారంగా అంది మిసమిస.

“అబ్బే, తొందరెందుకు. పెళ్లి చూపుల ఖర్చులను తగ్గించే ఆలోచన కూడా నాలో ఉంది. లేదంటే.. మా వాడి క్రింద మాకు అయిన ఖర్చులో ఈ పెళ్లి చూపుల ఖర్చు కూడా జమ అవుతోందిగా. అది పూడ్చే మీ లాంటి వారికి ఇబ్బందేగా. మరి ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలిగా.. నాకు ఆడపిల్ల వైపు ఖర్చుని పెంచే ఇష్టం అస్సలు లేదు. నమ్మాలి.” వెకిలిగా నవ్వేడు దండాకోర్.

మిసమిసకి ఒళ్లు మండుతోంది.

“మీ మాట కాదనలేం. లెక్కలు ఆపి.. అసలు చెప్పండి.” అంది.

“అబ్బే, తొందరెందుకు.. వరస పెట్టి అడుగుతున్నారు కనుక.. మా వాడిని మీరు పెళ్లి చేసుకోవాలంటే.. మీరు ఒన్ కోర్ పెర్ మంత్ మా వాడి అకౌంట్ లోను.. ఫిఫ్టీ లాక్స్ పెర్ మంత్ మా అకౌంట్‌లో వేస్తుండాలి. అదీ ట్వంటీ వన్ ఇయర్స్ వరకు.” ఆగాడు దండాకోర్.

“మీరు చెప్పే అంకెలు మింగుడు పడడం లేదు. లమ్సమ్‌గా ఎంతో చెప్పేయండి. కొత్త కొత్తగా మీరేమీ తేవద్దు.” చెప్పేసింది మిసమిస.

“అబ్బే, తొందరెందుకు. సడలింపులు, సర్దుకోవడాలూ అప్రస్తుతం. ఇంకా నేను కోరవలసినవి ఉన్నాయి.” నవ్వేడు దండాకోర్.

“ఇంకేంటి.” మిసమిస వింతవుతోంది.

“సెటిలైట్ ప్లస్ ప్రో కారు ఒకటి ఇవ్వాలి.” చెప్పాడు దండాకోర్.

మిసమిస తల్లడిల్లుతోంది.

“ఇయర్లీ ఒన్స్.. మా అందరికీ.. మీ ఖర్చులతో.. మూన్ ట్రిప్ ఉండాలి. సెవెన్ డేస్ చొప్పున.. వరసగా ఫైవ్ ఇయర్స్.” చెప్పుతున్నాడు దండోకోర్.

మిసమిస మిడిగుడ్లుతో వింటోంది.

“బంగాళాఖాతంలో ఈస్ట్ ఫేస్ న సెవెన్ స్టార్ విల్లా ఒకటి ఇవ్వాలి.” దండాకోర్ చెప్పుతున్నాడు.

“హేహే. వాట్ ఈజ్ దిస్. ఏమిటిదంతా. ఇంత డిమాండ్ నేను ఎరగను.” మిసమిస విసుక్కుంటుంది.

“కూల్ కూల్. నేనేం కొత్తగా అడగడం లేదు. ఆ మధ్య లావ్బిన్ కొడుకు పెళ్లి గురించి ఎరగవా. టిబ్టోమ్ మనుమడు పెళ్లి తెలియదా. ఇంకా..” చెప్పుతున్న దండాకోర్ కి అడ్డై..

“ఆపండి. వాళ్లెంతటి పరపతి ఉన్నోళ్లో మీకు తెలియదా.” రోషంగా అంది మిసమిస.

“చాల్లేమ్మా. నా కొడుక్కేం తక్కువ. నువ్వు ఎంత హెచ్చించినా.. మా వాడి లాంటి పర్సనాలిటీ ఉన్న వాడిని నేటి రోజుల్లో భర్తగా పొందు చూద్దాం. మా వాడి అందంకి దరిన ఏ కుర్రోడైనా నిలవ గలడా. నా కొడుకంతటి మగాడు నీ భర్త కావడం నీ అదృష్టం అనుకోవాలి.” విర్రవీగిపోతున్నాడు దండాకోర్.

మిసమిస తల విదిలించుకుంది.

గట్టిగా ఊపిరి పీల్చుకుంది.

అటు దండాకోర్ ముందున్న మోనిటర్ మీద.. ఇటు నుండి తన టచ్ పాడ్ నుండి కొన్ని కమాండ్స్ ఇచ్చి.. ఒక మెరుపును క్రియేట్ చేసింది.

అంతే.. దండాకోర్ కళ్ళను ఆ మెరుపు జిగేల్ పర్చింది.

అతడు కంగారు పడ్డాడు. చప్పున కళ్లు మూసేసుకున్నాడు.

ఈ అంతటినీ తన మోనిటర్ నుండి చూస్తున్న మిసమిస కొద్ది పాటి మౌనం వహించింది.

దండాకోర్ ఇంకా కళ్లు మూసుకునే ఉన్నాడు. కను చివర్ల నుండి జర్రున నీళ్లు వస్తున్నాయి.

“దండాకోర్ సార్.. ఏమైంది.” అడుగుతోంది మిసమిస.. ఏమీ ఎరగనట్టు.

మెల్లిగా కళ్లు విప్పి..

“అంతా చీకటిగా ఉంది. కళ్లు మండుతున్నాయి” చెప్పాడు దండాకోర్.

ఈ చిందర వందర తతంగానికి పుల్ స్టాప్ పెట్టాలని తలించింది మిసమిస.

“అయ్యా దండాకోర్ గారూ.. కాలం మారుతున్న.. ఆధునికం అంట కడుతున్న.. బంధంకి.. సంబంధంకి నీతివంతమైన సంస్కారాలు ఎక్కడైనా.. ఎప్పుడైనా అవసరం.” చెప్పుతోంది.

ఆ వెంబడే..

“వినండి దండాకోర్ గారూ.. అందం చూపుకే తప్ప.. అందం మనుగడకు పిసరంత ఉపయోగ పడలేదు. మరి ఎందుకండీ.. మీ అబ్బాయి అందంకి అంత విలువ ఇస్తున్నారు. పోయి.. డాక్టర్‌కు చూపించుకోండి. వేళ మించితే అసలు చూపే తుష్ మనొచ్చు.” చెప్పింది. కిసుక్కున నవ్వింది.

పవర్ సర్కూట్‌ని ఆఫ్ చేసేసింది.

దాంతో.. దండాకోర్ వైపు మోనిటర్ డిస్‌ప్లే ఫట్ మంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here