Site icon Sanchika

ఒక ‘ఉదయ’పు ప్రభవంలో…!!!

[dropcap]అ[/dropcap]మ్మ పొత్తిళ్ళల్లో ఉన్న ప్రతి బిడ్డ
సహజకవచకుండల రక్షకుడే.
తల్లికాబోతున్నానన్న ఆనందపు క్షణంలో
కొరికే పుల్లని మామిడులన్నీ పెద్ద రసాలే.
రేపటి ప్రపంచపు భావితరానికి
ఆమె గర్భమొక గోవర్ధనగిరి.
కట్టుకున్నవాడి ఆకలి కడుపునిండా తీర్చి
కనబోయే వంశాంకురపు బాల్యచేష్టలు
నిజం చేసుకోబోయే ఊహల చిత్రాలను
మనసు కేన్వాస్సుపై చిత్రించుకునే కుంచె ఆమె.
రక్తమాంసాలకు తోడుగా తన నవనాడుల్నీ
ప్రేమసంకెళ్లుగా మలచి మమతానురాగాల
దారాల గర్భసంచిలో పదిలంగా పదినెలల పాటు
మోసుకునే నిండుమనసు ఆమెది.
ఉమ్మనీటి ఈదులాటల సంబరాలలో
తన్నుతున్న తన్నులన్నీ పెరుగన్నంలో
ఆవకాయబద్ద నంజి లొట్టలేసినంత రుచి.
చుట్టూ పెనవేసుకున్న ఊడలచేతుల ఊతంతో
పెనిమిటి వటవృక్షం వొళ్ళంతా చెవులు చేసుకుని
వింటున్న గర్భాంతరపు కదలికలకు పితృత్వపు పులకింత.
నిండిపోయిన నెలలన్నీ పండుతున్న కలలకు
వాస్తవరూపమై తనకు తానై స్వేచ్చా ప్రపంచంలోకి
అమ్మ ప్రేమసంద్రపు కెరటమై ప్రభవించినపుడు
కేరింతలు నురుగుల పూలను ఏరుకునే చేతులెన్నో…
భావితరానికి ప్రతినిధియై రాణించాలన్న
ముత్యాల సరాల ఆశీసులెన్నెన్నో…!!!

Exit mobile version