Site icon Sanchika

ఒక విష వృక్షం!

[విలియం బ్లేక్ రచించిన ‘పాయిజన్ ట్రీ’ కవితని అనే అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of William Blake’s poem ‘Poison Tree!’ by Mrs. Geetanjali.]

~

[dropcap]నే[/dropcap]ను నా మిత్రుడి మీద కోపంగా ఉన్నప్పుడు..
ఆ సంగతి అతనికి చెప్పేసాను.
నా కోపం పోయింది!
శత్రువు పై కోపంగా ఉన్నప్పుడు మాత్రం అతనికి చెప్పనేలేదు.
అది ఎంత పెద్ద తప్పో అర్థం అయ్యింది.
అది తీవ్రమైన ఆగ్రహంగా మారిపోయింది!
భయంతో రాత్రింబగళ్లు నా కన్నీళ్ళని
పోసి ఆ కోపాన్ని పెంచాను.
అతనిపై కోపాన్ని దాచిన నేను
అతన్ని చూసినప్పుడల్లా
అబద్ధపు చిరునవ్వులతో పాటు ఎండ కూడా కాచాను.
మెత్తటి.. నమ్మక ద్రోహపు కుట్రలతో సహా
నాటకాలెన్నో ఆడాను!
నా కోపానెన్నడూ అతని ముందు వ్యక్త పరచలేదు!
ఇంకేం చెప్పను? అణుచుకున్న నా కోపం
పగలు రెండై.. రాత్రి ఆరై ప్రవర్ధమానం చెందుతూ వచ్చింది.
అది ఎంతవరకూ పెరుగుతూ పోయిందంటే
ఆ వృక్షం నుంచి ఒక ధగ ధగా మెరిసిపోయే ఆపిల్ పండు మొలకెత్తింది.
నా శత్రువు కాంతులీనే ఆ పండును చూడనే చూసాడు.
ఇంకేం.. అతనికి తెలుసు ఆ పండు నాదే అని..
నేనే పెంచి పోషించానని!
ఒక రాత్రి తోటలో నిలువెత్తు స్తంభం పైన
చీకటి ముసుగేసిన వెంటనే..
నిశ్శబ్దంగా నా తోటలో దొంగతనం జరిగిపోయింది.
నా చెట్టు ఆపిల్ పండు శత్రువు తినేశాడు.
పొద్దున్నే లేచిన నేను ఆనందంతో పొంగిపోయాను..
చూస్తే.. అక్కడేముందో చూసి భయంతో నివ్వెరపోయాను.
నేనేం చూసానో చెబుతాను వినండి
తోటలో..
నా చెట్టు వేళ్ల కింద నా శత్రువు
నలు దిక్కులా వ్యాపించి ఉన్నాడు!
శత్రువుపై కోపాన్ని
నేను అణుచుకోకుండా ఉండాల్సిందా..?

~

మూలం: విలియం బ్లేక్

అనుసృజన: గీతాంజలి


విలియం బ్లేక్ ప్రసిద్ధ ఆంగ్ల కవి, చిత్రకారుడు. ఇల్యూమినేటెడ్ ప్రింటింగ్ అనే నూతన సాంకేతికతను రూపొందించారు. సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్, సాంగ్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌, ది మారేజ్ ఆఫ్ హెవెన్ అండ్ హెల్, దేర్ ఈజ్ నో నాచురల్ రెలిజియన్ వీరి ప్రఖ్యాత రచనలు.

Exit mobile version