ఒకరికి ఒకరై..

0
2

[dropcap]కృ[/dropcap]ష్ణమూర్తి గారు ఆర్థిక రంగంలో వివిధ హోదాల్లో పనిచేసి తన యాభై ఎనిమిదో ఏట రిటైర్మెంట్ అయ్యారు. నల్గొండలో మంచి పేరున్న చార్టెడ్ అకౌంటెంట్‌గా అందరిలో గుర్తింపు పొందారు. వారి వద్దకి వస్తే ఎలాంటి ఆర్థిక సమస్య అయినా ఇట్టే తీరుస్తారని అందరూ భావిస్తారు. దేశం లోని ఎన్నో పట్టణాలకు వెళ్లి సెమినార్స్‌లో కూడా ఆకట్టుకునేలా ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. అలాంటి సమయాల్లో కుటుంబానికి దూరం కాకుండా భార్య, పిల్లల్ని సైతం తనతో పాటు ఆ ప్రాంతాలకు తీసుకు వెళ్ళేవారు.

అమ్మాయి స్రవంతి ఇంజనీరింగ్ మంచి మార్కులతో పాస్ అయింది. పెళ్ళయి నాలుగేళ్ళయింది. శ్రవణ్‌కి జన్మనిచ్చి కృష్ణమూర్తి, సౌజన్యలను తాతయ్య, అమ్మమ్మలను చేసింది. ఒక సంవత్సరం క్రితం ఓ ఇంటివాడైన ఆకాశ్ తండ్రి బాటలోనే సి.ఎ చేశాడు. అనుకూలవతి అయిన భార్య పల్లవితో ఇటీవలే గృహప్రవేశం చేశాడు.

అంతా సజావుగా జరుగుతుందనుకుంటున్న సమయంలో సడన్‌గా.. కృష్ణమూర్తి గారికి పాక్షికంగా పక్షవాతం రావడంతో ఎడమ చేయి.. కాలు చేయి సరిగ్గా పని చేయక కుటుంబ సభ్యులని ఎంతో బాధకు గురి చేసింది.

నేడు రిటైర్మెంట్ అవడంతో.. ఆఫీస్‌లో ఘనమైన వీడ్కోలు అందుకుని ఎంతో ఆత్మీయంగా వుండే నేస్తాలందరినీ పదే పదే పలకరించి. భారమైన హృదయంతో ఇంటికి చేరుకున్నాడు.

తన వెంటే నడుస్తున్న అర్ధాంగికి తన స్నేహితులకు పరిచయం చేశాడు.. వీడ్కోలు సభలో!

పని బిజీలో వుండి.. వీడ్కోలు సభకు హాజరు కాలేక ఏడు గంటలప్పుడు ఇంటికి వచ్చిన కొడుకుని ఆప్యాయంగా పలకరించారు.

అతడు కొత్తగా ఇల్లు (అపార్ట్మెంట్) కొనుక్కొని గృహప్రవేశం చేయడంతో రావడం ఆలస్యమై ఉంటుందని.. మనస్సులకి సర్ది చెప్పుకున్నారు ఆ దంపతులు !

ఆర్థిక రంగంలో ఎంతో పేరుప్రఖ్యాతులు సాధించినా.. ఎటువంటి ఆర్థిక అవకతవకలకు పాటుపడక కృష్ణమూర్తి పెద్దగా సంపాదించుకోలేక పోయారు.

రిటైర్మెంట్ అప్పుడు వచ్చిన డబ్బులు జాగ్రత్త చేయాలంటూ భార్య చెప్పిన మాటలకు సరే అన్నట్లుగా తలూపారు.. ఇంతకాలం తనతో కలిసి నడిచిన భార్య మాట తప్పక వినాలనుకున్నారు. ఇంతకంటే తను భార్యకి ఇంకేమీ చేయలేననుకున్న నిర్ణయానికి రావడం కూడా ఒక కారణం!

“సౌజన్యా! మన పిల్లలిద్దరు ఇక్కడే స్థిరపడ్డారు కదా! రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బులతో ఇక్కడే ఒక ఇల్లు కొనుక్కుని స్థిరపడదాం. లేదంటే డబ్బులు బ్యాంక్‌లో వడ్డీకి డిపాజిట్ చేసి అబ్బాయి దగ్గర వుందాం.. ఏం అంటావు?”

భార్య వైపు చూసారు తన స్పందన ఎలా ఉందో తెలుసుకుందామని!

చిరునవ్వు నవ్వింది సౌజన్య.

సమాధానం చెప్పకుండా నవ్వుతున్న భార్య వైపు చూస్తూ ఆలోచనలో పడ్డారు కృష్ణమూర్తి. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు.. మనవడు.. భోజనాలయ్యాక రాత్రికి ఇళ్లకు వెళ్లిపోయారు. మళ్ళీ ఇద్దరే మిగిలారు. అప్పుడు సమయం రాత్రి పదవుతోంది.

“అలా డాబా పై వెళదామా!?” అడిగారు కృష్ణమూర్తి.. భార్యను ఉద్దేశించి.

“డాబా పైకి ఎక్కగలరా?” సందేహంగా అడుగుతున్న సౌజన్య వైపు సంతోషంగా చూస్తూ.. “నువ్వు తోడుగా ఉంటే.. రెండు అంతస్తుల డాబా ఏంటి.. ఎవరెస్ట్ శిఖరాన్నైనా ఎక్కగలను” అన్నారు ఆత్మవిశ్వాసంతో!

ఎన్నడూ లేనిది భర్త అలా అడుగుతుంటే.. కాదనలేక భర్త చేతిని తన చేతుల్లోకి తీసుకుని.. ఆసరాగా నడపడానికి సిద్ధపడింది. ఇద్దరూ డాబా పైకి చేరుకున్నారు.

పౌర్ణమి కావడంతో.. అక్కడంతా వెన్నెల వెండి వర్ణంలో మెరుస్తుంటే.. వారి హృదయాలు ఆనందపరవశాలయ్యాయి.

తమ పెళ్ళైన రోజుల్లో పడిన కష్టాలు.. ఉమ్మడి కుటుంబాన్ని అంతా ఆర్థికంగా కృష్ణమూర్తి గారే పోషించడం.. పిల్లలు పుట్టడం.. వాళ్ళు పెరిగి పెద్దవుతున్నా తప్పని ఇంటి పోషణ పెద్ద కుటుంబాన్ని సైతం అలవోకగా.. ఇష్టంగా పెళ్ళిళ్ళు, పేరంటాలు చేయడం.. అన్నీ గుర్తొస్తున్నాయి ఇద్దరికీ. అదే వాళ్ళు ఇప్పటికీ ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరకపోవడానికి కారణం!

ఇప్పుడైనా రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బులతో మంచి ఇల్లు ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళ ఆరాటం. కుమారుడి దగ్గర అపార్ట్మెంట్‌లో ఉండడం వాళ్లకి ఇష్టం లేదు. అద్దె ఇల్లైనా ఇండిపెండెంట్ ఇల్లు.. పైగా దగ్గరలో ఉన్న పార్క్.. వాళ్ళు ఈ ఏరియాని విడిచి ఉండకుండా చేశాయి!

కాలం మనం అనుకున్నట్లుగా ఎందుకు జరుగుతుంది!? అది అక్కడక్కడ పెను సవాళ్లని విసురుతుంది! తనను గుర్తించి మసలుకోమంటూ పాఠాలెన్నో నేర్పిస్తుంది. కాలం నేర్పే పాఠాలు ఏ విశ్వవిద్యాలయాల్లో నేర్పరు. ఆ సవాళ్లను ఎదుర్కొన్న మనస్సులకే తెలుస్తుంది.. అది చేసే గాయాలేంటో.. నేర్పే పాఠాలేంటో!

పెళ్ళయ్యాక కొడుకు, కోడలు తమతో వుంటారనుకున్నారు వాళ్ళిద్దరు. ఆధునిక భావాలు కలిగిన వాళ్ళకి వెనుకటి తరం అయిన వీళ్ళ ఇష్టాలు, కోరికలు, ఆశలు.. అంతగా నచ్చలేదేమో!.. వేరు కాపురం అంటున్న కొడుకు కోడల్ని ఆపే ప్రయత్నం చేయలేదు.

వాళ్ళ కోరికని తథాస్తు అని దీవించారు. అప్పుడప్పుడు చుట్టం చూపుగా వస్తారనుకున్న వాళ్ళకి నిరాశే ఎదురైంది. ఎవరి బిజీల్లో వాళ్ళు!

బంధాలు బంధుత్వాలు.. అన్నీ ఆర్థిక సంబంధాలవుతున్న నేటి రోజుల్లో ఆ చాయల్లో తమ పిల్లలు వుండరనుకున్న వాళ్ళ నిర్ణయం తప్పని తేలింది.

తనలా ఆలోచనల్లో ఉండగానే.. తన భుజంపై తలానించి పడుకున్న శ్రీమతి వైపు చూసారు కృష్ణమూర్తి.

అమాయకమైన తన మోము.. ఎర్రని వర్ణంతో మెరుస్తున్న సిందూరం. పెళ్లయిన కొత్తలో ఎలాంటి అమాయకత్వంతో అడుగిడిందో.. అంతా నా వాళ్ళే అనుకుంటూ తనతో కలిసి.. తన వాళ్ళనే కాకుండా ఎందరినో ఆదరించిది. ఇంటికి ఏ వేళప్పుడు ఎవరొచ్చినా విసుగు విరామం లేకుండా వంటా వార్పు చేసి వడ్డించే మహాలక్ష్మి తను.

ఆయన నయనాల్లో సన్నని కన్నీటి పొర. పగలు జరిగిన తన వీడ్కోలు సభని ఆసాంతం తిలకించింది. తన గురించి.. తన వ్యక్తిత్వం.. స్నేహితులు మెచ్చుకుంటుంటే.. అదంతా విని ఎంతో మురిసిపోయింది. ప్రాణంలో ప్రాణంగా జీవించింది.. జీవిస్తుంది.

చేయి నొప్పిగా అనిపిస్తున్నా భరిస్తూ కూర్చున్నారే కానీ తనని తట్టి లేపే ప్రయత్నం చేయలేదు. సన్నగా వీస్తున్న గాలులు ఆహ్లాదాన్ని పంచుతుంటే ఆస్వాదిస్తున్నారు. పెరట్లో ఉన్న మల్లెల నుండి వీస్తున్న పరిమళాలని ఇష్టపడుతూ.. తెల్లగా మెరుస్తూ వెన్నెల్లో ముచ్చట్లు గొలుపుతున్న వాటి వైపు చూస్తున్నారు.

గుండెల్లో సన్నగా నొప్పి ప్రారంభమవుతుంది. “సౌజన్య..” పేరు మనస్సులో ధ్వనిస్తుందే కానీ పెదవి దాటి రావడం లేదు. నొప్పి పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. కాస్త కదిలే ప్రయత్నం చేస్తున్నాడు.

ఆ చిన్ని కదలికకే ఉలిక్కిపడి లేచింది.

“ఏంటి!? నేనలా నిద్రపోతుంటే లేపవచ్చుకదా!? భుజానికేమైనా నొప్పికలిగిందా?” ఆమె నయనాల నిండా కన్నీళ్ళు నిలిచాయి.

“కష్టమైన ఇష్టం.. నీకు నేను ఇవ్వగలిగే ఈ చిన్ని సాయం” అంటూ భుజాన్ని చూపాడు.. దగ్గరకి రమ్మంటూ లేవబోతున్న తనని ఆపుతూ.

తల ఆనించి ఆనించ నట్లుగా భుజంపై ఉంచి కొద్ది సమయం సేదతీరింది. ఆ మాత్రం ఆత్మీయ స్పర్శకే ఆమె మది పులకరించింది. భర్త నుదుటి పై సున్నితంగా ముద్దాడింది.

“ఏవండీ! నేనో మాట అడుగుతాను కాదనరుగా.”

అడుగు అన్నారు సైగ చేస్తూ.

“మనం మన ఊరు దామరచర్ల వెళదామండి. అక్కడ మన బంధువులు అందరూ ఉంటారు. అక్కడే స్థలం కొనుక్కుని చిన్న ఇల్లు కట్టుకుందాం. చుట్టూ పార్క్ లాగా మొక్కలు పెంచుకుందాం. మన ఇల్లు చూడడానికి చిన్నదే అయినా ఖాళీ స్థలం ఎక్కువగా వదిలి రకరకాల పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, పచ్చని చెట్లు.. పెంచుకుందాం. ఈ పట్టణ వాతావరణానికి, ఈ కృత్రిమ జీవితానికి దూరంగా మన ఊరిలో మన శేషజీవితాన్ని ఆనందంగా బ్రతుకుదాం ఏమంటారు?” అనునయంగా అడుగుతున్న శ్రీమతి మాటలు శ్రద్ధగా వింటున్నారు ఆయన.

“ఒకసారి పిల్లలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుని..”

భర్త మాటలకి అడ్డొచ్చింది.

“శ్రీవారు! కాస్త దూరంగా ఉంటేనే ప్రేమలు సజీవంగా ఉంటాయి. రోజులు అలా ఉన్నాయి మరి. తల్లిదండ్రులమైన మనం పిల్లల పట్ల ఎంతో ప్రేమల్ని కలిగివుంటాం.. మనం ఇక్కడ వున్నా మరెక్కడైనా వున్నా! కానీ నా మాట కాదనకండి.. ఇంతకంటే ఇంకేం చెప్పలేను. మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా సమ్మతమే.”

ఉదయం తను నిద్రలేచేసరికే నిద్రలేచి.. బయట వరండాలో పచార్లు చేస్తున్న భర్తను గమనించి.. హడావుడిగా కాఫీ కలుపుకుని వెళ్ళింది.

ఆయన పడక కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతూ.. భార్య ఏమైనా పలకరిస్తుందేమోనని వేచి వున్నారు.

మౌనంగా వున్న భార్యని గమనిస్తున్నారే కానీ పలకరించలేదు. ఆమె తన పనుల్లో లీనమైంది.

ఉదయం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. పది గంటలప్పుడు.. భార్యతో అన్నారు.

“సౌజన్యా! మన అర్జున్ రావు బాబాయ్‌తో మాట్లాడాను.. మన దామరచర్లలో ఒక మంచి స్థలం అందుబాటు ధరలో ఉందన్నాడు. స్థలం కొనుక్కోగానే వెంటనే ఇల్లు కట్టుకోవచ్చన్నాడు. ‘గృహమే కదా స్వర్గ సీమ’ అన్నట్లుగా ఇల్లు కట్టుకుందాం!? ఏమంటావు?”

అడుగుతున్న భర్త మాటలకు సరే అన్నట్లుగా తలూపింది సంబరంగా!

రెక్కలొచ్చిన పక్షులు గూటిని వీడి స్వంతంగా.. స్వేచ్ఛగా ఎగురుతుంటే.. తల్లిదండ్రులైన తాము వాళ్ళ అభ్యున్నతిని గమనిస్తూ ఆనందించాలే కానీ వాళ్ళ నుండి తిరిగి ఏమీ ఆశించకూడదనే సత్యం ఓ పాఠంగా గ్రహించారు.. ఆ దంపతులు!

సంతోషమే జీవన విధానంగా జీవించినంత కాలం ఒకరికి ఒకరు అన్నట్టుగా బ్రతుకుతూ.. చేతనైనంతలో నలుగురికి సాయం చేస్తూ మంచికి మారుపేరై నిలవాలనుకున్నారు.. ఆ దంపతులు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here