Site icon Sanchika

ఒక్క గుప్పెడు…!

~
[dropcap]ఒ[/dropcap]క్క గుప్పెడు
కొత్త ఆశలనివ్వు
నిరాశలు వెల్లువెత్తిన చోట
నాటి వస్తా

ఒక్క గుప్పెడు
రంగుల కలలనివ్వు
బాధలెరుగని
రేపటి వుదయపు
తోరణాలను అల్లేస్తా

ఒక్క గుప్పెడు
వసివాడని నవ్వుల నివ్వు
బాధా తీరాల ముసిరిన
నిశ్శబ్దాన్ని తరిమేస్తా

ఒక్క గుప్పెడు
రేపటి వూహలనివ్వు
కొత్త ప్రపంచపు నినాదాల
బావుటాను చిత్రిస్తా

ఒక్క గుప్పెడు
వాడని రంగుల నివ్వు
కొత్త ఆకాశపు
ఇంద్ర ధనువు నొకటి సృష్టిస్తా

ఒకే ఒక్క గుప్పెడు
వెలుగు పువ్వులనివ్వు
సాయంతీరాల వెంబడి
చీకటి పొడ సూపకుండా
తారాతోరణం కట్టి
నిలబెడతా.

Exit mobile version