Site icon Sanchika

ఒక్క పుస్తకం-10

[box type=’note’ fontsize=’16’] తోట సాంబశివరావు గారు వ్రాసిన నవల ‘ఒక్క పుస్తకం‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 10వ, ఆఖరి భాగం. [/box]

43

[dropcap]డి[/dropcap]స్ట్రిబ్యూటర్ల దగ్గర నుండి సదానంద్‌కి ఫోన్లు వస్తూనే ఉన్నాయ్. అందరిదీ ఒకటే మాట… ఒకటే అభిప్రాయం…. సినిమా బాగుందని, పబ్లిక్ టాక్ చాలా పాజిటివ్‌గా ఉందని చెప్పుకొస్తూన్నారు. ప్రతి షోకి కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయని, ఆ ట్రెండ్ అలాగే కంటిన్యూ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని, అందుకు తామంతా చాలా సంతోషంగా ఉన్నామని తెలియజేశారు డిస్ట్రిబ్యూటర్లు.

డైరెక్టర్ విశ్వం కూడా సదానంద్‌కి ఫోన్ చేసి, సినిమా బాగుందనే టాక్ వచ్చిందని, తప్పక విజయం సాధిస్తుందని చెప్పాడు. మంచి ఫీడ్ బ్యాక్ రావడంతో సదానంద్ ఆనందానికి అంతే లేకుండా పోయింది.

రాత్రి 8 గంటలకు గ్రూపులుగా వెళ్లిన వారందరూ ఆఫీసుకు చేరుకున్నారు. మీటింగ్ హాల్లో కలుసుకుని ఒకరికొకరు హైఫైలు చెప్పుకోడం, ఒకరినొకరు కౌగలించుకోడం, పరస్పరం అభినందనలు తెలుపుకోడంతో తలమునకలై ఉన్నారు. అప్పుడే వాళ్ల మధ్యకు వచ్చిన సదానంద్‌ను చూసి అందరూ కేరింతలు కొడ్తూ, డాన్సులు చేస్తూ సందానంద్‌ను తమ చేతులతో అమాంతం పైకి గాల్లోకి లేపుతూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. తాము సేకరించిన సమాచారాన్ని విశ్లేషిచుకుని, తమ సినిమా తప్పక విజయం సాధిస్తుందనే ఏకాభిప్రాయానికి వచ్చారు.

అప్పటికే, తన సినినమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని, అనూహ్య ఆదరణ లభిస్తుందని తెలుసుకున్న సదానంద్ అందరి కోసం ఒక గ్రాండ్ పార్టీ ఆర్గనైజ్ చేశాడు. పార్టీ జరుగుతున్న సమయంలోనే అందరికీ సంతోషాన్ని కలిగించే ఒక మంచి విషయం చెప్పాడు సదానంద్.

“మీరంతా ఒక వారం రోజులు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడికైనా సరే విహారయాత్రకు వెళ్లి ఎంజాయ్ చేసి రండి. మీరంతా తిరిగి వచ్చిన తరువాత మన రెండో సినిమా మొదలవుతుంది. ఇంకో విషయం… మన రెండో సినిమా పూర్తవగానే ఇలాగే ఒక వారం రోజుల పాటు మన దేశంలో ఎక్కడికైనా విహార యాత్రకు మీరు వెళ్ల వచ్చు… అలాగే మన మూడో సినిమా పూర్తవగానే దుబాయ్, సింగపూర్, మలేసియా, మారిషస్ ఏదో ఒక చోటికి ఒక వారం రోజుల పాటు విహార యాత్రకు మీరు వెళ్లవచ్చు. మీ విహారయాత్రల ప్లాన్స్ గురించి మన అడ్మిన్ డిపార్టమెంట్‌లో చెప్పండి. వారు మీకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తారు” అని సదానంద్ చెప్పగానే అక్కడున్న వారందరూ కృతజ్ఞతా పూర్వకంగా కరతాళధ్వనులను మారుమ్రోగించారు.

పార్టీని ఫుల్‌గా ఎంజాయ్ చేసి, ఆపై తమ తమ ఇళ్లకు వెళ్లి బడలిక తీరే వరకు నిద్రాదేవి ఒడిలో ఒదిగిపోయారు పసిపిల్లల్లా….

44

అందరూ విహారయాత్రలు పూర్తి చేసుకు ఆఫీసుకు వచ్చారు. వచ్చీరాగానే ప్రతి ఒక్కరికీ వారి పేరుతో వున్న క్లోజ్డ్ కవర్‌ను అక్కౌంట్స్ డిపార్టమెంటు వారు అందించారు. అందులో ఏముందో అనే సస్పెన్స్‌కు తెరదించుతూ అందరూ కవర్లను ఓపెన్ చేసి అందులో ఉన్న ఉత్తరాన్ని చదువుకుని అవాక్కయ్యారు.

“ప్రియమిత్రమా…
విహార యాత్రలతో బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. మరి మనందరం కలిసి మన మూడు సినిమాల ప్రాజెక్టులో మొదటి సినిమా తీయడం, అది రిలీజవడం, ప్రస్తుతం ఆ సినిమా విజయ పథంలో నడుస్తుండటం… గురించి ఈ పాటికి మీరందరికీ తెలిసే వుంటుంది. ఈ శుభతరుణంలో మన ప్రాజెక్టులో పని చేస్తున్న ప్రతి ఒక్కరికి మూడు నెలల జీతాన్ని బహుమతిగా ఇచ్చి సత్కరించదలిచాము. ఆ ప్రకారంగా మీకు రావలసిన మూడు నెలల జీతం తాలూకు చెక్కును ఈ ఉత్తరానికి జత చేసి మీకు అందజేస్తున్నాము. స్వీకరించగలరు.
ఇక మన రెండో సినిమా కోసం మీరు రెట్టింపు ఉత్సాహాంతో ద్విగుణీకృతమైన అందర్లీన శక్తితో కార్యోన్ముఖులవుతారని ఆశిస్తూ….

మీ
శ్రేయోభిలాషి
సదానంద్”

అడగంది అమ్మయినా పెట్టదంటారు. అలాంటిది అడక్కుండానే మా గురించి, మా బాగోగులు గురించి ఆలోచిస్తూ…. మా ఆనందం కోసం, మా సంతోషం కోసం నిరంతరం తపించే దేవుడు లాంటి సదానంద్ గారితో కలిసి పని చేయడమనేది మా పూర్వజన్మ సుకృతం అనుకంటూ రెండో సినిమా గురించి అందరూ తమ తమ పరిథిలో ఆలోచించడం మొదలెట్టారు.

45

చిన్నా పెద్దా హిరోలు, బడా నిర్మాతలు సదానంద్‌తో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఫోన్‌లో సంప్రదిస్తున్నారు. సదానంద్ మాత్రం తన మూడు సినిమాల ప్రాజెక్టు పూర్తయిన తరువాత తప్పకుండా చేద్దామని చెప్తున్నాడు.

అప్పుడే… మహేంద్ర లావణ్యా సదానంద్ క్యాబిన్‌లోకి వచ్చారు.

“ఆ! రండి! కూర్చోండి….” అంటూ ఆహ్వాలించాడు సదానంద్.

“సార్ మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాం సార్” నింపాదిగా చెప్పింది లావణ్య.

“ఆ! ఫరవాలేదు” చెప్పండి అన్నాడు సదానంద్.

“సార్… మీ ప్రాజెక్టులో చేరిన తరువాత నేనూ, లావణ్య మంచి స్నేహితులమయ్యాం. ఒకరి నొకరం బాగా అర్థం చేసుకొన్నాం. కొంత కాలానికి మా స్నేహం ప్రేమగా మారింది. రెండు మనసులు కలిస్తే ప్రేమ. అదే రెండు కుటుంబాలు కలిస్తే పెండ్లి. అదే ఇప్పుడు జరిగింది” చెప్పాడు మహేంద్ర.

“అవున్సార్… మొన్న విహారయాత్రకు కూడా మా రెండు కుటుంబాలు కలిసే వెళ్లాయి. అప్పుడే విషయం పెండ్లి దాకా వచ్చింది. రెండు కుటుంబాల పెద్దలు పెండ్లికి అంగీకారం తెలిపారు” సంతోషంగా చెప్పింది లావణ్య.

“పెండ్లి తరువాత మా రెండు కుటుంబాలు కలిసే జీవించాలని నిర్ణయించుకున్నాము. మేమిద్దరం కలిసే ఇరు కుటుంబాల పూర్తి బాధ్యతలను పంచుకుందామనుకుంటున్నాము” చెప్పాడు మహేంద్ర.

“సార్… ఎవరికైనా తల్లి, తండ్రి, గురువు, దైవం ముఖ్యం కదా సార్. ఇటు మా అమ్మ, అటు మహేంద్ర వాళ్ల తల్లిదండ్రులు మా పెండ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు…”

“ఆ తరువాత గురువు… ఆ గురువు మీరే కదా సార్ …. మీరు కూడా మా పెండ్లికి ఓ.కే అంటే… ఆ దేవుడు కూడా కరుణించి తథాస్తు అంటాడు సార్” వినయపూర్వకంగా చెప్పింది లావణ్య.

అంతా విన్న సదానంద్ “చాలా మంచి విషయం చెప్పారు నాకు చాల సంతోషమనిపిస్తుంది. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది… ఒక డైనమిక్ ఇండస్ట్రీ, ఒక వొలటైల్ ఇండస్ట్రీ…. అలాంటి ఇండస్ట్రీలో ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి కనబడితే… పుకార్లు, రూమర్స్, గాసిప్స్… అన్నీ మొదలవుతాయ్….. అలాంటి అవకాశం ఎవ్వరికీ ఇవ్వకుండా, ఒకరి నొకరు ఇష్టపడ్డ మీరు పెండ్లి చేసుకోవాలనుకోవడం హర్షణీయం. అందుకు మీ పెద్ద వాళ్లు కూడా అంగీకారించడం అభినందనీయం. నాకు, మన యూనిట్‌కి ఆ మాటకొస్తే నా బ్యానర్… రెయిన్‌బో క్రియేటివ్ ఎంటర్‌ప్రైజ్…కి కూడా మంచి పేరు తెచ్చే అంశం మీ వివాహం. మీ ఇద్దరికీ నా ముందస్తు శుభాకాంక్షలు… ప్లీజ్… గో ఎహేడ్” అని చెప్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

“థాంక్యూ సార్…” అంటూ మహేంద్ర, లావణ్య కలిసి సదానంద్ పాదలకు నమస్కరించారు.

“ఆ లావణ్య… నీకు మీ తండ్రిగారు అందుబాటులో లేరు కదా నేను నా భార్యా కలిసి నీ తల్లిదండ్రుల స్థానంలో ఉండి మేమే కన్యాదానం చేస్తాం… ఓ.కే.నా” అడిగాడు సదానంద్.

కళ్ల నీళ్ల పర్యంతమైన లావణ్య ఏమాట్లాడాలో అర్థం కాక కృతజ్ఞతా పూర్వకంగా తలాడించింది.

“ఆ! మహేంద్రా… మరి పెండ్లైన తరువాత హనీమూన్ వెళ్లాలి కదా, అందుకోసం రామోజీవిఫిల్మ్ సిటీలో మీ ఇద్దరి కోసం హనీమూన్ ప్యాకేజీని బుక్ చేస్తాను. మీ వివాహ సందర్భంగా అది నా పర్సనల్ గిఫ్ట్. అఫ్‌కోర్స్, మన కంపెనీ తరుపున వేరే గిఫ్ట్ ఉండనే ఉంటుంది” చెప్పాడు సదానంద్.

“సార్! మనషుల్లో ఎక్కడో ఒకచోట మంచితనం ఇంకా మిగిలేవుందని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం మీరే సార్…

మంచితనానికి నిర్వచనం…. మంచితనానికి పరాకాష్ట… ఏమిటి? అని నన్ను ఎవరైనా అడిగితే నేను మిమ్మల్ని చూపిస్తాను సార్…” అంటూ ఉద్వేగ భరితంగా చెప్పాడు మహేంద్ర.

“మా జీవితాలకే ఒక అర్థం…. ఒక పరమార్థం చెప్పిన మీ ఋణం ఎలా తీర్చుకోగలం సార్!…. యూ ఆర్ రియల్లీ గ్రేట్ సార్” గద్గద స్వరంతో చెప్పింది లావణ్య.

“మరి… మా అందరికీ పెండ్లి భోజనం ఎప్పుడు పెట్టిస్తున్నారు?….” నవ్వుతూ అడిగాడు సదానంద్.

“అతి త్వరలోనే సార్” అంటూ సంతృప్తి చెందిన మనస్సులతో శలవు తీసుకున్నారు మహేంద్ర, లావణ్య.

46

నిశితంగా గమనిస్తే “ఒక్క పుస్తకం మీ జీవితాన్నే మార్చేస్తుంది” అనే విషయం… సదానంద్, మహేంద్ర, లావణ్యల జీవితాలలో నిస్సందేహంగా నిరూపించబడింది.

ఆ పుస్తకమే వారి జీవితాలకు దిశానిర్దేశం చేసింది…

ఆ పుస్తకమే వాళ్లు దశనే తిరగరాసింది…

ఆ పుస్తకమే వారి జీవనగమనంలో బాట వేసింది…

ఆ పుస్తకమే వారికి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టి, వారిని గౌరవ ప్రదమైన స్థానంలో నిలబెట్టింది.

ఆ పుస్తకమే వారి స్థిితిగతుల్లో ఊహించని పెను మార్పుకు ఊపిరి పోసింది.

మరి మనందరం మంచి పుస్తకాలను చదువుతూనే ఉందాం!!

పది మంది చేత చదివిస్తూనే ఉందాం!!

(సమాప్తం)

Exit mobile version