ఒక్క పుస్తకం-2

10
2

[box type=’note’ fontsize=’16’] తోట సాంబశివరావు గారు వ్రాసిన నవల ‘ఒక్క పుస్తకం‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది రెండవ భాగం. [/box]

7

[dropcap]”ఆ[/dropcap] రోజు సంక్రాంతి పండుగ. కుటుంబ సభ్యులందరం కలిసి సందడి చేసుకుంటున్నాం. ఇదే అనువైన సమయం అనుకుని, అందరి ముందు నా మనసులోని విషయాన్ని బయటపెట్టాను. హైదరాబాద్ వెళ్ళి సినిమా పరిశ్రమలో రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా స్థిరపడాలనే నా ప్రగాఢ వాంఛను వారందరి ముందుంచాను. నా ప్రతిపాదనకు అందరూ అంగీకారం తెలిపారు. “ధైర్యంగా వెళ్ళు. నీ వెంట మేమందరం ఉన్నాం. మా అందరి సహకారం నీకు ఎల్లప్పుడూ వుంటుంది” అంటూ నా అభ్యున్నతి కోసం ఎవరికి తోచిన సలహా వారు ఇచ్చారు.

ఆ సలహాల సారాంశం “ఎవరి కిష్టమైన రంగాన్ని వారు ఎన్నుకోవాలి. ఎన్నుకున్న రంగంలో శిఖరాగ్రపుటంచులు చేరుకునేవరకూ విశ్రమించకూడదు” అని.

నా కుటుంబం నుంచి అంతలా ఊతం లభిస్తుందని నేనెన్నడూ ఊహించలేదు.

ఆ తరువాత, మంచి సినిమాలు తీయాలనీ, మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలనే నిశ్చయంతో హైదరాబాదులో స్థిరపడ్డాను. సినిమా పరిశ్రమలో అన్ని శాఖలలో మంచి అనుభవం సంపాదించి, ఆ తరువాతే, సినిమా తీయాలని, అప్పుడే మంచి సినిమా తీయగలననే నిర్ణయానికి వచ్చాను. ఆ క్రమంలోనే ప్రఖ్యాత సినీ దర్శకులు విశ్వం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి, ప్రస్తుతం ఆయన దగ్గరే అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాను. గురువుగారి మార్గదర్శకంలో మంచి అనుభవం సంపాదించాను. మంచి సినిమా తీయగలననే ధైర్యం వచ్చింది. ఒక మంచి కథను కూడా తయారు చేసుకున్నాను.

ఇప్పుడు మీకు చెప్పిన నా కుటుంబ నేపథ్యాన్ని మాత్రం, ఇంతవరకు నేను ఎవరికీ చెప్పలేదు. ఆఖరికి విశ్వం గారికి కూడా. ఎందుకంటే నా కుటుంబం యొక్క ప్రాభవాన్ని, పదవులను, పేరు ప్రఖ్యాతులను నేను నా సొంతానికి ఉపయోగించుకోవడం అనేది నా నైజానికి విరుద్ధం. నా సొంత తెలివితేటలతో, సమర్థతతో మాత్రమే, నా జీవితంలో ఎదగాలనేది నా ‘ఆశయం’.

‘ఎవరికి ఇంతవరకు చెప్పని విషయాలను మాకెందుకు చెప్తున్నారు’ అని మీరు అనుకోవచ్చు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే… విధి మన ముగ్గురిని కలిపింది. మన ముగ్గురం కలిసి సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలను ముందు ముందు చెయ్యబోతున్నాను. అందుకే కావాలనే చెప్పాను.”

శ్రీకాంత్, శ్రీలక్ష్మి కొద్దిగా ఆశ్చర్యానికి గురైనా, తమ భవిష్యత్తుకు కూడా ఒక భరోసా దొరకబోతోందనే ఆశ వారి మనసుల్లో చిగురించింది. ఇకముందు సదానంద్ గారితో కలిసి పనిచేయాలనే నిర్ణయానికి అప్పుడే అంకురార్పణ జరిగింది.

8

చెప్పడం కొంచెం సేపు ఆపేసిన సదానంద్ మరలా మొదలుపెట్టాడు.

ఆ రోజు జైపూర్‌లో షూటింగ్ జరుగుతోంది. బిజీ షెడ్యూల్ నుంచి పక్కకు వచ్చి, దగ్గరలో ఉన్న చెట్టు క్రింద ఏకాంతంగా కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, డైరక్టర్ విశ్వం గారు. ఆ సమయంలో నేను నెమ్మదిగా విశ్వంగారి దగ్గరకు వెళ్ళాను. ఆయన కళ్ళు మూసుకుని తదుపరి తీయబోయే ఒక ముఖ్యమైన సన్నివేశం గురించి ఆలోచిస్తున్నారు. ధైర్యం చేసి, “విశ్వం గారూ!” అని చిన్నగా పిలిచాను. ఆయన దగ్గర నుండి స్పందన లేదు. కొంచెం ముందుకు వంగి, “గురువు గారూ!” అని కొద్దిగా పెద్దగానే పిలిచాను. నా వైపు తిరిగి, “ఆ! ఏంటి సదానంద్?” అడిగారు విశ్వంగారు.

“సార్! నేనొక మంచి కథను తయారు చేసుకున్నను. ఆ కథతో స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా తీద్దామనుకుంటున్నాను” అని బిడియపడుతూ చెప్పాను.

కొంచెం కళ్ళు పెద్దవి చేసి, నా వైపు ప్రేమగా చూస్తూ “వావ్! ఎంత మంచి విషయం చెప్పావ్ సదానంద్… ఏ మాత్రం ఆలస్యం చెయ్యకు… వెంటనే పనులు మొదలుపెట్టు. ఆలస్యం అమృతం విషం అంటారు పెద్దలు” అంటూ లేచి వచ్చి నా భుజం తట్టారు. గురువుగారి మాటలతో నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్.

“నేను ఇంత గొప్ప దర్శకుడ్ని కావడానికి నీ వంతు సహకారాన్ని నేనెప్పటికీ మరిచిపోను. పైగా గత కొద్ది సంవత్సరాలుగా నిన్ను అతి దగ్గర నుంచి గమనిస్తున్నాను. నీ క్రమశిక్షణ, విషయ పరిజ్ఞానం, పట్టుదల అమోఘం. రాబోయే రోజులలో ఒక మంచి దర్శకుడ్ని మన ప్రేక్షకులు నీలో చూడబోతున్నారు. గో ఎహెడ్ మిస్టర్ సదానంద్” అంటూ నాలోని విశేషతలని వివరిస్తూ, నన్ను ఆకాశానికెత్తేశారు విశ్వంగారు. వెంటనే నా ఆలోచనలను నేలపైకి దించేసి, ముందుకు వంగి గురువుగారి కాళ్ళకు నమస్కారం చేశాను. అలానే వుండిపోయిన నన్ను “సదానంద్… లే… ఈ రోజు నాకెంత ఆనందంగా వుందో తెలుసా… నిజానికి ఆనందం కంటే గర్వంగా ఉంది. నా ప్రియ శిష్యుడు, నా కుడి భూజం త్వరలో గురువుని మించిన శిష్యుడు కాబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ… మై బోయ్” అంటూ నన్ను గాఢంగా తన గుండెలకు హత్తుకున్నారు… కళ్ళల్లో నీళ్ళు కనురెప్పలను దాటుతుండగా ఒకింత భావోద్వేగానికి లోనయ్యాను. నోట మాట రాలేదు. అలానే ఆయన గుండెలపై వాలిపోయి, కొద్ది సేపు గడిపాను. తరువాత తేరుకుని, కళ్ళు తుడుచుకుని “మీలాంటి వారు నాకు గురువుగా లభించడం నా అదృష్టం సార్… పూర్వ జన్మ సుకృతం” అంటూ మరొక్కమారు గురువుగారి కాళ్ళకి నమస్కరించి లేచాను.

ఇంతలో “షాట్ రెడీ” అనే పిలుపు వినబడింది. విశ్వంగారు నిదానంగా సెట్‌లోకి నడుస్తున్నారు. ఆవును అనుసరిస్తున్న లేగదూడలా గురువుగారి వెంట నడుస్తూ సెట్ లోకి వెళ్ళాను.

9

వెంటనే ఫ్యామిలీతో మా ఊరికి బయల్దేరాను. అదృష్టవశాత్తు నాన్నగారు, పెద్దన్నయ్యతో పాటు చిన్నన్నయ్య కూడా ఆ రోజు ఇంటి దగ్గరే వున్నారు.

వాళ్ళందరికీ నా ప్రాజెక్టు గురించి వివరించాను. చాలా సంతోషించారు వాళ్ళంతా. నా అవసరాల నిమిత్తం ఏయే సమయాల్లో ఎంతెంత డబ్బు కావాలో తెలియజేశాను. అందరిదీ ఒకటే మాట. “డబ్బు గురించి నువ్వు ఆలోచన చేయవద్దు. నువ్వు చెప్పిన ప్రకారమే ఎప్పటికప్పుడు నీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంటాము. నువ్వు మిగతా విషయాలన్నీ జాగ్రత్తగా చూసుకో” అంటూ నన్ను ముందుకెళ్ళమని ప్రోత్సహించారు.

రెండ్రోజులు కుటుంబసభ్యులందరితో సరదాగా గడిపి తిరిగి హైదరాబాద్ చేరుకున్నాము.

10

తదుపరి ఒక వారంలోపే ఫిలింనగర్‌లో ఒక బంగ్లా అద్దెకు తీసుకుని ఆఫీసు తెరిచాను. వెంటనే అప్పటికి కావలసిన సిబ్బందిని నియమించుకున్నాను. నా కథను సినిమాకు అవసరమయే రీతిలో మార్పులు చేర్పులూ చేస్తూ స్క్రిప్టు తయారుజేయడం మొదలెట్టాను. నా టీమ్‌లో దర్శకత్వం, సంగీతం, కెమెరా, స్టంట్స్, డాన్స్, మేకప్, ఎడిటింగ్, కళ, ప్రొడక్షన్ మొదలైన డిపార్ట్‌మెంట్‌లలో ప్రముఖుల దగ్గర పనిచేస్తున్న సెకండ్ లైన్‌లో వుండే వారిని సెలెక్ట్ చేసుకుని వారికి పూర్తి  బాధ్యతలు అప్పజెప్పాను. వాళ్ళందరూ వారి వారి డిపార్ట్‌మెంట్స్‌లో హెడ్స్ అయి మున్ముందు రాబోయే కాలంలో వ్యక్తిగతంగా గుర్తింపు తెచ్చుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారు. క్యారెక్టర్స్‌కు నటీనటుల ఎంపిక, షూటింగ్ లొకేషన్స్ గుర్తించడం, సెట్టింగ్స్ డిజైన్ చేసుకోవడం, పాటలు వ్రాయించడం, వాటికి ట్యూన్లు కట్టించడం లాంటి అన్ని విషయాలలో ప్రతీ రోజూ అందరం కలిసి గంటల తరబడి చర్చించుకుంటున్నాం.

చిత్రసీమలోకి నాలుగైదు సంవత్సరాల క్రితం ప్రవేశించి మంచి హిట్స్‌ని అందుకున్న యువహీరోల్లో ఒకరిని హీరోగా తీసుకుని, హీరోయిన్‌తో సహా మిగతా అన్ని పాత్రలకు కొత్తవారిని తీసుకుందామనుకున్నాం. ఈ నిర్ణయానికి కారాణ్ం… మాది మొట్టమొదటి సినిమా కాబట్టి… కొంచెం పేరున్న హీరో అయితే… ఆ హీరో ఇమేజ్ మాకు ప్లస్ అవుతుంది. కొంచెం బడ్జెట్ ఎక్కువైనా మంచి హీరోనే తిసుకోవాలనుకున్నాము. మిగతా వారందరూ కొత్తవారే కాబట్టి, బడ్జెట్ పరంగా అందరూ అందుబాటులోనే వుంటారు.

ఇక టెక్నీషియన్స్ అయితే అందూ నాకు బాగా తెలిసిన వాళ్ళే. చిత్ర పరిశ్రమలో వాళ్ళంతా నా సహచరులే. అందుకే బడ్జెట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది వుండకపోవచ్చు.

11

ఇక యువ హీరో గురించి ఆలోచిస్తుంటే నా మనస్సులో ‘నరేంద్ర గారు’ మెదిలారు. తెలుగు తెరకు నాలుగు సంవత్సరాల క్రితం పరిచయమై నాలుగు లో-బడ్జెట్ సినిమాల్లో నటించి బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల రికార్డులు సాధించడానికి కారకులయ్యారు నరేంద్రగారు. ఆ ఆలోచన రాగానే వెంటనే ఆచరణలో పెట్టాను. నరేంద్ర గారికి ఫోన్ చేశాను.

“హలో నరేంద్ర గారూ! నమస్తే అండి..”

“ఆ! నమస్తే సదానంద్ గారూ! ఏంటి విషయం?”

“మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను. ఏ టైమ్‌లో మీకు అనుకూలంగా వుంటుందో చెప్తే అప్పుడే వచ్చి కలుస్తాను.”

“ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్… లంచ్ టైమ్‌లో రాగలరా… మాట్లాడుకోవచ్చు.”

“ఓ! తప్పకుండా వస్తాను సార్!” అని చెప్పాను.

“ఓకే” అంటూ ఫోన్ కట్ చేశారు నరేంద్ర గారు.

అనుకున్న టైమ్‌కి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ స్పాట్‌కి వెళ్ళాను. అప్పటికే భోం చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు నరేంద్రగారు. నన్ను చూసి,

“ఆ! సదానంద్! రా… కూర్చో… ఏంటి?.. ఏదైనా మాట్లాడాలనుకుంటున్నావా… పరవాలేదు చెప్పు…” అన్నారు.

“మరేం లేదు నరేంద్ర గారు…  నేనో మంచి కథను తయారు చేసుకున్నాను. ఆ కథను నేనే సినిమాగా తీద్దామనుకుంటున్నాను… అదీ నా దర్శకత్వంలోనే…”

“ఓ… వెరీ గుడ్ న్యూస్… ఆల్ ది బెస్ట్…”

“అందులో హీరో క్యారెక్టర్‍కు మీరు బాగా సూటవుతారు. దయచేసి మీరు నా సినిమాలో హీరోగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” ఆశగా చూస్తూ అడిగాను.

“నేనా?” ఒక్క నిమిషం ఆగి, “చూడు సదానంద్… ఒక్కరోజు టైమ్ ఇవ్వు… ఆలోచించుకుని రేపు ఫోన్ చేస్తాను. ఓ.కే.నా?” చెప్పారు నరేంద్ర గారు.

“అలాగే సార్! మీ ఫోన్ కోసం ఎదురుచూస్తుంటాను… వస్తాను సార్” అని చెప్పి వచ్చేశాను.

మరుసటి రోజు ఉదయమే నరేంద్రగారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది.

“హలో! సదానంద్!”

“నమస్తే సార్”

“నువ్వు చెప్పిన విషయాన్ని సీరియస్‌గా ఆలోచించాను. నిజానికి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న చిన్న హీరోని నేను. అలాంటి నేను ఒక క్రొత్త దర్శకుడితో పని చేసి నా భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకోలేను. దయ చేసి ఏమీ అనుకోవద్దు. అన్నట్టు నువ్ తీయబోయే సినిమాలో ఒక కొత్త నటుడ్ని హీరోగా పరిచయం చేస్తే బాగుంటుందేమో ఒక్కసారి ఆలోచించు” అంటూ ఫోన్ డిస్‌కనెక్ట్ చేశారు నరేంద్రగారు.

ఎందుకో… కొంచెం నిరాశా, నిస్పృహలకు లోనయ్యాను. అయితే… వెంటనే తేరుకుని నేను కూడా లోతుగా ఆలోచించాను. నరేంద్ర గారు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. అందుకే ఆయన సలహా మేరకు ముందుకెళ్తే బాగానే వుంటుందనిపించింది. ఇకపై మరో విధంగా ఆలోచన చేసి విలువైన సమయాన్ని వృథా చేయకూడదని నిర్ణయించుకున్నాను. మంచి పుస్తకాలను కొనుక్కుందామని ఇలా బుక్ ఫెయిర్‌కి వచ్చాను. ప్రవేశద్వారం దగ్గర కట్టిన బ్యానర్‌లో ‘ఒక్క పుస్తకం మీ జీవితాన్నే మార్చేస్తుంది’ అన్న పుస్తకం గురించి తెలుసుకోవడం, ఆ పుస్తకం కోసం 123 స్టాల్ దగ్గరకు నేను రావడం, అక్కడ మన ముగ్గురం కలుసుకోవడం…, తరువాత జరిగిన విషయాలు మీకు తెలిసినవే.

ఇకపోతే… మనం ముగ్గురం రేపు సాయంత్రం 4 గంటలకు బిర్లామందిర్ దగ్గర మరలా కలుద్దాం. నా గురించి పూర్తిగా తెలుసుకున్న మీరు… రేపు మీ గురించి వివరంగా చెప్పాలి. ఆ! మన పుస్తకం గురించి… రేపు బిర్లామందిర్‌కి వచ్చే ముందే… బుక్ ఫెయిర్‌కి వెళ్ళీ మరో రెండు కొనుక్కుని వస్తాను. అవి మీకు చెరోటి ఇస్తాను. ఓకేనా?… తప్పక వస్తారుగా…” అన్నాడు సదానంద్.

“తప్పకుండా వస్తామండి” శ్రీకాంత్, శ్రీలక్ష్మి కలసి చెప్పారు.

బై బైలు చెప్పుకుంటూ అందరూ నిష్క్రమించారు.

12

హైదరాబాద్ నడిబొడ్డున వున్న నౌబత్ పహాడ్ అనబడే చిన్న కొండ మీద నిర్మించబడింది బిర్లామందిర్. దేవాలయం మొత్తం రాజస్థాన్ నుంచి తెప్పించిన తెల్లటి చలవరాళ్ళతో, దాదాపు పది సంవత్సరాల కాలం వెచ్చించి కట్టబడింది. ఈ దేవాలయంలో మూల విరాట్టుగా శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరి యున్నారు. దేవాలయ ప్రాంగణంలోనే శివుడు, గణపతి, హనుమంతుడు, బ్రహ్మ, సాయిబాబా, శక్తి, లక్ష్మి, సరస్వతి ఆలయాలు కూడా వున్నాయ్. ప్రశాంతతకు భంగం వాటిల్లకూడదనే సదుద్దేశంతో ఈ గుడిలో గంటలు కూడా అమర్చకపోవడం ఒక విశేషం.

మందిరం పై భాగం నుంచి చూస్తే హుస్సేన్ సాగర్, బుద్ధ విగ్రహం, అసెంబ్లీ, రవీంద్రభారతి, లాల్ బహాదూర్ స్టేడియం, లుంబినీ పార్క్ దగ్గరగా, అందంగా కనిపిస్తుంటాయ్.

ఆ మధ్య బిర్లామందిర్ పరిసరాల్లో భారీగా నిధులున్నాయనే వార్తలు రాష్ట్రంలో కలకలం రేపాయ్. ప్రభుత్వ పురావస్తు శాఖ ఒక అడుగు ముందుకేసి అన్వేషణ ప్రారంభించింది కూడా. ఫలితం ఇంకా తెలియాల్సి వుంది.

మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు… అనుకున్నట్టుగానే సదానంద్, శ్రీకాంత్, శ్రీలక్ష్మి బిర్లామందిర్ దగ్గర కలుసుకున్నారు. ముందుగా అందరి దేవుళ్ళను దర్శించుకుని, చివరిగా శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తమ తమ మనోవాంఛలను నెరవేర్చమని కోరుకుంటూ ప్రార్థనలు చేశారు. అనంతరం గార్డెన్ దగ్గరకు వచ్చిన్ లాన్‌లో కూర్చున్నారు.

(ఇంకా ఉంది)

 ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here