Site icon Sanchika

ఒక్క పుస్తకం-3

[box type=’note’ fontsize=’16’] తోట సాంబశివరావు గారు వ్రాసిన నవల ‘ఒక్క పుస్తకం‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది మూడవ భాగం. [/box]

13

[dropcap]”ఆఁ[/dropcap]… ఇక విషయానికి వద్దాం. ముందుగా శ్రీకాంత్… నీ గురించి వివరంగా చెప్పు” అన్నాడు సదానంద్.

శ్రీకాంత్ కొంచెం సేపు ఆలోచించి చెప్పడం మొదలుపెట్టాడు. సదానంద్, శ్రీలక్ష్మి చిరునవ్వులు చిందిస్తూ వింటున్నారు.

“మాదొక సాధారణ మధ్య తరగతి కుటుంబం. అమ్మా, నాన్నా, నేను, చెల్లి. చిన్న ఉద్యోగం చేస్తూ సంసారాన్ని కష్టంగా నడిపిస్తున్నాడు నాన్న. ఉన్నంతలోనే ఇంటిని చక్కగా చక్కబెడుతున్నది అమ్మ. చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా ఇంటర్మీడియెట్ చదువుతుంది చెల్లి. డిగ్రీ పూర్తి కాగానే నా చదువుకు బ్రేక్ పడింది. అందుకు రెండు కారణాలు. ఒకటి పై చదువులు చదివించే ఆర్థిక స్తోమత మాకు లేకపోవడం; రెండు ఉద్యోగం చేసి ఎంతో కొంత సంపాదించి కుటుంబ పోషణలో నాన్నకు ఆసరగా నిలబడాలనే నా నిశ్చయం. సాంఘిక స్థాయిలో, ఆర్థిక స్తోమతలో మా కుటుంబం తక్కువేమో కాని, అభిమానం, అనురాగం, ఆప్యాయతల్లో ఎవరికీ తీసిపోదు మా కుటుంబం.

పట్టా చేతికందగానే ఉద్యోగం కోసం వేట ప్రారంభించాను. ఆ క్రమంలో నా అనుభవాలు సగటు నిరుద్యోగి అనుభవాలకు అతీతం కాదు. మొదట్లో ఇంటర్వ్యూలకు వెళ్ళడం అంటే చాలా ఉత్సాహంగా అనిపించేది. హుషారుగా వెళ్ళేవాడిని. అడుగడుగునా నిరాశే ఎదురవడం వల్ల నిరాశక్తత, నిస్పృహ చుట్టుముట్టాయ్. అనుకున్నది సాధించలేనేమో అన్న సంశయం నన్ను వెంటాడుతుంది. మొట్టమొదటిసారిగా జీవితం ప్రారంభించే సమయంలో ఈ సమాజంలో నెలకొన్న పరిస్థితులు ఇలా ఉంటాయా అనే క్రొత్త కోణం నాకు అవగతమయింది.

14

ఒకసారి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు వాళ్ళ సంతృప్తి మేరకు సమాధానం చెప్పాను. ఈ ఉద్యోగం నాకు వస్తుందనే ఆశ చిగురించింది. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు వాళ్ళల్లో వాళ్ళు కొద్దిసేపు చర్చించుకున్నారు. మధ్యలో ఉన్నతను నా వైపు తిరిగి నవ్వుతూ చూస్తూ…

“ఈ ఉద్యోగానికి మిమ్మల్నే సెలెక్ట్ చేద్దామని నిర్ణయించాము. కాని ఒక్క షరతు. ముందుగా మీరు మూడు నెలల జీతాన్ని మా దగ్గర సెక్యూరిటీగా డిపాజిట్ చేయాలి. మీకు జీతం నెలకు పదిహేను వేల రూపాయలు. మూడు నెలల జీతం అంటే నలభై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేయాలి. మీరు ఎప్పుడు డిపాజిట్ చేస్తే అప్పుడు అపాయింట్‌మెంట్ ఇస్తాము. అదీ… ఒక వారం రోజులలోనే చేయాలి. లేదంటే ఆ ఉద్యోగం వేరేవారికి యిస్తాము, ఆలోచించుకోండి. ఇక మీరు వెళ్ళవచ్చు” అన్నాడు.

అంత డబ్బు డిపాజిట్ చేసే అవకాశం ఏ మాత్రం లేని నేను… “సార్.. ఇందులో ఆలోచించుకోడానికి వేరే ఏమీ లేదు. మీరు ఈ ఉద్యోగానికి మరొకరిని సెలెక్ట్ చేసుకోండి. థాంక్యూ సర్” అని చెప్పి బయటపడ్డాను.

ఇంకోసారి మరో ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూ బాగా జరిగింది. ఖచ్చితంగా ఆ ఉద్యోగం నాకే వస్తుందనే నమ్మకం కలిగింది. మరుసటి రోజు వచ్చి… అపాయింట్‌మెంట్ ఆర్డర్ తీసుకోమన్నారు. చాలా సంతోషించాను. ఆరోజు నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ రాత్రంతా నిద్ర రాలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా… ఎప్పుడు అపాయింట్‌మెంట్ ఆర్డర్ తీసుకుందామా అనే ఆలోచనలతో కలత నిద్రలో గడిపాను.

మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లాను. పిడుగులాంటి వార్త… ఆ ఉద్యోగానికి నన్ను కాదనుకుని వేరే వాళ్లను సెలెక్ట్ చేశారట… నా పరిస్థితిని చూసి జాలిపడిన అటెండర్ పక్కగా వచ్చి, అటూ ఇటూ చూసి ” సార్… మీకు అన్యాయం జరిగింది సార్.. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళలో ఒకతను మినిస్టర్‌తో ఫోన్ చేయించాడు కూడా. మీకు రావాల్సిన ఉద్యోగం అతనికి ఇచ్చారు సార్” అని చెప్పి వడివడిగా వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా నాలో నిస్సత్తువ ఆవరించింది. కాళ్ళీడ్చుకుంటూ బయటకు నడిచాను.

మరోసారి ఇంకో ఇంటర్వ్యూకి వెళ్లాను. ఎప్పటిలాగానే ఇంటర్వ్యూ బాగా చేశాను. సెలెక్ట్ చేశారు. కాకపోతే, గుమస్తా పోస్ట్‌కి ఇంటర్వ్యూ చేసి ప్యూన్ పోస్ట్‌కి ఆర్డర్ ఇస్తామన్నారు. చాలా కోపం వచ్చింది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. పైగా వాళ్ళు అంటారు… ఒక మూడు నెలలు ప్యూన్‌గా చేస్తే తరువాత గుమస్తాగా మారుస్తామని చెప్పారు. చూస్తూ చూస్తూ ప్యూన్‌గా చేయాలా… గుండెలు పిండినట్లనిపించింది. నోట మాట రాక సమాధానం చెప్పకుండానే బయటకు వచ్చేసాను.

15

సమాజంలో నెలకొనియున్న నిరుద్యోగ సమస్యపై ఒక అవగాహన వచ్చింది. ఈ మధ్యనే ఒక పత్రికలో చదివాను. 9,241 కానిస్టేబుల్ పోస్టుల కోసం 1,59,604 మంది దరఖాస్తు చేసుకున్నారట! వారిలో విద్యాధికులే అత్యధికంగా ఉన్నారట!

పి.హెచ్.డి 1
యమ్.ఫిల్ 4
పోస్ట్ గ్రాడ్యుయేట్లు 7,975
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 10,196
డిగ్రీహోల్డర్స్ 42,242
ఇంటర్మీడియట్ 84,884
ఇతరులు 3,861
యస్.యస్.సి./ఇంటర్ ఫెయిల్ 10,441
మొత్తం 1,59,604

అదే సమయంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్… 34 పోస్టులకు 20,000 మంది పోటీపడ్డారట! ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో ఏడుగురికి తీవ్రంగా, చాలామందికి స్వల్పంగా గాయాలయ్యాయని తెలిసింది.

ఇదంతా చూస్తుంటే… మన సమాజంలో నిరుద్యోగ సమస్య తీవ్రత ఎంతగా వేళ్ళూనుకుందో అర్థం అవుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఉద్యోగం దొరుకుతుందా? నా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని నా ఆశ నెరవేరుతుందా?.. అది అసాధ్యమని అనిపించింది. రోజులు గడిచేకొద్దీ నాలో న్యూనతా భావం పెరిగిపోయింది. అమ్మా, నాన్న, చెల్లి వాళ్ళకు ముఖం చూపించాలంటేనే ఏదో తప్పు చేసినవాడిలా భయపడేవాడ్ని. ముఖం చాటేసి ఎక్కువ సమయం బయటే నాలాంటి స్నేహితులతో జులాయిలాగా తిరుగుతూ కాలక్షేపం చేసేవాడ్ని. ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనిపించేది కాదు. అదే సమయంలో కుటుంబానికి సహాయపడలేక పోతున్నాననే దిగులు మనసును కలవర పెడుతుండేది. నాలో నేను ఏడ్వడం మినహా ఏమీ చేయలేకపోయేవాడ్ని. ఆ క్రమంలోనే జీవితమంటే విరక్తి పుట్టింది.

నాలో వస్తున్న ఈ మార్పును అమ్మానాన్నలు గమనిస్తూనే వున్నారు. సాధారణంగా నాలాంటి వాడు ఇంట్లో వుంటే తల్లిదండ్రులు తిట్టిన తిట్టు తిట్టకుండా నానా యాగీ చేసేవారు. నా తల్లిదండ్రులు అలా కాదు.

16

ఆ రోజు నేనుబాగా ప్రొద్దుపోయి ఇంటికి వచ్చాను. చెల్లి చదువు ముగించి నిద్రపోతోంది. పడక్కుర్చీలో వున్న నాన్న నన్ను చూడగానే, “బాబూ ఈ మధ్య రాత్రిళ్ళు బాగా లేటుగా ఇంటికి వస్తున్నావ్. ఎవరితోనూ సరిగా మాట్లాడడం లేదు. ముఖం చాటేస్తున్నావ్. నీలో నువ్వే మథనపడడం కూడా గమనిస్తున్నాను. చాలా బాధగా వుందిరా… అసలు నీకో విషయం తెలుసా?… ప్రతి మనిషికీ మంచి రోజులు రావల్సిన టైమ్‍కి వస్తాయ్. మనం ఎదురుచూసినంత మాత్రాన అవి ముందుగా రావు. అంత మాత్రం చేత మన పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే వుంటాయనుకోకు. ఆ రోజు వస్తే నీకూ మంచి ఉద్యోగం వస్తుంది. అందాకా నీ ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటూ ఆ మంచి రోజు కోసం ఎదురు చూస్తుండడం తప్ప నువ్వేమీ చేయలేవు” అంటూ కర్మ సిద్ధాంతం బోధించాడు నాన్న.

నాన్న చెప్పే మాటలు వింటుంటే నాకు చెవుల్లో అమృతం పోసినంత హాయిగా అనిపించింది. వెంటనే నాన్న దగ్గరకి వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని తలని ఆయన తొడపై ఆనించాను. నాన్న ఆప్యాయంగా నా తల నిమురుతూ… “ఆ! వీడు ఎప్పుడు తిన్నాడో ఏమో… భోజనం వడ్డించు” అంటూ ప్రక్కనే వున్న అమ్మకు పురమాయించాడు.

వెళ్ళి భోం చేయమని కళ్ళతోనే సైగ చేశాడు నాన్న. లేచి నిల్చుని అమ్మ అడుగులో అడుగేసుకుంటూ లోపలికి వెళ్ళాను.

17

రోజులు గడుస్తున్నా… పరిస్థితుల్లో మార్పు లేదు. ఎప్పటి లాగానే ఆ రోజు కూడా లేటుగా ఇంటికి వెళ్ళాను. అమ్మా, నాన్న ఏదో విషయం చర్చించుకుంటూ  నన్ను చూసి మాట్లాడుకోవడం ఆపేశారు.

“రా… బాబూ… రా… ఇలా కూర్చో.. ఈ విషయం నువ్ కూడా వినాలి. ఆ… ఇప్పుడు చెప్పు ఆ విషయం” అని అమ్మను అడిగాడు నాన్న.

“ఏం లేదండీ… బిడ్డొచ్చిన వేళ… గొడ్డొచ్చిన వేళ… అంటారు పెద్దలు. మనవాడికి పెండ్లి చేస్తే కోడలుగా వచ్చే అమ్మాయి అదృష్టం వల్ల మనవాడికి కలిసొస్తుందేమో… ఒకసారి ఆలోచించండి” నసుగుతూ చెప్పింది అమ్మ.

“అంటే నువ్వనేది… వాడికి పెండ్లి చేద్దామనా?”

“అవునండీ”

“నీ ఆలోచన సబబే. మరి ఇంత వరకు వీడు జీవితంలో స్థిరపడలేదు. ఉద్యోగం సద్యోగం లేదు. సంపాదన అంటూ ఏమీ లేదు. మరి ఇలాంటి వాడికి పిల్లనెవరిస్తారు? ఒక్కసారి అదీ ఆలోచించు మరి”

వాళ్ళిద్దరి మాటలు వింటూ వుండిపోయాను నేను. కనీసం వారు నా అభిప్రాయాన్ని కూడా అడగలేదు. అయినా… వాళ్ళు నా మంచి కోరే కదా… అలా ఆలోచిస్తున్నారు… ఏమవుతుందో చూద్దామనుకుని సరిపెట్టుకుని మిన్నకుండిపోయాను.

అప్పుడు అమ్మ ముఖంలో ఒక వెలుగు వెలిగింది.

“దానికీ ఓ మార్గం వుందండీ! ఎవరిచ్చినా ఇవ్వకపోయినా మీ చెల్లెలికి పెండ్లీడుకొచ్చిన కూతురు వుందిగా… మీరు నోరు తెరిచి అడిగితే మీ చెల్లెలు, బావగారు… కాదనరనే నా నమ్మకం” గట్టిగా చెప్పింది అమ్మ.

“నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ… వాళ్ళు ఒప్పుకుంటారంటావా?” సంశయాన్ని వెలిబుచ్చాడు నాన్న.

“అడగందే అమ్మయినా పెట్టదు కదండీ… ఒకసారి అడిగి చూస్తే పోయేదేముంది?”

“సరే… అయితే” ఒప్పుకున్నాడు నాన్న.

“మరింకెందుకు ఆలస్యం? రేపే వెళదాం… పైగా రేపు గురువారం, దశమి… మంచి రోజు కూడా” తొందరపెట్టింది అమ్మ.

“బాబూ నువ్వు కూడా మాతో రావాలి” చెప్పాడు నాన్న.

“సరే… నాన్నా” తలాడించాను నేను.

అందరం భోజనానికి లేచాం. నాకు ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. ఏంటి ఈ కొత్త మలుపు… నాకేంటి… పెళ్ళేంటి… ఆశ్చర్యమేస్తోంది ఒక వైపు. భయమేస్తోంది మరోవైపు. అయినా తల్లిదండ్రుల అభిమతానికి వ్యతిరేకంగా మాట్లాడి వారి మనస్సునులను నొప్పించదలచుకోలేదు.

18

మరుసటి రోజు ఉదయమే అందరం తయారై మా అత్తయ్య గారి ఇంటికి బయలుదేరాము. అక్కడికి చేరుకోగానే అత్తయ్య, మామయ్య, వాళ్లమ్మాయి మమ్మల్ని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. అప్పటికే మధ్యాహ్న భోజన సమయం అయ్యింది. అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ క్రిందనే కూర్చుని సహపంక్తి భోజనం చేసాము. భుక్తాయాసం తీర్చుకున్న తర్వాత, మేమంతా ఈరోజు వాళ్ళింటికి ఎందుకు వచ్చామనే విషయాన్ని చాలా చాకచక్యంగా, ఎవరి మనసు నొచ్చుకోకుండా నాన్న తెలియజేశారు.

అంతా విన్న అత్తయ్య, మావయ్య ఏ మాత్రం తడుముకోకుండా తమ మనసులోని మాటను నెమ్మదిగా బయటపెట్టారు.

“చూడండన్నయ్యా! మీ వాడికి మా అమ్మాయిని అడగటం అంటే మన బంధాల్ని మరింత బలోపేతం చేయడానికే… అందులో ఎలాంటి సందేహమూ లేదు. కాకపోతే… వాడు ఇంతవరకు జీవితంలో నిలదొక్కుకోలేదు. పెండ్లి చేస్తే మా పిల్ల భారం కూడా మీ మీదే పడుతుంది కదా! అన్నయ్యా!!” జాలిగా అంది అత్తయ్య.

“బావగారూ! ఒకసారి మీరు మా స్థానంలో ఉండి ఆలోచించండి. వాడికింకా ఒక ఉద్యోగం అంటూ లేదు. సంపాదనా లేదు. మీ అమ్మాయికే అయితే… ఇలాంటి అబ్బాయితో పెండ్లికి మీరు ఒప్పుకుంటారా? దయచేసి ఈ పెండ్లి ప్రస్తావన ఇంతటితో ఆపేద్దాం… మరోలా అనుకోకండి” ఖరాఖండితంగా చెప్పాడు మామయ్య.

అమ్మానాన్నలు మారు మాట్లాడలేకపోయారు. నా మటుకు నాకు అత్తయ్య మామయ్యలు చెప్పింది చాలా కరెక్టు అనిపించింది. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలు కదా!

తరువాత కొంతసేపు లోకాభిరామాయణం మాట్లాడుకొని వాళ్ల దగ్గర వీడ్కోలు తీసుకుని మేము ప్రయాణం అయ్యాము.

నా పరిస్థితి తలచుకుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లయింది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలన్నీ విఫలమై ఏ దారి కనిపించక దిక్కుతోచని స్థితిలో నేనుంటే, నేనున్న పరిస్థితుల్లో నాకు పిల్లనివ్వడానికి కూడా ఎవరూ ముందుకు రారని తెలుసుకొని మరీ క్రుంగిపోయాను.

(ఇంకా ఉంది)

Exit mobile version