ఒక్క పుస్తకం-6

6
2

[box type=’note’ fontsize=’16’] తోట సాంబశివరావు గారు వ్రాసిన నవల ‘ఒక్క పుస్తకం‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది ఆరవ భాగం. [/box]

26

[dropcap]ఉ[/dropcap]దయం పదిన్నర కల్లా షోరూమ్‌కి చేరుకున్నాను. సుజాతక్క చేప్పినట్లు యూనిఫాంలో తయారయ్యాను. మెడలో వేసుకోడానికి సన్నని గొలుసు కూడా ఇచ్చారు. చీరెలో నన్ను నేను అద్దంలో చూసుకుని తెగ మురిసిపోయాను. కొంచెం పెద్దదానిలా కన్పించినా చాలా బాగనిపించింది. కొలీగ్‌తో నా మొబైల్‌లో అయిదారు ఫోటోలు తీయించుకున్నాను, అమ్మకు చూపిద్దామని.

పదకొండు గంటలకు నా స్థానంలో నిలుచున్నాను. మొదటిరోజు కదా! కొత్తగా వుంది. కస్టమర్లతో మాట్లాడుతుంటే కొంచెం తడబడ్డాను. ఆ సమయంలో సుజాత అక్క వచ్చి సహాయపడింది. మెళకువలు నేర్పించింది. తరువాత రోజుల్లో అలవాటు పడ్డాను. నా విధి నిర్వహణలో మిగతా వాళ్ళకు సమానంగా చేరుకోడానికి ఎన్నో రోజులు పట్టలేదు.

ఆ తరువాత రోజుల్లో నేను సేల్స్‌లో బాగా రాణిస్తూ వచ్చాను. ఆ విషయాన్ని సుజాతక్క ప్రొప్రయిటర్ దృష్టికి తీసుకెళ్ళింది. ఆయన నన్ను క్యాబిన్‌లోకి పిలిచి…

“చాలా సంతోషం శ్రీలక్ష్మీ… సుజాత చెప్తుంది. సేల్స్‌లో నువ్ చాలా అభివృద్ధి చూపిస్తున్నావట! కంగ్రాచ్యులేషన్స్… ఈ సందర్భంగా నీకో చిన్న గిఫ్ట్” అంటూ ఒక చిన్న కవర్ నా చేతి కందించారు.

“థాంక్స్ అండీ” అని చెప్పి బయటకు వచ్చి సరాసరి సుజాతక్క దగ్గరకు వెళ్ళి “థాంక్స్ అక్కా” అని చెప్తూ వంగి ఆమె కాళ్ళకు నమస్కరించాను.

సుజాతక్క నన్ను కౌగిలించుకుని నా వీపుపై ఆప్యాయంగా నిమిరింది.

ఇంటికి వెళ్ళి అమ్మ కాళ్ళకు నమస్కరించి ఆ కవర్ అందించాను. తరువాత ఆ కవర్ తెరిచి చూశాము. ఐదు వందల రూపాయల నోట్లు పది ఉన్నాయ్. జీతంతో సంబంధం లేకుండా… నా ప్రతిభకు గుర్తింపు ఈ బహుమతి. ఆ రోజు నిజంగా మాకో పండుగ రోజులా అనిపించింది.

27

రోజులు ప్రశాంతంగా గడుస్తున్నాయ్ అనుకునే తరుణంలో ఆశనిపాతంలా తగిలింది ఒక ప్రమాదకరమైన సమస్య. మా ఇంటి నుండి సిటీ బస్ స్టాప్‌కు ఒక అర కిలోమీటరు దూరం వుంటుంది. దారిలో ఒక చోట నలుగురు పోకీరీలు కూర్చుని వచ్చేపోయే అమ్మాయిలను ఏడిపిస్తుంటారు. అందులో ఒకడు నా వెంట పడుతూ అల్లరి పెడుతూ రోజూ బస్ స్టాప్ దాకా వస్తున్నాడు. గొడవెందుకులే అని సర్దుకుపోతున్నాను. ఆ రోజు వాడు ఒక అడుగు ముందుకు వేసి నన్ను పెండ్లి చేసుకొమ్మని లేకపోతే నరికేస్తాననీ, యాసిడ్ పోస్తాననీ, చంపేస్తాననీ భయపెడుతున్నాడు. అంతలోనే బస్సు వచ్చింది. వెంటనే బస్సెక్కి కూర్చున్నాను. వాడనుకున్నంత పని చేస్తాడని మనసు శంకిస్తుంది.

వీడని భయంతో షోరూమ్‌కి వెళ్ళాను. నన్ను గమనించిన సుజాతక్క విషయమేంటని అడిగింది. కొద్ది రోజులుగా దారిలో జరుగుతున్న విషయాన్ని, మరీ ముఖ్యంగా ఈ రోజు జరిగిన దాన్ని గురించి చెప్పాను.

“అర్థమైంది శ్రీలక్ష్మీ… నువ్వేమీ భయపడకు. ఈ రోజు పోలీస్ ఇన్‌స్పెక్టర్ దమయంతి మన షోరూమ్‌కి వస్తున్నట్లు ఫోన్ చేసింది. తనతో నీ విషయం మాట్లాడుతా… సహాయం చేయమని అడుగుదాం. నువ్ ధైర్యంగా ఉండు. వెళ్ళు నీ పని చూసుకో…” అని ధైర్యం చెప్పింది. మనసుకు కాస్తంత ఉపశమనం కలిగింది. డ్యూటీలో నిమగ్నమయ్యాను నేను.

సాయంత్రం నాలుగు గంటలప్పుడు ఇన్‌స్పెక్టర్ దమయంతి షోరూమ్‌కి వచ్చింది. కావల్సిన నగలను కొనుక్కుని వెళ్ళబోతుండగా సుజాతక్క నన్ను పిలిచి తనకు పరిచయం చేసింది. విషయం చెప్పి సహాయం చేయవల్సిందిగా కోరింది. కంప్లయింట్ వ్రాసివ్వమని అడిగింది. అలా వ్రాసిస్తే తరువాత కొత్త సమస్యలు ఎదురవుతాయేమోనని సుజాతక్క దమయంతితో చెప్పింది.

“సరే! నేను చూస్కుంటాను. నువ్ రోజూలాగే నీ డ్యూటీకి అదే దారిలో నడుస్తు రా” అని చెప్పి నిష్క్రమించింది దమయంతి.

మరుసటి రోజు షరా మాములే!… అదే అల్లరి… అదే బెదిరింపు… నేను బస్సెక్కి షోరూమ్‌కి వచ్చాను. సాయంత్రం ఇన్‌స్పెక్టర్ దమయంతి సుజాతక్కకు ఫోన్ చేసి చెప్పింది – వాళ్ళ టీమ్ ముందుగానే స్కెచ్ వేసి వాళ్ళని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారట! స్టేషన్‌కి తీసుకెళ్ళి ఇవ్వాల్సిన ట్రీట్‌మెంట్ ఇచ్చి, వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి, అందరికీ కలిపి కౌన్సిలింగ్ ఇచ్చారట! మరల ఇలాంటివి పునరావృతమైతే తీవ్ర పరిమాణాలుంటాయని హెచ్చరించి వదిలేశారట! సుజాతక్క ఇదంతా నాకు చెప్పి, రేపటి నుండి ఆ పోకీరీల బెడద తీరిపోయినట్లేనని చెప్పింది. అనుకున్నట్లుగానే ఆ తరువాత రోజు నుండి ఆ వెధవలు నాకు కనిపించడం లేదు. థ్యాంక్స్ టు సుజాతక్క, ఇన్‌స్పెక్టర్ దమయంతి.

28

చూస్తుండగానే క్యాలెండర్‌లో రెండు సంవత్సరాలు మారిపోయాయి. తమ్ముడు ఇంటర్మీడియట్ మంచి ర్యాంకుతో పాసయ్యాడు. పేరున్న ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కూడా సంపాదించుకున్నాడు. రేపటి నుండి కాలేజీకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి అందరం భోంచేసి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాము. అప్పుడు తమ్ముదికి కొన్ని మంచి విషయాలు, జాగ్రత్తలు చెప్పాలనిపించింది.

“చూడు తమ్ముడూ! రేపటి నుండి నువ్వు ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్‌వి. చూస్తుండగానే పెద్దవాడివయ్యావు. ఆడపిల్ల పెద్దదైతే అదో రకమైన సమస్యలు. మగపిల్లవాడు పెద్దాడైతే మరో రకమైన సమస్యలు, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, దుర్వ్యసనాలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు…. వీటికి ఎక్కడ బానిసైపోతాడో, ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటాడో అనే భయం. అందుకే, నీకు చెప్పదలచుకున్నాను. ప్రతి విషయంలో ఆచితూచి అడుగేయాలి. మంచి అలవాట్లు, మంచి స్నేహితులు వుండేట్లు చూసుకోవాలి. బాగా చదువుకోవాలి. నీ మీద మేము పెట్టుకున్న ఆశలను వమ్ము చేయవని నమ్ముతున్నాము. మరి… నువ్వేమంటావ్?” అని అడిగాను.

“అక్కా! నా జీవితానికి నేనొక గోల్ పెట్టుకున్నాను. నేను బాగా కష్టపడి చదవాలి. మంచి ఉద్యోగం సంపాదించలి. నీకూ, అమ్మకూ ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. మనమంతా సంతోషంగా, హాయిగా జీవించాలి. అదే నా గోల్! ఇది తప్ప నాకు వేరే ఆలోచనలు వుండవు. రావు కూడా. నా విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు” ఆవేశంగా చెప్పాడు తమ్ముడు.

“చాలా సంతోషంరా తమ్ముడూ… చాలా పెద్దరికంగా, బాధ్యతాయుతంగా మాట్లాడావు. అలాగే ముందుకు సాగిపో… బాగా చదువుకో… భగవంతుడు నీకు అంతా మంచే చేస్తాడు” అని భుజం తట్టాను.

తమ్ముడి మాటలతో అమ్మ ముఖంలో ఎంతో సంతోషం, తృప్తీ కనిపించాయి.

“చూశావా అమ్మా… తమ్ముడు నీ గురించి నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నాడో. వాడు చాలా మంచోడమ్మా” అన్నాను అమ్మతో.

“అవునమ్మా! దేవుడు వాణ్ణి చల్లగా చూడాలి” అంటూ తమ్ముడిని దీవించింది అమ్మ.

“ప్రస్తుతం నీ గురించే నా దిగులంతా…” అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది అమ్మ.

“నా గురించి దిగులా!… నాకేం… నేను బాగానే వున్నాను కదమ్మా!” ఆశ్చర్యంగా అన్నాను నేను.

“ఏం బాగమ్మా… ఒక అచ్చటా లేదు… ఒక ముచ్చటా లేదు… ఇంటి కోసం బయటకెళ్ళి మగరాయుడిలా కష్టపడుతున్నావ్. నీ తోటి వారందరూ పెండ్లిళ్లు చేసుకుని పిల్లా పాపలతో సంసారం చేసుకొంటున్నారు. నిన్ను కూడా ఒక అయ్య చేతిలో పెట్టి ఒక ఇంటి దాన్ని చేస్తే… నా గుండెల మీది కుంపటిని దించినట్లవుతుంది. భగవంతుడు ఎప్పుడు దయచూస్తాడో ఏమో” అంటు ఏడుస్తూ పైట చెంగు నోటికి అడ్డుపెట్టుకుంది.

“అమ్మా! కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదన్నారు పెద్దలు. ఆ టైమ్ వస్తే వాటంతట అవే అన్నీ జరుగుతాయ్. నువ్వేమీ అధైర్యపడకు. సంతోషంగా వుండు” అని అమ్మను ఓదార్చాను.

రేపు ప్రొద్దున్నే లేవాలి, తమ్ముడు కాలేజీకి తయారవ్వాలి, వాడితో కలిసి కాలేజీకి నేను కూడా వెళ్దామనుకున్నాను. ఎందుకంటే మొదటి రోజు కదా! కాలేజీలో వాడికి కావల్సినవన్నీ సమకూర్చాలి. రేపు డ్యూటీకి రావడం లేదని సుజాతక్కకు చెప్పేవచ్చాను. ముగ్గురం నిద్రకు ఉపక్రమించాము.

29

మరుసటి రోజు తమ్ముడితో కలిసి వాడు చదవబోయే కాలేజీకి కాలేజీ బస్సులోనే వెళ్ళాను. కాలేజీకి చేరుకోవడానికి గంటకు పైగా టైమ్ పట్టింది. చాలా పెద్ద కాలేజీ. చాలా గొప్పగా ఉంది. తమ్ముడు చాలా అదృష్టవంతుడనిపించింది. మంచి కాలేజీలో సీటు దొరికింది మరి. కొత్తగా కాలేజీలో చేరబోతున్న విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు… అందరూ హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. వాళ్ళందరి ముఖాల్లో ఆనందం, ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయ్.

ఫీజులన్నీ కట్టేశాను. బుక్స్ కలెక్ట్ చేసుకున్నాము. అప్పటికే మధ్యాహ్న భోజనం టైమయ్యింది. ఇద్దరం కలిసి కాలేజీ క్యాంటీన్‍లో భోంచేసాము. భోజనం రుచిగా, శుచిగా వుంది.

“అక్కా! ఇక నువ్ ఇంటికెళ్ళక్కా! నేను వెల్‍కం క్లాసుకు అటెండ్ అయి సాయంత్రానికి ఇంటికి వస్తాను” అని చెప్పి క్లాసుకు వెళ్ళాడు తమ్ముడు.

ఒకసారి కాలేజీ అంతా కలియదిరిగాను. ప్లే గ్రౌండ్స్, లైబ్రరీ, ప్రయోగశాలలు, ఆడిటోరియం అన్నీ చూశాను. చాలా చాలా బాగున్నాయ్.

కాలేజీ బస్సులోనే సిటీ చేరుకున్నాను. బస్సులో వున్న కొందరు సీనియర్ స్టూడెంట్స్ యన్.టి.ఆర్. స్టేడియంలో జరుగుతున్న బుక్ ఫెయిర్ గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను. తమకు పనికొచ్చే పుస్తకాలు కొనుక్కుందామని కూడబలుక్కుని వాళ్ళంతా స్టేడియం దగ్గర దిగారు. నాక్కూడా ఏదైనా పుస్తకాలు కొనుక్కోవాలనిపించింది. అందుకే వారితో పాటు నేనూ బస్సు దిగాను.

స్టేడియం ప్రవేశ ద్వారం దగ్గర కట్టిన బ్యానర్‌లో ‘ఒక్క పుస్తకం మీ జీవితాన్ని మార్చేస్తుంది’ అని వ్రాసి వుంది. పుస్తకం ఏంటి? జీవితాన్ని మార్చేయడమేంటి? ఆశ్చర్యంగా వుందే!… సరే… ఆ పుస్తకం కొనుక్కుని చదువుదామని నిర్ణయించుకుని 123 స్టాల్ దగ్గరకు వచ్చాను. అక్కడ మన ముగ్గురం కలుసుకున్నాం” అంటూ ముగించింది శ్రీలక్ష్మి.

‘హమ్మయ్య! ఒక పెద్ద పనై పోయింది’ అనుకుంటూ ఒక నిట్టూర్పు విడిచింది శ్రీలక్ష్మి.

30

శ్రీకాంత్, శ్రీలక్ష్మి తమ గురించి చెప్పిన విషయాలన్నీ విన్న సదానంద్,

“గుడ్… ఇప్పుడు మనం ఒకరి గురించి ఒకరం పూర్తిగా తెలుసుకున్నాం. మున్ముందు మనం చేపట్టబోయే బృహత్ కార్యక్రమానికి నాంది పలికిపట్టినట్టే. ఇక మనం ఎలా ముందుకు సాగబోతున్నామో తెలుసుకుందాం. అందుకు మనం మరోసారి ఇంకో అయిదు రోజుల్లో అంటే వచ్చే శుక్రవారం ఇక్కడే కలుసుకుందాం. ఓ.కే.నా?” అని అడిగాడు.

“ఓ.కే. సార్” అన్నారు శ్రీకాంత్, శ్రీలక్ష్మి.

“గుడ్… అయితే ఈ లోపు ‘ఒక్క పుస్తకం మీ జీవితాన్నే మార్చేస్తుంది’ అనే ఈ పుస్తకాన్ని ఇద్దరూ పూర్తిగా చదవడం” అంటూ సంచిలోంచి రెండు పుస్తకాలను తీసి చెరోటి ఇచ్చాడు సదానంద్.

“ఆ… బాగా చీకటి పడింది. మీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఇక మీరు బయలుదేరండి… మరి… వచ్చే శుక్రవారం… సేమ్ ప్లేస్… సేమ్ టైమ్… మరిచిపోకండి” చెప్పాడు సదానంద్.

“అలాగే సార్… తప్పకుండా వస్తాము” చెప్పారు శ్రీకాంత్, శ్రీలక్ష్మి.

ముగ్గురూ తమ తమ ఇళ్ళకు బయలుదేరారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here