[dropcap]వ[/dropcap]సంతమై నిలిచి పోవాలన్న తన స్వప్నాన్ని
దుఃఖపు వరదను చేసుకుంటూ
నీ హృదయ ధూళిని కడిగి
తన పచ్చదనాన్ని పరుస్తూ
ఎండి మోడౌతున్న నీ దేహానికి
ఆశల చిగురులు తొడిగి
తాను బెరడై రాలిపడుతూ
నీవు గ్రహించకున్నా
తాను సర్వం కోల్పోతున్నా
తన సంతోషాన్ని
నీ అస్తిత్వపు ఆనందాన్ని చేస్తూ
చలిగాలి కాట్లకు వణికే నిన్ను
కొసప్రాణపు చేతులతో చుట్టి
తన చివరి వూపిరి తోనూ
నీకింకొక రంగునద్దుతూ
వర్షమో గ్రీష్మమో శిశిరమో అవుతున్న
తన అడియాసల కింద దాగిన
ఆశల కలలకు
నులివెచ్చని రూపమిచ్చేందుకు
నీవూ ఒక్క వసంతమై చూడు!