[కన్నడంలో శ్రీ ప్రేమశేఖర్ రచించిన ‘Om Namah Shivaya’ అనే కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ చందకచర్ల రమేశబాబు. ఇది మొదటి భాగం.]
[dropcap]“T[/dropcap]his is London calling Asia in the Eastern services of BBC. Our next programme is in Urdu..”
సౌత్ ఏసియా విశ్వవిద్యాలయం గెస్ట్ హౌస్ రూము బాల్కనీలో కళ్ళు మూసుకుని కూర్చుని నాలుగు సంవత్సరాల క్రితం తన అమ్మ ఇచ్చిన ఎనిమిది బ్యాండ్ల చిన్న సోని ట్రాన్సిస్టర్‌లో ఆకాశవాణి జైపూర్ కేంద్రం నుండి తేలివస్తున్న ‘నిశా గీత్’ విని, అది అయిపోగానే అలవాటుగా బ్యాండ్ పట్టీని ఎడమకు జరిపి షార్ట్ వేవ్ పంతొమ్మిదవ మీటర్ బ్యాండ్‌కు తెచ్చి, ట్యూనర్ వీల్‌ను కిందికి తిప్పసాగాడు ఆదిత్య. వార్తల ముఖ్యాంశాలు వినడమా లేదా ‘సోని చిన్నూ’ను ఆపేసి పడక వేయడమా? సమయం అప్పుడే పదిన్నర. ఉదయం నాలుగున్నరకెల్ల ఏర్పోర్ట్‌లో ఉండాలి.
వెనుకటి పదివేల సంవత్సరాలలో భారతదేశపు పశ్చిమ తీరంలో సముద్ర మట్టంలో జరుగుతూ వస్తున్న మార్పులకు సంబంధించిన కొత్త పరిశోధనల గురించి, సౌత్ ఏసియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల అంతర్జాతీయ సెమినార్ ఈ రోజు ముగిసింది. దాంతో పాటే సెమినార్లో పరిశోధనా వ్యాసాన్ని సమర్పించడానికి మంజూరైన ఆన్ డ్యూటీ సెలవు కూడా నేటితో అయిపోయింది. రేపు తొమ్మిదిన్నరకల్లా విశ్వవిద్యాలయంలో డ్యూటీలో ఉండాలి. పదిన్నరకి ఎంఎ మూడవ సెమిస్టర్ వాళ్ళకు, పన్నెండున్నరకు ఎంఎ మొదటి సెమిస్టర్ వాళ్ళకు తరగతులున్నాయి. వాటిని మిస్ చేస్తే, డీన్‌కు చాడీలు చెప్పడానికి హెచ్.ఓ.డికి ఒక అవకాశం ఇచ్చినట్టవుతుంది. దానివలన అసిస్టెంట్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవికి వెళ్ళాలనుకున్న తన ఆశయానికి దెబ్బ పడవచ్చు. అసలే హెచ్.ఓ.డికి తన పైన రుసరస. ఇంకో రెండు రోజుల్లో ఇంటర్వ్యూలున్నాయి. ఈ సమయంలో తన గురించి ఏదైనా చెడ్డగా చెప్పి, తన ప్రియమైన విద్యార్థిని చంపకవల్లికి ఇమ్మనవచ్చు. ఇవన్నీ ఆలోచించి ‘సోనీ చిన్నూ’ గొంతు నొక్కేసి నిద్రకు ఉపక్రమించాలని నిర్ణయించి వాల్యూం నాబ్‌ను తిప్పేంతలో తనకు ఇష్టమన గజాలా శమీమ్ గొంతు వినిపించింది. ఆమె రాగబద్ధమైన గొంతుకను కొంచెం విని తరువాత గొంతు నొక్కుదామనకునేంతలో గజాలా శమీమ్ తన ముద్దు గొంతుతో “ఏ బిబిసి లండన్ హై” అంటూ అనౌన్స్ చేసి ముందు వార్తలను వినిపించడానికి తయారయ్యింది. ఇక వార్తలు వినే ఓపిక కోల్పోయి దాన్ని పక్క పైన విసిరేసి నీళ్ళ బాటిల్‌ను తీసుకోవడానికి చేయి చాచాడు.
చాచిన చెయ్యి అలాగే ఆగిపోయింది. సోనీ చిన్నూలో నుంచి ఒక కొత్త గొంతుక. ఎవరిదబ్బా ఈ కొత్త గొంతు? ఇప్పటిదాకా వినలేదే! అనుకుని వార్తలు వినడానికి తయారయ్యాడు. మొదటి వార్త అతడిని తల్లడిల్లజేసింది. ఆశ్చర్యం, దిగ్భ్రమ, నిరాశలను దాటి అగాధమైన కోపం పొంగేలా ఉందది. ఆమె చెప్పసాగింది “భారత్ కా జునూబి సుబా వజీర్-ఎ-రియాసత్ జనాబ్ ఆజ్ శామ్ అక్బారీ నుమాయిందోం కె సాథ్ ఏక్ ములాకాత్ మె యెహ్ బాత్ దొహ్రాయి హై కి ఇస్తాంబుల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మరీన్ ఆర్కియాలజి కా రిపోర్ట్ కె ముతాబిక్ దరియా-ఎ-గంగావలి మె పాయా గయా శివ్ లింగ్ బారాహ్ సౌ సాల్ పురానా హై..”
తరువాతి వివరాలను వినే సహనం కోల్పోయి సోనీ చిన్నూను ఆపేసి తలకాయ పట్టుకుని కూర్చున్నాడు యువ పురాతత్వ శాస్త్రజ్ఞుడు డా. ఆదిత్య..
చాలా సేపటి తరువాత తల ఎత్తి టేబుల్ పైనున్న, ఉదయం తరగతిలో చెప్పి, అడిగిన ప్రశ్నలకు సమర్థవంతంగా జవాబులిచ్చి, కాలరెగరేసి పోడియం దిగి మళ్ళీ మళ్ళీ ఆ ఫోల్డర్‌ను తడిమి చూసుకుని మురిసిపోయిన తన పరిశోధనా వ్యాసం కాయితాలు, పిపిపి ఉన్న పెన్ డ్రైవ్ తనను వెక్కిరించినట్టయింది.
వాటివైపు నిరాశగా చూసి కళ్ళు మూసుకున్నాడు. మస్తిష్కంలో ప్రశ్న తొలిచింది – తను, డా. నీహారికా కల్యాణ్‌పుర్ కలిసి ఆహార నిద్రలు మాని ఒకటిన్నర సంవత్సరాలనుండి జరిపిన కష్టతరమైన పరిశోధన ఉన్నట్టుండి ఫెయిలయిందా? మా ఇద్దరి అకెడమిక్ జీవితంలోని ఒకటిన్నర సంవత్సర సమయం వ్యర్థమై, అరేబియా సముద్రంలో కలసిపోయిందా? తప్పెక్కడ జరిగింది?
మూసుకున్న రెప్పల చాటున గడచిన పద్దెనిమిది నెలలు విచ్చుకోసాగాయి.
***
ఇదంతా ప్రారంభమయ్యింది రెండు సంవత్సరాల క్రితం, చాలా ఆకస్మికంగా..
ప్రి-క్రిశ్చియన్ యుగంలో భారతదేశానికి పడమర తీరం, దాక్షిణాత్య ఆఫ్రికా తూర్పు తీరం ప్రజల నడుమ ఉన్న సముద్ర సంపర్కం గురించిన దక్షిణ ఆఫ్రికావారి దర్బాన్ విశ్వవిద్యాలయం ఏర్పరచిన అంతర్జాతీయ సెమినార్‌లో పాల్గొన్న ఆదిత్యకు తారసపడింది డా. నీహారకా కల్యాణ్‌పుర్. సంవత్సరం క్రితమే పిహెచ్.డి పదవిని పొంది పుణెలోని డెక్కన్ కాలేజిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న తన అమ్మాయిని ఒంటరిగా అంత దూరం పంపించలేక తమ ఖర్చుతో ఆమె వెంట వచ్చారు తండ్రి నారాయణ కల్యాణ్‌పుర్ గారు. మరుసటి రోజు డర్బాన్ ప్రాంత గవర్నర్ గారు ఇచ్చిన విందు తరువాత బయటికి గాలి పీల్చుకోను వచ్చిన ఆదిత్యను వీరిద్దరూ కలిశారు. అప్పుడు జరిగిన మాటల సందర్భంలో నారాయణ గారు చెప్పిన ఒక విషయం ఆదిత్య చెవులను రిక్కించేలా చేసింది.
గంగావళి నది సముద్రాన్ని చేరే స్థలంలో నారాయణ గారి ఒక రిసార్ట్, సముద్ర గంగా. అక్కడే ఆయన ఇల్లు కూడా. డిసెంబర్ ౨౦౦౪లో తూర్పు తీరాన్ని తాకిన సునామి దెబ్బ ఇక్కడ కూడా కనిపించింది. ఆ రోజు ఉదయం అరేబియా సముద్రం వెనక్కి జరిగి తన ముందు పరచిన దృశ్యాన్ని మరవలేక పోయారు నారాయణగారు. అంత దూరంలో ఇంగ్లీష్ యు ఆకారాన్ని పోలే ఒక రాతి ఆకారం. పాచి కట్టుకుని, సముద్ర సస్యాలతో నిండి ఉన్నా, అది రాతి కట్టడమేనని స్పష్టంగా గోచరించింది. కొన్ని నిమిషాలలోనే మళ్ళీ సంద్రం పొంగి దాన్ని ముంచేసింది. తరువాత అది సముద్రంలో మునిగిపోవడమే కాదు, ఆయన మనసునుండి కూడా మరుగైపోయింది. ఆ విషయాన్ని పంచుకోవడానికి సరైన మనుషులు దొరకనేలేదు. అలా మరచిపోయిన విషయం మళ్ళీ గుర్తుకు వచ్చింది, నీహరిక పడమర కనుమల జారుడ్లో కనిపించిన నవశిలాయుగపు మానవ వసతుల గురించి పరిశోధన మొదలుపెట్టినప్పుడే. అలా గుర్తుకు వచ్చినా తను చూసిన దానిని సరైన పదాల్లో తన కూతురికి చెప్పలేకపోవడం కూడా ఆయనను కలవరపరచింది.
పెద్దల మాటలు, ఆదిత్య ఆసక్తికరమైన ప్రశ్నలు, తండ్రి నిమీలిత నేత్రాలతో గుర్తు తెచ్చుకుని మరీ చెప్తున్న వివరాలు నీహారికలోనూ కుతూహలాన్ని పెంచాయి. డర్బాన్ నుండి బయలుదేరే సమయానికి ఆ విషయంలో కొంత కలిగజేసుకోవాలని ఇద్దరూ అనుకున్నారు. కానీ ఆ దిశలో సాగడం అంత సులభమేం కాదు. మరీన్ ఆర్కియాలజిలో సర్టిఫికేట్ కోర్స్ చేసిన ఆదిత్య సముద్రంలో మునగడం, అడుగుకెళ్ళి చూడడం, నీటి అడుగు ఛాయాగ్రహణం విషయాలలో ఒక స్థాయి వరకు తెలుసు. కానీ జగదాంబతోపాటు టీములో మిగతా వాళ్ళకు దీని గురించి ఏమీ తెలియదు. వాళ్ళదేమున్నా నేలను తవ్వడం మాత్రమే. కాని వెనుకంజ వెయ్యడానికి ఆదిత్య తయారుగా లేడు. జగదాంబ తనకు వీలైనంత సహాయం చేస్తానని చెప్పింది.
అక్కడ కూడా సమస్య ఎదురైంది. గంగావళి నది సముద్రంలో కలిసే చోట ఏర్పడిన కయ్యలో సముద్రపు నీరు పారదర్శకంగా లేక పది పదిహేను అడుగుల తరువాత ఏమీ కనిపించేది కాదు. ఇరవై అడుగుల లోతులో చిత్రాలు తీయడం అసాధ్యం. మరి అక్కడ నలభై-నలభై ఐదు అడుగుల లోతులో ఏముందని కనిపెట్టడం ఎలా?
అప్పుడు ఆదిత్యకు సహాయ హస్తం అందించింది అతడి పెహెచ్.డి గైడుగా ఉన్న ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ప్రొ. హితేశ్ రావత్. ఆయన మాట సహాయం వలన నియోట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజి) ఆదిత్యకు సముద్రపు అడుగున చేసే సర్వే గురించిన రెండు వారాల శిక్షణనిచ్చింది. అలాగే సోనార్, సబ్ బాటం ప్రొఫైలర్ ఉపకరణాల నుండి వచ్చిన సమాచారాన్ని కంప్యూటర్లో ఫీడ్ చేసే విధానాన్ని జగదాంబకు నేర్పింది. అంతే కాకుండా అవసరమైన ఉపకరణాలతో తన ఇద్దరు జూనియర్ విజ్ఞానులు కొన్ని రోజుల పాటు వీరికి సహాయపడేలా కూడా చేసింది. అప్పుడు జరిగింది చరిత్రనే మార్చే పరిశోధన. అలాగని ఆదిత్య, జగదాంబ ఇద్దరూ గట్టిగా నమ్మారు. వారి సంవత్సరంన్నర పరిశోధన వారికి ఆ గట్టి నమ్మకాన్ని కలిగించింది.
ఆదిత్య జట్టు నారాయణ కల్యాణ్‌పుర్ గారు చూసిన ఆకారాన్ని రెండు రోజుల్లో కనిపెట్టింది. అది ప్రాకృతికం కాదని, మనిషి నిర్మించినదని అనిపించినా దానికంటే ఎక్కువ సమాచారం దొరకలేదు. దాని గురించే ఇంకా ముందుకెళ్తే దొరికేదేమో! కాని ఆదిత్య ఏకాగ్రతను ఆకర్షించింది ఆ ఆకారంలోకి దిగుతున్నఇరవై నాలుగు మెట్లు. వాటి కింద పన్నెండు అడుగుల వెడల్పున్న దారి సముద్రం వైపు సాగుతూ కనిపించింది. ఆ చీకటిలో ఆ దారి ఎంత దూరం, ఎటు వైపుకు వెళుతుంది అని తెలుసుకునేలా లేదు. అప్పుడు ఆదిత్య తనతో పాటు వచ్చిన నియోట్ విజ్ఞానులు కిశన్ రెడ్డి, అమిత్ మౌర్య సహాయంతో వారు తెచ్చిన పనిముట్లతో సముద్రపు అడుగులోని ఇమేజ్‌లను తీసుకుని కంప్యూటర్లో విశ్లేషించాడు.
అప్పుడు కనిపించిన చిత్రాల ఇమేజ్‌లు ఆదిత్య కుతూహలాన్ని తారుమారు చేశాయి. అయితే విజ్ఞానులను, ఉపకరణాలను ఇంకా ఎక్కువ రోజులు కొనసాగించడానికి నియోట్ సంస్థకు వీలుకాలేదు. అలా ఒక రెండు నెలల పాటు పరిశోధనా కార్యాలు ఆగిపోయాయి. చివరికి కావలసిన పరికరాలను తనే స్వంతంగా కొని, ఎడతెగకుండా సముద్రపు అడుగు ఇమేజ్‌లను తీసి, పద్ధతిగా విశ్లేషించసాగిన ఆదిత్య, నీహారికాల ఎదురుగా కొన్నిఅద్భుతాలు తెరుచుకోసాగాయి.
అప్పటికే సహోద్యోగుల కళ్ళల్లో ‘టీమ్ ఎ అండ్ ఎన్’ అని పేరు తెచ్చుకున్న ఆదిత్య, నీహారిక జట్టుకు ముందుగా తెలిసి వచ్చింది సముద్రపు అడుగున రెండుగా చీలి కొనసాగిన నదీప్రవాహం. ఈ రెండు పాయలు గంగావళి నదియొక్క కొనసాగిన భాగాలై ఉండి, అవి వెనుకటికి నేలపై కూడా ప్రవహించిన సూచనలయితే సైడ్ స్కానర్ సోనార్ ఇమేజ్‌లలో కళ్లకు కొట్టినట్టు కనిపిస్తున్నాయి. అవి ఎప్పడు సముద్రంలో కలిసిపోయి ఉండవచ్చు అనే ప్రశ్నకు ఆదిత్యవద్ద సులభంగా అర్థమయ్యేలా సమాచారం ఉండింది. భూ విజ్ఞాన, సాగర విజ్ఞాన శాస్త్రవేత్తలు కలసి ఇప్పటిదాకా సేకరించిన సమాచారం ప్రకారం, తొమ్మిది నుండి పదివేల సంవత్సరాల క్రితం హిమయుగం అంతరించి ఉష్ణయుగం ప్రారంభమవుతూ పోయినట్లల్లా ప్రపంచమంతటా సముద్ర మట్టం పెరుగుతూ పోయింది. అప్పుడు మన పశ్చిమ తీరాన ఉన్న అరేబియా సముద్రం కూడా ముందుకు వస్తూ సుమారు నూట ఇరవై అడుగులు పెరిగింది. అనగా గంగావళి నదీ పాయలు సముద్రపు నీటిలో అంతర్థానమై అన్ని సంవత్సరాలయ్యాయి.
అప్పుడు నాగరిక మనుష్యులే లేరు. కాబట్టి ఈ జలప్రళయ ప్రమాదం ఎక్కడా దాఖలు కాలేదు అని ఆ విజ్ఞానుల, పురాతత్వ శాస్త్రజ్ఞుల, చరిత్రకారుల అభిప్రాయం. ఆదిత్య మెదడులో మెదలుతున్న ఈ విషయాన్నే నీహారిక చిన్నగా చెప్పినప్పుడు ఆదిత్య చిన్నగా నవ్వాడు. సైడ్ స్కాన్ సోనార్ నుండి తీసిన చిత్రాలను తనే 3డి ఇమేజ్‌లుగా చేసినవాటిని పెద్దగా చేసి ఆమెకు చూపగా ఆమె ఆశ్చర్యంతో నోరు తెరిచింది.
కంప్యూటర్ తెరపై ఇప్పటి రేవునుండి పడమరకు ఒక ఇరవై కిలోమీటర్ల దూరం వరకు సాగిన ప్రాచీన నదీ ప్రవాహాల మధ్య ఒక నగరపు అవశేషాలు పరచుకుని కనిపించాయి ఆ నగరంలో దీర్ఘచతురస్రంగా, చదరంగా ఉన్న కట్టడాల గుర్తులు ఉత్తరం నుండి దక్షిణానికి, తూర్పునుండి పడమరకు పద్ధతిగా సాగి కనిపించాయి. వాటి నడుమ ఇరుకైన నేరుగా, ఖాళీగా ఉన్న స్థలాలు బహుశ దారులై ఉండాలి. ఈ నగరం తొమ్మిది కి.మీ. దూరం, రెండున్నర కి.మీ వెడల్పు ఉన్నట్టు కనిపించాయి. అదొక పెద్ద నగరమే అయ్యుండాలి అనిపించింది.
కంప్యూటర్ తెరపైన ఈ రచన ఇమేజ్‌ను చూస్తూ ఆదిత్య సఖేదాశ్చర్యాలలో మునిగిపోయాడు. అతడి నోటినుండి మాటే పెగల్లేదు. నీహారిక అతడి స్థితిని అర్థం చేసుకున్నది. “ఇది.. ఇది.. మొహంజొదారోలోని స్నానగృహం నకలు!” అంటూ కంపిస్తున్న చిన్నగొంతుతో అంది. “ఎస్” అంటూ ఆదిత్య ఆమె చేతిని అదిమాడు.
నగరం ఇమేజ్‌ను చూస్తూ పోయినట్టల్లా వారిద్దరి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. నగరానికి పడమరలో ఎత్తైన దిమ్మ పైన ౬౦౦ అడుగులు పొడవు, ౧౫౦ అడుగులు వెడల్పు ఉన్న రచన, దాన్ని ఎక్కడానికి కుడివైపు మెట్లు, లోపల ౬౦ అడుగుల చతురస్రాకారపు గదులు కనిపించగానే “ఇది మొహంజాదారో, హరప్పా, కాలిబంతాన్‌లలో దొరికిన కోట!” అంటూ దాదాపు అరిచేశాడు ఆదిత్య. “అవును!” అంటూ నీహారిక అతడి అరచేతిని అదిమింది.
‘టీమ్ ఎ అండ్ ఎన్’కు దొరికింది ఊహించను వీలుకాని విధంగా సింధు-సరస్వతి నాగరికతకు సంబంధించిన నగరపు నకలు. అంటే ఆ మహాన్ నాగరికత ఇంత దక్షిణానికి వ్యాపించిందా? అదీ కాకుండా ఈ నగరం సుమారు తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే అనగా మొహంజొదారో నగరం ఏర్పడడానికి కనీసం మూడున్నర వేల సంవత్సరాలకు మునుపే సముద్రంలో మునిగిపోయిందా? హిమయుగం ముగిసి ఉష్ణయుగం ప్రారంభమవుతుండగానే సముద్రాల మట్టాలన్నీ పెరుగుతూ పోయి, భారతీయ ద్వీపకల్పం యొక్క పశ్చిమ తీరంలోని విశాలమైన నేలభాగం సముద్రంలోకి కలవడానికి సుమారు ఏడెనిమిది వందల సంవత్సరాలు పట్టాయి అన్నది సాగర విజ్ఞానం ఘంటాపథంగా చేప్పే మాట. అనగా ఇప్పుడు ఇక్కడ దొరికిన ఈ నగరాన్ని సముద్రం నిదానంగా మింగుతుండగా ఇక్కడి ప్రజలు ఉత్తరానికి వలస వెళ్ళి తమ జ్ఞాపకాల ఆధారంగా ఇలాంటి నగరాన్ని కట్టారా? సింధు-సరస్వతి నాగరికత ఉగమం ఇక్కడే జరిగిందా? సింధు-సరస్వతి నాగరికతను ఎక్కడినుండో తీసుకొచ్చి పంజాబ్, గుజరాత్, రాజస్తాన్ లలో నాటినట్టుంది: పూర్తిగా నాగరికులైన ప్రజలు ఎక్కడినుండో వచ్చి ఇక్కడ ఒక సువ్యవస్థిత నాగరికతను సృష్టించినట్టుంది అని పురాతత్వ శాస్త్రజ్ఞుల, చరిత్రకారుల సందేహాలకు నిర్ధిష్టమైన జవాబు దొరికినట్లయిందా? అలా ఉత్తరానికి వెళ్ళేటప్పుడు మహారాష్ట్ర, గోవా, కర్నాటక తీరాలలో కూడా ఇలాంటి నగరాలను ఎందుకు నిర్మించలేదు? మరి అవి ఇంతవరకూ ఎందుకు కనిపించలేదు? ఆదిత్య, నీహారికలు మళ్ళీ మళ్ళీ తమను తామే ప్రశ్నించుకున్న ప్రశ్నలివి. వీటి జవాబులకోసం తమ ఇద్దరి జీవితాల్నే అంకితం చేసుకోవల్సి వస్తుందని బయటికి చెప్పకపోయినా మనసులో మాత్రం గట్టిగా అనిపించసాగింది.
“టీం ఎ అండ్ ఎన్” పరిశోధనల వివరాలు మాధ్యమాల్లో క్రమంగా రావడం మొదలవగానే మెచ్చుకోలు కంటే విమర్శలే ఎక్కువగా వచ్చాయి. వీళ్ళిద్దరూ కంప్యూటర్ తెరపైన చూపుతున్న సైడ్ స్కానర్ సోనార్ ఇమేజ్‌లు నకిలీవని, కంప్యూటర్ గిమ్మిక్కులని పెద్ద పెద్ద పురాతత్వ శాస్త్రజ్ఞులు చెప్పసాగారు. ఈ అపప్రచారంలో కొంతమంది సహోద్యోగులు కూడా కనిపించారు.
ఇలాంటి నిరాశాదాయక సన్నివేశంలో వివరమైన ఉపన్యాసం ఇవ్వాలని విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నుండి వచ్చిన ఆహ్వానం ఆదిత్యకు సంతసాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఉపన్యాసాన్ని తమ విభాగం ఏర్పరిచుంటే బాగుండేదని అనిపించినా. అక్కడి లేత మనసులతో తన కొత్త ఆలోచనలు పంచుకోవడం మెరుగే అనిపించి నీహారికా రెండు రెండు సార్లు ఫోన్లు చేసి ఆదిత్యను ఉత్సాహపరచింది. కానీ తను అందులో పాల్గొనలేకపోతున్నానని ఆమెకు నిరాశ. ఆమె విశ్వవిద్యాలయానికి ముందు నెల వస్తున్న న్యాక్ కమిటికోసం డిపార్ట్ మెంటి ఫ్యాకల్టి ప్రొఫైల్ తయారు చేసే బాధ్యతను ఆమె పైన పెట్టారు ఆమె హెచ్.ఓ.డి గారు.
ఇటీవల విశ్వవిద్యాలయ విద్యార్థుల్లో దేశీయవాద ఆలోచనలకు, దేశభక్తికి ప్రాధాన్యతనిచ్చే సిఎంఐ అనగా చిల్డ్రన్ ఆఫ్ మదర్ ఇండియా విద్యార్థి సంఘటన పేరు సంపాదించుకొంటోంది. దాని ఫలితంగా రెండు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సహ కార్యదర్శి పదవులు ఈ సంస్థకే దక్కాయి. ప్రధాన కార్యదర్శి పదవి మాత్రం అనేక సంవత్సరాలనుండి ప్రభావశాలిగా ఉన్న వామపంథ విద్యార్థి సంఘటన ఎస్ ఎస్ ఐ (సోషియలిస్ట్ స్టూండెట్స్ ఆఫ్ ఇండియా)కు దక్కింది. దీనివలన విద్యార్థి సంఘం అనేక ఘర్షణలకు లోనైంది. తీవ్ర దేశీయవాద మనోభావం కలిగిన అధ్యక్షురాలు లతా రై టీం ఎ అండ్ ఎన్ సభ్యులు తమ పరిశోధనల గురించి, వాటి గురించి జరుగుతున్న పరిశోధనల గురించి జరుగుతున్న అనుకూల-వ్యతిరేక వాదనల పట్ల ఆసక్తి చూపుతూ, వాటి గురించి వివరమైన ఉపన్యాసం ఇవ్వాలని ఆదిత్యను ఆహ్వానించారు.
తరగతులన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఐదున్నరకు ఆడీటోరియంలో ప్రారంభమైన సబా కార్యక్రమంలో లతా రై మాట్లాడుతూ “..మనందరూ మెచ్చుకునే యువ విజ్ఞానులైన డా. ఆదిత్య, డా. నీహారికా పరిశోధించిన పురాతన నగర అవశేషాలు, చరిత్ర గురించిన మన పరిధిని విస్తారంగా పెంచగలిగేవని నా అభిప్రాయం. ఒక విజ్ఞాన పరిశోధనా విద్యార్థినిగా డా. ఆదిత్య, నీహారికలు తమ పరిశోధనా కార్యక్రమంలో ఉపయోగించిన వైజ్ఞానిక విధానాలకు నా సహమతం ఉంది. వారి పరిశోధనా విధానాన్ని గౌరవిస్తాను. చరిత్రను మలుపు తిప్పే ఒక చిరస్మరణీయమైన పరిశోధనను అభినందిస్తున్నాను. ఇప్పటి దాకా చరిత్రకారుల ప్రకారం మొట్టమొదట నగరాలను నిర్మించినవారు సుమేరియన్లు. అది ఐదువేల సంవత్సరాల క్రితం. కానీ గంగావళి కయ్యలో కనిపించిన పురాతన నగరం కనీసం తొమ్మిదివేల సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయిందని సాగర విజ్ఞానం ప్రకారం నిర్వివాద అంశం కాబట్టి ప్రపంచంలో మొట్టమొదట నగరనిర్మాణం మన నేలలోనే జరిగిందని మనమంతా గర్వపడేలా ఉంది. అంతే కాదు. మెహ్ర్ ఘర్ తవ్వకాల ఆధారం పైన దక్షిణ ఆసియాలో నాగరికత ప్రారంభమయ్యిందే తన దేశంలో అని వీగుతున్న పాకిస్తాన్ గర్వానికి సూది గుచ్చినట్టయింది. కాబట్టి డా. ఆదిత్య, ఆయన జట్ల ప్రయత్నాలను వారి నుండే విని తెలుసుకోవడం మనకు ఎంతైనా అవసరం. అదీ గాక మన అదృష్టం కూడా..”
చరిత్ర విద్యార్థిని కాకపోయినా తన పరిశోధన గురించి ఆసక్తి వహించడం, నాగరికతల గురించిన ముఖ్య వివరాలను తెలుసుకుని మాట్లాడడం ఆదిత్యకు ఎంతో నచ్చింది. దేశం పట్ల ఆమెకున్న ప్రేమ దీనికి కారణం అని అతను ఊహించాడు. కొత్త కొత్త అన్వేషణలకు పెద్దవాళ్ళు అంగీకారం తెలపకపోయినా, చిన్న తరం వాళ్ళు ఆసక్తి చూపడం స్వాగతించవలసిన విషయమే. దీని వలన భవిష్యత్తులో ఆశాభావన కనిపించే సూచనలున్నట్టు ఆదిత్యకు అనిపించింది. దీన్నే సంక్షిప్తంగా చెప్తూ, తరువాత గంటన్నర సేపు తాను, తన జట్టు జరిపిన అన్వేషణల గురించి వివరంగా ఉపన్యాసంలో చెప్పాడు. తరువాతి అరగంట ప్రశ్నోత్తరాల్లో గడిచింది. అన్ని ప్రశ్నలకూ ఆదిత్య వివరంగా సమాధానాలు చెప్పాడు. అన్నీ అయిపోయినట్టు అనిపించేంతలో ముందు వరసలోనుంచి ఒక గొంతు సన్నగా వినిపించింది.
తన ప్రాచీన చరిత్ర, పురాతత్వ శాఖ సీనియర్ ప్రొఫెసర్ గారి పిహెచ్.డి పరిశోధన విద్యార్థి అడిగిన ప్రశ్నను ఆదిత్య శ్రద్ధగా విన్నాడు. అదేం కొత్త ప్రశ్న కాదు. సైడ్ స్కాన్ సోనార్ నుండి పొందిన ఇమేజ్‌లు సముదపు అడుగు ఉన్నవాటి నిజమైన చిత్రాలు కావు. అలా తెలుసుకోవాలంటే నీటిలో మునిగే తెలుసుకోవాలి. అది అందరికీ తెలిసిందే.కానీ ఆ ప్రశ్న ఈ విద్యార్థిది కాక దాని వెనక ఉన్న వామపంథ చరిత్రకారుల గుంపుది అని ఆదిత్యకు అర్థమయింది.
“గంగావళి కయ్యలో సముద్రపు నీరు మట్టితో కూడుకుని ఉండడం వల్ల అక్కడ మునిగి సముద్రపు అడుగును పరిశీలించడం కానీ, అండర్ వాటర్ ఫోటోగ్రఫి వీలుకాదు: ఇలాంటి పరిస్థితుల్లో మనం వైజ్ఞానిక ఉపకరణాలనే ఉపయోగించాల్సి వస్తుంది. దీన్ని మొదలుపెట్టింది కూడా నేను కాదు. జపాన్ సముద్రం, కరెబియన్ సముద్రం, సర్గాస్సో సముద్రం మొదలైన వాటిలో సైడ్ స్కానర్ సోనార్ ఉపకరణాలను చాలా మట్టుకు ఉపయోగించడం జరిగింది. అలా దొరికిన ఇమేజ్‌లను సీనియర్స్ ఒప్పుకున్నారు” అని చాలా ఓపికగా వివరించాడు. “మీ ప్రశ్నకు తగిన జవాబు దొరికింది కదా?” అంటూ ఆ విద్యార్థి వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. “ఇంకో సందేహం?” మళ్ళీ అటువైపు నుండి గొంతు వినిపించింది. “ ఆ కోస్తా ప్రదేశం సముద్రంలో మునిగి తొమ్మిది వేల సంవత్సరాలయ్యాయి అనే ఆధారం పైన మీరు కనుగొన్నాను అంటున్న నగరం అంతే పురాతనమైంది అని మీరు అంటున్నారు. అలా కాకుండా, కొన్ని వందల సంవత్సరాల క్రితం కోస్తా ప్రాంతల్లో పెద్ద భూకంపం వచ్చి, తీరంలో ఉన్న ఒక నగరం నగరమే సముద్రం అడుగుకు విసిరేయబడి ఉండవచ్చు కదా? ఆ నగరం చాళుక్యుల లేదా శాతవాహనుల కాలం నాటి ఒక రేవు పట్టణం అయి ఉండవచ్చు కదా? నా ప్రకారం మీరు సముద్రపు అడుగులో కనుగొన్న నగరం సుమారు వెయ్యిన్నర సంవత్సరాలంత పాతది మాత్రమే అని నా అభిప్రాయం” అన్నది ఆ గొంతు.
ఆదిత్యకు మాట పెగల్లేదు. విషయాన్ని ఈ వైపు నుండి తను ఆలోచించనేలేదు. దక్కన్ పీఠభూమి భూకంపం వలయంలో లేదు అని తెలుసు. కానీ ఒక మినహాయింపుగా ఉండవచ్చునేమో? ఇదెందుకు తనకు తట్టలేదు? ఈ ప్రశ్న వెనుక ఆదిత్యకు స్ఫురించిందేమిటంటే ఈ ప్రశ్న విద్యార్థిదయ్యుండదు. తనను ఇరికించడానికి ఎవరో తనవాళ్ళే ఈ ప్రశ్నను అడిగించి ఉండాలి. జవాబు చెప్పకుండా ఉండకూడదు. విద్యార్థులంతా జవాబు కోసం అతడి వైపు చూస్తున్నారు. హాలంతా నిశ్శబ్దమై పోయింది. అతడికే ఆశ్చర్యమయ్యేలా అతడిలోని విశ్లేషకుడు మేల్కొని జవాబు చెప్పసాగాడు.
“అవును. మంచి ప్రశ్న. అడిగిన వారికి అభినందనలు.” అంటూ ఒకసారి గొంతు సవరించుకుని కొనసాగించాడు ఆదిత్య. “భూకంపం కారణాన్ని మేము అంత గంభీరంగా పరిగణించలేదు. ఎందుకంటే ఒకవేళ మీరన్నట్టు భూకంపం వచ్చుంటే సైడ్ స్కానర్ సోనార్ నుండి వచ్చిన ఇమేజ్ పూర్తిగా భిన్నంగా ఉండేది. ఒకవేళ రేవు పట్టణం ఒక్కసారిగా నూట ఇరవై అడుగుల లోతుకు విసిరివేయబడినట్లయితే, నగరమంతా ఛిన్నాభిన్నం అయ్యుండేది. భవనాలన్నీ కూలి పోయుండేవి. అప్పుడు నగరపు ఇమేజ్ ఒక గుట్టగా కనిపించేది. అదొక నగరం అని ఏ రకంగానూ మనం గుర్తు పట్టేవాళ్ళం కాదు. కానీ మనకు దొరికిన ఇమేజ్‌లలో కట్టడాలున్నాయి, దారులున్నాయి. ఇంకొక విషయం. నేను ఇంతకు ముందు నా ఉపన్యాసంలో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెపుతున్నాను. అన్ని రచనల బునాదులు సుభద్రంగా ఉన్నయి. మనం కోట అని అనుమానించే రచనలో ఒక మూల పూర్తి వృత్తాకారపు ఒక గుర్తుంది. అది ఒక బావి అయ్యుండవచ్చు. దారులన్నీ నేరుగా తూర్పునుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణానికి కనబడుతూ ఉన్నాయి. మనకు నేల పై కనిపించే మొహంజొదారోలోని తవ్వకాల్లో కనబడిన రచనల మాదిరిగానే!” ఆదిత్య ఒక లిప్త పాటు ఆపి ఎదురుగా ఉన్న శ్రోతలను గమనించాడు. మంత్ర ముగ్ధులుగా వింటున్న విద్యార్థుల వైపు అభినందిస్తూ చూసి, పాలిపోతున్న ప్రశ్నవేసిన మొహం వైపు చూసి మళ్ళీ బాణం సంధించాడు. “ఈ నగరం భూకంపానికి గురై నేల పైనుండి విసిరేయబడి ఉంటే మనకు దాని గుర్తులు కూడా లభించేవి కావు. మనం ఈ సాయంత్రం దీని గురించి చర్చించుకునే వాళ్ళం కూడా కాదు. దీని గురించి ఒకసారి మీ రీసర్చ్ గైడ్‌తో మాట్లాడండి. ఆయన తన పిహెచ్.డి చేసింది గుజరాత్ రాష్ట్ర బరోడా ఎం.ఎస్ విశ్వవిద్యాలయంలో. ఇరవై మూడు సంవత్సరాల క్రితం అదే గుజరాత్ లోని భుజ్ ప్రాంతంలో భూకంపం సంభవించినప్పుడు ఆయన తన తవ్వకాల గురించి అక్కడే ఉన్నారు. ఆయన మాటల్లోనే ‘నేను ఆ రోజు బయట టెంట్లో పడుకుని ఉన్నందున బ్రతికిపోయాను. లేకపోతే నా ఒంట్లోని ఒక్క ఎముక కూడా మొత్తంగా దొరికేది కాదు. భుజ్ పట్టణం లోని భవనాలు కూలిపోతున్న సన్నివేశం తలచుకుంటే నాకు వణుకు పుడుతుంది’ అని మాకంతా ఎన్నో సార్లు చెప్పారు. ఆ అనుభవం ఉన్న ఆయన మీరెవరో అన్నట్టు భూకంపం మన ప్రాచీన నగరానికి ఏ రకమైన హాని జరక్కుండా, మెల్లగా ఎత్తి నీటిలోకి దించేసిందంటే అస్సలు నమ్మరు” అన్నాడు.
హాలంతా చప్పట్లతో నిండిపోయింది. కృతజ్ఞతా ప్రసంగం చేయడానికి వచ్చిన సహ కార్యదర్శి మొహం నిండా చిరునవ్వుతో అధ్యక్షురాలివైపు అభిమానం, అభినందనలతో చూసి తన కర్తవ్యాన్ని ముగించాడు.
ఆ క్షణంలో తను గెలిచానని ఆదిత్యకు అనిపించినా తన ముందు రాబోయే సవాళ్ళు ఎలాంటివి అనే కల్పన తన ముందు పెద్దగా అనిపించింది. తన ఈ తవ్వకాల్లో తను సముద్రంతోనే కాదు, దానికంటే పెద్ద కదనం మనుష్యులతో అనిపించింది. సముద్రం ఒక సారి సంపూర్ణంగా తన ముందు తెరుచుకుంటే అది విశ్వాసం కల మిత్రుడయినట్లే. కానీ మనుష్యులు అలా కారు. కొత్త కొత్త వేషాలలో, కొత్త కొత్త రూపాలలో తన ముందు కదనాల కొత్త కొత్త పద్ధతులతో తయారవుతారు అనిపించింది. ఇలాంటి ఆలోచనలతో విచలితమైన ఆదిత్యను నెమ్మదిపరచింది తన తలిదండ్రులు, ప్రొ. హితేశ్ రావత్. కథా రచయిత అయిన అమ్మ తన లాలింపు మాటలతో ఓదారిస్తే, సాహిత్య ప్రాధ్యాపకుడైన తండ్రి మరికొన్ని సాక్ష్యాధారాలు దొరికేదాకా ఎవరికీ ఏమీ చెప్పద్దని సలహా ఇచ్చారు. ప్రొ. రావత్ గారిది ఈ రెండింటితో పాటు వెతకులాటలో సహకారం కూడా దొరికింది.
సింధు-సరస్వతి నాగరికత విషయంలో ప్రపంచంలోనే అగ్రగణ్యులుగా గుర్తించబడిన ప్రొ. రావత్ తమ శిష్యుడి అన్వేషణలో సహజంగానే ఆసక్తి వహించారు. అందులో ఆదిత్య పురోగమనం పట్ల ఆయనకు నమ్మకం కూడా కుదిరింది.
గంగావళి కయ్యలో మునిగి సముద్రపు అడుగును వీక్షించడం కానీ, జలాంతర్గత విడియో తీయడం కానీ వీలుకాని కారణంగా అక్కడి పూడికను తీయించి అక్కడి వస్తువులను పైకి తెచ్చి పరిశీలించడానికి అనుమతిని కోరి ఆదిత్య, నీహారికలు సంబంధించిన ప్రభుత్వ కచేరిలకు ఉత్తరాలు రాశారు. వాటికి ప్రొ. హితేశ్ రావత్ సిఫారసు ఉండడం వలన అనుమతులు తొందరగా దొరికాయి. తరువాత పైకి తెచ్చిన బురద మట్టిలో అనేక ఆశ్చర్యకరమైన ప్రాచీన వస్తువులు కనబడ్డాయి. అలంకరించిన పెంకులు, మణులు, అల్లికలున్న ఆట వస్తువులు, రాతి స్తంభాల తునకలు, దంచే విసర్రాళ్ళు, ఇంకా ఎన్నెన్నో ఉపయోగకరమైన వస్తువులు కనిపించాక వారిద్దరికీ తాము ఈ శోధననుండి వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదనిపించింది. ఈ నిర్ణయం తీసుకున్న వారానికి ఒక సాయంత్రం జరిగిన సంఘటన దాన్ని ఇంకా దృఢపరచింది.
***
ఏడవ సారి పూడిక తీసి వచ్చిన బురదను జల్లెడలో వేసి నీళ్ళు కారిపోవడానికి వదిలేసి, పదిహేను నిమిషాలు షవర్ కింద నిలబడి నీహారికా ఇంట్లో భోజనం ముగించిన ఆదిత్య నిద్రపోయి లేచాడు. దిగివచ్చేసరికి కాఫీ కప్ పట్టుకుని నిల్చున్న నీహారిక కళ్ళల్లో అదేదో మెరుపు గమనించిన ఆదిత్య కుతూహల పడ్డాడు. తను కూడా కాఫీ తాగడం ముగించగానే అప్పటిదాకా సహనంతో కాచుకున్న నీహారిక ఉత్సాహంగా “రండి. మీకొక అద్భుతాన్ని చూపుతాను”అంటూ బయలుదేరింది. పూడికలోనుండి రెండూ చేతులతో ఎత్తి తన ముందు పట్టుకున్న అరడుగు వెడల్పు అడుగు భాగంతో సిలిండర్ ఆకృతిగల నల్లటి వస్తువును ఆదిత్య కుతూహలంగా చూశాడు. “ఇది శివలింగం. ఇంకేదీ కావడానికి వీల్లేదు!” అన్నదామె. తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆదిత్య.
బరువైన వస్తువు తన చేతికొస్తుందని చేతుల్ని బిగించిన ఆదిత్యకు తన అరిచేతుల్లో ఇమిడిన వస్తువు అంత బరువు లేదనిప్చి “ఇదెలాంటి రాయి?” అన్నాడు. “ఇది కర్రది” అతడి ఆశ్చర్యాన్ని తగ్గించిం నీహారిక. “మన అన్వేషణకు ఇది చాలా ముఖ్యమైన సాక్ష్యం!” గంభీరంగా అని మాట ఆపింది నీహారిక. కళ్ళు మరింత మెరిసాయి.
నిజమే. అది అత్యంత ముఖ్యమైన సాక్షం.
ఇంతవరకూ దొరికిన అనేక రాతి వస్తువులు కానీ, కాల్చిన మట్టి వస్తువులు కానీ కార్బన్ డేటింగ్ పరీక్షకు పనికిరావు. కాబట్టి అవి ఎంత పురాతనమైనవో అని కనుక్కోవడం కుదరదు. ఆ సమస్యలను దూరం చేస్తుంది ఈ శివలింగం. దీన్ని కార్బన్ డేటింగ్ పరీక్షకు గురి చేస్తే అదెంత పురాతనమైనదో ఖచ్చితంగా కనుగొనవచ్చు. దాంతో పాటే సముద్రంలో మునిగిన నగరం కూడా ఎంత ప్రాచీనమైనదో అని కనుక్కోవచ్చు.
మొదటి చూపు, స్పర్శలోనే అదిత్యకు ఇది నైసర్గిక శివలింగం కాదని అర్థమయింది. అంటే ఇది ఎవరివల్లనో మెరుగుపరచబడింది. ఇది తను కనుగొన్న ప్రాచీన నగరం తాలూకా లేదా నేలపైని ఏదైనా గుడిలోనుండి కొట్టుకొని వచ్చి సముద్రంలో చేరిందా అని సందేహం కలిగింది. తన ఈ సందేహాన్ని తీర్చాలంటే దాని ఫోటోలను ఉత్తర లక్నోలో ఉన్న బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పేలియోబాటనికి పంపాలి. పదినిమిషాల్లో దాని ఫోటోలను తీసి ప్రొ. హితేశ్ రావత్ గారికి మెయిల్ చేశాడు. ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న ప్రొఫెసర్ గారు వెంటనే చూడాలని ప్రార్థించాడు. తను చేసిందంతటినీ నీహారికకు కూడా తెలిపాడు. ఆమె అంగీకార సూచకంగా తల ఊపింది.
అలా చూస్తే ప్రొ. రావత్ పాకిస్తాన్‌కు వెళ్ళిందే ఒక ఆశ్చర్యకరమైన సంగతి. ఆయన సింధు-సరస్వతి నాగరికత గురించి బాగా తెలిసినవారు. కానీ ఆయన కీర్తి ఆయనను పాకిస్తాన్ నుండి దూరం కావించింది. ఇస్లామిక్ రాష్ట్రం అయ్యుండి, తన ఇస్లాంకు పూర్వం ఉన్న చరిత్ర పట్ల అత్యంత అనాదరం, అవజ్ఞత ప్రదర్శించే పాకిస్తాన్‌లో ౧౯౪౭ తరువాత సింధులోయలో ఏ రకమైన తవ్వకాలూ జరగలేదు. జరగరాదు అని అక్కడి ప్రభుత్వ సిద్ధాంతం. దాని వెనుక ఉన్నది ఇస్లామిక్ మూలభూతవాదులు అన్నది బహిరంగ సత్యం. కాబట్టి ఆ స్థలాలకు ఏ విదేశీ పురాతత్వ శాస్త్రజ్ఞులను, ప్రత్యేకించి భారతీయ శాస్త్రజ్ఞులను అనుమతించదు. వాళ్ళ ‘పర్సొనా నాన్ గ్రాటా’ పట్టీలో మొదటి పేరే ప్రొ. రావత్ ది.
కానీ, గడచిన రెండు నెలలనుండి అసామాన్య మార్పులు కనబడుతున్నాయి.
(ముగింపు వచ్చే వారం)
కన్నడ మూలం: శ్రీ ప్రేమశేఖర్
తెలుగు అనువాదం: చందకచర్ల రమేశబాబు