[శ్రీ తుర్లపాటి నాగేంద్రకుమార్ రచించిన ‘ఓం నమో నారాయణాయా!’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]హా[/dropcap]ర్డువేర్ షాపునుంచి ఇవతలకు వచ్చి, రోడ్ అంచున పారుతున్న మురుగు నీటిని జాగ్రత్తగా దాటుతుండగా, ఓ శ్రావ్యమైన ఆలాపన చెవిన పడింది. వరదలొచ్చినప్పుడు, నదీజలాలు తమ దారిలో ఎదురైన చెట్టూ చేమల్నీ, కొండా కోనల్ని ఎలా ముంచెత్తుతాయో అలా ఓ ఆధ్యాత్మిక అనుభూతి నా మనసుని ఆవరించింది. వెంటనే ఆ ఆలాపన దిశగా నా చూపు పరుగు తీసింది. ఆశ్చర్యం, నేను ఉహించినట్టుగా ఆ దృశ్యం ‘సాయి బాబా’ ప్రతిమని మూడు చక్రాల వాహనంలోనో , ఎద్దు బండిలోనో ఉంచి, ఏదో ఒక తినుబండారాన్ని ప్రసాదం అంటూ పంచుతూ, ఇల్లిల్లూ తిరుగుతూ డబ్బులడిగేవారిది కాదు. అంతలో ఏదో అదృశ్య శక్తి నా చేతిని పట్టి లాగుతున్నట్టుగా తోచింది. చేతి వంక చూసిన నాకు, చేతిలోని కవరు అందులో ఉన్న పాలిథీన్ పరదా నాలుగింతలు బరువు పెరిగినట్టు అనిపించింది.
అంతలో, ఆ ఆలాపన, ఆ దృశ్యం, యాభై సంవత్సరాల క్రితం విన్న స్వరాలని, చూసిన దృశ్యాన్నీ నా కళ్ళముందు ఆవిష్కరింపజేశాయి.
అప్పుడు దసరా సెలవలు. నేను, అన్నయ్య బెజవాడ తాతగారింటికి వెళ్ళాము. ఆ రోజు తాతగారు మా ఇద్దరిని ఊరు చూపించడానికి తీసుకెళ్లారు. కాళేశ్వరరావు మార్కెటు సెంటరు నుంచి దుర్గ గుడి మెట్ల దారిలో మేము నడుస్తున్నాము. ఇంతలో నాలుగైదు అడుగులు ముందుగా ఉన్న కుడివైపు సందులో నుంచి సుమారుగా ఓ పాతిక మంది వడి, వడిగా అడుగులు వేస్తూ, ‘నారాయణ’, ‘నారాయణ’ అంటూ పూలు విరజిమ్ముతూ, ఓ పార్థివ దేహాన్ని పాడెపై మోస్తూ, ఎదురుగా మాకెడమవైపు ఉన్న సందులోకి సాగిపోయారు.
ఆ సమూహం, మేము నడుస్తున్న రోడ్డుపై అడుగుపెట్టగానే, నా చెయ్యి పట్టుకుని నడుస్తున్న మా తాతగారు తన చేతిని, నా చేతిపై బిగించి పట్టుకుని ఆగిపోయారు. ముందుకు అడుగేస్తున్న నేను, నా మరో చేతిని పట్టుకున్న అన్నయ్య ఆదాటున ఆగిపోయాము. తాతగారి వంక చూసిన నాకు, ఆయన కళ్ళలో ఓ అసందిగ్ధత భావం గోచరించింది.
క్షణంలో ఆ భావాన్ని నేను గ్రహించాను.
అది ఎదురుగా చూసిన దృశ్యం గురించి నేను ఏమి అడుగుతానో, ఏమి చెప్పాలో, ఎలా చేప్పాలో అన్న భావం.
కానీ నేను ఆయన్ని ఏమీ అడగలేదు. ఆంత దగ్గరనుంచి కాకపోయినా, అటువంటి దృశ్యాలు గతంలో నేను చూసినవే.
మా ఊళ్ళో, మా ఇంటి వెనకవైపు రోడ్డు ద్వారా తరచుగా వెళ్లే, అలాటి అంతిమ యాత్రలు చాలాసార్లు చూసాను. కానీ ఈ ‘నారాయణ’, ‘నారాయణ’ అన్న పదాలు మాత్రం ఎప్పుడూ వినలేదు. కాకపోతే, ఆలా వాళ్ళు ‘నారాయణ’, ‘నారాయణ’ అంటూ ఎందుకు వెళ్ళారన్నది, అర్థం అయ్యీ, అవ్వనట్టుగా తోచింది. ఎందుకోగానీ నా చిట్టి బుర్రకి, ఆ విషయం తాతగారిని అడగకుండా ఉండటమే సబబు అనిపించింది.
కాలక్రమంలో, నేను ఎదిగాక, ‘నారాయణ’ అన్నది, ఓ పదము కాదని, సర్వేశ్వరుడైన విష్ణు భగవానుని స్తుతించే మంత్రము అని, జీవితంలో తరచుగాను, చిట్టచివరికి అంతిమ యాత్రలోనూ ఆ మంత్రాన్ని ఉచ్చరించటం ముక్తిదాయకమని తెలుసుకున్నాను. కారణమైతే చెప్పలేను, కానీ ఆ దృశ్యాన్ని చూసిన నాటినుంచి, ‘నారాయణ’ అన్న పదము విన్నా, చదివినా, చూసినా వెనువెంటనే ఆ రోజు నేచూసిన, ఆ దృశ్యం కళ్ళలో మెదులుతూ ఉంటుంది.
వర్తమానంలో ఎదురుగా ఉన్న దృశ్యం వంక చూపులు సారించాను. ఎదురుగా అంతిమయాత్రకు తరలి వెళ్తున్న ఓ కాషాయ రంగు వాహనం. దానిపై ‘వైకుంఠ రథము’ అని పసుపు రంగులో వ్రాసి ఉంది. లౌడ్ స్పీకర్నుంచి ‘ఓమ్ నమో నారాయణాయ’, ‘ఓమ్ నమో నారాయణాయ’ అన్న ఆలాపన వినిపిస్తోంది. ఆ వాహనం వెనుక వైపు తలుపులు తెరచి ఉన్నాయి. పాడెపై ఉంచిన ఓ పార్థివ దేహం. ఓ తెల్లని వస్త్రము మెడ వరకు కప్పి ఉంది. నుదుట వైష్ణవ సాంప్రదాయ తిరునామాలు ఉన్నాయి. ఎవరో విప్రమోత్తముడు. ఆత్మ దేహాన్ని త్యజించింది. ఆ వాహనం ఆలా ముందుకి సాగుతూ, నా చూపుకు దూరమైంది. నేను స్థాణువులా నిలబడిపోయాను. అందరికిమల్లె, తేటతెల్లంగా, నాకూ తెలిసిన, మనిషి అంతిమ గమ్యం, నా వర్తమానాన్ని చిరునవ్వుతో తిలకిస్తున్నట్టుగా తోచింది.
నా మనసులో ఆలోచనా తరంగాలు వెల్లువెత్తాయి. గత నెలలోనే నా అస్తిత్వానికి, యాభై తొమ్మిదేళ్లు నిండాయి. వచ్చే సంవత్సరము ఉద్యోగ విరమణ చేయాలి. నా భార్య చాలా మంచిది. పెళ్లయిన నాటి నుంచి, ఈ రోజు వరకు నాకు చేదోడు, వాదోడుగా ఉంది. ఇద్దరు పిల్లలూ బుద్ధిమంతులు. వారితో ఎపుడూ, ఏ పేచీ లేదు. చదువు శ్రద్ధగా ముగించారు. ప్రస్తుతం మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఓ సొంతిల్లు ఏర్పర్చుకున్నాము. ఈ మధ్య రెండునెల క్రితమే పిల్లవాడి పెళ్లి చేసాము.. కోడలు కూడా ఉద్యోగం చేస్తోంది. తాను సౌమ్యురాలు. వినయ, విధేయతలు చూపుతుంది. ఆ కొత్త జంటకి సౌకర్యంగా, మెరుగైన మరుగు ఏర్పాటు చేయాలనే తాపత్రయం. ఇక అమ్మాయి చిన్నది. పెళ్లి చెయ్యాలి. ఓ సగటు జీవిగా, అదొక్కటే నాకు మిగిలిన బాధ్యత అనుకుంటాను. ప్రస్తుతం, మిద్దె మీద ఓ రెండు పడక గదులు కట్టిస్తున్నాము. పక్కింటి గోడలపై సిమెంటు వగైరా పడకుండా, రెండిళ్ళ మధ్య తెరలా, చేతిలో ఉన్న, ఈ పాలిథీన్ పరదా కట్టాలి. కొత్త జంటకి ఓ గది. పెళ్లయ్యాక, అమ్మాయి, అల్లుడు వచ్చినపుడు సౌకర్యంగా ఉండాలని, రెండోగది. ప్రస్తుతం ఉన్న రెండు పడకగదులు మేము, మా అమ్మగారు వాడుకుంటున్నాము.
ఈ రెండుగదులు పూర్తి అయ్యి , అమ్మాయి పెళ్లి, ఉద్యోగ విరమణ అయినాక, ఇంకే బాధ్యతలు ఉండవా? ఉండవు, అని అనుకోవడానికి లేదు. కాలం కలిసి రాకపోతే, వియ్యాలవారి కయ్యాలు, సంప్రదింపులు, ఊరడింపులు. ఆ తరవాత మనుమలు, మనవరాళ్లు వారి ముద్దులు, మురిపాలు, బుజ్జగింపులు. ఇవన్నీ దాటేసరికి, వయసు దేహంతో ఆడే సయ్యాటలు.
ఇప్పుడు ఇంకా, ఏం కావాలి. కోరికలకు అంతులేదు. ఆస్తులు కూడబెట్టటానికి అంతులేదు. సంపాదనకు అంతులేదు. లౌకిక భోగాలకి అంతులేదు, కీర్తి కాంక్షకి అంతులేదు. కానీ, ఈ దేహానికి అంతం ఉంది. చివరికి మిగిలేది ఏమీ లేదు. ఎంతో ఎత్తునుంచి నేలని తాకే జలపాతంలా, ఆలోచనలు ఒక దాని వెనుక మరొకటి, మనసుని తాకి, అదృశ్యమవుతున్నాయి.
చేతిలో ఉన్న, కవరు గాలికి రెపరెపలాడింది . హార్డువేరు షాపతను కస్టమరుతో ఏదో అంటున్నాడు. అకస్మాత్తుగా, ఆలోచనలు అదృశ్యమయ్యాయి. మనసంతా ప్రశాంతంగా ఉంది. ‘ఓమ్ నమో నారాయణయ’ అన్న ఆలాపన, హృదయాంతరాలలో ప్రతిధ్వనిస్తోంది. కొద్దీ సమయం, క్రితం ఆలకించిన ‘ఓం నమో నారాయణయ’ మంత్ర తరంగాలు, మనసు పొరల్లో తిష్ట వేసుకుని ఉన్న, లౌకిక భావాలన్నింటిని, ఒకొక్కటిగా కరిగించివేస్తున్నట్టుగా తోచింది. ఓ అనీర్వచనీయమైన అనుభూతి, ఆనందం నన్ను ముంచెత్తాయి.
విచిత్రం, ఎప్పుడో, చిన్నతనంలో మొదటిసారి చెవిన పడిన, ఈ నారాయణ శబ్దం, విన్న ప్రతిసారీ , నన్ను అలౌకిక భావాలకు గురి చేస్తుంది. నాకెందుకో, ఇది కాకతాళీయం అనిపించలేదు. ఆ సర్వేశ్వరుడు, నారాయణుడే దిశానిర్దేశం చేసి, నన్ను భవిష్యత్కార్యోన్ముఖుడిని చేసినట్టుగా తోచింది. ఆ క్షణం, నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం, భవబంధాలు పారద్రోలే వరమునొసగే సాధనం అని, నా భవిష్యత్కార్యాచరణ, ఏవిటన్నదీ, సంపూర్తిగా అవగతమైంది.