[dropcap]వే[/dropcap]దాంతసారము విపులీకరించగల 208 ఉపనిషత్తులలో 108 ఉపనిషత్తులు మాత్రము లభిస్తున్నాయి. వాటిలో గణేశ ఉపనిషత్తు ఒకటి. లంబోదరుడిగ జగములను కుక్షిలో నిలుపుకొనిన వినాయకుడు పరమాత్ముడు అని గణేశ ఉపనిషత్తు చెబుతుంది. పరిమితమైన చైతన్యాన్ని, ప్రజ్ఞను బ్రహ్మచైతన్యంతో అనుసంధానము చేసి మోక్షవిద్యను పొందింప చేస్తుంది గణేశోపనిషత్తు. అందుచేత గణేశుడు పరబ్రహ్మ స్వరూపముగ సృష్టికి అధినాయకుడిగ గణేశ పురాణము కూడ వెలసింది. వేదమూర్తిగ మోక్షదాయకుడు, పురాణపురుషుడుగ హేరంబుడు{శివునియందు సంతోషపడువాడు} కాబట్టి “వాతాపి (శుభదాయకుడైన వారణాస్యుడు అంటే ఏనుగు ముఖం కలిగిన) గణపతింభజే” అన్నారు ముత్తుస్వామి.
శరీరంలో కుండలినీ శక్తి ఉంటుంది. ఏడు చక్రములలో దాగి ఉంది. కుండలినీశక్తి మేల్కొనిన వానికి పరమాత్మ సిద్ధి లభిస్తుంది. విఘ్నేశ్వరుడు మూలాధారచక్రశక్తి అని చెబుతారు. సకలజీవరాశిని కరోన మహమ్మారి నుంచి కాపాడవలసిన వేళ ఇది. జీవాత్మకు హంస అని పేరు. జీవాత్మలన్నీ హంసధ్వని భూషిత హేరంబమ్ అహంభజే అని ముత్తుస్వామి దీక్షితులవారితో గొంతుకలిపి పరమాత్మగణేశ కీర్తన సందేశముగ వినాయక చవితిపండుగరోజై గణేశ చతుర్ధి మారుమ్రోగుతుంది. ఓం శ్రీ గణేశాయ నమః
‘మొదల మూలాధారమొదవ, మొదల విఘ్నేశ్వరుండు” అని వేమన తత్త్వముంది. శరీరములో మూలాధార, స్వాధిష్ఠ, మణిపూరక, అనాహట్, విశుద్ధ, అజ్ఞా, సహస్రార చక్రములలో మూలాధార చక్రము గణేశుడు. అనాహట్ చక్రముగ హృదయస్థానములో ఉన్న జీవాత్మలు హంసలు. ‘మురారి ప్రముఖాది ఉపాసితం… మూలాధారక్షేత్ర స్థితమ్’ అహంభజే మానస ధ్వనియై మోక్షమడగడమే గణేశపూజ.
మోక్షగాములే అయినా భగవద్గీతలో చెప్పినట్లు ముందు కర్మ పరిపక్వము కావాలి. కర్మఫలమైన శుభాశుభమయ జీవితమును మానవులు శరీరముతో అనుభవిస్తున్నారు. అందుచేత భక్తియోగము సులభమార్గముగ వివిధ పూజావిధానాలు సూచించారు. వాటిలో వినాయక చవితి వ్రతపూజ ఒకటి.
కష్టాలు తొలగిపోవాలి. ప్రతి శుభకార్యములోను జయము కలగాలి. మంచిపనులు తలపెట్టినపుడు, శత్రు విజయము కొరకు ప్రయత్నించినపుడు ఏవిధమైన అడ్డంకులు కలగకూడదు. మునులు, బ్రహ్మాది దేవతలు ఈ వరమిమ్మని కైలాసము వెళ్ళి శివుని ప్రార్థించారు. అందుచేత శివుడు పార్వతిపైనే దృష్టి నిలిపి తదేకంగా చూస్తూ, ఆకాశం పుత్రుడై జన్మించాలని కోరుకుని భాద్రపద శుద్ధ చవితినాడు హేరంబుడౌ (హేశివె రంబతి) విఘ్నేశుని సృష్టించాడని వరాహ పురాణకథనం.
ఆకాశపుత్రుడి అందం అందరినీ ఆకట్టుకుంది. ఆ అందమే హేరంబునికి శాపమైంది. పార్వతి కూడ మైమరచి పుత్రుడిగా మోహపడింది. శివునికది నచ్చక గజముఖం, బానపొట్టగల రూపముగా మార్చి గణేశుడని పేరుపెట్టి గణాలకధిపతిని చేసి విఘ్నములు తొలగించు విఘ్నపతిగా పూజకందించాడు.
తెలుగువారి జానపద కోలాటపాటలలో కూడ ఆయన గణపతిగ పేర్కొనబడ్డాడు. ‘శివశివ మూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథా…’…‘పార్వతితనయా గణపతిదేవ పరుగున రావయ్యా…’ అని విఘ్నములు బాపుటకు ఎలుకగుఱ్ఱ్రమునెక్కి రమ్మని కీర్తిస్తారు. బ్రహ్మవైవర్త, మత్స్య, శివపురాణాలు, గజముఖుడుగ గణేశావతారాన్ని పేర్కొన్నాయి. వాటిలో పార్వతి నలుగుపిండి బాలుడి కథ, గజాసురుడి తల అతికింపుగ గజముఖుడైన కథ ఎక్కువ ప్రచారమయ్యాయి..
అందుచేత గజముఖుడిది తొలుత సుందరముఖరూపముగ పురాణాలు చెబుతాయి. పార్వతి నలుగుపిండితో స్నానము చేస్తూ నలుగుపిండితో బాలునిగ చేసి ప్రాణము పోసిన సుందరాకారుడు గణపతి కథను శివపురాణ పాఠకులు ఎక్కువ విశ్వసిస్తారు. పార్వతీ తనయుడుగ సుందరాకారుడై గుమ్మము వద్ద దుర్గాశక్తిపుత్రుడై కాపలాగా ఉండి శివుడిని కూడ లోపలకు రానీయకుండా ఎదిరించాడు. తనను ఎదిరించినందుకు శివుడు బాలుడి తల ఖండించాడు. శిరస్సు పోగొట్టుకున్నఆ పార్వతీ తనయుని శివుడు అనుగ్రహించాడు. శివభక్తుడగు గజాసురుని తల తెచ్చి అతికించబడి గజముఖుడిగ శివుని కుమారుడై గణాధిపతయ్యాడు. మత్స్య, బ్రహ్మవైవర్త పురాణగాథలు ఈ కథకు బలాన్నిస్తాయి.
బ్రహ్మవైవర్త పురాణము ప్రకారము పార్వతి పెళ్ళయిన కొత్తలో సనత్కుమారుని ఆధ్వర్యములో విష్ణువ్రతము చేసింది. గోలోకములోని శ్రీకృష్ణుడె స్వయముగ బాలుడై అవతరించాడు. దేవతలందరు వచ్చి అభినందించారు. కాని శనిదేవత దోషదృష్టి వల్ల బాలుని శిరస్సు మాయమై గోలోకము వెళ్ళిపోయింది. విష్ణువు తలలేని మొండెమునకు ఐరావతము తల అతికించాడు. ఐరావతము భార్యకు భర్తృవియోగము కలుగకుండా చేయడానికి ఐరావతము బ్రతకాలి. విష్ణుమాయ సహకరించింది.
పునర్జన్మగా ఐరావతమును సృష్టించ వలసి వచ్చింది. అందుకు కారణము ఇంద్రుడి వాహనముగా అగస్త్యుడిచ్చిన పూలహారము అందుకుని ఇంద్రుడికివ్వకుండా నలిపి పాదాలతో తొక్కి అగస్త్యకోపము వల్ల శాపానికి గురైంది. ఆ శాపమునకు శిక్షగా ఐరావతము తలను ఖండింప చేసుకుంది. విష్ణుకృప వల్ల మరణించిన ఐరావతము మళ్ళీ బ్రతికింది. నారాయణుని మాయ తెలియలేము.
ఈలోగానే అగస్త్య శాపకారణంగా మరణించిన ఐరావతము పునర్జన్మ ఎత్తి పుష్పభద్ర నదీతీరమున నిద్రించేలా చేయడం విష్ణుమాయ. ఆ ఏనుగు తలనే ఖండించి తెప్పించాడని అందరూ భావించారు. గజముఖుడిగ గణపతిగ లోకపూజనీయుడని చెప్పడానికీ పురాణముల కల్పనలు ఎన్ని కనపడినా విమర్శకు నిలబడలేవు. అయినా శివపురాణ నలుగుపిండి పుత్రబాలుడు, నన్నెచోడ కుమార సంభవములో శివపార్వతులు గజదంపతులుగా క్రీడించి కన్న గజముఖపుత్రుడు కథలు విశ్వసనీయమైన భాద్రపద శుద్ధచవితి జన్మదిన గజముఖుడని ప్రచారములోకి వచ్చాయి.
మూషికాసురుడు మూషికమై వాహనముగ మోస్తుండగ లోకాలు తిరుగుతూ విఘ్నములు తొలగించే కోరికతో పూజ చేసేవారికి ప్రసన్నుడవుతున్నాడు. మోర్గాన్ గణేశ దేవాలయంలో మూషికముతోబాటు కుమారస్వామి వాహనము నెమలిని కూడ ఆయనకు వాహనముగా భావిస్తారు. మూషికుడు రాక్షసుడు. క్రౌంచుడు గంధర్వుడు. వీరివురు దుష్ప్రవర్తనతో దేవతలశాపానికి గురై మూషికములుగ మారి వినాయక కృపకు కారకులయ్యారని వాహనమయ్యారని కథలు ప్రచారములో ఉన్నాయి. విశ్వసనీయమైన మూషికకథ మూషికాసురుడు. ఈ ఎలుకపై ఎక్కి ఉండ్రాళ్ళు తిని వస్తుంటే దారిలో పాము ఎదురైందిట. మూషికము భయపడి విఘ్నేశుని నేలమీద పడేసింది. పొట్టపగిలి ఉండ్రాళ్ళు బయటకు వచ్చాయి. ఎలాగో పొట్టకుట్టుకుని విఘ్నేశుడు ఆ పామును పట్టుకుని వడ్డాణముగా చేసుకున్నాడు. అది చూసి చంద్రుడు నవ్వాడు. భాద్రపదశుద్ధచవితి నాడు తన వ్రతముచేసి అక్షింతలు వేసుకోకపోతే నీలాపనింద లొస్తాయని శపించాడు. ఆ శాపాన్ని కృష్ణుడు అనుభవించాడని శమంతకమణోపాఖ్యానము చెబుతుంది. .గణపతికి సిద్ధి, బుద్ధి భార్యలున్నారని భావిస్తారు. గణపతి ఆకారము భిన్నమైనది.
చతుర్భుజుడు. వాటిలో ఒక చేతిలో దంతముంటుంది. పరశురామునితో చేసిన యుద్ధములో విరిగిన దంతమది. ఏకదంతుడిగ మారిన ఆయన వ్యాసుడు భారతము చెప్పగా ఆ దంతముతోనె భారతము రాసాడని అంటారు. ఒక చేతిలో అంకుశం. మరో చేతిలో పాశం. ఇంకొకటి కపిత్థ ఫలము కలిగి ఉంటాయి. ఈ చతుర్భుజమూర్తి పద్మాసీనుడై పూజలందుకుంటున్నాడు. బీజ, బాల, తరుణ, హేరంబ, హారిద్ర, నృత్య, ఉన్మత్త, శక్తి గణేశ రూపములుగా గణపతి ఆరాధనా మూర్తులున్నాయి. లక్ష్మి, సరస్వతి, శక్తి మూర్తులతో కలిసి ఉన్న గణేశశిల్పములు కనిపిస్తాయి. బౌద్ధ, జైన మతవ్యాప్తి కారణంగా చైనా, జపాను దేశాలులో కనబడే హిందూగణపతి ప్రతిమలు గణపతి ప్రాచీనతకు సాక్ష్యముగ కనిపిస్తాయి.
స్కాందపురాణము వ్రతవిధానముగ విఘ్నేశపూజకు రూపకల్పన చేసింది. స్త్రీ, బాలవృద్ధులు, అన్ని కులాలవారికి దురదృష్టములనుండి, పూర్వజన్మ దుష్కృతములనుండి కూడ ఈ వ్రతము చేస్తే విముక్తి కలుగుతుంది. సోమనాథ దేవాలయ సందర్శన ఫలితము లాంటి విముక్తి లభిస్తుందని శివుడు వరమిచ్చాడు. విఘ్నములు బాపి సకలకోరికలు తీర్చే ఇంటింటి గణపతిపూజ దేశమంతా గణపతి నవరాత్రులుగా జరుపుకుంటోంది. ఓంశ్రీ గణేశానమః అని పులకిస్తూ ఒక చిన్నివ్యాసములో లంబోదరుని గుర్తు చేసుకోగలము తప్ప అనంతమైన విశేషాలు ఎన్నో ఉన్నాయని మనవి.