[శ్రీ షేక్ మస్తాన్ వలి రచించిన ‘ఒంటరి పోరాటం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]వై[/dropcap]బ్రేషన్ అండ్ సైలెంట్ మోడ్‌లో వున్న నా సెల్‌ఫోన్ నిన్నట్నుంచి ఒకే ఊగిపోతుంది. పదే పదే తెరపై ‘మోహన్’ అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. కాని నేను సెల్‌ను కర్కశంగా ఆపేస్తున్నాను. కారణం, అతనిపై నాకున్న కోపం, కసి అలాంటివి. ఇక ఈరోజు అలా చేయలేక పోయాను. ఎంతైనా తాళి కట్టిన భర్త కదా! అందుకే అనాసక్తంగా “హలోఁ!” అన్నాను.
“హల్లోఁ.. అనూ డియర్! కనికరించావా! థాంక్యూ సో మచ్!.. థాంక్యూ సో మచ్!” అవతలి కంఠంలో ఉత్సాహం ఉరకలైంది.
“ఏంటో చెప్పండీ! అవతల నాకు చాలా పనుంది” విసుగ్గా అన్నాను.
“అంతొద్దు డియర్! నే చెప్పేది కాస్త ఓపిగ్గా వినండీ! ఆపై నిర్ణయం మీకే వదిలేస్తా!” మాటల్లో మార్దవముంది.
“ఆఁ! ఈ సింగినాదం కబుర్లు చాలా సార్లయ్యాయి!” నిర్లిప్తంగా అన్నా.
“అది కాదు.. డియర్! ఈ ఒక్కసారికి నన్ను క్షమించు! ఆపై జరిగేవన్నీ.. నీవనుకున్నట్లే వుంటాయ్! నన్ను నమ్ము.. ప్లీజ్!”
“సరే.. సంగతేంటో చెప్పండీ! అయినా.. యిల్లు విడిచి నెలైతే యిప్పటిదాక నే గుర్తుకు రాలేదా? ఏం.. గత రెండు రోజులుగా అంత ప్రాకులాడుతున్నారు? కొంపదీసి త్రాగుడుపై ముఖం మొత్తిందా? లేక పెళ్ళాంపై గాలి మళ్ళిందా?” విసుగ్గా అన్నాను.
“లేదు అనూ! అదెన్నటికి కాదు! నువ్వు అకస్మాత్తుగా యిల్లు విడిచి వెళ్ళగానే నా పశ్చాత్తాపం తారాస్థాయికి చేరింది! బాగా ఆలోచించా! ఇలాంటి బాధాతప్తమైన పరిస్థితికి కారణం.. మహమ్మారి త్రాగుడేనని గ్రహించా! కాబట్టి ఆ చెడు అలవాటు నుండి బయటపడాలని పట్టుగా ప్రయత్నించా! చూడు డియర్! నేననుకున్నది.. నిజంగానే సాధించా.. అదిగో.. అలా చులకనగా మూతి విరువకు! నా పట్టుదల నాకు నూరు శాతం విజయం చేకూర్చింది! ఈ నెలరోజుల్లో అనేకులు అనేకసార్లు నన్ను త్రాగుడుకు ఆహ్వానించారు! నే రానన్నాను! వాళ్ళు బలవంతం చేశారు!.. కొందరైతే గేలి చేశారు! అయినా నే లొంగలేదు! వాళ్ళే ముడిచారు! ఇప్పుడు ఈ మోహన్.. అన్ని విధాల నీవనుకునే.. నీ భర్త! సో.. వెంటనే బయలుదేరి రా అనూ! ఇకపై మన సంసారం సుఖమయంగుంటుంది!” అతని అభ్యర్థనలో నిజాయితీ కనిపించింది.
దాంతో “అలాగే చూద్దాంలే! నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి!” అనే ఓ సందిగ్ధ సమాధానమిచ్చా.
“అనూ! ఇంకోమాట! ఇవ్వాళ్టికి నువ్వెళ్ళి నెలపైనే అయింది! అయినా మీ వాళ్ళెవరూ జరిగిందానికి ఫోన్ చేసి నన్ను నిలదీయలేదంటే.. నువ్వు సంగతి వాళ్ళకు తెలియ పరచలేదని తెలుస్తుంది! అలా అయితే యిక ముందు కూడా విషయాన్ని గోప్యంగానే వుంచు! అప్పుడు మన ఇంటిగుట్టు రట్టు కాకుండా వుంటుంది! ఇది నా అభ్యర్థన మాత్రమే! ఆపై ఆచరణ నీ యిష్టం!”
“అయ్యగారు సంగతి బాగానే ఊహంచ గలిగారే! ఈ తెలివితేటలకేం తక్కువ లేదు! ఇక నేనెప్పుడు వచ్చేది.. మళ్ళా తెలియచేస్తాను! ఈసారేమైనా తేడా వచ్చిందా.. ఖబడ్డార్!” అంటూ ఓ వార్నింగ్‌తో ఫోన్ ఆపగానే నా కళ్లముందు గతం కదలాడ సాగింది.
***
ఎప్పుడూ నవ్వుతూ, తుళ్ళుతూ, తాజాగుండే నేను నెల క్రితం అకస్మాత్తుగాను, దిగాలుగాను రావటంతో పుట్టింట్లో అందరు కంగారు పడ్డారు.
“ఏం జరిగిందే.. అలాగున్నావ్? అయినా.. ఒక్కర్తివే వచ్చావేంటి? అల్లుడుగారు ఏమయ్యారు?” అమ్మ సూట్‌కేస్ అందుకుంటూ ప్రశ్నించింది.
“ఏం లేదమ్మా! రావాలనిపించింది.. వచ్చాను! అంతే! ఆయనగారు బిజీగా ఉ..న్నా..ర్లే..!” నా పొడి పొడి సమాధానంతో తృప్తి చెందనామె “మీ ఆయనేమైనా.. అన్నాడేంటే?” సాగదీస్తూ అంది.
“అదేం.. లేదమ్మా!” హ్యాండ్‌బ్యాగ్ మంచంపై గిరాటేశా.
“ఏమోనే తల్లీ! అసలే రాత్రి పీడ కలొచ్చింది! ఉన్నట్లుండి నువ్వొస్తే.. ఏమైందోనని గుండె దడగా వుంది!” అమ్మ నావైపు దీనంగా చూసింది.
“పోనీ.. నాకన్నా చెప్పక్కా!” ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదివే నా తమ్ముడు ప్రత్యేకంగా అడిగాడు.
“ఏంటమ్మా అనురాధా! సంగతేంటో బయటకు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది తల్లీ!” చనువు తీసుకొని నాన్న నా తల నిమిరాడు.
“ఏమీ లేదు! లేదు!.. లేదు! అందరెందుకలా విసిగిస్తున్నారు? ఏం.. నేనొక్కదాన్నిక్కడికి రాకూడదా! ఆయనగారితో వస్తేనే.. ఆదరిస్తారా? నాకామాత్రం.. స్వతంత్రం లేదా?” నా విసుగు సమాధానంతో వాళ్ళ నోళ్ళు మూయించి ఒక్కసారిగా సామానుతో ప్రక్క గదిలోకెళ్ళా.
అలాగయితే చేయగలిగాను కాని, ఎలాంటి ముందస్తు.. సమాచారం లేకుండా నేనూడి పడ్డ వైనం, ఆపై నా విసుగులతో.. ఏదో వుందనే అనుమానం వాళ్ళల్లో పొడసూపటం గమనించా.
‘ఛీఁ!.. ఛీఁ! ఏం.. బ్రతుకో! లాలించే ఆత్మీయుల్ని కసిరి కొట్టా! అయినా.. తలరాత బాగుంటే ఇలాగెందుకైద్దీ? ఆయన్ని త్రాగుడు మానమని ఎన్ని విధాల బ్రతిమాలా! ఊఁ! హూఁ.. వింటేనా! రాజాలాంటి ఉద్యోగం వెలగబెడ్తున్నాడు.. ఎందుకు? పెళ్లయ్యాక మూడేళ్ళు బాగానే వున్నాడు! తరువాత క్లబ్బులన్నాడు! పబ్బులన్నాడు! గెట్ టు గెదర్లన్నాడు!.. అలా.. అలా త్రాగుడుకు బానిసయ్యాడు! మెల్లమెల్లగా లిక్కర్ బాటిల్స్ ఫ్రిజ్‌లో చేర్చటం వరకు వచ్చాడు! ఆ చర్యను ప్రతిఘటించా! అయినా.. విన్లేదు! త్రాగి వచ్చిన ప్రతిసారి ఇంట్లో రభసవ్వ సాగింది. ఫలితం! ఇరుగు పొరుగు చోద్యం చూడసాగారు. ఆ విషయం పదే పదే చెప్పి.. కుటుంబం పరువు కాపాడమని బ్రతిమాలా! అదీ వినలేదు! చివరకు విషయాన్ని మా అమ్మనాన్నలకు తెలియపరిచి.. వాళ్ళను పిలపిస్తానని బెదిరించా! ఊఁ! హుఁ.. కుదర్లేదు! సరిగ్గా.. తగాద జరిగిన ఆదివారం పట్టపగలే త్రాగొచ్చి వాకిట్లో తూలిపడి వాంతి చేసుకున్నాడు. ఇల్లంతా.. ఒకే కంపు! ఆపై పిచ్చి ప్రేలాపన్లు! అప్పటికే కిట్టి పార్టీకై మా ఫ్లాట్‌కొచ్చివున్న ఆడవాళ్ళు కిసుక్కుమని నవ్వుకుంటూ ఒక్కరొక్కరుగా జారుకున్నారు!.. దాంతో పార్టీ రద్దయింది! నాకు తల కొట్టేసినట్లయింది! ఇక ఏమాత్రం పరిస్థితి భరించలేకపోయా! ఏదో.. ఒకటి చేసి ఆయనకు గట్టి శాస్తి చేయాలనుకున్నా! అందుకే.. నా మేలుకోరే ప్రక్క ఫ్లాట్ శారద సలహా మేరకు ఆ రోజు గమ్మునుండి, మర్నాడు తీవ్రంగా కొట్లాడి, ఆయన ఎంత గింజుకున్నా పెడచెవిన పెట్టి పుట్టింటి కొచ్చేశా! నా రాక కిదీ కారణమని నావారికెలా చెప్పను? అల్లుడు బుద్ధిమంతుడు, హోదా గలవాడని మురిసిపోతున్న వాళ్ళకు వాస్తవం చెప్పి ఎలా బాధించగలను? అయినా ఈ విషయంలో వాళ్ళేమి చేయగలరు? ఇది కేవలం.. నా సమస్య! కాబట్టి దీన్ని.. నేనే పరిష్కరించుకోవాలి! ఏమైనా.. పోరాటం ఒంటరిగానే చేయాలి!’ అని నిర్ణయానికి వచ్చిన నేను ఆ రోజు నుండి ఈ నెలనాళ్ళు గుంభనంగా వుండిపోయా.
ఏమైతేనేం సమస్యకు పరిష్కారంగా, విజయానికి ఆలంబనంగా ఇంతకు ముందే.. వచ్చిన ఫోన్‌కాల్‌ను మరోసారి తనవితీరా మననం చేసుకున్నా.
***
‘ఆహాఁ!.. ఏం జాగ్రత్త! అయ్యగారి పరువు అత్తగారింట పదిలంగుండాలి! ఎంత మంచివాడు! ఎంత.. గొప్ప అభ్యర్థన! ఏమైనా.. జరిగింది దాచి మేలే చేశా! మొత్తానికి నేనిచ్చిన ఝలక్ నషాళాని కంటినట్లుంది! అందుకే అబ్బాయిగారి మాటల్లో అంత మనోవేదన! అంత ఆత్మీయత! అది.. మారిన మనస్సుకు నిదర్శనమే! అయితే.. వెంటనే వెళ్ళాలి! అదీ.. ఇవ్వాళే! సో.. సాయంత్రం బయల్దేరుతున్నట్లు మోహన్‌కు కాల్ చేయాలి!’ ఫోన్ తీశా.
‘వద్దు.. వద్దు! ఒక్కసారిగా వెళ్ళి ఆశ్చర్యంలో ముంచెయ్! మజాగుంటుంది!’ మనస్సు హెచ్చరిస్తుంటే ఆ ప్రయత్నం ఆపేశా.
ఆపై తత్కాల్ టికెట్‌కై తమ్ముడ్ని వేగిర పెట్టా.
“అప్పుడే ప్రయాణ మేంటమ్మా? ఇక నువ్వు కాదు కూడదంటే.. నేను వస్తా!” సంగతి తెలుసుకున్న నాన్న ప్రేమ కుమ్మరించాడు.
“ఆయన్నూ రానియ్యవే!” అమ్మ వత్తాసు పలికింది.
“ఎందుకమ్మా నాన్నకు శ్రమ! నే.. వెళ్తాగా!” వాళ్ళను సుతారంగా వారించా.
ఇక తమ్ముడు తత్కాల్ టిక్కెట్ సాధించటంతో ఆ సాయంత్రమే నేను గోదావరి ట్రెయిన్‌కు బయలుదేరా.
ప్రసన్న వదనంతో బై.. బై.. చెప్పిన నన్ను చూసి మురిసిపోయిన అమ్మా నాన్నలు, “క్షేమంగా వెళ్ళి రామ్మా!” అంటూ వీడ్కోలు పలికారు. “ఆల్.. ది.. బెస్ట్.. అక్కా!” తమ్ముడు ఆప్యాయంగా చేయూపాడు.
మెల్లగా రైలు వేగం పుంజుకోసాగింది.
‘సారీ.. నాన్నా! సారీ.. అమ్మా! సారీరా.. తమ్ముడూ! మీ ప్రేమకు ప్రతిగా నే స్పందించలేక పోయా! నా మెట్టినింటి భాగోతం దాచి మిమ్మల్ని మభ్యపెట్టా! మరేం.. చేయమంటారు? ఇది.. కేవలం నా సమస్య! ఇందులో భాగస్వామ్యం కల్పించి మిమ్మల్నెందుకు బాధ పెట్టాలి? అందుకే.. ఒంటరి పోరాటం చేసి నేనే సంగతి తేల్చుకోదలుచుకున్నా! ఇందులో ఏదైనా పొరపాటు దొర్లివుంటే నన్ను క్షమించండీ! క్ష..మిం..చం..డీ!’ అనుకుంటుంటే కళ్ళు చెమర్చాయి. చాలాసేపు మావాళ్ళనే చూస్తూ వుండిపోయా.
ఆపై కంపార్ట్‌మెంట్ లోకి దృష్టి సారించి, సామాన్లు సర్దుకొని, అమ్మ యిచ్చిన ప్యాక్ ఫుడ్ తిని, బెర్త్ పై చేరి, జరిగినవి నెమరు వేసుకుంటూ.. నిద్రలోకి జారుకున్నా.
మరునాడు ఆదివారం ఉదయానికి బండి సికింద్రాబాద్‌లో ఆగింది. హడావిడిగా దిగిన నేను క్యాబ్ తీసుకొని యిల్లు చేరా.
ఆశ్చర్యం! మా ఫ్లాట్ తాళమేసి వుంది. ఆదిలోనే హంసపాదు. దాంతో యిప్పటివరకు ఉరకలు వేస్తున్న ఉత్సాహం నీరుకారి పోయింది.
‘ఆదివారం శలవే గదా! మరి.. ఆయనేమయ్యాడు? ఇంత ఉదయాన్నే ఎక్కడికెళ్ళాడు? ఏమిటో.. అంతా అయోమయం! అసలు.. ఈయన్ను నమ్మి రావటమే పొరపాటేమో?’ ప్రశ్నలు వేధిస్తోంటే నేను ప్రక్క ఫ్లాట్‌కు వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కా.
“హాయ్ అనూ! వచ్చావటే! రాఁ.. రాఁ! మీవారు తాళాలిచ్చారే!” శారద వంకీకున్న కీ బంచ్ తెచ్చి యిచ్చింది. ఈలోగా ఫ్లోర్‌లోని మరికొందరు ఆడవాళ్లు ప్రోగయ్యారు.
“ఇంతకూ.. ఆయనేమయ్యారే?” నేను తేరుకొని శారదనడిగా.
“ఏమోనే.. నిన్న సాయంత్రం ఆరుగంటలకు ఓ నలుగురు వ్యక్తులొచ్చి మీవారిని పిలుచుకెళ్ళారు! వెళ్తూ.. వెళ్తూ.. తాళాలు నాకిచ్చారు!” శారద జరిగిన విషయం చెప్పింది.
“అవునమ్మా! నేను చూశా! సరిగ్గా పదే పది నిముషాల్లో తయారై మీవారు టింగు రంగా అని వాళ్ళతో వెళ్ళారు!” ఓ పెద్దావిడ నర్మగర్భంగా అంటూ ఓ వెకిలి నవ్వు విసిరింది.
“ఇందులో.. చెప్పటానికేముందమ్మా! అది మందు వేళ కదా.. ఏ పార్టీకో వెళ్ళుంటాడు! పైగా పెళ్ళాం ఇంట్లో లేకపోయా! ఇక అడ్డేముంది! అయినా.. వస్తారే తల్లీ.. కంగారు పడకు!” ఓ మధ్య వయస్కురాలు ఓదార్పుతోనే ఎత్తి పొడిచింది.
“మరే! రాత్రంతా.. అక్కడే వుండి పోయాడేంటమ్మా.. విడ్డూరంగా!” ఓ అతి శాల్తీ ఏకంగా నోరే నొక్కుకుంది.
అలాగే మిగిలిన వాళ్ళు తమ.. తమ వంతుగా వ్యంగ్యోక్తులు విసిరారు.
ఎన్నెన్నో ఊహలతో, మరెన్నో ఆశలతో.. వచ్చిన నాకు వాళ్ళ పలుకులు ములుకులే అయ్యాయి. “ఇక చాలుఁ!.. నోర్మూయ్యండీ! అయినా.. మావారి సంగతి మీకెందుకు?” అని పెద్దగా అరుద్దామనుకున్నా. కాని నోరు పెగల్లేదు. దాంతో.. ఉక్రోషం పెల్లుబికి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే.. నేను యాంత్రికంగా ఫ్లాట్‌కు చేరి, సామాను సోఫాలో గిరాటేసి బెడ్‌పై వ్రాలా.
‘ఈయన మళ్ళా మాట తప్పాడా? ఛీఁ!.. ఛీఁ! నాకే బుద్ధిలేదు! ఎక్కడైనా.. కుక్క తోక చక్కనైద్దా?.. నా పిచ్చి కాకుంటే!’ ఆలోచనలు తొలిచేస్తుంటే చాలాసేపటి దాక అలాగే పడుకున్నా.
ఆపై పది గంటలకెలాగో లేచి ముఖం కడుక్కొని, అయిష్టంగానే స్నానం ముగించి, కొద్దిగా కాఫీ త్రాగి, ఏవో, మేగజైన్లు తిరగేస్తూ కూర్చున్నా.. మెల్ల మెల్లగా మధ్యాహ్నం ఒంటిగంటైంది. అప్పటికీ మోహన్ రాలేదు.
ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది.
‘అబ్బా! వచ్చాడల్లే వుంది’ ఆత్రంగా వెళ్ళి తలుపు తెరిచా. ఎదురుగా.. ప్రక్కింటి శారద! ఒక్కసారిగా నిరుత్సాహం చుట్టేసింది. అయినా దాన్ని మనస్సులోనే అణచివేసి “రావే!.. కూర్చో!” అంటూ ఆమెను మామూలుగా ఆహ్వానించా.
“అలాగున్నావేంటే? వంట చేయలేదా?” పరిసరాలు గమనిస్తూ శారదంది.
“ఏం.. తినాలని లేదే!” నే పెదవి విరిచాను.
“భలేదానివే! పస్తుంటావేంటే? అన్నయ్య ఏదో.. పని పైన వెళ్ళుంటార్లే! వస్తారుగా! దానికెంత దిగులెందుకు?” శారద లాలనగా అంది.
“అది కాదే!.. అలా పశ్చాత్తాపం వలకబోస్తూ ఆయన ఫోన్‌లో ఏవో కబుర్లు చెబితే.. అవి నమ్మి వెంటనే బయలుదేరి వచ్చానే! తీరా ఇక్కడ.. చూస్తే విషయం మళ్ళా మొదిటికే వచ్చినట్లుంది!” జరిగినదంతా చెప్తుంటే కంఠం రుద్దమై కన్నీరాగలేదు.
“ఛాఁ!.. ఛాఁ! ఏడ్వకు! అయినా.. ఒక్కసారి మీ అమ్మా నాన్నలకు చెప్తే.. ఫలితం వేరుగా వుంటుందేమోనే.. అనూ!” శారద ఓదార్పుగా అంది.
“వద్దే.. వద్దు.. శారదా! ఏమైనా సరే, మన బాధ మనమే పడాలి! కన్న నేరానికి వాళ్ళను రొంపిలోకి లాగదల్చుకో లేదు! ఇది.. నా నిర్ణయం!” అంత బాధలోను గట్టిగా చెప్పా.
“ఇంతకు.. అన్నయ్య ఇంటికి రాకుండానే మనం ఏవేవో ఊహించుకోవటం సరైంది కాదేమోనే! అది సరే.. ఇప్పుడేం వంట చేసుకుంటావు గాని.. నే లంచ్ తెస్తానుండు!” శారద నా సమాధానానికి కూడా ఎదురు చూడకుండా వెళ్ళి కాసేపటికి క్యారియర్ తెచ్చింది. ఆపై ఆమె అపార్ట్‌మెంట్ కబుర్లు చెప్తుంటే నేను పదార్థాలు అలా అలా కెలికి తిన్నాననిపించా.
“ఇక వస్తానే! ఇంట్లో.. మా వారున్నారు!” శారద వెళ్ళిపోయింది.
ఇంతలో ఫోన్ రింగైంది. “మోహన్ కాదు గదా!” ఆత్రంగా సెల్ ఎత్తా.
“అనూ! సుఖంగా చేరావా? అల్లుడుగారు స్టేషన్‌కొచ్చారా? అయినా.. ట్రెయిన్ దిగ్గానే ఫోన్ చేయద్దటే!” అమ్మ యోగక్షేమాల చిట్టా విప్పింది.
‘శారదన్నట్లు.. ఆయన సంగతి మీ వాళ్ళకు చెప్పేయ్! ఆపై.. వాళ్ళే విజృంభిస్తారు! దాంతో అయ్యగారు తోక ముడుస్తారు!’ మనస్సు కవ్విస్తుంటే.. అంతరాత్మ, ‘వద్దు!..వద్దు! ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చిన ఇంటిగుట్టు రట్టు చేయకు! ఎలాగో సమస్యపై ఒంటరి పోరాటం చేయాలనుకున్నావుగా! ఆ మాటపైనే ఉండు! విజయం.. నీదవుతుంది!’ అని జాగృత పరిచింది.
నా మౌనం భరించలేని అమ్మ “ఏమైందే.. ఎంతసేపు మాట్లాడవ్?” అంటూ అరిచింది.
“ఆఁ!.. వస్తున్నానమ్మా! ఇల్లు సర్దుకుంటున్నా! మొత్తానికి క్షేమంగానే చేరా! ఆయనే స్వయానా స్టేషన్ కొచ్చారు. ఇప్పుడు ఇంట్లో హేపిగున్నాం! ఓకేనా!” అంటూ అబద్ధం చెబుతుంటే పెదాలు వణికాయి. కళ్ళు చెమర్చాయి.
“చల్లని కబురు చెప్పావ్ తల్లీ!” నిట్టూర్పుతో అమ్మ ఫోన్ పెట్టేసింది. ఆపై ఏకాంతం పెను భారమైంది. ‘అయినా.. తప్పదు!’ పక్కపై అటూ.. ఇటూ మసలుతూ కాసేపు గడిపా. ఇంతలో ఏదో గుర్తుకు రాగా గబ గబా వెళ్ళి ఫ్రిజ్ తెరిచి చూశా. అక్కడ ఏ హాట్ డ్రింక్స్ లేవు.
‘అంటే.. అయ్యగారి మందు టికానా అంతా.. బయటేనన్నమాట!.. ఇంత త్వరగా నేనొస్తానని ఊహించుండడు! అందుకే నిన్న రాత్రి పార్టీకని ఉడాయించి.. ఇప్పటి దాక రాలేదు! ఔరా.. ఎంత తెగువ! ఎంత మోసం!.. నంగనాచిలా ఫోన్‌లో ఎంత ప్రేమ ఒలక పోశాడు! అదంతా నిజమనుకున్నా! ఐ యామ్ ఏ ఫూల్! ఏ రియల్ ఫూల్!’ ఆలోచనా సుడిగుండం లోనే మెల్లగా నిద్రలోకి జారుకున్నా.
సాయంత్రం నాలుగు గంటలకు కాలింగ్ బెల్ మ్రోగుతుంటే బద్ధకంగా లేచి తలుపు తెరిచా.
ఎదురుగా మోహన్! ముఖం జేవురించింది. క్రాఫు చెదిరుంది. కళ్ళు ఎర్రగున్నాయి. బట్టలు నలిగున్నాయి. బాగా నీరసించున్నాడు. “ఓఁ.. అనూ!.. వచ్చావా! కాస్త.. బాగాలేదు! మళ్ళా.. మాట్లాడుతుతా!” కాళ్ళ జోడు విడిచిన అతను సరాసరి పడగ్గది కెళ్ళి బోర్లా పడ్డాడు.
‘ఆహాఁ! ఆయ్యగారు పూర్తిగా మునిగున్నారన్నమాట! మాట్లాడేదానిక్కూడా ఓపిక లేదు!’ నాకతన్ని చూడాలంటేనే అసహ్యమేసింది. ‘అయినా.. తప్పదు! నేనే తొందరపడి వచ్చేశా!’ మనస్సు సరిపెట్టుకొని ఆయన దగ్గరికెళ్ళి దిండు సరిచేస్తూ మనిషి దగ్గన వాసన గమనించా.
ఆశ్చర్యం! ఆల్కహాల్ త్రాగిన వైనం కనిపించలేదు! ఆ వాసనే లేదు!
‘మరి.. మరి.. ఏమైంది? ఎందుకిలా డీలాగున్నాడు? అసలెక్కడున్నాడు? ఇప్పటిదాక నే చేసిన ఫోన్ కాల్స్‌కు ఎందుకు జవాబివ్వలేదు?’ బుర్రకెంత పదును పెట్టినా.. సమాధానాలు లేవు. ఇక చేసేది లేక టీ.వి. ముందు కూర్చొని కాలం వెళ్ళబుచ్చాను.
సాయంత్రం ఆరు గంటలకు మేల్కొని మోహన్ “అనూ!.. అనూ!.. నాకు తింటానికేమైనా.. ఇవ్వూ! చాలా ఆకలిగా వుంది!” అన్నాడు. నాకు అతని ప్రవర్తన ఎబ్బెట్టుగా వున్నా, లేని శక్తిని కూడగట్టుకొని ఉప్మా తయారుచేసి తీసుకొచ్చా.
ఈలోగా ఆయన స్నానం వగైరాలు ముగించుకొని, నైట్‌డ్రస్ వేసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ, ప్రసన్న వదనంతో “థాంక్యూ.. సో మచ్.. అనూ!” అన్నాడు.
“దేనికీ?.. టిఫిన్‌కా!” ఉప్మా ఫ్లేట్ ఆయన ముందు పెట్టా. అయితే నా మాటల్లో నిష్ఠూరం కొట్టొచ్చినట్లుంది.
“కాదు! నా మాటపై నమ్మకముంచి.. వచ్చినందుకు!” ఆయన మాటలు దృఢంగున్నాయి.
“అది సరే! ముందుగా.. నిన్నట్నుంచి ఇవ్వాళదాక బయటేమి.. చేసొచ్చారో.. చెప్పండీ?” నేను నిలదీశా.
“చెప్తాను.. అనూ.. చెప్తాను! రాగానే చెప్పాలనుకున్నా! కాని రాత్రంతా నిద్రలేక ఒళ్ళు తూలిపోతుంటే.. అలా చేయలేక పోయా!” మాటల్లోనే ఆయన తింటం ముగించి పడగ్గదికి నడిచాడు.
“పోనీ.. ఇప్పుడు చెప్పండి!” ఆయన వెంట వెళ్ళి పక్కపై చేరా.
“మా కంపెనీ పై ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ వారు ఇంటన్సివ్ రైడ్స్ చేశారు! ఆ సందర్భంగా సి.ఎం.డి. సార్ నన్ను పిలిపించి స్పెషల్ డ్యూటీ వేశారు. దాంతో నేను, నా స్టాఫ్‌తో కలిసి, నిన్న రాత్రి, యివ్వాళ పగలు శ్రమించి, కావాల్సిన సమాచారం సేకరించి ఐ.టి. వారికి ఇచ్చాం. వారవన్నీ పరిశీలించి.. మా గత పది సంవత్సరాల ఐ.టి. రిటర్న్స్ సరిగ్గా వున్నాయని తేల్చారు! యుద్ధప్రాతిపదికన ఈ కార్యక్రమం జరిగినంతసేపు మా సెల్‌ఫోన్లన్ని ఐ.టి. వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు! ఇక నిన్న రాత్రంతా నిద్రలేకుండా పోయింది! ఈలోగా మాకు తిండి తిప్పలు సరిగ్గా అమరలేదు. మొత్తానికి పని దిగ్విజయంగా ముగించుకొని యివ్వాళ సాయంత్రం రెండు గంటలకు మేం ఆఫీస్ వదిలాం! అక్కడ్నించి.. నేరుగా ఇంటికి చేరాను! నా కోరిక మేరకు తిరిగి వచ్చిన నిన్ను చూసి మురిసిపోయాను! కాని అలసి.. నిద్రపోయాను! అదీ డియర్.. జరిగింది!” ఆయన ముగించి చిలిపిగా నవ్వాడు.
కొండంత బరువు కొనగోట తీసినట్లు కాగా నేను ఆయనవైపు పరీక్షగా చూశా. ముఖంలో నిజాయితీ మార్పుకు ప్రతిగా వెలుగుతుంది.
క్షణాల్లో నా అనుమానాలు పటాపంచలయ్యాయి. ఇప్పటి దాక గూడు కట్టుకున్న అయిష్టత ఒక్కసారిగా మాయమైంది.
ఆయన కడిగిన ముత్యంలా కన్పించాడు. అంతే! క్షణాల్లో నేను ఆయన ఎదపై వ్రాలి “నన్ను క్షమించండీ! నన్ను.. క్షమించండీ!” అని పలువరించ సాగా. నా కళ్ళు ఆనందాశ్రువుల్ని జాలువారుస్తున్నాయి.
“నిన్ను క్షమించటమేంటీ.. అనూ? తప్పు చేసింది.. నేను కదా!” ఆయన నన్ను పొదవి పట్టుకున్నాడు. ఆలింగనంలో వెచ్చదనం హాయిగుంది.
“అది కాదండీ! ఇరుగు పొరుగువాళ్ళ మాటలు నమ్మి మీరు మళ్ళా.. త్రాగటానికెళ్ళి రాత్రంతా అక్కడే జాగరణ చేసొచ్చారని అనుమానించా! మీరేమో మంచికెళ్తే.. నేనేమో చెడు ఊహించా.. పాపిష్టిదాన్ని!”
“ఓఁ!.. అదా! మరి త్రాగుబోతంటే.. అలాగే అంటారు డియర్!”
“ఆఁ!.. మీరిప్పుడలా కాదుగా!” నే బుంగమూతెట్టా.
“అంత ముద్దులొలక్కు ప్రియా! నిన్నలా చూస్తే నాకేదో.. అయిద్దీ!” ఆయన కన్ను గీటాడు.
“ఛీఁ! పాడు! మీకెప్పుడు అదే.. ధ్యాస!” నే సిగ్గుతో ఆయన్ను హత్తుకున్నా.
ఏమైతేనేం, ఒంటరి పోరాటం జరిపి విజయం సాధించిన వైనం నాలో ఎనలేని తృప్తిని నింపింది.