గాఢమైన పఠనానుభూతిని అందించే ‘ఒంటరీకరణ’

0
2

[dropcap]క[/dropcap]విగా, రచయితగా, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరక్టరుగా మామిడి హరికృష్ణ సుప్రసిద్ధుడు.

“అన్ని విలువలూ, శాలువాలూ, భుజకీర్తులూ, గజమాలలూ, crowns, queries పరిత్యాగం చేసి నగ్న హృదయంతో మనల్ని మనం ఒలకపోసుకున్నప్పుడు, సాష్టాంగపడి వెక్కిళ్ళతో ఏడ్చినప్పుడు మాత్రమే కవిత్వం ప్రత్యక్షమవుతుంది” అని, అలా ప్రత్యక్షమైన కవితను దర్శించి, ఆ దర్శనానుభూతిని పాఠకుడికి అందించే తపనలో రూపొందిన 45 కవితల సమాహారం ‘ఒంటరీకరణ’.

1993 నుంచి 2003 వరకూ, అంటే ఒక దశాబ్దంలో మామిడి హరికృష్ణ రచించిన కవితలలోంచి ఎంపిక చేసి, ఏరి కూర్చిన కవితా సంపుటి ఇది.

కవితా వస్తువులను ఎంచుకోవటం లోనూ, భావాల్ని వ్యక్తీకరించటంలోను పదాలను వాడటం, వాక్య నిర్మాణంలోనూ ఒక దశాబ్దంలో కవి ఎదుగుదలను, పరిణామ క్రమాన్ని విశ్లేషిచే వీలునిస్తుంది ఈ పుస్తకం. ఆరంభ కవితలలోని ఆంగ్ల పద ప్రయోగాలు రాను రానూ తగ్గి, అనుభవంతో చిక్కనై, పరిణతి పొందిన పదాల పొందికతో గాఢతరమైన పఠనానుభూతిని అందించే రీతిలో కవితల్లో కవి హృదయపు లోతులను, మనో వైశాల్యాన్ని, ఆలోచనలు అధిరోహించిన ఎత్తులను గమనించే వీలు కల్పిస్తాయీ కవితలు.

‘plastic పూలనీ

imported scent పరిమళాన్నీ

apartments కొండల్ని’ (మహాజన విశ్వం, 1993)

పరిశీలిస్తూ ఆరంభమైన కవితా సంపుటి

‘నింపాల్సిన శూన్యాలు

పూడ్చాల్సిన గుంతలు

రాయాల్సిన అక్షరాలు

చెక్కాల్సిన నిముషాలు

అద్దాల్సిన జ్ఞాపకాలు

ఎన్నో ఉంటాయ్!’ (ప్రహేళిక, 1993)

అన్న గ్రహింపుతో ముందుకు సాగుతుది.

‘నింగి ప్రేమ సందేశాలు

మేఘవాహనాల్లో బరువెక్కి బరువెక్కి

చినుకాక్షరాలుగా రాలాయేమో –

నేల నిలువెల్లా తడిసిపోయింది!’ (పునః పునః, 1995)

అన్న అత్యంత సున్నితమైన భావాల చిరుజల్లులలో తడుపుతూ

‘కిలకిలల గొంతు కాస్తా పూడుకు పోయాక

ఎగసిపడే చెంప నేలపై

కన్నీటి పూలు జారిపడ్డాయ్!’ (దుఃఖానంద సందర్భం, 1999)

అన్న అతద్భుతమైన విషాద imagery ని కళ్ళముందు నిలిపి దుఃఖానంద సందర్భాన్ని బోధపరుస్తాడు కవి.

‘చక్రీయ గమనాల సుదీర్ఘ ప్రస్థానాల మధ్య

వీర విహారం చేసిన మంచు

ఈ క్షణానికి ఆఖర్న

మేలి ముసుగు లోంచి

Rebecca చెక్కెలిని ముద్దాడింది!’ (మంచు జ్ఞాపకం, 2002)

ఒక చక్కని ‘శీతల పవనాల కచేరీ’, ‘తుహిన సంగీతం’ లాంటి ‘చేతకూ చేతానానికి చేతనావస్థ’ అత్యంత మృదువుగా అనుభవానికి తెస్తుందీ కవిత.

‘మదిలో దుఃఖ కెరటాలు

కంటి తీరాలపై అశ్రువులుగా వర్షిస్తాయి

ఇసుక రేణువుల్లో యుగాల నాటి విషాదం

మళ్ళీ జీవం పోసుకుంటుంది’ (ఒంటరి సముద్రం, 2003)

అన్న కవిత చదివిన తరువాత సముద్రం అందంలో, సముద్ర గాంభీర్యంలో, సముద్రం ఒడ్డున ఇసుక రేణువులపై కూర్చుని ఎగసిపడే అలలను చూస్తుంటే సముద్రం ఒక రొమాంటిక్ విషాదగీతం కనిపిస్తుంది. ‘హృదయ సాగరం’ అలలు అలలుగా ఎగసిపడుతుంది.

చివరి కవిత ‘ఇంకా’.. వియోగవేళ విరిసే ప్రేమల భావాలలోని ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తుంది.

‘సానుభూతి ప్రేమ ఓదార్పులతో పరివ్యాప్తమై

కాంక్షా దేహపు జీవన లాలసలో ఓలలాడి

పరిష్వంగమై, పెనవేతయై, ఇద్దరమూ గెలిచే

తీయని పోరాటమైనాక

దూదిపింజయై, నీలిమేఘమై

తేలియాడిన నిశ్వాసానంతర తృప్తిని..’

ఈ కవితా సంపుటిలోని కలిగిస్తాయి. చాలా కాలం తరువాత భావపూర్ణమూ, ఔచిత్యవంతమూ, అత్యున్నత స్థాయి సున్నితమైన కవితలని చదివిన ఆనందాన్ని కలిగిస్తాయీ సంపుటిలోని కవితలు. ‘ఆప్తవాక్యం’లో ఐనంపూడి శ్రీలక్ష్మి రాసినట్టు ‘సరికొత్త భావనా ప్రపంచానికి తలుపులు తెరుస్తాయీ’ కవితలు.

కవికి అభినందనలు. కవితా ప్రేమికులకు చక్కటి కవితల విందు ఈ పుస్తకం.

***

ఒంటరీకరణ (కవిత్వం)
రచన: మామిడి హరికృష్ణ
ప్రచురణ: స్వరాజ్యం పబ్లికేషన్స్,
వెల: ₹ 200/-
ప్రతులకు:
స్వరాజ్యం పబ్లికేషన్స్
804, రాయల్ పెవిలియన్ అపార్ట్‌మెంట్స్,
అమీర్‌పేట, హైదరాబాదు.
email: harikrishnamango3@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here