[dropcap]ఒం[/dropcap]టరిననిపిస్తున్నది
ఉసికల పాయలన్నీ
అంతర్ధానమై
శాపగ్రస్థ ఒంటి అరకలా మిగిలినట్టు
పాదు విరూపమై వేర్లు విచ్చేదమై
కొమ్మలు ఎగిరిపోయి
ఊసరక్షేత్రంల విత్తనంలా మిగిలినట్టు
ఒంటరిననిపిస్తున్నది
మొదటి సారి
ఒంటరికి సమూహాన్నిచ్చిన నేనే
దిక్ భ్రమలకు
దిక్కునిచ్చిన నేనే
ఎన్ని దారులు మూసుకున్నా
మరో దారిని చేసుకున్న నేనే
సత్యమెప్పుడూ ఒంటరి కాదన్న నేనే
సూర్య చంద్రులు
బ్లాక్‌హోల్‌ల అదృశ్యమై
చివరి మినుకు చుక్క తెగిన దారిలా మిగిలినట్టు
ఒంటరిననిపిస్తున్నది
మందాకినిని నేలకు దించిన నేనే
ఖడ్గ ప్రహారాల మధ్య కనురెప్ప దించని నేనే
గాలానికి దొరకని చేపని పట్టించిన నేనే
ఒంటరిననిపిస్తున్నది
నిత్యనిత్యాల భాషణ
నిత్య విస్ఫోటనం బధిర ప్రపంచం
నింగీ నేలా భ్రాంతీ భ్రమరం
శూన్యావరణంలా మిగిలినట్టు
ఎవరి మూట ముల్లెను వారు సర్దుకున్నరు
ఉన్నప్పుడో పోయినప్పుడో
ఎవరి జెండా కప్పరనా
ఒంటరిననిపిస్తున్నది
సత్యం ఏ జెండా నొప్పుకోదన్న నేనే
సత్యానిదే అన్ని జెండాలన్న నేనే
ఒంటరిననిపిస్తున్నది
సత్యం మరణ వాంగ్మూలమివ్వాలిప్పుడు