Site icon Sanchika

ఒంటరితనం

[dropcap]సి[/dropcap]ద్ధాపురం అనే ఊరిలో కైలాసం, హరి అనే ఇద్దరు వ్యాపారులు వ్యాపారం చేసేవారు. ఒక్కొక్కసారి ఓడ మీద విదేశాలకు వెళ్లి సరుకు తెచ్చుకొని వ్యాపారం చేసేవారు.

చిత్రమేమిటంటే వ్యాపారంలో పోటీ వలన ఇద్దరు నిప్పు ఉప్పులా ఉండేవారు. ఇద్దరికీ సఖ్యత లేదు!

ఒకసారి ఇద్దరు ఓడలు మీద విదేశాలకు వెళ్లవలసిన వచ్చింది. ఓడ రేవులో అప్పుడు ఒకే ఓడ ఉంది. ఇక తప్పక ఇద్దరు ఆ ఓడ ఎక్కాల్సి వచ్చింది. ఓడలో కూడా ఇద్దరు ఎడ మొఖం, పెడ మొఖం పెట్టుకున్నారు. ఒకరినొకరు పలకరించుకోలేదు.

అలా ఓడ సముద్రం మధ్యలోకి వెళ్లాక తుఫాను ప్రారంభమైంది. పెద్ద గాలి వలన ఓడ ఊగిపోయింది. ఓడ లోని వారందరూ ప్రాణాలు ప్రమాదంలో పోతాయేమోనని భయపడి పోసాగారు. కైలాసం, హరి పరిస్థితి భిన్నంగా లేదు. వారు కూడా భయపడి పోసాగారు.

అనుకున్నంత అయింది. ఓడ అదుపు తప్పి ఓ పెద్ద రాయికి కొట్టుకుని తునాతునకలయిపోయింది.

ఓడ లోని వారు చెల్లాచెదురుగా పడిపోయారు. ఆ సముద్రంలో కొంత మంది ఆచూకీ లేకుండా పోయారు.

అదృష్టవశాత్తు కైలాసం, హరి పక్క పక్కనే పడిపోయారు! విరిగిన పెద్ద ఓడ చెక్క ఒకటి లభించింది వారికి. ఇక తప్పదు కదా! ఇద్దరు ఆ చెక్క ఎక్కి చేతుల్ని ఉపయోగించి ఇద్దరు సాగారు.

అలా కొంత దూరం వెళ్ళాక వారికి ఒక దీవి కనబడింది, అతి కష్టం మీద అక్కడికి చేరుకున్నారు.

ఇంత జరిగినా ఇద్దరు ఒకరినొకరు పలకరిచుకోలేదు.

ఆ దీవిలో జన సంచారం లేదు. కొన్ని కొబ్బరి చెట్లు ,తెలియని వింత చెట్లు ఉన్నాయి.

ఇద్దరు ఈదుకరావడం వలన వారికి బాగా ఆకలి కలిగింది. తినడానికి తిండి లేదు. మరి ఉన్నవి కొబ్బరి చెట్లు మాత్రమే! కొబ్బరి చెట్టు ఎక్కడం హరికి మాత్రమే తెలుసు! కైలాసానికి చెట్టు ఎక్కడం రాదు.

హరి గబగబా కొబ్బరి చెట్టు ఎక్కిఆరు కొబ్బరి కాయలు కోసుకున్నాడు. ఎంచక్కా కొబ్బరి కాయలు పగుల కొట్టి,నీళ్లు త్రాగి కొబ్బరి తిని ఆకలి తీర్చుకోసాగాడు.

దూరంగా నిలబడి ఆశగా కైలాసం చూడ సాగాడు.

అప్పుడు కోపాలు, వ్యాపార పోటీ ఏవీ గుర్తుకు రాలేదు. ఒంటరితనంలో మనిషి అవసరం అతనికి తెలియవచ్చింది.

అమాయకంగా,ఆశగా చూస్తున్న కైలాసాన్ని చూసే సరికి హరి మనసు కరిగి పోయింది!

అతను కూడా కైలాసాన్ని అప్యాయంగా, ప్రేమతో పిలిచి కొబ్బరి కాయలు ఇచ్చాడు. ఒకరికి ఒకరు శతృత్వం మరచి ప్రేమను పంచుకుంటే కలిగే ఆనందం తెలుసుకున్నారు.

అప్పటి నుండి ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకున్నారు.

రెండో రోజు దూరంగా ఒక ఓడ తమ ద్వీపం వైపు వస్తూ కనబడింది. ఇద్దరు తమ చొక్కాలు విప్పి ఓడకేసి ఊపారు. ఓడ లోని వారు ఇద్దరినీ గమనించి ఓడను ద్వీపం దగ్గరకు తెచ్చి ఇద్దరినీ కాపాడారు.

చూశారా, కక్షలు, కార్పణ్యాలు మాని ఒకరికి ఒకరు అనుకుంటూ ప్రేమతో జీవించాలి!

Exit mobile version