[‘ఊబి’ అనే కథని అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]
[dropcap]సు[/dropcap]రేష్ వసుధలకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ స్కూల్లో చదువుకుంటున్నారు. ఇద్దరు బాగా చదువుతారు.
“ఏవండీ! ఏవండీ! పిల్లలు ఊబిలో మునిగిపోతున్నారు. పట్టుకోండి పట్టుకోండి. కాపాడండి. ఏమిటి నేనిలా అరుస్తుంటే మీరు అలా చూస్తూ కూర్చుంటారేమిటి. మిమ్మల్నేనండి పట్టుకోమంటే అలా చూస్తూ ఊరుకుంటారేమిటి?” అంటూ కేకలు పెడుతున్నది వసుధ.
వసుధ కేకలకు పక్కనే పడుకున్నసురేష్ మధ్య నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచాడు.
“వసుధా! వసుధా! ఏమిటి కలవరిస్తున్నావు. నిద్రలే లే” అన్నాడు సురేష్.
“ఏమిటండి కలవరిస్తున్నాను అంటారేమిటి. పిల్లలు ఊబిలో పడి మునిగిపోతున్నారు, పట్టుకోమంటే చూస్తున్నారు?” అన్నది వసుధ.
“ముందు నువ్వు నిద్రలే. పిల్లలేమిటి, ఊబిలో పడిపోవడం ఏమిటి? మనం ఎక్కడ ఉన్నామనుకొంటున్నావు. మనం హైదరాబాదులో ఉంటాం. నువు ఎక్కడున్నావు అసలు?” అన్నాడు సురేష్.
“అలా కాదండి మీకు ఏమీ తెలియదు. నాకెంత భయంగా ఉందో తెలుసా! పిల్లలు ఏమైపోతారో అని” అన్నది వసుధ.
“ఏమైంది నీకివ్వాళ? అలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావు?
“నాకేమీ కాలేదు టీవీలో పేపర్లో ఎక్కడ చూసినా సరే పిల్లలు మునిగిపోతున్నారంటున్నారు.”
”ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడ మునిగిపోతున్నారు? ఏమిటి? అసలు మునిగిపోవటానికి మనం ఏమైనా పల్లెటూర్లో ఉన్నామా? పట్నంలో ఉన్నాం. మీ అమ్మ వాళ్లు, మా అమ్మ వాళ్ళు ఇద్దరు కూడా ఇదే నగరంలో ఉన్నారు. ఇంకేమిటి భయం మనకి?”
“అది కాదండి. ఇవ్వాళ పేపర్లో చదివాను, స్కూలుకి వెళ్లిన పిల్లలు సరిగ్గా చదవటం లేదని మందలిస్తే ఆత్మహత్య చేసుకుంటున్నారని రాశారు. నాకెంత భయం వేసిందో. అందుకే పిల్లలు ఏమైపోతారో అని భయంగా ఉంది” అన్నది వసుధ.
“పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. నీకు అంత భయంగా ఉంటే రేపటి నుంచి ఒక ఆటో మాట్లాడి ఇద్దరినీ బస్సులో కాకుండా ఆటోలో పంపిద్దాం. అతను స్కూల్లో దింపుతాడు, తిరిగి తీసుకుని వస్తాడు. మధ్యలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళటానికి కూడా అవకాశం ఉండదు. ఇంక నువ్వు భయపడాల్సిన పని లేదు.”
“అది కాదండీ, కరోనా వచ్చినప్పుడు స్కూళ్ళు సరిగ్గా లేక ఆన్‌లైన్ క్లాసులు పెట్టారు కదా. అపుడు ఈ ఆన్‌లైన్‌లో క్లాసుల కోసమని కంప్యూటర్, సెల్‌ఫోన్లకి పిల్లలు అలవాటు పడ్డారు. అప్పుడు ఫోన్‍లో వాళ్ళు కేవలం పాఠాలు మాత్రమే కాకుండా వేరేవి చూడటం ప్రారంభించారట. ఇప్పుడు క్లాసులు సరిగ్గా జరుగుతున్నా పిల్లలు ఆ అలవాటును మానుకోలేకపోతున్నారు. ఆ సెల్ ఫోన్ చూస్తూ చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారని చెప్పినా వినటం లేదు. చివరకు టీచర్లు చెప్పినా కూడా వాళ్ళని ఎదిరిస్తున్నారు. మొన్నటికి మొన్న సెల్ ఫోన్ చూడవద్దని తల్లి చెప్పిందని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిట ఒక అమ్మాయి. అలా పేపర్లో టీవీలో రోజుకు ఏదోఒక వార్తను చదువుతున్నాం. సెల్ ఫోన్ చూడటం అనేది అవసరంగా కాక అందరికి ఒక వ్యసనం లాగా మారిపోయింది. ముందు పిల్లలని ఆ వ్యసనం బారి పడకుండా కాపాడుకోవాలి. ఫోను అనేది చెరువు కాదండి. చెరువులోని ఊబిలో పడ్డవాడిని ఎలాగోలా బయటకు తీయవచ్చు, కానీ కావాలని ఊబిలో దిగిన వాణ్ణి బయటకు లాగటం చాలా కష్టం. ఇప్పటికీ మన పిల్లల చేతులు మన చేతుల్లోనే ఉన్నాయి. ఎలాగైనా సరే వాళ్ళని ఆ సెల్ ఫోన్ అనే ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలి. ఇదంతా ఆలోచిస్తుంటే రాత్రి నా కలలో వాళ్ళు నిజంగా ఊబిలో మునిగిపోతున్నట్టుగా అనిపించింది. ఈ సెల్ ఫోన్ అనే ఒకపెద్ద ఊబిలో నుంచి మన పిల్లలని మనం కాపాడుకోవాలండి” అంది వసుధ.
“ఓహ్ అదా నీ భయం. సరే రేపటి నుంచి మనం కూడా అవసరానికే ఫోను వాడదాం. పిల్లలకన్నా ఏది ఎక్కువ కాదుకదా. సరే ఇంకా తెల్లవారలేదు పడుకో” అన్నాడు సురేష్.
“అమ్మయ్య. నా బాధ అర్థం చేసుకున్నారు. ఈ సెల్ అనే ఊబిలోకి పిల్లలు దిగకుండానే చూడాలి. అప్పుడు నాలా ఎవరు బాధపడాల్సిన అవసరం రాదు.” అంది వసుధ.
సూర్యోదయంతో కొత్త ఆలోచన మొదలుపెట్టింది.