ఊహ-నిజం!

0
3

[శ్రీ సముద్రాల హరికృష్ణ రచించిన ‘ఊహ-నిజం!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఊ[/dropcap]హలలో – నింగికి పై అంచులకు యానం
కుచేలుని స్వప్నాలలో కుబేర విలాసం
నిర్గంధ గిరి సుమాల్లో గొప్ప పరీమళం
కడలి నీటిలో కలకండ తియ్యదనం!!
***
ఊహలలో – ఎవరి పని వారు చేయడం
మున్నీటిలో కూలిన అవినీతి కుధరం
వివక్ష లేక అందరకు సమాన స్థానం
మెరికైన వాడెవ్వరైన పట్టపు స్నానం!
***
ఊహలలో – కూడు, గూడు, నీరు, బట్టలకె
ప్రథమ తాంబూలం, పాలన యెవ్వరిదైన!
జన సంక్షేమమే లక్ష్యం, అమ లెరుగని
ఆకారం దాల్చని వాగ్దానాలె, కొలమానం!!
***
ఊహలలో – శిక్షల ఊసంటే పెను భయం
రాబందులకు, రెక్కల విరచే ఝంఝుల
యమ భయం, గత్యంతరం లేకైన, మంచికి
మారే నవ శకం, పేదలకో యుగారంభం!!
***
కళ్ళు తెరిస్తే – కొరడా విసిరిన, నిజం
కీళ్ళు విశ్లధమైన జనజీవన యంత్రం
పరాన్న భుక్తులకు విందులు, విషాహుల
వీర విహారం, ధనమత్తుల రాచరికం!
***
చట్టాలెన్నైన, శిక్షలెన్నున్న బేఖాతరే!
దిట్టరి నాధుడేడి? ఆ ప్రాడ్వివాకుడేడి?!
ఇది ముఖద్వారం, ఆ అథః పాతాళానికి
తుది ఆయుధమే, ‘శస్త్ర చికిత్స’, తప్పదు!!
***
ధర్మ, దండ భయాలుంటే-ఓపెన్ సెసేమ్
మరచిన, కర్తవ్యమనే దైవం గుహకు!
భయ భక్తులుంటే నేతకు, సగం జయం!
భయానికి సేవ తోడైతే, ప్రజా విజయం!!
***
కాని, ఇటు సూర్యు డా వైపున పొడిచేనా?!
మన కాగల కార్యం చేసే గంధర్వు డేడి?
దినమణి సాక్షిగ చేసే మోసా లాగేనా?!
ఆ నిర్దయుల కెపుడో శిక్షాస్మ్రృతి వేడి?√√

ఎక్కడ ఆ శ్వేతాశ్వం, ఎపుడో ఆ కల్కి అవతరణం!?
చిక్కటి చీకటి చీల్చి వచ్చే అభయ సూర్య కిరణం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here