[డా॥ చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారు రచించిన ‘ఊళ్ళో పెళ్ళవకపోయినా..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]న[/dropcap]రోత్తమ్ చాలా అసహనంగా ఫీల్ అవుతున్నాడు. ఎంతంటే, ఆ ఛాంబర్ లోంచి వాకౌట్ చేద్దామన్నంత! అదిగో అక్కడే ఉంది ఓ ఫిట్టింగు. మరొకరి ఛాంబర్ నుండి వాకౌట్ చేసినట్టు, తన ఛాంబర్ నుండి చేయలేడు కదా! పాపం, పెద్ద కష్టమే వచ్చిపడింది! అవతలి మనిషిని గెంటాలని అనిపిస్తోంది, కానీ తాను ఉన్న స్థాయికి అది అగౌరవం. అందరూ సీనియర్లంటే గౌరవమిస్తారు, ‘ఇదెక్కడి తేడా మనిషిరా బాబూ,’ అని మనసులో ఆమె గురించి అనుకున్నా, ఆమెను ఆడిపోసుకోవడం మాత్రం ఆపలేదు.
చిన్నగా, ఎర్రగా బుర్రగా ఉందనుకుంటే ఈ మనిషికి ఎంత పొగరు! అందులోనూ ఆడదై ఉండి, అణకువ లేకుండా సూర్యకాంతంలా వాదిస్తోందీ గయ్యాళిది! మనం ఒకళ్ళని పట్టించుకోకపోతే, కంఠశోష దండగ అనుకుని వాళ్ళంతట వాళ్ళే మనల్ని విసిగించకుండా పోతారన్న మేనేజ్మెంట్ సూత్రాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. దాన్ని తు.చ. తప్పకుండా పాటించాడు! ఏమాటికి ఆమాటే చెప్పుకోవాలి, మేనేజ్మెంట్ సూత్రం భలే పనిచేసింది కూడాను!
తన స్థాయి గుర్తు చేసుకుంది ఆమె. తను ఏమీ మామూలు ఉద్యోగిని కాదు. హెచ్.ఆర్. హెడ్. పిన్న వయస్కురాలైనా, తన పరిధిలోకి వచ్చే కష్టాలన్నీ పరిష్కరించి, యాజమాన్యానికీ-యూనియన్‌కీ మధ్య సత్సంబంధాలు నెలకొల్పింది కూడా! మరి యాజమాన్యం వాళ్ళు తన ఇక్కట్లని తీర్చకపోతే? ఆడదంటే అంత అగౌరవమా? ఈ పురుషాహంకారులకు బుద్ధి చెప్పేవాళ్ళే లేరా?
‘ఖర్మ! ఇదంతా నా జాతకంలోనే ఉంది, అప్పట్లో నేను నమ్మలేదు గానీ! ఇంట్లో ఎంతటి సామరస్యం ఉంటుందో ఆఫీసు వాతావరణం దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని మా జాయ్ గాడు చెప్పలేదూ? నేను పిచ్చి పీనుగులా ఉద్యోగుల నుంచి సమస్యలుంటాయి అనుకున్నాను గానీ, ఉద్యోగమిచ్చిన వాళ్ళు ఇంత తేడా మనిషుల్లా ఉంటారనుకోలేదు,’ అని మనసులో విసుక్కుంది ఆమె.
“సర్! మా సంక్షేమం చూసుకోవాల్సిన మీరు ఈ ఉదాసీన వైఖరిని అవలంబించడం ఏమీ బాగాలేదు,” అంటూ కుర్చీలోంచి లేచింది మయూఖ. “మనది ఫ్యాక్టరీ టౌన్‌షిప్ చూడండమ్మా! అందుకని, బయటి వాళ్ళెవరూ తోచినట్టు వచ్చి, వెళ్ళలేరు. మన కాలనీలో సెక్యూరిటీకి సంబంధించిన ఎటువంటి గొడవలూ ఉండవ్.
మరో విషయం. మీరు ఒక అధికారిణి అన్న సంగతి మరచిపోతున్నారు. మీ భాష చూస్తే యూనియన్ సభ్యులు మాట్లాడినట్టుంది,” అని కావాలని ఎద్దేవా చేశాడు నరోత్తమ్. మయూఖ అతనికి జవాబివ్వకుండా, విసురుగా వెళ్ళిపోయింది. “హమ్మయ్య, శని వదిలింది,” అని నిట్టూర్చాడు నరోత్తమ్.
***
ఇది జరిగిన చాన్నాళ్ళకి..
ఒక సెలవు రోజున నరోత్తమ్ ఫోన్ మ్రోగింది. చూస్తే మయూఖ నుంచి. ‘నిన్ననే కదా ఆమెకు ఫేర్‌వెల్ ఇచ్చాము. ఇంకా ఏం తోమేద్దామని ఫోన్ చేస్తోంది?’ అని గొణుక్కుంటూ ఫోన్ ఎత్తాడు. “నమస్కారం సార్. మీరు ఖాళీగా ఉన్నారా?” అడిగిందామె.
‘కొంపదీసి నన్ను ప్లాస్టిక్ కవర్ అని అనుకుంటోందా, ఖాళీగానో, నిండుగానో ఉండడానికి? అసలే ఇప్పుడు ప్లాస్టిక్‌ని నిషేధించారు కూడాను. ఈ అమ్మాయి ఇంత అజ్ఞానంతో మాట్లాడుతోంది ఏమిటి? హ హ హ,’ అని మనసులో వెటకారంగా అనుకుని, “అసలు ఇవ్వాళ కావలసినంత పనుంది. కానీ, నేను ఉద్యోగుల పక్షం కదా, అనవసరంగా మా స్టెనోని, ప్యూన్‌ని కష్టపెట్టడం ఇష్టంలేక, ఇంటి నుంచే పనిచేస్తున్నాను.
నేను ప్రతీ నిముషమూ ఒక ఆఫీసర్‌ని కదా! సెలవులు కింద స్థాయి వాళ్ళకి మాత్రమే, నా లెవెల్ వాళ్ళకి కాదు,” అని దర్పం చూపించాడు. తనను ధిక్కరించిన వాళ్ళని తన చుట్టుపక్కల మననీయడు నరోత్తమ్. మయూఖ తను అన్న మాటని ఎదిరించినందుకు మరి ఆమె రాజీనామా చేసే పరిస్థితులను కలిగించినందుకు తనకు తానే మనసులో వీపు తట్టుకుని, ప్రశంసించుకున్నాడు.
‘ఫోన్ చేసి బలైపోవడం అంటే ఇదే కాబోలు. దీన్నే హిందీలో ‘ఆ బైల్ ముఝే మార్,’ అంటారు కదూ,’ అని, మనసులో నవ్వుకుంటూ మౌనంగా ఉండిపోయింది మయూఖ. ‘తేడాగాళ్లతో మాట్లాడితే ఇలాగే ఫోన్‌కు జిడ్డు అంటుకుంటుంది,’ అని కూడా ఆమె అనుకుంది.
లైన్ కట్ అయిందనుకున్న నరోత్తమ్, “హలో, హలో,” అని, ఆమె లైన్‌లో ఉందని కన్ఫర్మ్ చేసుకుని, “ఇంతకీ, ఎందుకు ఫోన్ చేశారు? మీరు మమ్మల్ని వదిలి వెళ్లిపోవడానికి నిశ్చయించుకున్నాక, నిన్న రిలీవ్ అయిపోయాక కూడా నన్నెందుకు చూడాలనుకుంటున్నారు?” అని అడిగాడు, పాతకాలపు చిరంజీవి పాటని పేరడీ చేసి, ‘ఇదేదో తేడాగా ఉంది,’ అని మనసులో పాడుకుంటూ.
“నేను మళ్ళీ ఎప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తానో తెలియదు కదండీ. కొత్త ఉద్యోగం వేరే ఊళ్ళో దొరికింది కదండీ! ఎండీ గారు ఎలాగూ ఊళ్ళో లేరు. పెద్దవారు, కనీసం మిమ్మల్ని కలిసి, మీ ఆశీస్సులు తీసుకుని వెళ్దామని..” అని వినయంగా చెప్తే, నరులలో ఉత్తముడు, ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో, “చూడండి, మీ మేడమ్, అంటే మా ఆవిడ, వంద కిలోమీటర్ల అవతలుండే పరమశివుని ఆలయానికి వెళ్ళింది. సాయంత్రం రండి,” అన్నాడు.
“సాయంత్రం నా ఫ్లయిట్ ఉందండీ. ఇప్పుడు కలవలేకపోతే మరెప్పుడూ కలవలేనేమో,” అని ఆ అబల దీన ప్రేలాపన చేస్తే కరిగిపోయాడు మనవాడు. తేడాగా అనిపించడం మానేసింది. ఇంకా నరోత్తమ్ ఆలోచిస్తుంటే, “సార్, నేను పట్టపగలు మీ ఇంటికి వస్తున్నాను. తలుపులు తెరిచి ఉంచండి. భయమెందుకు?” అని ఆమె అతని తటపటాయింపుని దూరం చేసింది.
“సరే ఎప్పుడు వస్తారు?” అని అడిగాడు నరోత్తమ్. “ఓ పావుగంటలో వస్తాను సార్. మీ ఇంట్లో కుక్కలు గాని లేవుకదా!” అంది మయూఖ.
“ఒక జర్మన్ షెపర్డ్ ఉంది కదండీ!” అన్నాడు నరోత్తమ్.
“మీకు తెలుసు కదండీ, నాకు కుక్కలంటే చచ్చేంత భయమని! దాన్ని కాస్త కట్టేసి పుణ్యం కట్టుకోండి సార్,” అని ప్రాధేయపడింది ఆమె.
ఏదో గుర్తుకు తెచ్చుకున్న నరోత్తమ్, “షూర్. బట్ అది మగ కుక్క. ‘వాడు’ అని పిలవాలి,” అని సంతోషంగా చెప్పాడు.
‘వీడు నిజంగా తేడాగాడే. కుక్కల్లో కూడా మగ కుక్కనే ఎంచుకున్నాడు ఈ పురుషాహంకారి,’ అనుకుంటూ, “త్వరలోనే కలుస్తాను సార్,” అనేసి ఫోన్ పెట్టేసింది. ఆమె ఒక స్నేహితురాలి కార్ తీసుకుని నరోత్తమ్ ఇంటికి వచ్చింది. ఆ పెద్ద టౌన్‌షిప్‌లోని పెద్దమనుషుల్లో రెండవ స్థానంలో ఉన్న మనిషి తాలూకు ఇంటిని నిశితంగా కలయజూసింది.
ఎత్తైన ప్రహరీ గోడ, కోట గుమ్మమంత ఎత్తు గేటు. ‘మా ఇంటికి తాగుబోతులొచ్చి గొడవ చేశార’న్నా పెట్టించని గేటు, వీళ్ళింట్లో ఎందుకబ్బా,’ అనుకుంటూ దాన్ని తెరిచింది. వెంటనే లోపలి నుంచి పెంపుడు గ్రామ సింహగర్జన మొదలయ్యింది. ఆమె జడుసుకుంది. కారు లోపలకి తెచ్చి, గేటు బార్లబెట్టి, మళ్ళీ డ్రైవ్ చేస్తూ పోర్టికో బయట ఆపింది.
దాని ముందున్న అందమైన లాన్, దాని చివర్లో ఉన్న పూల కుండీలలో విరగబూసిన పూలు చూసుకుంటూ తెరిచి ఉన్న తలుపును తట్టి, నరోత్తమ్ రమ్మనగానే లోపలికి వెళ్ళింది. ఆయన ల్యాప్‌టాప్‌ని ఒంట్లో పెట్టుకుని ఏదో పని చేసుకుంటున్నారు. ముక్కు మీదున్న కళ్ళజోడు పైనుంచి ఆమెను చూసి, కూర్చోమని సైగ చేశాడు. మయూఖ ఆయన చేతిలో ఒక పళ్ళబుట్ట పెట్టి, ఆయనకి చేతులు జోడించి నమస్కారం చేసింది.
రాజమందిరాల్లో ఉండే హంసతూలికా తల్పంలాంటి మోడల్ సోఫాసెట్ మీద రాజసంగా కూర్చుని కనిపించాడు నరోత్తమ్. ఆ డ్రాయింగ్ రూమ్ ఒక అయిదు నక్షత్రాల హోటల్ లాబీలా ఉంది. ఎన్ని లక్షలు పోసి కొన్నాడో ఆ కళాఖండాలని, అనుకుంది మయూఖ. ‘డబ్బులు, కళాఖండాలున్నంత మాత్రాన ఈ మనిషి గురువింద గింజ కాకుండా పోతాడా,’ అని కూడా అనుకుంది.
ఆమె ఉన్నంత సేపూ పెంపుడు గ్రామ సింహం గర్జిస్తూనే ఉంది. “ఏమీ అనుకోకండి. కొత్తవాళ్లంటే మా లియో గాడికి కిట్టదు,” అని అనునయంగా అన్నాడు. పోనీ, ఆ గదిలో ఉన్న డెబ్భై అయిదు అంగుళాల స్మార్ట్ టివి గొంతు కూడా నొక్కలేదు. వాటిని మించి గట్టిగా అరిచి వాళ్ళిద్దరూ చాలా తక్కువ సేపు పిచ్చాపాటీ మాట్లాడాక, ఆయన ఆశీస్సులు తీసుకుని బయల్దేరింది మయూఖ. వెళ్తున్నప్పుడు తాను నరోత్తమ్‌కి ఎంత ‘అనవసరమైన అతి’థో అని అర్థం చేసుకోగలిగింది. ప్రహసనం ముగుస్తున్నందుకు సంతోషించింది కూడా!
తానొక పెద్ద ఆఫీసర్ కనుక, ఆమెను సాగనంపడానికి నరోత్తమ్ గుమ్మం దాకా కూడా రాలేదు. ఆమెతో మాత్రం, “నేను అతిథి మర్యాదలు పాటించడం లేదని అనుకోకండి. ఈ రిపోర్ట్ ఇవ్వాళే పంపించాలి,” అని బిజీగా ఉన్నట్టు బిల్డ్‌అప్ ఇచ్చాడు. “ఫర్వాలేదు లెండి. ఈ ఊళ్ళో ఉన్నప్పుడు మీ నుండి చాలా నేర్చుకున్నాను సార్,” అని మర్యాదగా చెప్పి కదిలింది ఆమె.
లోపలున్న అతనికి ఆమె కార్‌డోర్ రెండు సార్లు వేసినట్టనిపించింది. డోర్ సరిగ్గా పడలేదేమో అనుకున్నాడు. మరి కొద్ది క్షణాల్లో..
ఒక ఊరకుక్కల మూక బిలబిలమంటూ లోపలికి వచ్చి, అందమైన అతని డ్రాయింగ్ రూమ్ మీద, అందులో ఉన్న అందమైన, విలువై బొమ్మల మీద, హంసతూలికా తల్పంలాంటి ఆ సోఫాల మీద, చివరిగా నరోత్తమ్ మీద దాడి చేశాయి. విశ్వాసం ఉన్న పెంపుడు కుక్క బంధించి ఉండడం వల్ల, తన కోపం మొరగడంలోనే చూపించగలిగింది.
టివిలో ‘కింగ్’ సినిమాలోని కామెడీ సీన్ వస్తోంది. హీరో దెబ్బలకి సంగీత దర్శకుడు తాను హీరోయిన్‌తో పలికిన అవాకులు-చవాకులు గుర్తు తెచ్చుకుంటాడు. అలాగే, అదే సమయంలో మయూఖతో తను తేడా మాటలు తనకి గుర్తుకు వచ్చాయి..
“బయటి వాళ్ళు లోపలికి వచ్చేందుకు వీలు లేదు కదండీ.. పైగా, మీకు ఇచ్చిన ఇల్లు చాలా రోజులు ఖాళీగా ఉంది. మన టౌన్‌షిప్‌లోని తాగుబోతులు ప్రమాదకరమైన వాళ్ళు కారు. వాళ్ళకి కాస్త అడ్జస్ట్ అయ్యే సమయం ఇవ్వండి మరి!
ఊరకుక్కలన్నాక ఎక్కడపడితే అక్కడ తిరుగుతాయి, మొరుగుతాయి. ఎంత మీ తోటలోనే అయినా, మీ పిల్లవాణ్ణి ఎక్కడ పడితే అక్కడ తిరగనీయకండి. అతణ్ణి ఇంట్లో పెట్టి తాళం వేయడం నేర్చుకోండి.”
ఊళ్ళో పెళ్ళవకపోయినా, కుక్కలు హడావుడి చేస్తాయని ఊహించని నరోత్తమ్, ఇప్పుడు ఎవరి మీద ఫిర్యాదు చేస్తాడు? చేస్తే మాత్రం, ఏమైనా నిరూపింపబడుతుందా?