Site icon Sanchika

మరుగున పడిన మరో మాణిక్యం – ‘ఊరికిచ్చిన మాట’

[dropcap]ఇ[/dropcap]టీవల కాలంలో ‘సంచిక’ అంతర్జాల పత్రికలో ‘మరుగున పడిన మాణిక్యాలు’ శీర్షికన విజయవంతం కాకపోయినా మంచి కథ, చక్కని నటన ఉన్న వివిధ భాషలలోని సినిమాలను పరిచయం చేస్తున్నారు. అలాంటివి తెలుగులో కూడా చాలా ఉన్నాయి. వాల్మీకి, శకుంతల, ఉషా పరిణయం, శ్రీరామ కథ వంటివి. ఇవి అప్పట్లో విజయం సాధించకపోయినా ఇప్పుడు చూస్తే కళాఖండాలు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు పాత సినిమాలు చూసే అలవాటు ఉన్నవారు జయాపజయాలతో సంబంధం లేకుండా అన్నీ చూస్తారు. ఇవన్నీ అందరికీ తెలిసిన చిత్రాలే!

చిరంజీవి తొలినాళ్ళలో వచ్చిన చిత్రం ‘ఊరికిచ్చిన మాట’ కూడా అలాంటిదే! చూడగానే పెద్దగా ఆకట్టుకోని టైటిల్, చిరంజీవికి తర్వాత కాలంలో కమర్షియల్ హిట్లు ఇచ్చిన అనేక చిత్రాల ముందు తేలిపోయినట్లు అనిపించేది అయిన సినిమా ఇది. కానీ పరిశీలనగా చూస్తే మంచి కథ, చక్కని నటనతో ఆకట్టుకుంటూ నిర్మాత ఉత్తమాభిరుచిని తెలియజేస్తుంది. ఈ సినిమాని నిర్మించింది నటుడు బాలయ్య. బాలయ్య ‘పాండవ వనవాసం’లో అర్జునుడుగా, ‘బభ్రువాహన’లో బలరాముడుగా, భక్త కన్నప్ప, మోహినీ భస్మాసుర చిత్రాల్లో శివుడుగా, ఇంకా అనేక చిత్రాల్లో నటించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

బాలయ్య తన అభిరుచికి తగినట్లు కొన్ని చిత్రాలను స్వంతంగా నిర్మించారు. అవి ‘చెల్లెలి కాపురం’, ‘నేరము-శిక్ష’, ‘ప్రేమ పగ’, ‘చుట్టాలున్నారు జాగ్రత్త’, ‘ఈనాటి బంధం’ ఏనాటిదో మొదలైనవి. వీటన్నిటికీ కథను తనే సమకూర్చుకున్నారు. ఆ కోవలోనికి చెందినది మరో చిత్రం ‘ఊరికిచ్చిన మాట (1981)’. ఈ చిత్రం నాటికి సినీపరిశ్రమకు స్వర్ణయుగం ముగిసింది. కళాత్మక చిత్రాలు దాదాపుగా కనుమరుగు అయ్యాయి. అయినా అడపాదడపా మంచి చిత్రాలు ఒకటీ రెండు వస్తున్నాయి. అలాంటిదే ఈ చిత్రం కూడా.

ఎల్లవరం మారుమూల కుగ్రామం. చుట్టుపక్క ఊళ్ళన్నీ అలాంటివే! టౌన్‌కి వెళ్ళాలంటే పదిమైళ్ళు కొండల్లో నడిచి వెళ్ళాలి. రవాణా సౌకర్యాలు కూడా లేవు. ఆ ఊళ్ళో గవర్నమెంట్ డాక్టర్ ఉన్నాడు గానీ టౌన్‌లో కాపురం ఉంటూ ఎప్పుడో ఒకసారి వచ్చివెళుతూ ఉంటాడు. ప్రతి సంవత్సరం కలరా వల్లనో, టైఫాయిడ్ వల్లనో జనం చీమలు, దోమలు లాగ చచ్చిపోతూ ఉంటారు. అలాంటి గ్రామంలో కోటి అనే యువకుడు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఊళ్ళో అందరూ నిరక్షరాస్యులే!

కోటిని అన్న రాముడు కట్టెలుకొట్టి కష్టపడి చదివిస్తాడు. కోటి డాక్టర్ అయితే ఈ ఊరివాళ్ళ కష్టాలు తెలుసు కాబట్టి ఇక్కడే ప్రాక్టీస్ పెడతాడు, జనం బ్రతుకుతారు అనే ఉద్దేశంతో ఊళ్ళో అందరూ కలసి తలా కొంత వేసుకుని యం.బి.బి.యస్., చదివిస్తారు. చదువు అయిన తర్వాత కోటి కాలేజీలో తనతో పాటు చదువుకునే రూపను ప్రేమించి, పెళ్లి చేసుకుని ఇల్లరికం ఉండిపోతాడు. ఆ విషయం తెలిసి, తమ ఊరికి రమ్మని పిలవటానికి వచ్చిన అన్నను మెడపెట్టి గెంటిస్తాడు.

రాముడు ఇంటికి తిరిగివచ్చి జరిగిన విషయం ఊరివాళ్ళతో చెబితే ఎవరూ నమ్మరు. అన్నదమ్ములిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారని రాముడిని నిందిస్తారు. రాముడు అవమానంతో ఊరు వదలి వెళ్ళిపోయి ఎలాగైనా కోటిని ఆ ఊరుని రప్పించాలని ప్లాన్ వేసి, రూపను బలవంతంగా తన ఊరికి తీసుకువస్తాడు. భార్య కోసం కోటి కూడా వస్తాడు. అక్కడి పరిస్థితులు అర్థం చేసుకుని భర్తను ఇక్కడే ప్రాక్టీస్ పెట్టమని కోరుతుంది రూప. కోటి పశ్చాత్తాపపడి అన్నకు, ఊరివాళ్లకు క్షమాపణ చెప్పి అక్కడే ఉండిపోవటంతో కథ ముగుస్తుంది.

ఇందులో రాముడుగా చిరంజీవి, కోటిగా సుధాకర్, రూపగా మాధవి, రాముడి ప్రియురాలు సీతగా కవిత, రూప తండ్రిగా కాంతారావు నటించారు. ఇంకా ఇతర పాత్రలలో రావి కొండలరావు, గిరిబాబు, వంకాయల, ఝాన్సీ, లక్ష్మీ కాంతమ్మ, జయమాలిని, మాడా మొదలైన వారు నటించారు. ఇందులో ఆరు పాటలు ఉన్నాయి. ‘పైరగాలి పైట లాగుతూంటే..’. ‘ఆడింది ఊరు, పాడింది పైరు, ఎగిరెగిరి దూకింది ఏటినీరు..’, ‘చూపుల్లో చుట్టేసి మాటల్లో పట్టేసి..’, ‘కోడికూసే పొద్దే పొద్దు..’, ‘హోరుగాలిలో కలిసిండా ఊరికిచ్చిన మాట..’ అనే అయిదు పాటలు సి. నారాయణ రెడ్డి రచించగా బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడారు. ‘మోహనరంగా, ముద్దులరంగా..’ అనే జాలాది రచన మాత్రం వాణీజయరాం పాడింది.

‘ఊరికిచ్చిన మాట’ చిత్రానికి మాటలు డి. వి. నరసరాజు రాసారు. డి. వి. నరసరాజు సంభాషణలు రాసిన చిత్రాలు అన్నింటిలోనూ పాత్రల స్వభావాలు కథ మొదట్లోనే చెప్పేస్తారు. ‘గుండమ్మ కథ’లో సావిత్రి కోడికూతతో లేచి జొన్నలు దంచుతూ ఉంటుంది. ఇంతలో సూర్యకాంతం వచ్చి “అప్పుడే తెల్లారిందా నీకు? మమ్మల్ని నిద్ర పోనీయవా!” అంటూ మొట్టికాయ వేస్తుంది. పనంతా అయిన తర్వాత జమున నిద్ర లేచి “అమ్మా! కాఫీ!” అంటుంది. దీనిని బట్టి సావిత్రి కష్టపడి పనిచేస్తుందనీ, సూర్యకాంతం గయ్యాళి అనీ, జమున గారాబంగా పెరిగిందనీ ప్రేక్షకులకు అర్థం అవుతుంది.

అదేవిధంగా ‘ఊరికిచ్చిన మాట’ సినిమాలో కూడా కథ మొదలు అవగానే కోటి పరుగెత్తుకుంటూ వచ్చి అడవిలో కట్టెలు కొడుతున్న అన్నతో తను ఇంటర్మీడియట్ పాసయిన విషయం చెబుతాడు. ఇద్దరూ ఊళ్లోకి వచ్చి అందరితో ఈ విషయం చెబుతారు. “అంటే ఏంట్రా!” అని అడుగుతాడు ఊళ్ళో ఒకడు మరొకడిని. “అదేదో ఇంగిలీషులో మంత్రాలు చదివే చదువులే!” అని చెబుతాడు. అంటే ఊళ్ళో అందరూ నిరక్షరాస్యులనీ, ఇంటర్మీడియట్ చదవటమే గొప్ప అనీ, రాముడు కట్టెలు కొట్టి కష్టపడి తమ్ముడిని చదివిస్తున్నాదనీ కథ మొదలైన రెండు నిమిషాల్లోనే అర్థం అయిపోతుంది.

ఇందులో కొన్ని సన్నివేశాలు హృదయాన్ని కదిలిస్తాయి. కోటి వచ్చి తను పాసయ్యానని చెప్పగానే “అయ్యబాబోయ్! పేపర్లో నీ ఫోటో వేశారట్రా!” అని అడుగుతాడు రాముడు. “ఫోటో కాదన్నయ్యా! నంబర్ వేసారు” అని చెబుతాడు. “ఇంత పెద్ద పేపర్లో నీ ఫోటో వెయ్యచ్చు గదరా! వాళ్ళ సొమ్మేం పోయింది?” అని అంటాడు రాముడు అమాయకంగా.

భోజనం చేసేటప్పుడు “నాకు వరిఅన్నం పెట్టి, నువ్వు జొన్నఅన్నం తింటున్నావేం అన్నయ్యా!” అని అడుగుతాడు కోటి. “నువ్వు చదువుకునే వాడివి కదరా! నీకు వరిఅన్నం. నేను కట్టెలు కొట్టుకునేవాడిని కాబట్టి నాకు జొన్న అన్నం” అని చెబుతాడు రాముడు అమాయకంగా. అతడికి తమ్ముడి పట్ల ఉన్న ప్రేమ, అభిమానం తెలియజేస్తుంది ఈ సన్నివేశం. ఆ రోజుల్లో బియ్యం చాలా ఖరీదు, జొన్నలు చౌక. పేదవాళ్ళు తినేవాళ్ళు జొన్నలని. భూమి గుండ్రంగా ఉన్నది అన్నట్లు ఇప్పుడు మళ్ళీ అవే అలవాట్లు రిపీట్ అవుతున్నాయి. ఈ రోజుల్లో చాలామంది షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవటానికి జొన్నసంకటి తింటున్నారు.

మళ్ళీ కథ లోకి వస్తే, అదే తమ్ముడి కోసం పట్నం వెళ్ళినప్పుడు తమ్ముడి మావగారు “కోటి ఇప్పుడు ఈ ఇంటి అల్లుడు” అని చెబుతాడు. అది వినగానే ఒక్కక్షణం నివ్వెరపోతాడు రాముడు. అతనికన్నా పెద్దవాడు తనకి పెళ్లి కాకుండానే తమ్ముడు పెళ్లి చేసుకోవటం గుండెల్లో పొడిచినట్లు అనిపించింది. అంతమాత్రాన తిట్టిపొయ్యలేదు. తనకన్నా ముందు తమ్ముడు పెళ్లి చేసుకున్నాడని ఏడ్చిపోయే కుసంస్కారి కాదు. చదువుకోకపోయినా సంస్కారవంతుడు అతను. వెంటనే సంభాళించుకుని “పోన్లేరా, మన ఊరు వెళదాంరా!” అని పిలుస్తాడు. రాముడు పాత్రలో నటించిన చిరంజీవి అప్పటికి ఇంకా స్టార్ కాలేదు. అప్పుడప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అయినా ఎక్స్‌ప్రెషన్‌లు చక్కగా ఇచ్చాడు.

“నువ్వు లేకుండా నేను మన ఊరు వెళ్ళలేనురా!” అంటాడు రాముడు. “వెళ్ళకపోతే ఇక్కడే ఉండిపో! నీకే లోటూ రాకుండా చూసుకుంటాను” అంటాడు తమ్ముడు. ఒళ్ళు మండిపోతుంది రాముడికి. “నేను ఇక్కడ ఏడిచేది నా బతుకు కోసం, నా కడుపు కోసం కాదు. నీతి కోసం, ఊరికిచ్చిన మాట కోసం! మాటపోయిన తర్వాత మనిషి బతికినా ఒకటే, చచ్చినా ఒకటే!” అంటాడు.

ఈ సన్నివేశం చూసే ప్రేక్షకులకి రాముడి పాత్రమీద అభిమానం, గౌరవం ఏర్పడతాయి.

ఒక అయినింటి ఆడపిల్లని, చదువుకున్న దానిని, అంగబలం అర్థబలం ఉన్నవాడి కూతురిని ఆమె ఇష్టంలేకుండా తీసుకురావటం అంటే మాటలుకాదు. మత్తుమందు ఇచ్చి, కారులో వేసుకుని చిటికెలో తీసుకురావటానికి రాముడు నేరాలు చేయటం అలవాటు ఉన్నవాడు కాదు.. పల్లెటూరి వాడు, చదువు సంధ్య లేని, సామాన్యమైన తెలివితేటలు కలవాడు. అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే పంతం, పట్టుదల కలవాడు. కష్టపడి రిక్షా తొక్కి నాట్య ప్రదర్శనకు కావలసిన హైక్లాస్ టికెట్ కొని పోస్ట్‌లో రూపకి పంపిస్తాడు. ఎవరో ఫ్రెండ్స్ పంపారని అనుకుని రూప వస్తుంది. ఒంటరిగా చూసి, బెదిరించి చేతులు, నోరు కట్టేసి రైల్లో తీసుకువస్తూ ఉంటాడు.

తోటి ప్రయాణీకులు అడిగితే “ఈ అమ్మాయి నా చెల్లెలండి. పిచ్చిఎక్కితే ఆసుపత్రికి తీసుకుపోతున్నాను” అని చెబుతాడు. తన ఊరికి బలవంతంగా తీసుకురావటం చూసి ఊళ్ళో అందరూ “కొండను తవ్వి, ఎలకను పట్టినట్లు నీ తమ్ముడికి చెప్పుకోలేక ఆడపిల్లను తీసుకువస్తావట్రా!” అంటారు. “దూడ వెంట ఆవు వచ్చినట్టు పెళ్ళాం మీద మోజుతో ఆడు ఇక్కడికి వస్తాడు మావా! ఆడిని మీకు అప్పగిస్తాను. కొడతారో, కోసుకు తింటారో మీ ఇష్టం. మేమిద్దరం కలసి గూడుపుఠాణీ చేసామని అన్నారుగా!” అంటాడు రాముడు. చిరంజీవి నటించిన వైవిధ్యభరితమైన పాత్ర ఇది. జయాపజయాలతో సంబంధం లేకుండా చిరంజీవి నటించిన పది మంచి చిత్రాలను చెప్పమంటే తప్పనిసరిగా చెప్పాల్సిన చిత్రం ‘ఊరికిచ్చిన మాట’.

ఈ చిత్రంలోని ఏ మాత్రం అసభ్యత లేని హాస్యసన్నివేశాలు హాయిగా నవ్విస్తాయి. ఎనభై ఏళ్ల ముసలమ్మ ఒకామె “ఒరేయ్ కోటీ! నువ్వు డాకటరు అయ్యి రావాల! నా కీళ్ళ నెప్పులకు నువ్వే మందియ్యాల” అంటుంది. ఒకతను ఆమె వంక ఎగాదిగా చూసి “ఆడు డాకటరు అయి వచ్చేదాకా నువ్వుంటా వంటే?” అంటాడు. “నేను యాడికి పోతాన్రా! కావాలంటే కాయితం రాసుకో! ఏలుముద్ర యాస్తాను” అంటుంది అమాయకంగా.

ఆ ఊరిలో ఉన్న ఒకే ఒక్క వైద్యుడు దైవాధీనం. పట్నం వెళ్ళినప్పుడు కడుపునొప్పి అనీ, తలనొప్పి అనీ, మూడురోజులకి ఒకసారి వస్తుందనీ చెప్పి, మందుల షాపులో ఇరవై, ఇరవై టాబ్లెట్లు తీసుకుని వస్తాడు. పల్లెటూరిలో వైద్యం పేరుతూ ఇస్తూ డాక్టర్‌గా చెలామణీ అవుతూ ఉంటాడు.

ఊరి జనంవచ్చి “డాక్టరుగారూ! కడుపులో నెప్పి అండీ!” అంటాడు

“మీ కోడి, గుడ్లు పెట్టిందా!” అడిగాడు దైవాధీనం. “పెట్టిందండీ!” చెబుతాడు. “అదీ సంగతి. పెట్టిన గుడ్లన్నీ నువ్వే తినేస్తే కడుపు నెప్పి రాక ఏమౌతుంది?” అంటాదు దైవాధీనం.

“రేపు కోడినే తెస్తానండీ!” చెబుతాడు. “అలా అన్నావు. బాగుంది” అని మందుల షాపులో కొన్న టాబ్లెట్ ఇస్తాడు దైవాధీనం.

ఎటువంటి టెన్షన్‌లూ పెట్టకుండా రెండున్నర గంటల పాటు హాయిగా సాగిపోయే ‘ఊరికిచ్చిన మాట’ చిత్రం 1981లో విడుదలై ‘శంకరాభరణం’ చిత్రం పోటీని తట్టుకుని బాగానే ఆడింది.

Images Source: Internet

Exit mobile version