Site icon Sanchika

ఊరు రమ్మంటోంది!

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో ₹ 2500/- బహుమతి పొందిన కథ. రచన కె.వి.లక్ష్మణ రావు గారు. ఈ కథకు ప్రైజ్ మనీని అందించిన వారు డా. అమృతలత.]

[dropcap]‘క[/dropcap]న్నతల్లిని కాదన్న వాడికి బ్రతుకుండదు’

‘కన్న ఊరిని మరచిన వాడికి చరిత్ర ఉండదు’

***

వారంలో ఆరు రోజులూ ఉపాధ్యాయుడు కాబట్టి వెంకట రమణ బడికి వెడతాడు.

ఆదివారం మాత్రం ఆ ఊరి లైబ్రరీకి వెడతాడు.

సాధారణంగా రమణ ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు తక్కువ దూరం అయితే నడుచుకుంటూ, ఎక్కువ దూరం అయితే సైకిల్ మీద, బాగా దూరం అయితేనే బస్సెక్కి వెడతాడు.

ఇవే అతని ప్రయాణ సాధనాలు.

నెట్ రోజుల్లో కూడా నేటివిటీకి విలువ నిస్తాడు. పచ్చని పల్లెటూరిలో బ్రతకడమే ఒక వరం అని వాదిస్తాడు.

ఇంటికి దగ్గరలో ఉన్న లైబ్రరీకి నడుచుకుంటూ వెడుతుండగా ఫోన్ రింగయింది.

“శ్రీనూ, సాఫ్ట్‌వేర్” అని డిస్‌ప్లే మీద కనబడితే ‘చాలా కాలానికి చేసాడ’నుకుంటూ రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకింద ఆగి ఫోన్ లిఫ్ట్ చేసాడు.

‘శ్రీనూ! చెప్పు, ఏంటి సంగతులు?” అన్నాడు.

“ఒరేయ్! రమణా! మన ఫ్రెండ్స్ కిరణ్, సత్తిబాబులు కూడా నీతో మాట్లాడుతారట. కాన్ఫరెన్స్ కాల్ ఇది” ఆన్నాడు శ్రీను.

“మీతో మాట్లాడి చాలా రోజులే అయిందిరా. ఇప్పుడు ముగ్గురూ ఒకేసారి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. సడన్‌గా ఫోన్ చేశారు. ఏదైనా విశేషమా?” రమణ నవ్వుతూ అడిగాడు.

“మేం ముగ్గురమూ ఒకేసారి నీతో మాట్లాడేలా చేసింది నువ్వేగా. ఏమి తెలియనట్టు అంటున్నావే?” అన్నాడు సత్తిబాబు కొంచెం వ్యంగ్యంగా.

“నేనేం చేశానురా?” అర్ధం కానట్టుగా అన్నాడు రమణ.

“ఏదో ఆన్‌లైన్ పత్రికలో, ‘మా ఊరు.. గొప్పూరు’ అని మన ‘మానేపల్లి’ గురించి రాసింది నువ్వేగా?” అన్నాడు కిరణ్.

“అది మీ వరకూ వచ్చిందా?” అన్నాడు రమణ సంతోషంగా.

“వాట్సప్ లోనూ, ఫేస్‌బుక్ లోనూ, ఇన్‌స్టాగ్రామ్ లోనూ చక్కర్లు కొట్టింది. మా దృష్టికి రాదా?” అన్నాడు శ్రీను.

“మన ఊరు గుర్తు కొచ్చి ఫోన్ చేశారన్న మాట. బావుందిరా!” అన్నాడు రమణ.

“మన ఊరు గురించి అన్నీ అబద్ధాలే రాశావు. అయినా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో ఊపిరి తీసుకునే సమయం కూడా మాకు ఉండటం లేదురా” అన్నాడు శ్రీను.

“బడిలో పంతులుగా పని చేసేటోడికి, సంపాదనతో బాటు సమయం కూడా మిగులుతుంది శ్రీనూ” అన్నాడు సత్తిబాబు వ్యగ్యంగా.

“రమణా! మన ఊరిలో చెరువు నీళ్లను, దాహం వేస్తే, అప్పటికప్పుడు గ్లాసుడు నీళ్లు తీసుకుని తాగి దాహం తీర్చుకోవచ్చా? తాగడానికి తప్ప, మిగతా అన్ని పనులకూ వాడేస్తున్న చెరువు గురించి అలా అబద్ధం రాయచ్చా?” అన్నాడు శ్రీను.

“అదే కాదు శ్రీనూ! గోదావరి గట్టున వెలసిన కుమారస్వామి గుడికి, ప్రతీ రోజూ బారులు తీరేలా భక్తులు వస్తారట. వారి వారి మొక్కులు చెల్లించుకుంటారట. చినుకు పడితే వరద నీరు చేరినట్టుగా, ఆ గుడి చుట్టూ అంతా బురదగా ఉంటుంది. అలా అబద్ధం రాయడం తప్పుకాదా?” సత్తిబాబు రమణను అడిగాడు.

“శివ కేశవు లిద్దరూ కొలువైన గుడి ప్రాంగణం. ఆది శంకరుని అద్వైతానికి ప్రతీకని రాశావు. శిథిలావస్థకు చేరిన ఆ గుడి గురించి అందమైన అబద్ధం రాయడం తప్పురా రమణా! బడిలో పిల్లలు అబద్దాలాడితే, ఉపాద్యాయులు తప్పని చెప్పాలి. ఇక ఉపాధ్యాయుడే అబద్దా లాడితే కంచే చేను మేసినట్లు కాదా?”

“ఒరేయ్! ఒక్కసారి నేను చెప్పేది కూడా వినిపించుకోండి” అన్నాడు రమణ చిరాగ్గా.

“ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని రాస్తే అది గొప్ప రచన అవుతుంది. లేనిది ఉన్నట్టు రాస్తే అది అభూత కల్పన అవుతుంది. ఆ కల్పనలు పిల్లలకు నచ్చుతాయి. కనుక పిల్లల కథలు రాసుకో. ఇలా అబద్ధపు రచనలు మానుకో. నీకేం? టీచర్‌వి. అడక్కుండా కొన్ని, అడిగితే మరి కొన్ని సెలవులు వానాకాలం వరదల్లా వస్తూనే ఉంటాయి. మేము మాత్రం ఆదివారం అయినా, ఆన్‌లైన్‌లో ఆఫీస్ వర్క్‌కు అటెండ్ కావాల్సిందే?” అంటూ ఆ ముగ్గురు మిత్రులూ, రమణ ఇచ్చే వివరణ వినకుండానే కాన్ఫరెన్స్ కాల్‌ను కట్ చేసేశారు.

రమణలో అంతర్మధనం మొదలైంది. ‘తప్పు చేశానా? అబద్దాలు రాశానా?’ తనలో తాను ప్రశ్నించు కున్నాడు.

అదే ఆలోచన తోనే లైబ్రరీకి నడుస్తున్నాడు.

దారిలో తెలిసిన వాళ్ళు ఎదురైన ప్పటికీ ముక్తసరిగానే పలకరిస్తున్నాడు.

ఆలోచనల్లో ఉండగానే లైబ్రరీ వచ్చేసింది.

అప్పటికే పిల్లలు అక్కడికి చేరుకున్నారు.

కొంతమంది కథల పుస్తకాలు చదువుతుంటే, మరి కొంత మంది బొమ్మల పుస్తకాలను పరిశీలిస్తున్నారు. వాళ్ళను అలా చూడగానే, చిన్నప్పుడు దీక్షితులు మాస్టారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.

“కొండ ఎక్కితే ఎత్తులో కనిపిస్తాము. కానీ లైబ్రరీకి వెళ్లి చదివితే, కొండంత ఎత్తుకు ఎదుగుతాము” అనేవారు.

రమణతో పాటు శ్రీనూ, కిరణ్, సత్తిబాబు అంతా దీక్షితులు మాస్టారి వద్ద చదువు నేర్చుకున్నవారే.

ఇక్కడే పొలం గట్ల మీద ఆడుకున్నారు. కొబ్బరి బొండాలను చెట్లెక్కి మరీ తీసేవారు. కొబ్బరి నీళ్లను తాగేవాళ్ళు. ఆదివారం వస్తే, ఊరిలో మోతుబరి రైతు ఆంజనేయులు గారి తోటలో జామ చెట్లు ఎక్కి, ఎన్నో జామ కాయలు కోసేసేవాడు సత్తిబాబు.

‘ఆంజనేయులు గారిని అడగచ్చు కదరా?’ అని రమణ అంటే, “అనుమతి కోరి, కోసిన కాయలు కన్నా, చెట్టు పై కొట్టుకొచ్చిన కాయలు తీపిగా ఉంటాయంటారు! తినండిరా” సత్తిబాబు సమర్థించుకునేవాడు.

‘ఈ ఊరు మాకు అందమైన బాల్యం ఇచ్చింది. ఆనందంతో కూడిన అల్లరిని చేయించింది. చదువు చెప్పింది. జీవితాన్ని ఇచ్చింది’ అనుకున్నాడు రమణ.

రమణ రాసినది చదివి, బెంగుళూరులో ఉంటున్న దీక్షితులు గారబ్బాయి అవధాని వెంటనే ఫోన్ చేసాడు.

“అన్నయ్యా! నాన్నగారు, మిమ్మల్ని మెచ్చుకున్నారు. ఊరి కోసం ఎంతైనా చేస్తామని చెప్పమన్నారు” అని చెప్పాడు.

అలాగే అమెరికాలో సెటిల్ అయిన మునసుబు గారబ్బాయి రవి ఫోన్ చేసి “రమణా! చేసేది అమెరికాలో నైనా, నా మనసు అందాల కోనసీమకే నెలవైన మన ఊరు మానేపల్లిలోనే ఉంది. నీ ఆర్టికల్ ద్వారా మన ఊరిని మరోసారి గుర్తించేలా చేశావు. ఊరికి ఏది అవసరమైతే అది చెప్పు. వెంటనే చేయిస్తాను.” అన్నాడు.

అలా తాను రాసిన ఆ వ్యాసం ద్వారా, ‘ఊరికి ఏమి కావాలి?’ అని అడిగిన వారే కానీ, వెక్కిరించిన వాళ్ళు లేరు.

“బాగా రాశావు” అని మెచ్చుకున్నారే గానీ, “అబద్దాలు రాశావు” అని నొచ్చుకున్న వారే లేరు.

లైబ్రరీకి వెళ్ళాడే కానీ, రమణ మనసు కుదుట పడటం లేదు. ఉద్యోగాల రీత్యా ఊరొదలి వెళ్లి పోవడం తప్పు కాదు. కానీ అమ్మా, నాన్నలను, వారి కూడా తీసుకుని వెళ్లిపోతే మాత్రం, కన్న ఊరిని మరిచి పోతారా?

ఆలోచనలతో, అన్యమనస్కంగా ఉన్న రమణతో లైబ్రేరియన్ “లైబ్రరీ సమయం ముగిసింది, సార్!” అనడంతో లేచాడు. పిల్లలను ఇంటికి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి, తాను కూడా ఇంటికి బయలుదేరాడు.

ఆలోచనల్లో ఉండగానే ఇల్లు వచ్చేసింది. అప్పుడే చేతిలోకి సెల్ తీసుకున్నాడు.

మిత్రులకు వాట్సప్ టైప్ చేయడం మొదలుపెట్టాడు.

“లేనిది చెప్పడం ‘అబద్ధం’ అవుతుంది. నిజమే! కానీ ఒకప్పటి వైభవాన్ని తిరిగి చెప్పడం ‘జ్ఞాపకం’ అవుతుంది. ఏరా! మరచి పోయారా? మన ఊరి చెరువు నీళ్లు, తేనె కన్నా తీయగా ఉంటాయని. అవి మనం చిన్నప్పుడు తాగామని.

ఆదివారం, మన ఊరి వైనతేయ గోదావరి నదీ పాయలో స్నానం చేస్తే, కాశీ గంగా నదిలో స్నానం చేసిన ఫలితం ఉందని, మన పెద్దలు చెప్పిన మాట మరచిపోయారా?

మీకో విషయం చెప్పాలి.

మన గురువు గారైన దీక్షితులు గారి మండువా లోగిలి ఉన్న ఇంటిని, రైతైన ఆంజనేయులు కొన్నారు. కానీ ఆయన ఇంటిని కొంత మరమ్మత్తులు చేసి బాగు చేసుకున్నారే కానీ, పడగొట్టి కొత్తగా ఇంటిని నిర్మించలేదు. నన్ను కన్న తల్లి, పుట్టిన ఊరు నాకు ఎప్పుడూ అందంగానే ఉంటాయి. చూస్తోంటే ఆనందంగానే ఉంటుంది.

అందుకే మన ఊరి చెరువు, గుడి యొక్క పూర్వ వైభవాన్ని, ప్రాభవాన్ని చెప్పాను. కారణం అందరూ చేయి, చేయి కలిపితే ఆ వైభవం తిరిగి వస్తుందన్న ఆశతో, నమ్మకంతో.

అప్పుడు నేను రాసినట్టుగా మన ఊరు ఒకప్పటిలా కలిమికి చెలిమికి నిలయం అవుతుంది. కాలుష్యానికి దూరం అవుతుంది.

నేటి రోజుల్లో పిల్లలు ఉద్యోగాలు సిటీ లోనే చేయవచ్చు. కానీ వాళ్ళని కన్న వాళ్ళు మాత్రం పల్లెటూళ్ల లోనే ఉంటున్నారు. వాళ్ళు తీరిక వేళల్లో కన్న వాళ్ళను చూడటానికి ఊరు రావడం లేదా?

కన్నవాళ్ళెంతో కన్న ఊరు కూడా అంతే. ఒరేయ్! గుర్తుంచుకోండి రా.

కన్న తల్లిని కాదన్న వాడికి బ్రతుకుండదు. కన్న ఊరిని మరచిన వాడికి చరిత్ర ఉండదు. అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను.”

వాట్సప్ సందేశం ముగ్గురి మిత్రులకూ చేరింది. బ్లూ టిక్‌లు వచ్చాయి.

వారం రోజులు గడిచాయి.

ఆదివారం ఉదయాన్నే రమణ ఇంటిముందు కార్ ఆగింది. శ్రీనూ, సత్తిబాబు, కిరణ్‌లు ముగ్గురూ భుజాన బ్యాగ్ లతో వచ్చారు.

రమణ చుట్టూ చేరారు.

“అమ్మను గుర్తు చేశావు రా. ఊరికి దూరమైతే అమ్మను దూరం చేసుకున్నట్టే. సెలవు పెట్టి మరీ వచ్చాం. కులాసాగా గడపడానికి కాదు. ఊరికి మా వంతు సాయం చేయడానికి. కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకు రావడానికి” అన్నాడు శ్రీను, రమణను కౌగిలించుకుంటూ.

ముగ్గురు మిత్రులనూ ఒక్కసారిగా చూసేసరికి, రమణ ఆనందానికి అవధులు లేవు.

“ఉన్న ఊరిలో, కన్న వారితో ఉండడం అదృష్టం రమణా! ఆ అదృష్టం అందరికీ ఉండదు రా. దేనికైనా పెట్టి పుట్టాలి” అన్నాడు సత్తిబాబు, రమణ కేసి మెచ్చుకోలుగా చూస్తూ.

“మీరు నాకో మాటివ్వండి రా. సంవత్సరానికి ఒక్కసారైనా ‘మన పల్లెకుపోదా’మనే ఆలోచన చెయ్యండి. మానేపల్లి రండి. కన్న ఊరు ఋణం తీర్చుకునే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకండి. మన ఆరోగ్యకర పరిపూర్ణ జీవితానికి పుట్టిన ఊరే పట్టుకొమ్మలు రా” అన్నాడు రమణ మిత్రులని ఆలింగనం చేసుకుంటూ.

“నీ, ‘మా ఊరు! గొప్పూరు’ వ్యాసం ద్వారా మా కళ్ళు తెరిపించావురా” అన్నారా ముగ్గురు మిత్రులూ. ఆనందంగా నవ్వుతూ, రమణకు మనసారా అభినందనలు తెలియజేస్తూ.

Exit mobile version