Site icon Sanchika

ఊసరవెల్లి

[Anton Chekov, ‘A Chameleon’ కథకు, సముద్రాల హరికృష్ణ గారి యథేచ్ఛనుసృజన]

[dropcap]చ[/dropcap]లికాలం.

మంచు, పొగలు కక్కుతున్న వేళ!

కొన్ని చోట్ల దుప్పటి లాగా మంచు ఆవరించిన వేళ!

మహానగరంలో ఒక పెద్ద కాలనీ.

అన్ని రకాల, అన్ని వర్గాల మనుషులు మీకు తగిలే అవకాశం మెండుగా ఉన్న ప్రాంతం.

ఇన్‌స్పెక్టర్ త్రిపాఠీ, ఒడుపుగా ఒక చేత్తో – ఎవడి దగ్గరో భయపెట్టో, బెదిరించో కొట్టేసిన ఒక ప్యాకెట్టు; రెండో చేత్తో, తన కొత్త ఓవర్‌కోట్ సరిచేసుకుంటూ, తాపీగా నడిచొస్తున్నాడు.

అతని వెనకాలే, రాగిజుట్టు కానిస్టేబుల్ మంగత్రామ్, తన స్థాయికి తగ్గట్టు, పళ్ళ కొట్టులో ఆమ్యామ్యాగా తీసుకున్న జాంపళ్ళ బుట్టతో!

ఆదివారం కాబట్టో, చలిపులి వలనో, రోడ్డంతా ఖాళీ, పిట్టపురుగు లేదు!

అంతా నిశ్శబ్ద వాతావరణం.

తెరిచిన దుకాణాల తలుపులూ, బేరాల కోసం ఆవురావురంటున్న దుకాణదారులూ!

***

అంతటి నిశ్శబ్దాన్ని చీలుస్తూ, “పాడు పక్షీ, నేనే దొరికినా నీకు కరవటానికీ”, అన్న మాటలు త్రిపాఠీ చెవుల పడ్డాయి.

“ఎవరన్నా ఉన్నారా, పట్టుకోండి దాన్ని, పట్టుకోండి, ఇంకా ఎంత మందిని కరుస్తుందో పాడు కుక్క” అన్న మాటలూ వినవచ్చాయి.

వాసుదేవ్ టింబర్ డిపో లోంచి, ఒక కుక్క మూడు కాళ్ళ మీద కుంటుకుంటూ, అరుస్తూ రావటం గమనించాడు ఇన్‌స్పెక్టర్. దాన్ని తరుముకుంటూ, ఒక చొక్కా బొత్తాలు కూడా సరిగ్గా పెట్టుకోని ఆసామి వస్తున్నాడు. ఇంతలోనే, అతను ముందుకు దూకి ఆ కుక్క వెనుక కాళ్ళు పట్టుకొని, అదుపు లోకి తెచ్చుకున్నాడు.

మళ్ళీ అది లబోదిబో అరుపులు!

దుకాణాల్లో నుంచి, ఆవలిస్తున్న మొహాలు కొన్ని తొంగి చూశాయి, ఏవిఁటా హడావిడి అని!

అంతలోనే,ఆకాశం నుంచి ఊడిపడ్డారా,భూమి లోపలి

నుంచి పుట్టకొచ్చారా అన్నట్టు,చాలా మంది పోగయ్యారు గుంపుగా,చెక్కల అడితీ ముందు!

“ఏదో గొడవ లాగా ఉంది, బాస్”, అన్నాడు మంగత్రామ్, తెలియనిదేదో, చురుగ్గా తాను పసిగట్టినట్టు!

ఇన్‌స్పెక్టర్ కాస్త ముందుకొచ్చి ఎడమవైపు తిరగ్గానే, ఆ లూజు చొక్కా అతను కనిపించాడు, డిపో గేటు దగ్గర!

తన కుడి చేయి పైకి ఎత్తి, రక్తం ఓడుతున్న ఒక వేలిని చూపిస్తున్నాడు, ఆ గుంపు వైపు, మత్తు మొహంతో!

“ఎట్లాగైనా మూల్యం చెల్లిస్తావ్ చూడు” అంటున్నట్టు, ఆ వేలేదో విజయపు చిహ్నం అయినట్టు!

***

త్రిపాఠీ గుర్తుపట్టాడు అతన్ని, కంసాలి రంగయ్యగా, ఒక గోల పుట్టించి, గగ్గోలు పెట్టి, ఆ గుంపు ఏర్పడటానికి కారణమైన వాడిగా!

ఒక బోజాయ్ కుక్కపిల్లను కూడా చూశాడు, ముంగాళ్ళ మీద నుంచొని ఉన్న దానినీ, భయంతో వణుకుతున్న దానినీ, గుంపు మధ్యలో!

***

చొరవగా గుంపు మధ్యకి వచ్చి, అందరినీ ఉద్దేశిస్తూ, రంగయ్యనే చూస్తూ

“ఏవిఁటీ గొడవ ఇక్కడ? ఎవరు మీరంతా?ఎందుకా వేలు అట్లా చూపిస్తున్నావు, ఏంటి కథ? ఎవరా అరుపులు అరిచింది?” అన్నాడు, అధికార దర్పం ఉట్టిపడేలా!

వచ్చే దగ్గును ఆపుతూ, సగం దగ్గుతూ, రంగయ్య చెప్పటం మొదలెట్టాడు:

“నేను ఒక్కణ్ణే నా పాటికి నేను ఉన్నానయ్యా ఎవరి జోలికి పోకుండా! టింబర్ దుకాణం యజమానురాలితో వంట కట్టెలు గురించి మాట్లాడుతుంటే, ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ దెయ్యం వచ్చి మీదపడి, నా కుడి చేయి వేలిని అమాంతం కొరికేసింది!

నేనా చేత్తో పనిచేసే వాడిని, అందునా అతి ముఖ్యమైన వేలిని దెబ్బతీసింది ఇది, ఏ పని చేయటానికి, వీలు లేకుండా!

నాకు నష్ట పరిహారం ఇప్పించాలి సార్. ఇట్లా కుక్కలు కరిస్తే, నష్టపోయి ఊరికే చేతగానివాడిలా కూచోవాలని ఏ చట్టం మాత్రం చెపుతుంది?

అందరూ ఇట్లా కుక్క కాటుకు గురైతే, ఇంక లోకం నడిచినట్టే!

అంతేనయ్యా, అంతే విషయం! ఏదో పేద వాణ్ణి,మీరే న్యాయం చేయాలి!”

అంతా వినన్నట్టు నటిస్తూ, శ్రధ్ధగా విన్నాడు, ఇన్‌స్పెక్టర్ త్రిపాఠీ!

“ఊఁ, తగిన శిక్ష పడాల్సిందే ఇట్లా కుక్కలను ఊరి మీద వదిలేవారికి. నియమాలు పాటించని ఎవరైనా ఒకటే నాకు, బీదా గొప్పా, చిన్నా పెద్దా తేడాలే లేవు!”

ఒక క్షణం గుంపులో అందరినీ, రంగయ్యనూ, కుక్కనీ తేరిపార చూసి, పెద్దగా ఇంకా ఇట్లా అన్నాడు:

“మంగత్రామ్, వెంటనే దర్యాప్తు చేసి చెప్పు, ఇది ఎవరి కుక్క, ఎందుకు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ వదుల్తున్నారో? వెంటనే.. ఊఁ అర్ధమయ్యిందా?! వెంటనే నాకు తెలియాలి, ఎవరిదీ కుక్క?” గర్జిస్తున్నట్టు అన్నాడు.

“దీన్ని, ఎట్లాగో ఇక అంతమొందించాల్సిందే, పిచ్చిదే అయ్యుంటుంది. తప్పదు. లేకపోతే, సమాజానికే ప్రమాదం”, అని సాగించాడు కూడా!

“జనరల్ వర్మ గారి కుక్క అనుకుంటానండీ”, ఎవరో గుంపులో నుంచి మెల్లిగా అన్నారు.

ఇన్‌స్పెక్టర్ లాఠీ అటూ ఇటూ తిప్పుతూ, పచార్లు చేస్తూ –

“ఊఁ, వర్మ గారి కుక్క! అసలు నువ్వెట్లా చిక్కావోయ్ దీనికి?! అది చూస్తే నేలకు జానెడుంది, నువ్వేమో దుక్క లాగా దిట్టంగా, అంతెత్తున్నావ్!

నువ్వే, గోటితో వేలి మీద గిల్లుకుని, రక్తం, దెబ్బ అంటూ గోల చేస్తున్నావా ఏంటి, పరిహారం పేరున ఏదో కొంత నొక్కేయచ్చని?!

మీ అలగా జాతి లక్షణాలు నాకు బాగా తెలుసు, నాతో ఆటలాడకు,జాగ్రత్త!” అన్నాడు రంగయ్య కేసి తిరిగి!

అందరూ వింటున్నారు, కిమ్మనకుండా!

“వీడే దాని నోట్లో సిగరెట్ పీక పెట్టాడయ్యా, అది కరవటానికి అవకాశం ఇచ్చాడు! మొదటి ఛాన్సులోనే కరిచేసింది! మరి ఊరుకుంటుందేమిటి, నోట్లో వేలు పెట్తే??!”, గుంపులో ఒకడి మాటలివి.

వెంటనే రంగయ్య, “ఆపరా మెల్లకన్నూ! అందరికీ కనిపించేదొకటి, నీక్కనిపించే దింకొకటి! నువు చూశావా?! చూడనేలేదు, ఎందుకురా ఉత్త పుణ్యానికి అబధ్ధాలాడి, పాపం మూటగట్టుకుంటావు?! ఇన్‌స్పెక్టర్ గారు బాగా తెలివైన వారు, ఇట్టే పసిగట్టేస్తారు- ఎవడు నీ లాగా అబధ్ధాలకోరో, ఎవడు నాలాగా అమాయక పక్షో! వారిది న్యాయమైన చూపు! నేనే అబద్ధాలు చెబుతున్నాననుకో, కోర్టు కెళ్దాం, అక్కడ తేలిపోతుంది కదా, నీళ్ళేవో పాలేవో?!! అందరూ సమానం రోయ్, ఈ రోజుల్లో చట్టం ముందు! మా వాడొకన్నాడు, వాడు లాయరులే, అందుకని ‘లా’ విషయాల్లో నన్ను బోల్తా కొట్టించ లేరెవరూ, తెల్సా?!” అన్నాడు.

రంగయ్య ఉపన్యాసాన్ని, త్రిపాఠీ కత్తిరించేశాడు.

“ఏయ్, ఊఁ వదరవాకు! కట్టిపెట్టు నీ కాకమ్మ కబుర్లిక, అర్థమైందా?!”

ఇంతలో, మంగత్రామ్ హడావిడిగా వచ్చి, “సార్ ఇది వర్మ గారిది కాదు సార్! వారివన్నీ పొమరేనియన్ లట!” అన్నాడు.

“ఏమయ్యా, ఖచ్చితమేనా?! వర్మ గారిది కాదుగా ఇది?” మళ్ళీ ప్రశ్నించాడు త్రిపాఠీ!

“ముమ్మాటికీ కాదు సార్” అన్నాడు మంగత్రామ్, దృఢంగా!

“నాకు ముందే తెలుసు ఆ విషయం, వర్మ గారివన్నీ ఉత్తమ జాతి కుక్కలు! ఇది.. ఎవరికి తెలుసు ఏ జాతో ఏమిటో?!” ఈసడింపుగా అన్నాడు ఇన్‌స్పెక్టర్!

“ఇట్లాంటి దాన్ని ఎందుకు పెంచుకుంటారో ఎవరైనా!  గౌరవభంగం, నన్నడిగితే, ఇట్లాంటివి పెంచుకోవటం! సరే రంగయ్యా, నిన్ను కరిచింది అంటున్నావు, అదే నిజమైతే నీకు న్యాయం జరగాల్సిందే.

ఎవరు దీన్ని నిర్లక్ష్యంగా వదిలారో వారికి శిక్ష పడాల్సిందే! ఇప్పటికే వ్యవస్థ, వారికి చాలా అలుసై పోయింది”.

ఇంతలో తనలో తాను అనుకుంటున్నట్టు, కానీ పైకే అనేసిన, మంగత్రామ్ మాటలు:

“ఇది బహుశా వర్మ గారిదే నేమో! దాని మొహాన వ్రాసి లేదు కానీ, ‘వర్మ గారి కుక్క’ అని, అప్పుడెప్పుడో వారి ఇంటి విశాల ఆవరణలో ఇదో ఇట్లాంటిదో, దర్జాగా విహరిస్తుండటం చూసిన గుర్తొస్తోంది,నాకు!”

“ఇది ఖరాఖండిగా చెపుతున్నాను సార్, వర్మ గారిదే”, ఒకడు గుంపులోంచి అన్న మాట అది!

“కానిస్టేబుల్, నువ్వు వెంటనే దీన్ని తీసుకుని వర్మ గారింటికి వెళ్ళి, వారిదేనా కనుక్కుని వారికి జాగ్రత్తగా అప్పగించి రా. నాకు కనిపిస్తే, వారిదని గుర్తించి, పంపించానని ప్రత్యేకంగా చెప్పు. నా పేరు చెప్పటం మర్చిపోకూడదు, తెలిసిందా?! ఇట్లా ఇది బయటకు రాకుండా కట్టుదిట్టం చేయమని చెప్పానని కూడా చెప్పు. ఎంత ఖరీదైన, గొప్ప జాతి కుక్కో, వారు పెంచుతున్నారంటే! సామాన్య విషయమా! బయటకు వేస్తే, ఇట్లాగే ప్రతి అడ్డమైన వాడూ, నోట్లో సిగరెట్టో ఏదో పెట్టి వేధిస్తాడు. పాపం పాడైపోతుంది.వర్మ గారి లాంటి పెద్దమనిషి పెంపుడు జంతువు! మంగత్రామ్, నువ్వు బయల్దేరు, ఊఁ, వెంటనే!” అన్నాడు త్రిపాఠీ.

***

“ఏయ్, బండవెధవా, ముందా చెయ్యి కిందకు పెట్టు! ఏదో ఘనకార్యం చేసిన వాడిలాగా, ప్రదర్శన చేస్తున్నాడు, ప్రదర్శన! తప్పంతా నీదే, స్పష్టంగా తెలుస్తోంది. నోరు మూసుకొని, ఇంటి దారి పట్టు, లేదా కటకటాల గదిలో ఇరుక్కుపోతావ్, జాగ్రత్త!”

“అదిగో చూడండయ్యా, వర్మ గారి వంటవాడు ఇటే వస్తున్నాడు, అతన్ని అడుగుదాం!” అన్నాడు రంగయ్య ఆత్రంగా!

“ఏయ్, ముకుందా, ఈ కుక్క మీ యజమాని ఇంటిదేనా?!” రంగయ్య అడగనే అడిగాడు!

ముకుంద్, తాపీగా, “ఛీ, ఇట్లాంటివి అసలు మా అయ్యగారికి ఇష్టమే ఉండవు”, అన్నాడు.

ఇంతలోనే త్రిపాఠీ కర్కశంగా చెప్పేశాడు:

“ఇక్కడ ఇట్లా ప్రతివాడినీ అడుగుతూ, కాలం వృథా చేయాల్సిన అవసరం లేదు. అతను చెపుతున్నాడు కదా, ఇది వీథి కుక్కే అని! ఇది వీథి కుక్కే, తక్షణం దీన్ని తొలగించాల్సిందే! ఇదే ఈ విషయంలో ఆఖరి మాటా, నిర్ణయం, అంతే!”

***

అంతలో ముకుంద్ మళ్ళీ కొనసాగించాడు, “ఇది మా అయ్యగారిది కాదు కానీ, ఆ యింటికి సంబంధించిందే! మొన్న వాళ్ళ తమ్ముడు గారు వచ్చారుగా, బయటూర్నుంచి, వారిది. వారు తెచ్చారు తమతో బాటు!”

వెంటనే ఇన్‌స్పెక్టర్ త్రిపాఠీ, “ఓహ్, చెప్పావు కాదేమిటోయ్, జనరల్ గారి తమ్ముడుగారు, ధీరవర్మ గారు వేంచేశారా?! ఎప్పుడూ? నాకు తెలియలేదు?! అవును అన్నగారంటే వారికి ఎంతో గౌరవం, మన్నన! నాకు తెలియలేదు వారి రాక గురించి, దానికేం గానీ, ఇంద తీసుకుని వెళ్ళు భద్రంగా దీన్ని! చురుకైన కుక్క, ఈ మొద్దు వాడి వేలు కొరికిందట!”

ముకుంద్ చకచకా వచ్చి, కుక్కను తీసుకొని బయటకు నడిచాడు, కలప అడితీ ప్రాంతం నుంచి.

***

గుంపు గుంపంతా, రంగయ్య వైపు చూసి నవ్వింది.

“నీ గడుసుదనం అంతా బయటపెడ్తా, ఏదో ఒక రోజు కాచుకో”, అంటూ బిక్క చచ్చి చూస్తున్న రంగయ్యని బెదిరిస్తూ, పెద్ద పెద్ద అంగలతో వెళ్ళిపోయాడు, ఇన్‌స్పెక్టర్ త్రిపాఠీ, తన థానా వైపు!

Exit mobile version