(చెన్నూరు హరి నారాయణ రావ్🌿 గారి ‘ఒరేయ్ అప్పారావ్!’ రచనని అందిస్తున్నాము.)
[dropcap]నా[/dropcap] చిన్నప్పుడు, అంటే నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ఇప్పటికంటే చాలా చిన్నగా ఉండేవాణ్ణట! అంటే లేట్ 60s 70s లో అనుకోండి. ప్రజలకి సాహిత్యం, తెలుగులోని గిలిగిలితనం గట్రాలపై మక్కువ అనేవి ఇప్పటికంటే కొంచెం ఎక్కువగా ఉన్న ఆరోజుల్లో ప్రైవేట్ ఆడియో ఆల్బంస్ కోస్తా ఆంధ్రాలో ఎక్కువగా సందడి చేసేవి. అవి బాగా చెలామణి అయ్యి ప్రజల ఆదరాభిమానాలతోపాటు ఆయా నిర్మాతలకి కాసులవర్షం కురిపించకపోయినా సదరు మదరాసు బాబుల జేబులు నింపేవి. అప్పట్లో కళాకారులకి నిదర్శనం అని కొందరు నమ్మి పాటించి ధరించే లాల్చీ పైజమాల జేబుల లోతంత. ఆయా డిస్కుల డిస్ట్రిబ్యూషన్ (ఆ తర్వాత దీన్నే కొంతకాలం పంపిణీ అన్నార్లే!) చాలావరకు గోదావరి జిల్లాలవరకే పరిమితమై ఉండేదని శ్యామలా టాకీస్ సెంటర్లో ఒక భోగట్టా. ఇప్పట్లా కాకుండా ఆ రోజుల్లో దూరతీరాలకి (నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర ఇత్యాదులు దూరమే మరి!) డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ (బహుశా) కష్టంగా ఉండేదేమో. సినిమా రీళ్ళయినా, LPలు అయినా, నాలుగు ఆరు ముక్కల పోస్టర్లయినా ఫిజికల్ గా బస్సుల్లోను లాంచీల్లోను పంపాల్సిందేగా. పండగల సీజన్లో అగ్రతారల చిత్రాలు రిలీజయితే ఆ ఊరికి ఈ ఊరికి మధ్యన రయ్ రయ్ మంటూ తిరిగేందుకు అంబాసిడర్లు ఎటూ ఉండనే ఉన్నాయి. అడపా దడపా విచ్చేసే సినీజీవుల తాకిడితో వారి సందర్శకులతో కోలాహలంగా అనిపించే ఆ రోజుల్లో, కనిపించే ఆ వీధుల్లో, మేం స్కూలుకి వెళ్ళే దారుల్లో ఎక్కడైనా అపరిచితమైన అంబాసిడరు కనిపిస్తే లోపలకి తొంగి చూసేవాళ్ళం చీకట్లో తారలేవన్నా తళుకుమంటాయేమోనని. విషయానికొస్తే, అట్టాంటి ప్యూర్ ఆడియో ఆల్బం చెయ్యాలంటే దమ్ముతోపాటు బాగా డబ్బు కూడా ఉండాలి. అసలీ రోజుల్లో అంతటి సాహసవంతులు అంజనం వేసినా దొరకరనేది నిజం. తీస్తే మార్కెట్టు ఏది అంటారేమో. అదీ నిజమే!
సరే, ఆ ప్రైవేట్ ఆల్బంస్ అన్నీ దాదాపుగా సినిమా షూటింగులకి కాణాచి అయిన గోదావరి యాసలోనే ఉండేవి. నా పెళ్ళయిన కొత్తల్లో మా అత్తారింట ఒక జోకేశారు కూడాను ‘అప్పటిదాకా మామూలుగా వచ్చే గోదావరి ఎక్సుప్రెస్ గోదారి బ్రిడ్జీ ఎక్కగానే సా..గుతుందట.’ అదేం చిత్రమో మరి! ఆ రోజుల్లోనే రిలీజైన నూతన్ ప్రసాద్ సినిమా ‘చలిచీమలు’ (కోటిలింగాల రేవు అన్నట్టు నూటొక్క జిల్లా కూడా ఉన్నట్టే!) నిజ్జంగానే ఆ గోదావరి గాల్లో ఛలి పుట్టించింది. హిట్టో గిట్టో తెలీదు కానీ ఆ రోజుల్లో ఎక్కడ చూసినా ఆ సినిమాలోని నూతన్ ప్రసాద్ డైలాగులే యెటకారాలు తీసేవి. అప్పట్లో LP & SP అని గ్రాంఫోన్ ప్లేట్లు ఉండేవి. LP అంటే Long play, SP అంటే Short play అని క్లాసులో అనుకునేవారు. సినిమా సూపర్ డూపర్ హిట్టయితే ప్లాటినం-డిస్క్, అది ఇది అని స్టేజీలెక్కి సంబరాలు చేసుకునేవారు. నాకు గుర్తున్నంతవరకు ఏ సెంటర్కి వెళ్ళినా ముత్యాలముగ్గు, యమగోల, చలిచీమలు డైలాగులే మోత మోగేవి. (రావ్ గోపాల్రావ్ గారు బతికుంటే డైలాగు కాదురా ‘డవులాగు’ అని చిన్నబుచ్చుకునేవారేమో.) ఆ సినిమాల్లోని డైలాగ్స్ చాలావరకు ఫన్నీగా ఘాటుగా ఓ మోస్తరు మోటుగా అనిపించినా చాలావరకు గోదావరి యాసతో కళాత్మకంగా నిజాత్మకంగా ఉండేవి. అప్రస్థుతం అయినా అసంబద్ధం కాని విషయం ఒకటి ఇక్కడ ముచ్చటించుకోవాల్సిందే. నాటు సరసం, కొంచెం మోతాదు మించినట్టుగా అనిపించే ఘాటుతనం అనేవి (వెకిలితనం కాదు సుమీ!) అక్కడి రాజమండ్రి గోదావరి తీరాల్లో సహజంగా ఉండేవో లేక కొందరు రచయితలు వారివారి కథల్లోకి అవి జొప్పిస్తేనే వాస్తవికతకు దగ్గరగా ఉంటుందనుకున్నారోగానీ ఆ ఇదైతే ఉందనిపించేశారు! పోలిక కుదిరిందో లేదో కానీ, ఏదేని సినిమా కథలో నాయికను వర్ణించినప్పుడు కట్టుబొట్టు పెద్దగా పట్టించుకుంటామో లేదో కానీ కిన్నెరసాని, ఎంకి పాత్రల్లో జాకెట్టు లేని అశ్లీలం కాని కోనశీమ అందం కనిపిస్తుంది. ఎవరూ చెప్పకపోయినా బహుశా ‘ఇలా ఉంటుంది, ఇలానే ఉండాలి’ అని ప్రేక్షకులు చదువరులు ముందే ఒక (ఉన్నతమైన) అభిప్రాయానికి రావడం అలవాటైపోయిందేమో. ఆ ‘ఇది’ అనేది చదువరుల సాహిత్యాభిలాషకు వారి ఉన్నతమైన ఆలోచనాశైలికి పరాకాష్ట అనక తప్పదు. ఇంకా, ఆ రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ దాదాపుగా రాజమండ్రి, గోదావరి, అక్కడి లంకలు పరిసర ప్రాతాల్లోనే ఉండేది, ఊరేగేది. ఎందుకంటే ఎక్కడైనా, ఏ మూలైనా, ఏ షూటింగ్ జరుగుతున్నా ముందుగా అది మా క్లాసురూములో వార్తకు వచ్చేది చర్చకు తెర తీసేది. మీలో ఎవరైనా నాలా జుత్తు కొంచెం వెనక్కెళ్ళి నుదుట గీతలు పడ్డ వారుంటే ఇహ చెప్పేదేవుంది, మీకు తెలియకనా అంట!
ఇంతకీ నే చెప్పొచ్చేదేవిటంటే, ఆ రోజుల్లో నేను విన్న ఒక ప్రైవేట్ ఆల్బం కథ. ఇది బహుశా నూతన్ ప్రసాద్ గారి ‘చలిచీమలు’ హిట్టయ్యక అదే మూసలో మోజులో చేసుంటారు. నేను ఎలిమెంట్రీ స్కూల్లో ఉండగానే అక్కడి హిందూ సమాజంలో ఏకపాత్రాభినయనం తెగ వేసేవాళ్ళు, ఆబగా చూసే వాళ్ళు. కానీ ఇలా ఏకపాత్ర-ఆడియోతనం విన్లేదు కన్లేదు. దాన్నే ఇప్పుడు బ్లాగ్ (Blog) అంటున్నారేమో. ఈ ప్రయోగం నూతన్ ప్రసాద్ తోనే తెరంగేట్రం చేసిందనేవారు కొందరు. ఆదొక విచిత్రమైన ప్రక్రియలా అనిపించేది నాకు. ఒకరకంగా కొత్త ఒరవడి కూడాను. ఇప్పుడు తలుచుకుంటే నిజ్జంగా హాశ్చర్యంగానే ఉంది. ప్రస్థుత కధావస్తువు ఆల్బంలో గొంతు కూడా అచ్చం నూతన్ ప్రసాద్ గొంతులానే ఉంటుంది. బహుశా ఆయనదే అయ్యుండొచ్చు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ‘పక్కాగా ఆయనదే’ అని కితాబు ఇచ్చినా ఇందులో ఆశ్చర్యపోవడానికి ఎవరూ ఏవీ మిగల్చలేదు. ఆయన గారు అక్కడి మనిషే కదా మరి! ఇహ ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఆల్బం కథ విషయానికొస్తే, నాకు గుర్తున్నంతవరకు చెప్తాను. అంటే, ఆ తరువాద్ది మిమ్మల్ని చెప్పమని కాదు. మక్కీకి మక్కీ గుర్తు లేదని నా ఇది. టూకీగా చెప్పాల్సొస్తే,
సన్నివేశం ఒక ‘సినిమా ధియేటర్.’ అందలి కిక్కిరిసిన ప్రేక్షకుల నడుమ కూర్చున్న ఒక కొంటెజంట చుట్టూ తిరిగే చమత్కార సరసభరిత సంభాషణీయం. అప్పుడేమో –
భార్యగారు అంటుంది భర్తగారితో “ఏవండీ, ప్చ్. ముందు సీట్లో ఆ ఎత్తాయన అడ్డం వస్తున్నాడండీ. డైలాగులు వినపడుతున్నాయి కానీ బొమ్మ కనబడ్డం లేదు.”
ఇంకేం! ఆ భర్తలోని మగాడు ధవిళేశ్వరంలోని ఆనకట్టై కట్లు తెంపుకున్నాడు. గళ్ళచొక్కా పై బొత్తాలు రెండు ఠపీ ఠపీమని ఊడి కొవ్వూరులో పడ్డాయి. చూస్కో నా తడాఖాని ‘కాడి ఎద్దు గాంఢీవముతో ముక్కాడి ఎద్దుగా ఎదిగి అర్జునుడు చెండ కోపమున..’ అని బాపుగారి తిన్నడు భక్తకన్నప్పలో లేచిన చందాన ఉవ్వెత్తున లేచి ఆ ఎదురు సీట్లో మనిషికి ఠపీమని ఒక్క జెల్లకాయ్ ఇచ్చుకున్నాడు.
ఇచ్చుకున్నవాడై ఇలా అన్నాడు “ఒరేయ్ అప్పారావ్, ఎంతకాలం అయ్యిందిరా నిన్ను చూసి. ఎక్కడుంటున్నావ్, ఏం చేస్తున్నావ్, పెళ్ళయ్యిందా, పిల్లలెంతమంది..”
“ఓ ఓ ఆగండాగండి. మీరు ఎవర్నో చూసి ఎవరో అనుకుని పొరపాటు పడుతున్నారు. No problem. it happens. I can understand.” అని మర్యాదకొద్దీ అన్నాడేగానీ ఒకటే శంక. మళ్ళీ కొడతాడేమో అని వెనక్కి ముందుకి అనుమానంగా చూపులు, గుండెల్లో గుబులు.
ఇంతలో మనోడి భార్యగారికి సినిమా టిక్కెట్టు గిట్టుబాటు కావట్లేదని ఎందుకో ఒకటే ఫీలింగ్. భర్తగారితో “ఇందాక కాదండీ. మీగ్గానీ దమ్ముంటే వాణ్ణి మళ్ళీ కొట్టండి. అప్పుడు ఒప్పుకుంటా!”
“ఏవని!? ఓకే ఓకే. ఒప్పుకుంటావుగా మరి? ఐతే చూడు..”
ఠపీమని ఇంకో జెల్లకాయ్!
“ఏరా అప్పారావ్, నేను నిజంగానే నిన్ను గుర్తుపట్టలేదనుకుంటున్నావ్ కదూ! అందుకేనా, వెనక్కి-ముందుకి వెనక్కి-ముందుకి తొంగితొంగి చూస్తున్నావ్, దొంగా! చిన్ననాటి స్నేహితుల్ని నేనంత ఈజీగా మర్చిపోనర్రేయ్! సర్లే కానీ, మనోళ్ళందరూ ఎక్కడున్నారు, ఏంటీ..”
ఈలోగా ఇంటర్వెల్!
సదరు పెద్దమనిషి ఈపాలి కొంచెం ముందుగానే జాగ్రత్తపడ్డాడు. ముందు మూడు లైన్లు దాటి మొకం మీద కాంతి పడకుండా ఒక మూల నక్కి సెటిలయ్యాడు.
భర్తగారు – “చూశావా మన తడాఖా. దెబ్బకి పరార్. ఇప్పటికైనా ఒప్పుకుంటావా నేను..”
భార్యగారు – “ఏంటి ఒప్పుకునేది పలసపులుసులో పనసపొట్టు! ఆడెక్కడికీ పోలేదు. అల్లదిగదిగో ఆ మూల బట్టబుఱ్ఱ మెరిశిపోవట్లా, ఆడే! నువ్వో పేద్ద మొగోడివి, నీకా గళ్ళ చొక్కా, హిప్పీ క్రాఫు నువ్వూనూ. చాల్చాల్లే ఊరుకో!“
(అమ్మ దీని.. ఎంతమాట అనేసింది) భర్తగారు అహం దెబ్బ తిని బిక్క చచ్చాడు. కామెడీసీను కాటిసీను కాకూడదనుకున్నాడు. రైలుబండి బొగ్గు ఇంజెన్‌ను తలపిస్తూ నాశికారంధ్రాలు వేడెక్కి శెగలు సుడులు తిరిగుతూ ఊళ పెట్టాయి.
“ఈయేల ఆడో నేనో తేలిపోవాల, అంతే. ఇప్పుడు చూడు నా విశ్వరూపం..” అంటూ జాతరలో తోక తిప్పిన పోటెద్దులా ముందుకి దూసుకెళ్ళాడు.
మళ్ళీ ఠపీ!
“ఏరా అప్పారావ్, ఇక్కడున్నావా! ఓలోలోలి, ఇందాకట్నుంచి నువ్వనుకుని ఆడెవడికో పాపం తెగ జెల్లకాయలిచ్చేసేననుకో. సర్లే కానీ, రాజమండ్రి ఎప్పుడొచ్చావ్, ఎన్ని రోజులుంటావ్, ఏంటి కత..”
సదరు మైదానంగారు దీన వదనంతో “ఒరేయ్, నువ్వెవరోగానీ ఎందుకురా ఇలా నా వెంట పడ్తున్నావ్? ఇంతపెద్ద ధియేటర్లో నేనే కనిపిస్తున్నానేంట్రా నీకు! నేన్నీ అప్పారావుని కాదురా బాబూ అన్నా వినవేంట్రా? ఛీ.. అసలీ ఊరే వదిలిపోతా..” అంటూ పెద్దపెద్ద అంగలేసాడు ఎర్రబోర్డు ఎగ్జిట్ వైపు.
“ఒరేయ్ అప్పారావ్, సినిమా ఇంకా పూర్తి కాలేదురా..”
“చూపించింది చాలు..”
వాయిల్-చీర ఒంటి బిగువుని ఓపలేకుంటే కాలుపై కాలేసి ఊపుతూ కిసుక్కున వవ్వింది వరహాలు. ఆ నవ్వు వెన్నెల్లా హాలంతా పరుచుకుంది. ఆ వెలుగులో మీసం మెలేశాడు గవర్రాజు!
అదండీ కథ. దాదాపు యాభై యేళ్ళనాటి కథ ఇది. నాకు గుర్తున్నంతవరకు చెప్పాగానీ ఈ కథ రాసింది నేను కాదు. నేనొక మాధ్యమం మాత్రమే. కాలానికి సాహితీపిపాసులకు మధ్యన వేసిన వంతెన. ఇందులో ఇసుమంతైనా క్రెడిట్ నాకొద్దు. ‘వద్దు’ అనడం కూడా కొంచెం అతిశయోక్తిగాను ఎబ్బెట్టుగాను ఉంది. కూడదు, అంతే. కాలానికి, తదనుగుణంగా వెన్నంటి వచ్చే ఆధునికతకు సాంకేతికతకు ఎదురొడ్డి ఇంకా నా మదిలోని గోడల్ని పట్టుకు వేలాడే ఒక మాశికలా నిలిచిన ఈ కథని అనుమతి లేకుండా ఇలా మీతో పంచుకున్నందుకు ఆ అజ్ఞాత రచయితకి నా క్షమాపణలు, నమస్సులు, నీరాజనాలు. చదువరులకు కృతజ్ఞతలు.