Site icon Sanchika

ఆస్కార్ నామినేషన్లు ఏ సినిమాలకు-ఒక అంచనా!!!

[dropcap]ఓ[/dropcap]టీటీ ప్లాట్‌ఫామ్స్ ప్రాచుర్యం పెరుగుతున్న కొద్దీ సినిమాలు తామే నిర్మించి నేరుగా ఓటీటీలోనే విడుదల చేయటం మొదలుపెట్టాయి నెట్ ఫ్లిక్స్, ఆమెజాన్ లాంటి సంస్థలు. అయితే కొందరు నిర్మాతలు, దర్శకులు సినిమాలు థియేటర్లలోనే చూడాలి అంటూ ఓటీటీ సినిమాలకు అవార్డులు ఇవ్వరాదని పట్టుబట్టారు. ఆస్కార్ అవార్డులు ఇచ్చే సంస్థ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మధ్యేమార్గంగా ఆ సినిమాలు కొన్నాళ్ళు థియేటర్లలో ప్రదర్శించి తర్వాత ఓటీటీలో విడుదల చేస్తే అవార్డుల కోసం వాటిని పరిగణిస్తామని ప్రకటించింది. కానీ అవార్డులకి ఓట్లు వేసేది సినీరంగంలో ఉన్నవారే కాబట్టి ఓటీటీ చిత్రాలకు మొదట్లో అవార్డులు రాలేదు. క్రమంగా అది మారింది. 2018 సంవత్సరానికి ఉత్తమ దర్శకత్వం ఆస్కార్ అవార్డు “రోమా” (నెట్ ఫ్లిక్స్) చిత్రానికి దక్కింది. తర్వాతి సంవత్సరాలలో “ద ఐరిష్ మ్యాన్” (నెట్ ఫ్లిక్స్‌), “మ్యాంక్” (నెట్ ఫ్లిక్స్), “సౌండ్ ఆఫ్ మెటల్” (ఆమెజాన్ ప్రైమ్ వీడియో) నామినేషన్లు దక్కించికున్నా పెద్ద అవార్డులేమీ రాలేదు. ఉత్తమ చిత్రం ఆస్కార్ అవార్డ్ ఇప్పటికీ ఓటీటీకి అందని ద్రాక్షే. ఈ సంవత్సరం ఉత్తమ చిత్రం అవార్డ్ ఓటీటీకి దక్కే అవకాశాలు బావున్నాయి. ఏదేమైనా ఓటీటీ వచ్చాక ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులకు ఆస్కార్ వేడుకకి ముందే మంచి చిత్రాలు చూసే అవకాశం వచ్చింది. ఈసారి కూడా ఎన్నో మంచి చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి.

2021కి గాను ఆస్కార్ నామినేషన్లు ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు. ఈసారి ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలు బరిలో ఉన్నాయి. ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రం, ఒక సంగీతభరిత చిత్రం, ఒక క్రీడా చిత్రం, ఒక వెస్టర్న్ చిత్రం, ఒక స్వీయ అనుభవ చిత్రం, ఒక నటీనట దంపతుల నిజజీవిత చిత్రం వీటిలో ఉన్నాయి.

ఇప్పటికే కొన్ని సంస్థలు నామినేషన్లు, అవార్డులు ప్రకటించాయి. అందులో ముఖ్యమైనవి గొల్డెన్ గ్లోబ్స్, స్క్రీన్ యాక్టర్స్ గిల్ద్, డైరెక్టర్స్ గిల్ద్ ఆఫ్ అమెరికా మరియు ప్రొడ్యూసర్స్ గిల్ద్ ఆఫ్ అమెరికా. వీటి ఆధారంగా ఆస్కార్ నామినేషన్లు ఎలా ఉండబోతున్నాయో ఊహించవచ్చు. విమర్శకుల ప్రశంసలు, వివిధ సంస్థల నామినేషన్లు దక్కించుకున్న చిత్రాలు వాటికి లభించిన ఆదరణ క్రమంలో ఇవీ:

ద పవర్ ఆఫ్ ద డాగ్

‘ద పవర్ ఆఫ్ ద డాగ్’ చిత్రానికి జేన్ క్యాంపియన్ దర్శకత్వం వహించింది. ఇది వెస్టర్న్ చిత్రాల తరహాలో ఉంటుంది. వెస్టర్న్ చిత్రాలంటే అమెరికాలోని పశ్చిమ ప్రాంతాలలో 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం మొదట్లో కథ జరిగినట్లు చూపించే చిత్రాలు. ఆ ప్రాంతాలలో ఊళ్ళు ఎడారి లాంటి ప్రదేశాలలో ఉంటాయి. అక్కడక్కడ కొండలు, గుట్టలు ఉంటాయి. ప్రపంచం నగరీకరణ చెందుతున్న ఆ సమయంలో ఆ ఊళ్ళలో ఆటవిక రాజ్యమే ఉండేది. ఆధిక్య పోరాటాలు, ప్రతీకారాలు న్యాయవ్యవస్థకు బయటే జరిగేవి. ఈ కథలలో ముఖ్య పాత్ర కౌబాయ్. పొడుగు బూట్లు, పెద్ద టోపీ, మెళ్ళో రుమాలు వేసుకుని గుర్రంపై తిరుగుతూ తన పనులు చక్కబెట్టుకుంటూ ఉంటాడు. ఒక విలన్ ఉంటాడు. స్త్రీలు ద్వితీయ శ్రేణి పాత్రలుగా ఉంటారు. ఈ వెస్టర్న్ చిత్రాలు చూసి మనవాళ్ళు “మోసగాళ్ళకు మోసగాడు”, “టక్కరి దొంగ” లాంటి కౌబాయ్ చిత్రాలు తీశారు.

థామస్ శావేజ్ రాసిన నవల ‘ద పవర్ ఆఫ్ ద డాగ్’ ఆధారంగా తీసిన చిత్రమిది. ఇందులో ఫిల్, జార్జ్ అన్నదమ్ములు. పశుసంపద గల సంపన్నులైనా, పనివాళ్ళున్నా పశుపోషణ వాళ్ళే దగ్గరుండి చూసుకుంటారు. ఫిల్ మొరటువాడు, అందరి మీద అధికారం చెలాయిస్తూ ఉంటాడు. తనకు పని నేర్పించిన బ్రాంకో హెన్రీ మరణించి చాలా కాలమైనా అతన్ని ఆదర్శంగా భావించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. జార్జ్ నెమ్మదస్తుడు. రోజ్ అనే నడివయసు స్త్రీ భర్త మరణించగా బ్రతుకుతెరువు కోసం ఒక సత్రం నడుపుతూ ఉంటుంది. ఆమె కొడుకు పీటర్ హాస్టల్‌లో ఉంటూ కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు. జార్జ్ రోజ్‌ని పెళ్ళి చేసుకుంటాడు. డబ్బు కోసమే ఆమె తన తమ్ముణ్ణి పెళ్ళి చేసుకుని అతణ్ని తనకు దూరం చేసిందని ఫిల్ ఆమెపై ద్వేషం ప్రదర్శిస్తాడు. ఆమెను అవమానిస్తూ ఉంటాడు. జార్జ్ తరచూ దూరప్రాంతాలకు వెళుతూ ఉండటంతో చెప్పుకునే దిక్కులేక ఆమె బాధపడుతుంది. ఈ మానసిక హింస భరించలేక తాగుడు మొదలుపెడుతుంది. సెలవుల్లో అక్కడికి వచ్చిన ఆమె కొడుకు పీటర్‍ని ఫిల్ మొదట్లో ఆటపట్టించినా తర్వాత తన వెంట తిప్పుకుంటూ ఉంటాడు. రోజ్‌కి ఇది సుతరామూ నచ్చదు. ఆటవికంగా ఉండే ఫిల్, కాలేజీలో చదువుకున్న పీటర్, వాళ్లిద్దరి మధ్య రోజ్ ఏమి చేశారన్నది మిగతా కథ. రక్తసంబంధాల పాశం ఒకవైపు, గతానుభవాలతో రాటుదేలినా ప్రేమ కోసం తపించే నైజం ఒకవైపు ఉంటే న్యాయాన్యాయ విచక్షణకు ఎంత తావు ఉంటుందన్నది ఈ చిత్రంలో ప్రధానాంశం. ఫొటోగ్రఫీ, సంగీతం కథాగమనానికి దోహదం చేస్తాయి.

ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు (ఫిల్ పాత్రధారి బెనెడిక్ట్ కంబర్బ్యాచ్), ఉత్తమ సహాయనటి (రోజ్ పాత్రధారి కర్స్టన్ డంస్ట్), ఉత్తమ సహాయనటుడు (పీటర్ పాత్రధారి కోడీ స్మిట్-మెక్ఫీ) నామినేషన్లు దాదాపు ఖాయం. 93 ఏళ్ళ ఆస్కార్ చరిత్రలో ఇప్పటి వరకు ఉత్తమ దర్శకత్వానికి అవార్డ్ అందుకున్న మహిళలు ఇద్దరే. ఇందులో గత సంవత్సరం ఆ అవార్డ్ అందుకున్న క్లోయి జావ్ (“నోమ్యాడ్ లాండ్”) ఒకరు. ఈసారి జేన్ క్యాంపియన్ ఆ అవార్డ్ అందుకునే  అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్క్రీన్ ప్లే కూడా ఆమే రాసింది. ఇప్పటికే జేన్ “ద పియానో” (1993) చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే ఆస్కార్ అందుకుంది. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, ఫొటోగ్రఫీ, సంగీతం నామినేషన్లు రావచ్చు. కోడీకి ఉత్తమ సహాయనటుడి అవార్డ్ దక్కవచ్చు.

ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు.

బెల్‌ఫాస్ట్

దర్శకుడు కెన్నెత్ బ్రానా తన బాల్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం ఇది. బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన ఈ చిత్రం ఒక పాత చిత్రాన్ని చూసిన అనుభూతి కలిగిస్తుంది. ఇది పాత జ్ఞాపకాలకు ప్రతీక. ఈ ప్రక్రియ ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్. 2018లో “రోమా”, 2020లో “మ్యాంక్” ఇలాగే తీశారు. చలం కథ “దోషగుణం” ఆధారంగా పదిహేనేళ్ళ క్రితం ఇంద్రగంటి మోహనకృష్ణ “గ్రహణం” కూడా ఇలాగే తీశారు.

ఉత్తర ఐర్లాండ్‌లో కెన్నెత్ బ్రానా పెరిగిన నగరం బెల్‌ఫాస్ట్. ఉత్తర ఐర్లాండ్ బ్రిటన్ నుంచి వేరుపడి ఐర్లండ్‌లో విలీనం కావాలని ఒక కూటమి, బ్రిటన్ లోనే ఉండాలని ఒక కూటమి కోరుకుంటున్న సమయమది. 1969 లో అల్లర్లు జరుగుతాయి. ఈ సమయంలో తొమ్మిదేళ్ళ బడ్డీ, అతని తల్లి, తండ్రి, తాతయ్య, నానమ్మ, అన్నయ్యలు పరిస్థితులను ఎలా ఎదుర్కున్నారన్నదే కథ. తమ కళలో ఆరితేరిన దర్శకులు వ్యక్తిగత అనుభవాల ఆధారంగా తీసిన చిత్రాలలో కృత్రిమత్వం తక్కువగా ఉంటుంది. కథలో లొసుగులు ఉండవు. హృదయంలో నిక్షిప్తమైన ఆ జ్ఞాపకాలు కళారూపంగా మలచినపుడు ఆ శ్రద్ధ, తపన వేరుగా ఉంటాయి. ప్రేక్షకులకు రసానుభూతిని కలిగిస్తాయి. ఈ చిత్రం ఆ కోవలోనిదే. బ్రానా నటుడిగా, రచయితగా, దర్శకుడిగా ఎంతో అనుభవం కలవాడు. ఈ చిత్రాన్ని ఆయన “మై మోస్ట్ పర్సనల్ ఫిల్మ్” అన్నాడు.

ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం నామినేషన్లు ఖాయం. ఉత్తమ సహాయనటి (తల్లి పాత్రధారి కెట్రైన బేల్ఫ్), ఉత్తమ సహాయ నటుడు (తాతయ్య పాత్రధారి కియెరెన్ హైండ్స్) నామినేషన్లు దాదాపు ఖాయం. ఫొటోగ్రఫీ, బ్రానా రాసిన స్క్రీన్ ప్లే, “డౌన్ టు జాయ్” అనే పాట నామినేట్ కావచ్చు.

ఓటీటీ సినిమాలంటే విముఖత ఉన్నవారు ఉత్తమ చిత్రంగా ఈ చిత్రానికే ఓటు వేస్తారని ప్రచారం జరుగుతూంది.

వెస్ట్ సైడ్ స్టోరీ

స్టీవెన్ స్పీల్బర్గ్ పేరు తెలియని సినీప్రియులుండరు. హాలీవుడ్‌ని శాసించే దర్శకుల్లో అతను ఒకడు. “షిండ్లర్స్ లిస్ట్” (1993), “సేవింగ్ ప్రైవేట్ రయన్” (1998) చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డులు అందుకున్నాడు. ఓటీటీ చిత్రాలంటే గిట్టని వారిలో అతనూ ఒకడు. అతని చిన్నప్పుడు వచ్చిన “వెస్ట్ సైడ్ స్టోరీ” (1961) అనే సంగీతభరిత చిత్రం లోని పాటలంటే అతనికి ఎంతో ఇష్టం. “మా ఇంట్లో అనుమతి పొందిన మొదటి పాటలవి. ఎప్పుడూ వింటూ వాడిని” అంటాడు. ఆ చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేశాడు.

కథ విషయానికొస్తే 1957లో న్యూయార్క్ నగరం లోని వెస్ట్ సైడ్‌లో తెల్లజాతి కుర్రాళ్ళ గ్యాంగ్ జెట్స్, పోర్టో రీకో మూలాలున్న కుర్రాళ్ళ గ్యాంగ్ షార్క్స్ ఎప్పుడూ గొడవపడుతూ ఉంటాయి. ఆధిపత్యం కోసం ఒక ఆఖరి పోరాటం పెట్టుకోవాలని నిర్ణయించుకుంటాయి. జెట్స్ గ్యాంగ్ లీడర్ రిఫ్ తన మిత్రుడు టోనీని సాయమడుగుతాడు. టోనీ కొన్నాళ్ళ క్రితమే పెరోల్ పై జైలు నుంచి విడుదలై వచ్చాడు. తాను మంచి జీవితం గడపాలని కోరుకుంటున్నానని, గొడవలకి రానని చెబుతాడు. ఒక డ్యాన్స్ పార్టీలో టోనీ షార్క్స్ గ్యాంగ్ లీడర్ బెర్నార్డో చెల్లెలు మారియాను చూస్తాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఇది తెలిసి బెర్నార్డో కోపంతో టోనీ కూడా పోరాటానికి రావాలని షరతు పెడతాడు. టోనీ ఎంత వద్దన్నా పోరాటం జరుగుతుంది. బెర్నార్డో రిఫ్‌ని పొడిచి చంపేస్తాడు. ఆవేశంలో టోనీ బెర్నార్డోని చంపేస్తాడు. మారియా ఎలా స్పందిస్తుంది, తర్వాత ఏమి జరుగుతుందనేది మిగతా కథ.

పాటలతో కథ నడుస్తుంది. మూలంలోని పాటల సాహిత్యాన్ని, బాణీలని అలాగే ఉంచి కొత్తగా రికార్డ్ చేశారు. హాలీవుడ్‌లో నేపథ్య గాయకులచే ఎక్కువగా పాడించరు. నటీనటులే పాడతారు. పాటలకి మంచి పేరు వచ్చింది. పాటలు పాతవే అయినా కొత్త స్క్రీన్ ప్లే తయారు చేసి పకడ్బందీగా తీశారు. నృత్యాలు ఆకట్టుకుంటాయి. కళా దర్శకత్వం ఆ నమయంలోని న్యూయార్క్ నగరాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. వర్ణరంజితంగా ఉన్నా సహజత్వానికి దగ్గరగా ఉంటుంది.

ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ కళా దర్శకత్వం, ఉత్తమ దుస్తులు నామినేషన్స్ ఖాయం. పాత పాటలకి నామినేషన్లు ఇవ్వటం నిబంధనలకి విరుద్ధం. బెర్నార్డో ప్రేయసిగా నటించిన ఆరియానా డిబోస్‌కి ఉత్తమ సహాయనటి నామినేషన్ ఖాయం. మారియాగా నటించిన కొత్త నటి రేచెల్ జెగ్లర్‌కు ఉత్తమ నటి నామినేషన్ రావచ్చు.

కింగ్ రిచర్డ్

సాధారణంగా బయోపిక్స్ అంటే ప్రసిద్ధులైన వ్యక్తుల గురించి తీసే చిత్రాలు. కానీ “కింగ్ రిచర్డ్” ప్రసిద్ధ టెన్నిస్ స్టార్లు వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్ తండ్రి రిచర్డ్ విలియమ్స్ గురించి తీసినది. వీనస్, సెరెనా నిర్వహణలో రూపొందింది. దర్శకుడు రైనాల్డో మార్కస్ గ్రీన్.

అమెరికాలో ఇప్పటికీ జాతివివక్ష ఉందన్నది కాదనలేని నిజం. ముప్ఫై ఏళ్ళ క్రితం మాట చెప్పక్కర్లేదు. ఓ పక్క పేదరికం, ఓ పక్క ఉన్నతమైన ఆశయాలు – వీటి మధ్య ఊగిసలాడుతున్న ఓ నల్లజాతి కుటుంబం కథే ఈ చిత్రం. ఆ కుటుంబం చెదిరిపోకుండా చూసుకుంటూ, అమ్మాయిలను కాపాడుకుంటూ, అధైర్యపడకుండా వారిని అత్యుత్తమ టెన్నిస్ ఆటగత్తెలుగా తీర్చిదిద్దిన ధీరుడు రిచర్డ్. అందుకే కింగ్ రిచర్డ్ అన్నారు. అమ్మాయిల సవతి తల్లి బ్రాండీ తన పిల్లలు తనకున్నా అతని ఆశయసాధనకు ఎంతో సహకరించింది. ఇద్దరూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చిన్నప్పటి నుంచే అమ్మాయిలకు శిక్షణ ఇస్తారు. వారి ఆటను వీడియో టేపుల్లో చూపించి మంచి కోచ్ కోసం రిచర్డ్ శతవిధాలా ప్రయత్నిస్తాడు. అప్పట్లో టెన్నిస్ తెల్లజాతి సంపన్నుల క్రీడగా చెలామణి అయ్యేది. నల్లజాతి వారు, అందునా మగవారు మాత్రమే బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ ఆడేవారు. వీరు నల్లజాతి వారు కావటం, డబ్బు లేకపోవటంతో చాలా కాలం కోచ్ దొరకలేదు. చివరికి వారి ఆట చూసి ముగ్ధుడై ఒక కోచ్ ఒప్పుకుంటాడు. కానీ ఉచితంగా ఇద్దరికీ శిక్షణ ఇవ్వలేనని వీనస్ కి మాత్రమే శిక్షణ ఇస్తాడు. సెరెనా శిక్షణ బ్రాండీ దగ్గరే సాగుతుంది. కొన్ని జూనియర్ టోర్నమెంట్లలో ఇద్దరూ ఆడి విజయాలు సాధిస్తారు. అయినా వారిని అందరూ వివక్షతోనే చూస్తారు. క్రీడాకారులకు అవకాశాలు కల్పించటానికి ప్రొఫెషనల్ ఏజెంట్స్ ఉంటారు. కానీ లైంగిక వేధింపులకి భయపడి రిచర్డ్ ఏజెంట్లను నియమించకుండా అమ్మాయిలను జూనియర్ టోర్నమెంట్ల నుంచి విరమింపజేస్తాడు. వద్దన్న కోచ్‌ని తొలగిస్తాడు. ఇలా అడుగడుగునా వారిని కాపాడుకుంటూ చివరికి వారిని ఎలా విజయపథాన నిలబెట్టాడనేది మిగతా కథ. మన దేశం లో తీసిన “దంగల్” చిత్రం ఇలాంటిదే.

ఒకప్పటి చార్మింగ్ హీరో విల్ స్మిత్ రిచర్డ్ గా నటించాడు. తనకున్న ఇమేజ్ ని పక్కన పెట్టి ఒక తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. గతంలో రెండు సార్లు ఉత్తమ నటుడి విభాగంలో నామినేషన్లు దక్కించుకున్నా అవార్డ్ దక్కలేదు. ఈసారి నామినేషన్ ఖాయమే కాకుండా అవార్డ్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అతని భార్య బ్రాండీగా నటించిన ఆంజెనూ ఎలిస్‌కు ఉత్తమ సహాయ నటి నామినేషన్, ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం నామినేషన్ దాదాపు ఖాయం.

డ్యూన్

ఈసారి ఆస్కార్ బరిలో నిలిచిన రెండో రీమేక్ చిత్రం “డ్యూన్”. ఫ్రాంక్ హర్బర్ట్ రాసిన సైన్స్ ఫిక్షన్ నవల “డ్యూన్” ఆధారంగా గతంలో ఒక చిత్రం వచ్చింది. తనకిష్టమైన ఆ నవలను రెండు భాగాలుగా దర్శకుడు డెనీ విల్నవ్ మళ్ళీ తెరకెక్కించాడు. మొదటి భాగం విడుదలైంది.

మన జానపద చిత్రాల్లో మంత్రతంత్రాలతో సాధించే అతీంద్రియ శక్తులు భవిష్యత్తులో యంత్రాలు, గ్రహాంతర పదార్థాల సహకారంతో నిజంగానే సాధ్యమవుతాయనే ఊహ ఈ చిత్రంలో కనిపిస్తుంది. మాంత్రికుడు మాయాగోళంలో ఎక్కడో ఉన్న రాకుమారిని చూసినట్టు ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్లలో ఎక్కడో ఉన్నవారిని చూస్తున్నాం కదా. ముందు ముందు ఇంకా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో? ఈ చిత్రంలో రెప్పపాటులో అంతరిక్షంలో వేల కిలోమీటర్లు ప్రయాణించే సాధనాలు ఉంటాయని చూపించారు. దాంతో ఈ విశ్వమంతా ఒకే రాజ్యంలా మారిపోతుంది. ఒక చక్రవర్తి, పలు సామంత రాజులు ఉంటారు. కాలడాన్ అనే గ్రహానికి రాజు ఆట్రైడెస్ వంశానికి చెందిన లెటో. అతని భార్యకు కొన్ని అతీంద్రియ శక్తులుంటాయి. వారి కుమారుడు పాల్‌కి అవి సంక్రమిస్తాయి. ఎందరో గురువుల శిక్షణలో అతను పలు విద్యలు అభ్యసిస్తాడు. అతను భవిష్యత్తులో గొప్ప నాయకుడౌతాడని అందరి నమ్మకం. లెటోను అరాకిస్ అనే గ్రహాన్ని పాలించమని చక్రవర్తి ఆదేశిస్తాడు. ఎడారి పరచుకున్న ఆ గ్రహాన్నే డ్యూన్ అని వ్యవహరిస్తారు. అక్కడి ఇసుక నుంచి వెలికితీసే స్పైస్ అనే పదార్థం సేవిస్తే సునిశిత దృష్టి, సమీప భవిష్యద్దర్శన శక్తి లభిస్తాయి. కానీ ఆ వెలికితీత అంత సులభం కాదు. ఆ గ్రహాన్ని అంతవరకు హార్కొనెన్ వంశం వారు పాలిస్తూ ఉంటారు. అయిష్టంగానే చక్రవర్తి ఆదేశాలను ఒప్పుకుంటాడు లెటో. నిజానికి తనకు పోటీగా ఎదుగుతున్న ఆట్రైడెస్ వంశంపై హార్కొనెన్లతో తిరుగుబాటు చేయించి వారిని రూపుమాపాలని చక్రవర్తి వ్యూహం. ఇలాంటి జానపద తరహా కథని విజువల్ ఎఫెక్ట్స్ (గ్రాఫిక్స్)తో అద్భుతంగా మలచాడు దర్శకుడు. స్పైస్‌ని ఇసుక నుంచి వెలికితీసే క్రమంలో ఆ పదార్థాన్ని తిని జీవించే మహాసర్పాలు ఇసుక కింద ప్రయాణించి దాడి చేసే దృశ్యాలలో విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ మిక్సింగ్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి. కథకి తగినట్టు సంగీతం (రీరికార్డింగ్) గ్రాండ్ గా ఉంటుంది.

సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు సాంకేతిక విభాగాల్లో (విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ మిక్సింగ్, ఫొటోగ్రఫీ) నామినేషన్లు రావటం మామూలే కానీ ఉత్తమ చిత్రం నామినేషన్ రావటం అరుదు. ఉత్తమ చిత్రం అవార్డ్ ఇంతవరకు రాలేదు. “అవతార్” (2009) చాలా చేరువలోకి వచ్చింది. ఈసారి కూడా ఆ అవార్డ్ రావటం కష్టమే కానీ నామినేషన్ తథ్యం. ఉత్తమ దర్శకుడి నామినేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ మిక్సింగ్ నామినేషన్లు ఖాయం. కానీ ఈ విభాగాల్లో “స్పైడర్ మ్యాన్: నో వే హోమ్” నుంచి గట్టి పోటీ ఉంటుంది. సంగీతానికి నామినేషన్ దాదాపు ఖాయం. నటీనటులకు నామినేషన్లు వచ్చే అవకాశం లేదు.

ఈ చిత్రాన్ని యూట్యూబ్ లో రూ. 150 కట్టి చూడవచ్చు.

బీయింగ్ ద రికార్డోస్

1950 దశకంలో “ఐ లవ్ లూసీ” అమెరికాలో ఒక గొప్ప ప్రజాదరణ పొందిన టీవీ సీరియల్. భార్యాభర్తలైన లూసీల్ బాల్, డెసీ అర్నాజ్ కలిసి నటించిన కామెడీ సీరియల్ అది. ఆ సీరియల్ ప్రసారమయ్యే వేళల్లో దుకాణాలు తొందరగా మూసేసేవారట. అంత ప్రజాదరణ పొందిన సీరియల్ నిర్మాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు లూసీల్, డెసీ. ఆ సీరియల్ ముగియగానే లూసీల్ డెసీకి విడాకుల నోటీసు ఇచ్చింది. సీరియల్ నిర్మాణంలోని ఒడిదుడుకులు, విడాకులకు దారితీసిన పరిస్థితుల ఆధారంగా ఆరన్ సోర్కిన్ తీసిన చిత్రం “బీయింగ్ ద రికార్డోస్”.

లూసీల్ 1930 దశకం చివర్లో బీ-గ్రేడ్ చిత్రాలలో నటించి పేరు గడిస్తుంది. ఒక చిత్రం షూటింగ్‌లో తన కంటే చిన్నవాడైన డెసీ పరిచయమౌతాడు. అతను క్యూబా నుంచి వలస వచ్చిన గాయకుడు. ఇద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు. కొన్నాళ్ళకు డెసీకి ఇతర స్త్రీలతో సంబంధాలున్నట్టు తెలుస్తుంది. అయినా లూసీల్ ఓర్పు వహిస్తుంది. 1942లో “ద బిగ్ స్ట్రీట్” అనే పెద్ద చిత్రం లూసీల్ కు మంచి పేరు తెస్తుంది. అయినా ఆమెకు మంచి అవకాశాలు రావు.  దాంతో ఆమె రేడియోలో సీరియల్స్ చేస్తుంది. 1948లో “మై ఫేవరెట్ హజ్బెండ్” అనే రేడియో సీరియల్ హిట్ అవుతుంది. ఆ సీరియల్‌ను టీవీ సీరియల్ గా రూపొందించాలని ఒక టీవీ ఛానల్ తలపెడుతుంది. తన భర్త తనతో నటిస్తేనే తాను నటిస్తానని లూసీల్ షరతు పెడుతుంది. ఈ విధంగానైనా తన కనుసన్నల్లో ఉంటే అతని తిరుగుళ్ళు తగ్గుతాయని ఆమె ఆశ. అలా “ఐ లవ్ లూసీ” ప్రారంభమవుతుంది. అప్పటికే వారికి ఒక కూతురు ఉంటుంది. సీరియల్‌కి బాగా పేరు వస్తుంది. సీరియల్లో వారి ఇంటిపేరు రికార్డో. అదే ఈ సినిమా పేరులో చేర్చారు. ఓసారి డెసీ మరో స్త్రీతో ఉన్న ఫొటో పత్రికల్లో వస్తుంది. అతన్ని నిలదీస్తుంది లూసీల్. అది పాత ఫొటో అంటడాతను. అదే సమయంలో లూసీల్ కమ్యూనిస్టు అనే వార్తలు పేపర్లో వస్తాయి. అప్పటికి కమ్యూనిస్టు దేశమైన రష్యాకి, అమెరికాకి ప్రచ్ఛన్న యుద్ధం (కోల్డ్ వార్) జరుగుతూ ఉంటుంది. దాంతో పెద్ద దుమారం రేగుతుంది. పట్టించుకోకుండా సీరియల్ రిహార్సల్స్ చేస్తూ ఉంటారు. లూసీల్ సీరియల్లోని కొన్ని సన్నివేశాల విషయంలో దర్శకుడితో విభేదిస్తుంది. దీనికి తోడు ఆమె మళ్ళీ గర్భం దాల్చిందని తెలుస్తుంది. గర్భం కనపడకుండా వస్తువులు అడ్డుపెట్టి సీరయల్ కొనసాగించమని ఛానల్ వాళ్ళు సూచిస్తారు. దీనికి లూసీల్, డెసీ ఒప్పుకోరు. సీరియల్లోనే ఆమె గర్భం దాల్చినట్టు చూపిద్దామంటారు. ఓ పక్క సీరియల్లో ఇతర నటీనటులతో కీచులాటలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఒక వారం రోజుల్లో అనేక వివాదాలను, సమస్యలను వారెలా ఎదుర్కొన్నారనేది కథ.

తళుకుబెళుకుల సినిమా, టీవీ రంగాల్లో తెర వెనుక ఎన్ని సమస్యలుంటాయో చూపించే సినిమా ఇది. మన “మహానటి” సినిమాలో మనం సావిత్రి జీవితం చూశాం. లూసీల్ కూడా టీవీలో అంత పేరున్న నటియే. ఒక్కోసారి నటీనటులు పేరుప్రఖ్యాతుల కోసం వ్యక్తిగత జీవితాల్లో రాజీపడిపోతుంటారు. కానీ ఆత్మగౌరవం కోసం కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఈ సంఘర్షణని ప్రభావవంతంగా చూపించారు. లూసీల్ పాత్ర ధరించిన నికోల్ కిడ్మన్‌కు ఉత్తమ నటి నామినేషన్ ఖాయం. డెసీ పాత్రలో నటించిన హావియెర్ బార్డెమ్‌కు ఉత్తమ నటుడి నామినేషన్ వచ్చే అవకాశం ఉంది. నికోల్ కి గతంలో “ద అవర్స్” (2002) చిత్రానికి ఉత్తమ నటి ఆస్కార్ వచ్చింది. ఈసారి మళ్ళీ అవార్డు వచ్చే అవకశాలున్నాయి. హావియెర్ కి “నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్” (2007) చిత్రానికి ఉత్తమ సహాయ నటుడి ఆస్కార్ వచ్చింది. ఆరన్ సోర్కిన్ కి “ద సోషల్ నెట్వర్క్” (2010) చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డ్ వచ్చింది. దరిమిలా దర్శకుడిగా మారిన అతను ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా రాశాడు. అయితే కొన్ని సంఘటనలను అటూ ఇటూ మార్చి రాసిన స్క్రీన్ ప్లే ఇది. నిజజీవితాన్ని రెండు గంటల సినిమాలో చూపేటపుడు ఇలా చేయటం మామూలే. అది రచయిత ప్రతిభకు గుర్తుగానే విమర్శకులు భావిస్తారు. స్రీన్ ప్లే నామినేషన్ ఖాయం. దర్శకత్వం నామినేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి గానీ పోటీ ఎక్కువగా ఉంది.

ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

ఇతర చిత్రాలు

లికరిష్ పీట్జా – రచయిత, దర్శకుడు పాల్ థామస్ ఆండెర్సన్ రూపొందించిన ఈ చిత్రం ఒక 15 ఏళ్ళ అబ్బాయికి, 25 ఏళ్ళ యువతికి మధ్య జరిగే కథ. హాస్యం జోడించి కొత్త నటీనటులతో కళాత్మకంగా మలిచారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు నామినేషన్లు రావచ్చు.

కోడా – కోడా (CODA) అంటే చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్ (బధిరుల బిడ్డ). తల్లిదండ్రులు, అన్నయ్య బధిరులైన ఓ అమ్మాయి కథ ఇది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ సహాయనటుడి నామినేషన్ రావచ్చు. ఈ చిత్రాన్ని యాపిల్ టీవీలో చూడవచ్చు.

డోన్ట్ లుక్ అప్ – ఒక తోకచుక్క భూమిని ఢీకొని భూమి అంతరించిపోతుందని అమెరికా శాస్త్రజ్ఞులు కనుగొంటారు. దేశ అధ్యక్షురాలికి చెబితే ఆమె తీసిపారేస్తుంది. టీవీ ఛానళ్ళు కూడా వారు అనవసరంగా హంగామా చేస్తున్నారని పట్టించుకోవు. సైన్స్‌ని రాజకీయ నాయకులు, మీడియా వాళ్ళు ఎలా నిర్లక్ష్యం చేస్తారో వ్యంగ్యంగా చూపే చిత్రమిది. భూతాపానికి ప్రతీకగా తోకచుక్కని చూపించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ స్జ్రీన్ ప్లే నామినేషన్లు రావచ్చు. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు.

టిక్, టిక్… బూమ్! – జొనాథన్ లార్సన్ అనే నాటక రచయిత ఒక సంగీత రూపకాన్ని రాయటానికి ఎంత ప్రయాస పడ్డాడో చూపించే బయోపిక్ ఇది. ఈ చిత్రాన్ని ఒక సంగీత రూపకంగా మలచటం దర్శకుడి ప్రతిభకు తార్కాణం. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు నామినేషన్లు రావచ్చు. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు.

విదేశీ చిత్రాలు

ఇండియా నుంచి “కూళంగళ్” అనే తమిళ చిత్రాన్ని విదేశీ చిత్రం విభాగానికి పంపించారు. కానీ ఇప్పటికే విడుదల చేసిన పొట్టి జాబితా (షార్ట్ లిస్ట్) లో ఆ చిత్రం లేదు. కొందరు అనుకుంటున్నట్టు “జై భీమ్” చిత్రాన్ని ఇండియా పంపించలేదు. అమెరికాలో విడుదలైన ఏ చిత్రమైనా విదేశీ చిత్రం విభాగంలో తప్ప అన్ని అవార్డులకు పరిశీలిస్తారు. అమెరికాలో విడుదల కాకపోయినా ఆయా దేశాలు పంపితే ఆ చిత్రాలను కేవలం విదేశీ చిత్రం విభాగంలో పరిశీలిస్తారు. “కూళంగళ్”, “జై భీమ్” అమెరికాలో విడుదలయ్యాయి కాబట్టి ఇతర అవార్డులకు అర్హమైన చిత్రాలే. కానీ ఎంతో పబ్లిసిటీ చేయాలి. కాబట్టి వాటికి నామినేషన్లు వచ్చే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి.

గత కొన్నేళ్ళుగా విదేశీ చిత్రాలు ఇతర విభాగాల్లో నామినేట్ అవుతున్నాయి. 2019కి గాను కొరియన్ చిత్రం “పేరసైట్” ఏకంగా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులు గెలుచుకుంది. ఒక పూర్తి విదేశీ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డ్ గెలుచుకోవటం ఇదే మొదటిసారి (ఇండియాలో రూపొందించిన “గాంధీ” (1982), “స్లమ్ డాగ్ మిలియనేర్” (2008) ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్నా వాటికి దర్శకులు బ్రిటన్ వాళ్ళు). 2020కి గాను డెన్మార్క్ చిత్రం “అనదర్ రౌండ్” ఉత్తమ దర్శకుడి నామినేషన్ దక్కించుకుంది. ఈసారి జపాన్ చిత్రం “డ్రైవ్ మై కార్” ఉత్తమ చిత్రం లేదా ఉత్తమ దర్శకుడి నామినేషన్లు దక్కించుకోవచ్చు. ఒక స్టేజి నటుడు, అతని భార్య కథ ఇది. ఆమె ఒక రచయిత. ఆమెకు అక్రమ సంబంధం ఉందన్న సంగతి అతనికి తెలుస్తుంది. ఏమీ తెలియనట్టుంటాడు. అనుకోకుండా ఆమె మరణిస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగిందనేది కథ.

ఆస్కార్ అకాడమీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సినీరంగంలో పని చేసే ప్రముఖులని సభ్యులుగా చేర్చుకుంది, ఇంకా చేర్చుకుంటూంది. వారందరూ అవార్డులకు ఓట్లు వేస్తారు. అందుకే విదేశీ చిత్రాలకు గుర్తింపు లభిస్తూంది. భారతీయ దర్శకుల చిత్రాలకు కూడా ఆస్కార్ అవార్డులు వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు!

Exit mobile version