Site icon Sanchika

2023 ఆస్కార్ నామినేషన్లు ఏ చిత్రాలకు? – ఒక అంచనా

[dropcap]ఆ[/dropcap]స్కార్ నామినేషన్లు జనవరి 24న ప్రకటించనున్నారు. RRR కి ఆస్కార్ నామినేషన్ వస్తుందా? ‘నాటు నాటు’ పాటకి ఉత్తమ గీతం నామినేషన్ ఖాయం. ఈ పాటకి ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు, క్రిటిక్స్ చాయిస్ అవార్డు వచ్చాయి. ఆస్కార్ నామినేషన్ కచ్చితంగా వస్తుంది. అవార్డు రావటానికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆస్కార్లలో ఉత్తమ గీతానికి గీతరచయితకి, సంగీతదర్శకుడికి అవార్డు ఇస్తారు. అంటే చంద్రబోస్ గారికి, కీరవాణి గారికి ఆస్కార్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలుగు సినిమాలోనే కాదు, భారతీయ సినిమాలోనే ఇది పోటీలో గెలిచిన తొలి ఆస్కార్ అవార్డు అవుతుంది! ఇంతకు ముందు భారతీయులకి ఆస్కార్లు వచ్చినా అవి వేరే దేశాల వారు నిర్మించిన చిత్రాలకు వచ్చాయి. సత్యజిత్ రే కి జీవిత సాఫల్య ఆస్కార్ వచ్చింది.

RRR కి ఉత్తమ సంగీతం, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ లో నామినేషన్లకి దారులు మూసుకుపోయాయి. ఈ విభాగాలలో ఇప్పటికే విడుదలైన పొట్టి జాబితాలో RRR కి స్థానం దక్కలేదు. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో పరిశీలనకి భారత్ RRR ని పంపలేదు కాబట్టి అందులో కూడా నామినేషన్ రాదు. ఇక ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్‌కి అవకాశం ఉంది. నా అభిప్రాయం ప్రకారం నామినేషన్ వస్తుంది. ఎంతోమంది హాలీవుడ్ కళాకారులు ఈ చిత్రాన్ని చూసి సామాజిక మాధ్యమాల్లో అభినందించారు. ఆ ప్రచారంతో నామినేషన్ వస్తుందనే అనిపిస్తోంది. ఉత్తమ చిత్రానికి పది నామినేషన్లు ఉంటాయి కాబట్టి ఇది సాధ్యమనే చెప్పవచ్చు. ఉత్తమ దర్శకత్వానికి ఐదు నామినేషన్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆ నామినేషన్ కష్టమే.

ఇక ఇతర చిత్రాలు చూస్తే..

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్

సైన్స్ ఫిక్షన్‌ని హాస్యంతో కలిపి తీసిన చిత్రమిది. Absurdist comedy తరహా కిందకి వస్తుంది. ఈ ప్రపంచంలో ఒక తీరూ తెన్నూ లేదని, గందరగోళమే దీని స్వభావమని చూపించే కళారూపమే absurdist comedy. కొత్త రకమైన కథ, అబ్బురపరచే గ్రాఫిక్స్, కథనాన్ని సరళం చేసే ఎడిటింగ్, వీటన్నిటినీ సమన్వయం చేసే దర్శకత్వంతో ఈ చిత్రం ప్రశంసలందుకుంది. ఉత్తమ చిత్రం గా క్రిటిక్స్ చాయిస్ అవార్డు అందుకుంది.

కథలో ఎవెలిన్ అనే చైనీస్ మహిళ తండ్రికి ఇష్టం లేకపోయినా ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోతుంది. కూతురు జాయ్ పెరిగి పెద్దదవుతుంది. ఎవెలిన్ ఒక లాండ్రొమాట్ (అనేక వాషింగ్ మెషీన్లు ఉండే చోటు. అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టి ఎవరి బట్టలు వారే ఉతుక్కోవచ్చు) నడుపుతూ ఉంటుంది. ఆమె భర్త విడాకులు కావాలని అడుగుతాడు. ఎవెలిన్ తండ్రి చైనీస్ కొత్త సంవత్సరం సందర్భంగా అమెరికా వస్తాడు. జాయ్‌కి ఒక ప్రియురాలు ఉంటుంది. ఆమె చైనీస్ అమ్మాయి కాదు. ఇది ఎవెలిన్‌కి నచ్చదు. ఇంతలో లాండ్రొమాట్‌ని ఆడిట్ చేయటానికి అధికారులు వస్తారు. ఎవెలిన్ ఈ గందరగోళంలో ఉండగా ఇంకా వేరే ప్రపంచాలు ఉన్నాయని, అందులో వేరు వేరు ఎవెలిన్లు ఉన్నారని, వేరు వేరు జీవితాలు గడుపుతున్నారని తెలుస్తుంది. ఈ ఎవెలిన్లు అందరూ ఒకరితో ఒకరు సంభాషించటం మొదలుపెడతారు. ఇలాంటి కథని అయోమయం లేకుండా చూపించటం కష్టమే. ఈ పనిని డానియల్ క్వాన్, డానియల్ షైనర్ట్ సమర్థవంతంగా చేశారు. ఈ ఇద్దరూ కలిసి స్క్రేన్ ప్లే వ్రాసి, దర్శకత్వం వహించారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్క్రీన్ ప్లే నామినేషన్లు ఖాయం. ఉత్తమ ఎడిటింగ్ నామినేషన్ కూడా దాదాపు ఖాయమే. ఎవెలిన్ భర్తగా నటించిన కే హుయ్ క్వాన్ కి ఉత్తమ సహాయ నటుడి ఆస్కార్ అవార్డు దాదాపు ఖాయమే. అతను ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ చాయిస్ అవార్డు అందుకున్నాడు. ఎవెలిన్‌గా నటించిన మిషెల్ యో, జాయ్ గా నటించిన స్టెఫనీ షు లకి ఉత్తమ నటి, ఉత్తమ సహాయనటి నామినేషన్లు ఖాయం. ఇంకో పాత్ర పోషించిన జేమీ లీ కర్టిస్ కి ఉత్తమ సహాయనటి నామినేషన్ రావచ్చు.

ద ఫేబెల్మన్స్

స్టీవెన్ స్పీల్బర్గ్ హాలీవుడ్‌లో దిగ్గజ దర్శకుల్లో ఒకరు. ఆయన తన బాల్యం అధారంగా తీసిన సినిమా ‘ద ఫేబెల్మన్స్’.  కళాకారులు – వారి కుటుంబజీవితం, కళ ద్వారా జీవితాన్ని అర్థం చేసుకోవటం వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందించారు.

చిన్నప్పుడు ‘ద గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్’ అనే చిత్రం చూశాక శామీ ఫేబెల్మన్ తన బొమ్మలను పెట్టి వీడియోలు తీయటం మొదలుపెడతాడు. తల్లి మిట్జి ప్రోత్సహిస్తుంది. తండ్రి బర్ట్ ఇది కేవలం చిన్నపిల్లల సరదాగా అనుకుంటాడు. బర్ట్ కి వేరే ఉద్యోగం వస్తుంది. వేరే ఊరికి వెళ్ళాలి. మిట్జి.. బర్ట్ స్నేహితుడు, భాగస్వామి బెన్నీని కూడా ఆ ఊరికి రమ్మంటుంది. అందరూ కొత్త ఊరికి వెళతారు. కొన్నేళ్ళ తర్వాత ఒకసారి అందరూ సెలవుల్లో సరదాగా గడపటానికి వేరే ప్రదేశానికి వెళతారు. అక్కడ శామీ అందరినీ వీడియోలు తీస్తాడు. వీడియోలు తీసేటపుడు లైటింగ్ ఎలా ఉండాలో నేర్చుకుంటాడు. కొంత కాలానికి మిట్జి తల్లి మరణిస్తుంది. ఆమె దిగులుగా ఉంటే ఆమెని ఉల్లాసపరచటానికి సెలవుల్లో తీసిన వీడియోలన్నీ కలిపి ఎడిట్ చేసి ఒక సినిమాలాగా చేయమంటాడు బర్ట్. శామీ తనకి వేరే వీడియో పని ఉందని అంటాడు. బర్ట్ తమ కుటుంబ చిత్రమే ముఖ్యమని అంటాడు. తర్వాత శామీ తమ కుటుంబ చిత్రాన్ని తయారు చేయటం మొదలుపెడతాడు. అందులో మిట్జి, బెన్నీలకు ఒకరి మీద ఒకరికి అనురాగం ఉన్నట్టు తెలుస్తుంది. శామీ ఖిన్నుడవుతాడు.

ఈ కథతో 1999లోనే చిత్రం తీద్దామని స్పీల్బర్గ్ అనుకున్నాడు. అయితే తన తలిదండ్రులు బాధపడతారని ఈ కథని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఈ చిత్రం కళ యొక్క గొప్పతనాన్ని చాటుతూ తెరకెక్కింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ సంగీతం, ఉత్తమ ఛాయాగ్రహణం నామినేషన్లు ఖాయం. మిట్జిగా నటించిన మిషెల్ విలియమ్స్ కి ఉత్తమ నటి నామినేషన్ రావచ్చు. బర్ట్ గా నటించిన పాల్ డానో కి ఉత్తమ సహాయనటుడి నామినేషన్ రావచ్చు.

ద బ్యాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్

ఈ చిత్రం డిస్నీ+ హాట్ స్టార్ లో లభ్యం. 1920లలో ఐర్లండ్‌లో జరిగిన అంతర్యుద్ధం నేపథ్యంలో జరిగే కథ ఇది. ఐర్లండ్ ప్రధాన భూభాగం నుంచి విసిరేసినట్టుగా ఉండే ఇనిషెరిన్ అనే ద్వీపంలో కథ జరుగుతుంది. పెడ్రేక్, కోమ్ వయసుల్లో వ్యత్యాసమున్నా మంచి స్నేహితులు. కోమ్ సంగీతకారుడు. పెడ్రేక్ సాదాసీదా మనిషి. ఒకరోజు కోమ్ పెడ్రేక్ తో “నీ స్నేహం నాకు వద్దు” అంటాడు. దూరంగా ఉండటం మొదలుపెడతాడు. పెడ్రేక్ హతాశుడవుతాడు. ఎందుకని అడిగితే “నీ మాటల్లో సారమేమీ ఉండదు. నేను నా సంగీతం మీద దృష్టి పెట్టాలి. గుర్తుండిపోయేలా సంగీతం సృష్టించాలి. నీతో సమయం వృథా చేస్తే నా జీవితమే వృథా” అంటాడు కోమ్. పెడ్రేక్ తన చెల్లెలితో కలిసి జీవిస్తుంటాడు. వయసు మీరిపోయినా ఇద్దరూ పెళ్ళి చేసుకోలేదు. పెడ్రేక్ కి తన గాడిద అంటే ప్రేమ. ఆ గాడిద ఇంట్లో కూడా తిరుగుతుంటుంది. అతని చెల్లెలు విసుక్కుంటుంది కానీ భరిస్తుంది. పెడ్రేక్ డామినిక్ అనే యువకుడితో తన బాధలు చెప్పుకుంటాడు. డామినిక్ కాస్త తింగరగా ఉంటాడు. అయినా పెడ్రేక్ కన్నా తెలివైనవాడే అనిపిస్తుంది. పెడ్రేక్ తనని విసిగించే కొద్దీ కోమ్ కి అసహనం పెరుగుతుంది. చివరికి దారుణమైన పరిణామాలు జరుగుతాయి. ‘బ్యాన్షీ’ అంటే జానపద కథల్లో ఉండే ఒకరకమైన మానవాతీత స్త్రీ. ఆమె రోదిస్తూ పాట పాడితే మృత్యువు వస్తుందని అర్థం.

ఈ కథ అంతర్యుద్ధానికి ఒక ప్రతీక. ‘మేము మేధావులం, మీరు అధములు’ అని ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు. సమాజానికి మేధావులూ అవసరమే, శ్రమజీవులూ అవసరమే. కలిసి జీవించాలి గానీ ‘నీ అవసరం నాకు లేదు’ అంటే సమాజమే అల్లకల్లోమవుతుంది. ఈ చిత్రానికి మార్టిన్ మెక్ డొనా స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందించాడు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ నటుడు (పెడ్రేక్ గా నటించిన కాలిన్ ఫారెల్), ఉత్తమ సహాయ నటుడు (కోమ్ గా నటించిన బ్రెండన్ గ్లీసన్), ఉత్తమ సహాయ నటి (పెడ్రేక్ చెల్లెలిగా నటించిన కెరీ కాండన్) నామినేషన్లు ఖాయం. డామినిక్ గా నటించిన బ్యారీ కీగన్ కి కూడా ఉత్తమ సహాయనటుడి నామినేషన్ రావచ్చు. కాలిన్ ఫారెల్ కి ఉత్తమ నటుడి అవార్డు రావచ్చు. అయితే త్రిముఖ పోటీ ఉంది. ‘ఎల్విస్’ చిత్రంలో నటించిన ఆస్టిన్ బట్లర్, ‘ద వేల్’ చిత్రంలో నటించిన బ్రెండన్ ఫ్రేసర్ గట్టి పోటీ ఇస్తున్నారు.

టార్

కళాకారుల జీవితాలు ఎలా ఉంటాయో చూపించే చిత్రం టార్. పైకి వారి ప్రతిభ, వారి ఐశ్వర్యం కనిపిస్తుంది. కానీ వారికి లోపల అభద్రతా భావం ఉంటుంది. ప్రేమ అందకపోతే పరితపిస్తూ ఉంటారు. ప్రేమించేవారు తమని ప్రేమిస్తున్నారా లేక తమ ఐశ్వర్యాన్ని ప్రేమిస్తున్నారా అనే అనుమానం ఉంటుంది. తెలుగులో ‘శివరంజని’ ఇలాంటి చిత్రమే. ‘మహానటి’ కూడా. అయితే ‘టార్’ బయోపిక్ కాదు. ‘శివరంజని’ లాగా కల్పిత కథ. లిడియా టార్ అనే సంగీత దర్శకురాలి కథ ఇది.

కేట్ బ్లాంచెట్ ముఖ్యపాత్ర పోషించింది. ఆమెకు ఉత్తమ నటి ఆస్కార్ రావటం దాదాపు ఖాయమే. ఇంతకు ముందే ఆమెకు రెండు ఆస్కార్లు వచ్చాయి (‘ద ఏవియాటర్’ చిత్రానికి ఉత్తమ సహాయనటి, ‘బ్లూ జాస్మిన్’ చిత్రానికి ఉత్తమ నటి.) ఈసారి ఆమెకి మళ్ళీ ఆస్కార్ వస్తుందని అంచనా. అంత గొప్పగా నటించింది. అయితే ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్…’ చిత్రంలో నటించిన మిషెల్ యో నుంచి పోటీ ఉండొచ్చు. ఆస్కార్ల కంటే ముందు ఇచ్చే నటుల సంఘం (స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్) అవార్డు కేట్ కి వస్తే ఆస్కార్ ఖాయమైనట్టే. రచయిత, దర్శకుడు టాడ్ ఫీల్డ్ కి స్క్రీన్ ప్లే, దర్శకత్వం నామినేషన్లు రావచ్చు. సంగీతానికి ఆస్కార్ అవార్డే రావచ్చు.

టాప్ గన్: మ్యావెరిక్

ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. 1990లో వచ్చిన ‘టాప్ గన్’ చిత్రానికి సీక్వెల్ ఇది. మ్యావెరిక్ 30 సంవత్సరాల తర్వాత కూడా కెప్టెన్ గానే అమెరికా నౌకాదళంలో ఉంటాడు. అతనికి పదోన్నతి రాదు. కారణం ఎక్కువ ఆలోచించకుండా పని చేయాలని అతని సిద్ధాంతం. అందువల్ల తప్పులు జరుగుతాయి. అయితే విజయాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే అతన్ని తీసేయలేరు. చివరికి అతన్ని ఒక మిషన్ కి శిక్షకుడిగా పంపిస్తారు. అక్కడ అతని స్నేహితుడి కొడుకు ఉంటాడు. ఆ స్నేహితుడు ఒక మిషన్లో మ్యావెరిక్ తో పాటు ఉండగానే మరణించాడు. అతని కొడుకు నౌకాదళంలో చేరకుండా మ్యావెరిక్ అడ్డుపడ్డాడు. అయినా ఆపలేకపోయాడు. ఇప్పుడు అతనికి శిక్షణ ఇవ్వాలి. ఏమైనా తేడా వస్తే అతని ప్ర్రాణానికే ముప్పు. తండ్రి తర్వాత తండ్రి స్థానంలో అతన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా లేక శిక్షకుడిగా అతన్ని తీర్చిదిద్దాలా?

భావోద్వేగాలతో పాటు అద్భుతమైనా విమానవిన్యాసాలతో చిత్రం నడుస్తుంది. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ గీతం (లేడీ గాగా పాడిన ‘హోల్డ్ మై హ్యాండ్’) నామినేషన్లు ఖాయం. ఉత్తమ దర్శకుడి నామినేషన్ రావచ్చు. ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ధ్వని ముద్రణ, ఉత్తమ ఛాయాగ్రహణం నామినేషన్లు దాదాపు ఖాయం. ఉత్తమ విజుయల్ ఎఫెక్ట్స్ నామినేషన్ కూడా రావచ్చు. టామ్ క్రూజ్ కి ఉత్తమ నటుడి నామినేషన్ రావచ్చు. అయితే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్

ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం నామినేషన్ ఖాయం. ఉత్తమ దర్శకుడి నామినేషన్ వచ్చే అవకాశం ఉంది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ ధ్వని ముద్రణ నామినేషన్లు ఖాయం.

విమెన్ టాకింగ్

ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం నామినేషన్ ఖాయం. మహిళా హక్కుల గురించి వచ్చిన నవల ఆధారంగా సారా పోలీ స్క్రీన్ ప్లే వ్రాసి దర్శకత్వం వహించింది. స్క్రీన్ ప్లే నామినేషన్ ఖాయం. దర్శకత్వం నామినేషన్ రావచ్చు.

ద వేల్

స్థూలకాయంతో బాధపడే ఒక తండ్రి కథ ఇది. డారెన్ ఆరనాఫ్స్కీ దర్శకత్వం వహించాడు. బ్రెండన్ ఫ్రేసర్ ముఖ్యపాత్ర పోషించాడు. అతనికి ఉత్తమ నటుడి నామినేషన్ ఖాయం. చిత్రానికి ఉత్తమ చిత్రం నామినేషన్ రావచ్చు.

బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్

2018లో వచ్చిన ‘బ్లాక్ పాంథర్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఆ చిత్రం ఉత్తమ చిత్రం నామినేషన్ అందుకుని చరిత్ర సృష్టించింది. ఆ నామినేషన్ అందుకున్న తొలి కామిక్ బుక్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం నామినేషన్ రావచ్చు. ఉత్తమ ధ్వని ముద్రణ, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ నామినేషన్లు ఖాయం. ఉత్తమ సహాయనటిగా ఏంజెలా బాసెట్ కి నామినేషన్ రావచ్చు.

గ్లాస్ ఆనియన్: ఎ నైవ్స్ ఔట్ మిస్టరీ

ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో లభ్యం. ఒక క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం నామినేషన్ రావచ్చు.

ఆల్ క్వయట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్

ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో లభ్యం. యుద్ధం ఎంత ఘోరంగా ఉంటుందో చూపించే చిత్రం ఇది. మొదటి ప్రపంచ యుద్దం నేపథ్యంలో కథ ఉంటుంది. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం నామినేషన్ రావచ్చు. జెర్మనీలో నిర్మించిన ఈ చిత్రానికి ఉత్తమ అంతర్జాతీయ చిత్రం నామినేషం ఖాయం.

ఎల్విస్

ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. పాప్ సంగీతానికి రారాజు ఎల్విస్ ప్రెస్లీ జీవిత కథ ఇది. ఆస్టిన్ బట్లర్ ఎల్విస్ గా అద్భుతంగా నటించాడు. ఉత్తమ నటుడి నామినేషన్ ఖాయం. ఉత్తమ చిత్రం నామినేషన్ రావచ్చు.

Exit mobile version