Site icon Sanchika

ఆస్కరంత నాటు!!

[dropcap]స్వ[/dropcap]ర్గ సీమ!

నందనవనం!

తెలుగు కవులు, సినిమా పాటల రచయితలు పిచ్చాపాటికి కలుసుకొనే ఘుమఘుమల పూల తోట, విశాల మంటపం!

ఇది మామూలే, రాగానే వీరిలో ఎవ్వరూ పెదవి విప్పరు!

అందరూ భావుక సామ్రాట్టులే కదా, అందుకని ముందుగా కాస్సేపు మౌనంగా, ఆ పారిజాతాల సోయగాన్ని చూస్తూ, ఈ సౌగంధికాల పరిమళాలను ఆనుతూ, రసలోకాల్లో విహరిస్తారు!

ఆ తరువాతే, మెల్లమెల్లగా మాటామంతీ మొదలౌతుంది!

***

“విన్నారా, విశ్వనాథ వారూ, మన వాళ్ళ పాటకు అదేదో ఆస్కారు బహుమతి వచ్చిందట”, రాఘవాచారి గారు, సినీ గీతాలకు పితామహులు, సీనియర్ సముద్రాల గారు, ఆరంభించారు, ఏదో ఊర్ధ్వ లోకాల ఆలోచనల్లో ఉన్న కవిసమ్రాట్టుల నుద్దేశించి!

“ఏవిటయ్యా, భాస్కర శతకమా, ఎందుకు చూడలా, భేషుగ్గా ఉంటుంది, మంచి నడకా, ధారానూ!”

“భాస్కర కాదండీ, ఆస్కరు, ఆస్కరు!”

“ఓ, అదా, అదేదో ఆ అమెరికా వాళ్ళు, యూరోప్ వాళ్ళు చేసుకొనే సినిమా పండగ క్కాదూ! మనదేముంది, మనకేముందీ, అందులో?! నేనూ, ఒక చెయ్యి వేశాలే, తొలినాళ్ళలో, ఈ సినిమా రచనల్లో! ‘ఆకాశరాజు’, అని గుర్తు, ఆ సినిమా పేరు! ఒక పాతాళ ప్రయత్నం కింద ముగిసింది! ఇట్లా రాస్తే జనానికి అర్థం కాదంటాడు, అట్లా రాస్తే ససిగా రాలేదంటాడు, ఆ దర్శకుడు! దాంతో, ఇక మీ గోల మీరు పడండని లేచ్చక్కా వెళ్ళిపోయా! అంతే, స్వస్తి! సరే, ఇది మీకు తెలిసిందేగా, ఆ పురస్కారం విషయం చెప్పండి!” అన్నారు విశ్వనాథ!

“వాళ్ళే, ఇప్పుడు మన తెలుగు సినిమా పాటకి అత్యుత్తమ బహుమతి ఇచ్చారట! తెలుగు నేలలో, తెలుగు వారున్న ప్రతి చోటా, సంబరాలు జరుగుతున్నాయి!” సముద్రాల గారి వివరణ.

“ఓహ్! భేషైన వార్త చెవిన వేశావయ్యా! చాలా సంతోషం! అసలు మన తెలుగు భాష, పాటకు మహ బాగా ఒదుగుతుందయ్యా! ఒదగటమేటీ,?! మాట్లాడుతుంటేనే, ఏదో సంగీతమై వినిపిస్తుంది. అది కాదు నేను ఆ నాడే  రాశాను!”

“‘ఒక సంగీతమేదో పాడుచున్నట్లు/భాషించునపుడు విన్పించు భాష” అన్నారు తమరు ఒక కవితలో” అని సముద్రాల వారు అందించారు.

“ఊహూ, నీకు బాగా గుర్తుందయ్యా, భేష్!, అది సరే, మన పాటకు గాక ఎవరికి ఇస్తారు, బహుమతీ, రావాల్సిందే, ముమ్మాటికీ! ఆ భాష సత్తా అటువంటిది మరి! ఇంతకీ ఏమిటీ ఆ పాట, ఎవర్రాశారేమిటి?!”

“‘నాటు నాటు పాటని’, ఒక పాట! చంద్రబోసనే అనే సినీకవి రాశాడు, కీరవాణి అనే ఇంకో పేరున్నాయన బాణీ కట్టాడట!”

“నాటు మేటైందన్న మాట, బాగుంది, జరగనీ!” అన్నారు విశ్వనాథ, తన సహజమైన ముక్తాయింపుతో!

ఆ ముక్తాయింపు, ప్రశంసే అయి ఉంటుంది, ఆయన మాట తీరే అట్లా, కానీ, మనసు మహా దొడ్డది, గుణం ఉంటే గుర్తించి తీరుతారు, అనుకొని ఊరుకున్నారు, రాఘవాచారి గారు!

“మంచి వేగం, ఆవేగం రెండూ ఉన్నాయి, పాటలో, బాణీలో!, విన్నాన్నేను” అంటూ అందుకున్నారు, పక్కనే ఉన్న, మిత భాషి, సదా నెమ్మదితనం వహించే, మల్లాది వారు!

చికిలింత చిగుళ్ళతో, సంపెంగ గుబుర్లతో, తెలుగు నుడికారపు విరి సొంపుల, సుగంధాల ఉద్యానవనం వారి పాటల తోట! పైగా సహ్రృదయ శిఖామణి!

అందరినీ వీపు తట్టి, ప్రోత్సహించే తత్త్వం! తనకు ఏమి వచ్చిందనీ, ఏమి రాలేదని విచారమే లేని వారు! వ్రాయమని అడిగిన పాట పదికాలాలు జనం పాడుకునే అందాలతో అమరించటమే వారి తపస్సు, ధ్యేయం!

ఇంతలో, జరుక్ శాస్త్రిగా ప్రసిద్ధుడైన జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి వచ్చారక్కడికి, హడావిడిగా!

ఈ సంభాషణలు విన్నారు కూడా!

“ఎవరండీ, నాటకాల తరువాత, ఆ ఫక్కీ మార్చేసి, ఆద్యుడై, పౌరాణిక కథలను సినిమాకు మలిచి, మాటలు పాటలూ రెండూ సవ్యసాచిగా రాసిన అర్జునుడు, మన సముద్రాల వారు గాక! వారికి ఒక్క బిరుదైనా ఇచ్చారా, ఆయనతో పాటు వారబ్బాయి రామానుజం, అదే, జనం సముద్రాల జూ. అని. పిలిచినాయన! నా మిత్రుడేలే వాడు! సినిమా మొదలయ్యేప్పుడు, పెద్ద అక్షరాలతో వారి పేరు వేయటం తప్ప, ఏ లక్షలు కట్టబెట్టారు ఈ సముద్రడికీ, సినీ కవికుల వాల్మీకికి?!!

వీరు, చమత్కారాల చక్రవర్తి, పింగళి గారు! వీరి మాటల గారడీ, క్రిష్ణ గారడీకి ఏ మాత్రం తగ్గదు సుమా! పాటలూ అంతే, ఏదో కూర్చుని ఇంట్లో వాడే మాటలతో వ్రాస్తారు! అవే బాగుంటాయి, ఏమిటో, ఈయన వ్రాస్తే! ఆ మాయాబజార్ ఒక్కటి చాలదండీ, ఎన్ని బహుమానా లివ్వాలి ఆయనకు?!” అన్నారు.

పింగళి గారు నవ్వుతూ, “కాలం అండీ కాలం, ప్రతిదానికీ ఇంత అని నిర్ధారించబడే ఉంటుంది! నాటకంలో మన పాత్ర అయిపోయింది, అంతే నిష్క్రమించాలి, అదే నియమం! ఇంకా ఉంటే రసాభాసే! తప్పుకోవటమే వివేకం!!”

విన్నారు కానీ, జరుశా, పింగళి గారికి ఒక్క నమస్కారం పెట్టి, తన ధోరణిలో మళ్ళీ కొనసాగించారు ఇలా:

“ఆ కాలంలో ఇంత ఆర్భాటం, హంగు చేసే వారూ లేక గానీ, మా మల్లాది వారి ‘రహస్యం’ సినిమా లోని ‘గిరిజా కళ్యాణం’, దానికి సాటి ఏదైనా ఉందండి, ఈ సినీ లోకంలో?! ఏమి చక్కదనాల పదాలు, ఏమి చిక్కదనాల పదచిత్రాలు, ఆహా! ఏమిచ్చారండీ వారికి?! పైగా ఆ సినిమా తుస్సుమనటంతో ఆ యక్షగానం అట్లా మౌనంగా పడి ఉంది, మకుటం తక్కువైన మహరాజులా!”

“ఫరవాలేదులేవయ్యా, మన వారికి ఇప్పుడేదో ఇచ్చారటగా, గట్టిదే, పాటకు బహుమానం! సంతోషిద్దాం!” అని మల్లాది వారు శాంతంగా సర్ది చెప్పే యత్నం చేశారు!

కానీ, మళ్ళీ జరుక్ శాస్త్రి గారే అన్నారు: “సంతోషమే అన్నగారు, మన వారు అభివృద్ధి చెంది, భూమి నాలుగు చెరగులా గుర్తింపు పొందితే, సంతోషం గాకేం! కాకపోతే, గతం లోనూ ఉన్నాయి గొప్ప గీతాలు, అన్నదే నా వాదం! వాదమే కాదు, గుర్తింపు లేదే అని, ఖేదం కూడా!!” అని –

పక్కనే ఉన్న కొసరాజు గారిని చూపిస్తూ, “ఏం మన రాఘవయ్య గారు ఏమైనా తక్కువ రాశాడా?!మహా ఉద్దండుడు కాదూ, ముఖ్యంగా జానపద శైలిలో! అతనే రాయాలి ఆ పాటలన్నంతగా! ఆహా, ఆ ఏరువాక పాట, ఒక్కటి చాలండి, తెలుగు నాట వ్యవసాయపు ఆరంభ సంరంభాలు చెప్పటానికి! కళ్ళకు కట్టించాడు కాదూ, ముద్దులొలికే మాటలతో!

పాడి, పశు సంపదల మీది పాటలతో ఎన్ని రంగుల ఓపరాలు కట్టి మురిసిపోయాడో, మరపించాడో, జానపద గీతాలకు! అతనికే పురస్క్రృతి దక్కింది?! తన ధోవతి, అంగవస్త్రం తప్పా!?”

“సరేనయ్యా శాస్త్రి, ఆ నాటి పరిస్థితులు అవీ, ఏవో శాయశక్తులా రాశాం, మెప్పించాం! రావాల్సినవి వచ్చినై, మనవి కానివి ఎటూ రావు! ఎందుకిలా, ఇప్పుడు రాద్ధాంతం, మన వాళ్ళకి వచ్చిందట కదా ,గొప్ప విషయమే, ఆనందిద్దాం!”

అయినా మహోధ్ధృతమైన గోదావరి లాంటి జరుక్ గారి ప్రవాహవేగం ఆగందే?!

“ఇక అదిగో అక్కడ, మా అధిక సిరుల కవి, శ్రీశ్రీ! ఎక్కడో పైన ఉన్న రథ చక్రాలను భూ మార్గం పట్టించి, శతాబ్ది నాదని చెప్పుకున్న ఖలేజా ఉన్న ప్రజా కవి! ఎన్ని ప్రబోధ గీతాల్లాంటివి రాశాడు సినిమాల్లో, ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకూ, నీ కోసమే కన్నీరు నించుటకూ..’, ఆహా ఎంత భాగ్యం అట్లాంటి మిత్రుడు ఉండటం! ఇంకో సినీగీతం లోనే అంటాడు కదా, ‘కల కానిది విలువైనది బతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు.. అగాధమౌ జలనిధిలోనే ఆణిముత్య మున్నటులే, శోకాల మరుగున దాగి  సుఖమున్నదిలే,.. శోధించి సాధించాలి, అదియే ధీర గుణం’ – ఇంత కంటే ఆ పాట పరిధిలో, ఏమి హితోపదేశం రాయగలరండీ?! ధైర్యం నూరిపోసే ఔషధ పూర్ణ చంద్రిక కాదూ ఇది!

ఇక మా వాసంత విలాసుడు కృష్ణశాస్త్రిని మించిన గీతకర్త ఏడి, చూపించండి? ప్రకృతితో మమైకం అయ్యే రకం, ఆ అడవిలోనే ఓ కుటీరం వేసుకొని ఉండి పోతానంటాడు, ఎంతటి రసలోలుడండీ?! కాబట్టే అట్లాంటి, మాకందా ల్లాంటి పాటలు రాశాడు! పసరు రెక్కల పైన పరవెత్తాలని తహతహ, ఏ ఊర్వశిని వెతకాలనో! గొప్ప భావుక లోక విహారి లెండి, మా దేవులపల్లి!

ఈయనని చూడండి, మన బహు భద్రమూర్తి, ఆరుద్ర! సినీ పాటల్లో ఏమి క్రీడలు చేశాడు, ఆ భాగ్యనగరాన్ని గూర్చి ఏమన్నాడయ్యా?! ఆ, ‘భరత మాత జడలోని పసిడి నాగరం!’ ఆహా, అద్భుతం! ఏమి ఊహా సౌందర్యం?! అది అట్లా ఉంచండి, సమగ్రాంధ్ర సాహిత్యం అంటూ కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగి, విషయం సేకరించి రాశాడు కాదు, అన్ని కాలాల గురించీ! ఏమిచ్చారు ఇతనికి, శుష్క ప్రియాలూ, శూన్య హస్తాలు తప్ప?! మనలో మన మాట, మా రామలక్ష్మితో ఎన్ని చీవాట్లు తిన్నాడో! అదొక సరసమైన వ్యవహారం అనుకోండి వాళ్ళ మధ్య! అయినా, ఆవిడా వచ్చిందిట, మొన్నీ మధ్యే మన లోకం! కనబడదేం?!

ఇక ఈ మనస్వి! మనసు మీద మనసే పారేసుకున్నాడు! వీడి దుంప తెగ, ఎన్ని పాటలు రాశాడయ్యా, ఈ కోతి మనసు మీద?! ఏమన్నావ్, ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా..!’ భాష్యం చెప్పావయ్యా మనసు మీద నీ పాటల్లో, చిన్న చిన్న తెలుగు పదాలతో! శాభాషీలు తప్ప నేనేమి ఇవ్వగలను, నీకు దక్కినవైనా అవేగా!

ఇక మన నారాయణరెడ్డి, వేటూరి, సిరివెన్నెల గూర్చి అందరికీ బాగా తెలిసిందే! తెలుగు సినీ పాట పొలాల్లో రాజనాలు పండించారు కాదూ!

తరువాతి తరం వారు వీరు! కాస్తో కూస్తో జనాల, పాలకుల గుర్తింపు, ప్రాపు లభించింది వీరికి, సంతోషం!!

ఇంకా అదిగో అనేక మంది ఉన్నారు, ఈ తోటలో అక్కడా అక్కడా కూర్చుని, సినీ వినీలాకాశంలో తమదైన కాంతిని వారి పాటలతో ప్రసరింప చేసిన వారు.

అందరు హేమాహేమీలే! మరచిపోకూడదు, ఈ జాతి, తెలుగు సినిమా తొలి రోజులలోని సాహిత్య కృషిని, ఆ కవులను! అదే నా అభిప్రాయం! కాదు, మర్చిపోతారేమో అని నా ఆవేదన!!

అందరూ అమాయక  సార్వభౌములు, నోరెత్తి అడగరు, ఎవరినీ పల్లెత్తు మాట అనరు! కవులకు ఆ మాత్రం ఆభిజాత్యం అలంకారమే అనుకోండి!

నేను మటుకు ఆగలేను, నాదైనా, వేరే వాళ్ళదైనా! గుణం ఉంటే చాలు, నా గుండె గోదారై పొంగిపోతుంది మరి!” అన్నారు శాస్త్రి.

అంతలో కొసరాజు గారు కల్పించుకొని, “అసలు ఆ పాట గురించి చెప్పవయ్యా, నీవు వినంది, చదవనిదీ ఏముంది, వేదాల నుంచి, రుబాయీల వరకూ! ఈ పాటికి దాన్ని అన్ని కోణాల్లో శల్య పరీక్ష చేసే ఉంటావ్! మహా గట్టి ఘటానివయ్యా నువ్వు!” అన్నారు, అతని జోరు కాస్త తగ్గించేందుకు, పెద్దమనిషి తరహాలో!!

ఇంకేముంది, ఏక బిగిన, జోరుగా ‘నాటు నాటు’ పాటలోని రకరకాల నాటులు – వీర, పిచ్చి, వెర్రి, తిక్క, చెడ్డ, ఇట్లాంటివి, చెప్పి, అందులో గ్రామీణ వాతావరణాన్ని ఆ పద సంయోజనంతో, ఎట్లా కళ్ళకు కట్టించాడో, వ్యవసాయ సంప్రదాయాలను, ఆహారపు టలవాట్లను, జనాల నోళ్ళలో నానిన ఆ పదజాలమే వాడి, వేడిగా, తన కలం వాడితనంతో ఎట్లా వ్రాశాడో ఈ కవి అని వివరించి, పాత వారిని అంతగా వెనకేసుకొచ్చిన ధోరణిలోనే, అంత మైమరచీ వర్ణించేశారు జరుశా, ఏ పాత కొత్తల భేదబుధ్ధీ లేకుండా!

కాని, ఆయనన్న కొస మెరుపు మాటే, ఆయన యెద లోపలి బరువుగా అనిపించింది!

ఏ బాటా లేని రోజులల్లో వచ్చి, ఆలోచనలను మథించి, ఎట్లా జనరంజకంగా పాట, సాహిత్యపు విలువలతో అందించాలో చెప్పిన ఈ మహామహులని మాత్రం మర్చిపోవద్దని చెప్పటమే తన ధ్యేయం అని స్పష్టం చేయటమే అది!

రుక్కాయి ఆలోచన ఎప్పటికీ మంచి సాహిత్య కృషి, ఎవరు చేసినా సరే, గౌరవం దక్కకుండా, అనామకంగా ఉండి పోకూడదనే!!

ఏ ఎత్తు కెదిగినా, పునాదులు వేసిన వారిని మరవకూదదనే, తన తపన, అదే ఆ మాటల్లో చెప్పానని కూడా అన్నారు, గద్గద స్వరంతో!

ఎవ్వరైనా, తప్పుగా అర్థం చేసుకుంటారేమోనని బెంగ కాబోలు!

పాపం వెర్రి నాయన, జలసూత్రం, సిసలైన సాహిత్య పిపాసి, అభిలాషి, స్వయంగా రచయితా! అందరూ మిత్రులే ఆయనకు, అందరివీ, అక్షరం వదలకుండా చదవటమే!

అక్షర వ్యసని అనాల్సిందే మరి!

అదే ఆయన గొప్పలక్షణం అని తెలిసే, అందరు ఆయనతో సన్నిహితంగా ఉంటారు అని ఆ కవి బృందం అనుకొన్నది మరొక్కసారి!

చక్కగా ఎవరు ఏది రాసినా ఆకాశాని కెత్తే గుణగ్రాహి, జలసూత్రం అని ఎప్పుడో ఆ నాటి కవిపండిత సమూహం, ఈతని విషయంలో సూత్రీకరణ చేసిన విషయం అందరికీ బాగా తెలిసినదే! మొదట్లో అతను అట్లా గత వైభవం అగ్గిస్తూంటే, చివరకు ఈ బహుమతి గ్రహీతయైన, నవ కవిని కూడా అంతగానే విశ్లేషించి, ప్రశంసిస్తాడని, వారికి బాగా తెలిసే, అతన్ని చెప్పనిచ్చారు!

ఆ విషయం అతనికీ ఎరుకే!

అందుకే ఆ ధారను ఎవరూ ఆపే యత్నం చేయలేదు, చేసినా అతను చెప్పేది చెప్పే తీరతాడని కూడా వారికి తెలుసు!

అతని కవితాభినివేశం అంత గాఢమైనది, అందులో ఏ ఇతర సంకుచిత భావాలకు తావే లేదు!

ఇవాళ మన గీత లోకానికి ఒక గొప్ప సుదినం, అంతర్జాతీయ స్థాయిలో మన పాటను నిలబెట్టారు ఈ నాటికి, అని అందరూ సంతోషంగా లేచి, వెళ్ళిపోతుంటే, జరుశా యే అన్నారు మళ్ళీ!

“ఆగండన్నయ్యలూ, అంత ఖ్యాతి మన తెలుగు పాటకు తెచ్చిన దానిని గూర్చి నా మాటల్లో నాల్గు వాక్యాలు రాశాను, విని ఆ కవిని, ఆ సంగీత దర్శకుణ్ణి, ఆ దర్శకుణ్ణి ఆ మొత్తం బృందాన్ని, సరస్వతీ పుత్రులు మీరందరూ, ఇంకా ఇట్లాంటివి ప్రతి యేటా తెచ్చే స్థాయిలో సినిమాలు నిర్మించి, సాహిత్యసంగీతాలు సమకూర్చాలని ఆశీర్వదించి మరీ, బయలుదేరండి” అని, అంటూనే, ఇట్లా పాటలాగా చదవటం మొదలెట్టారు:

‘నాటునాటు’ పాట మీద, ఓ పాట!!

~

రాదురాదు రాదురాదు రానే రాదు ఈ పాట సంద డెందు లోన
పోదుపోదు పోదుపోదు ఘాటు దీన్ది ఎన్ని వంద/లేళ్ళు ఐన!
***
పదాలకు:

ఉండిఉండి ఉండిఉండి
గుండెలోని పొంగులన్ని
హంగులైన పదములై
పుడమి పైకి చిమ్మినట్టు!
***
వేల వేల పాటల్లో
రసమునంత పిండినట్టు
పల్లెటూళ్ళ పదములన్ని
జల్లెడేసి దింపినట్లు
***
జానపదం అంతరంగం
అద్దమేసి చూపినట్లు
కొసరాజు, దువ్వూరి
బోసు కలం దూరినట్లు.
***
పట్టాకత్తి ద్దూసినట్టు
పిడిబాకూ గుచ్చినట్టు
పదునెక్కిన పదాలివీ
కదను తొక్కే వాజులివి!
***
పోట్లగిత్త పొగరణచగ
పోటుగాడు మీరినట్లు
మంకు తేజి న్నొక్కదాన్ని
కళ్ళెమేసి ఆపినట్లు.
***
పండుమిరప పచ్చడేమొ
ఉండ చేసి మింగినట్టు
మంట మండే ఎండల్లోన
కుర్రకారు ఆడినట్లు.
***
నాటులోని ఘాటునంత
పాటలోన నింపినట్లు
తెల్గుమాట అందానికి
లోకమంత పాడునట్లు

~

స్వరాలకు:

పలుకుల్ల పైడిపూలకు
పాట తా వద్దినట్టు
జాను పదం చెట్టుకేమొ
పాట తీగ నల్లినట్టు!!
***
కంకి మీద పాలపిట్ట
రివ్వుమని వాలినట్టు
నిక్కి చూసి అటూఇటూ
తుర్రుమనీ ఎగసినట్టు
***
యుధ్ధభేరి మోగినట్టు
నగారాలు ఊదినట్టు
గుర్రమెక్కి వీరుడొకడు
పొలికలనికి ఉరికినట్టు
***
నంది శంఖం ఒత్తినట్టు
భృంగి తాళం వేసినట్టు
పొంగి హరుడే సంజవేళ
తాండవమ్మె చేసినట్టు
***
నాగసొరపు నాదానికి
నాగులన్ని ఆడినట్టు
సరసరసరమంటూ చరచరచర
మెలిక నృత్యం చేసినట్టు
***
రోళ్ళ లోన ఒక్కసారి
రోకళ్ళతో దంచినట్టు
దంచి దంచి అమ్మలందరు
చక్కదనాల పాడినట్టు
***
తిరునాళ్ళ సంబరాల్లో
ఒళ్ళు మరచి ఆడినట్టు
శివాలెత్తి గణాచారి
నింగి నేల యేకినట్టు.
~

పదస్వరాలకు, స్వరపదాలకు:

తెల్గు బాస తెల్గు రాగం
తెల్లోళ్ళకు తెల్పినట్టు
తుళ్ళింతల వారందరు
ఒళ్ళు మరిచి ఆడినట్టు!!
***
ఆపరాని డప్పు మోతల
నింగి కాస్త బెదిరినట్టు
కాళ్ళ కింద తొక్కిడితో
భూమి ఇంత అదిరినట్టు.
***
అడుగులేసి అలసిపోయి
పదం కలిపి సొలసి పోయి
బొమ్మలేమొ తూలిపోయి
అమ్మమ్మో అని వాలినట్టు!
***
బూర గొట్టం ఊది ఊది
బుగ్గలన్ని నొచ్చినట్టు
సోలిపోవు పానానికి
కాలి నృత్యం ఊపిరట్టు!!
***
జబ్బ చరచే మల్లులట్టు
అబ్బబ్బంటి పట్టులట్టు
నిబ్బరాల ఆట పెట్టు
సుబ్బరం గిద్దరు గెల్చినట్టు!
***
హిమాలయం కొమ్ము మీద
మువ్వన్నెల నిల్పినట్టు
సినీ జగం తాతయ్యల
మెప్పు పత్రం పొందినట్టు!!
***
వీర నాటు పిచ్చి నాటు
ఊర నాటు వెర్రి నాటు
చెడ్డ నాటు తిక్క నాటు
నేడు.. ఆస్కరంత మహా నాటు!!
~
రాదురాదు రాదురాదు రానే రాదు
ఈ పాట సంద డెందు లోన
పోదుపోదు పోదుపోదు ఘాటు దీన్ది
ఎన్ని వంద/ లేళ్ళు ఐన!

~

అందరూ విని, “బాగుంది, బాగుంది,” అంటూ, ప్రసన్న వదనాలతో, వారి మంగళాశీస్సులను తెలుగు సినిమాకీ, పాటకీ, ఈ బహుమతి సాధించిన బృందం మొత్తానికీ మనసారా అందించి, నెమ్మదిగా ఒక్కొక్కరే, తరలి వెళ్ళారు, వారి వారి బసలకు, అమరపురిలో!

వెళ్తూ వెళ్తూ, విశ్వనాథ వారు, శాస్త్రి దగ్గర ఆగి మరీ,

“బలే గారడీ అయ్యా నీది, నాక లోకం వచ్చినా, వదిలావు కాదు, నీ పేరడీ విద్యని, దీని తస్సాదియ్యా!” అన్నారు!

“అన్నీ మెచ్చుకోళ్ళే, మహాప్రభూ! పేరడీలలో నుంచి దీన్ని మినహాయించాలి, మరి” అని శాస్త్రి గారి జవాబు!

ఇంతకీ ఈయన మెచ్చినట్టా, తిట్టినట్టా, అనుకొని, ఏదైనా సేగేమీ లేదులే, మహానుభావుడు, అన్నిటికీ ‘సమర్థుడు’, అనుకుంటూ తనూ నిష్క్రమించారు, జరుక్ శాస్త్రి అని పిలవబడ్డ జలసూత్రం వారు!

సన్నగా, ‘సమర్థు లొక్కటే కాదు, పాషాణ పాక ప్రభువులు కూడా’, అనుకొని, చిలిపిగా నవ్వుకున్నట్టు అనిపించింది!

నిజమో, నా భ్రమో, తెలియదు మరి!!

***

ఏది ఏమైనా, ఇక తిరుగులేదు, కవులై దేవతలుగా మారిన వారి అందరి ఆశీర్బలం మన వెంటే ఉంది, తెలుగు సినిమాకి, మాటకూ, పాటకు, ఇంకా ఉన్నతోన్నత పురస్కారాలే, ఆదరణే!

నిస్సందేహంగా!

అందుకు, ఈ ఆస్కార్‍తో శ్రీకారం చుట్టిన శ్రీయుతులు చంద్రబోస్‍కి, కీరవాణికి, రాజమౌళికి, బృందం అందరికీ హార్దిక అభినందనలు!

మంగళమస్తు!!

Exit mobile version