Site icon Sanchika

వెర్రి అభిమానంతో మనం తయారు చేసుకునే OTHER GODS

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]ప[/dropcap]ర్ల్ ఎస్. బక్. ప్రపంచం మెచ్చిన రచయిత్రులలో ఒకరు. అమెరికా దేశస్తురాలయిన పర్ల్ మిషినరీలతో పని చేసిన తల్లి తండ్రుల సంతానం కాబట్టి తన జీవితంలో ముఖ్య భాగం చైనాలో గడిపారు. అందువలన ఆ దేశ సాంప్రదాయాలను పరిస్థితులను ఆధారం చేసుకుని ఎన్నో గొప్ప నవలలు రాసారు. నోబెల్ బహుమతి పొందిన గొప్ప రచయిత్రి ఆమె. వీరి నవలలు కొన్ని చాలా ప్రాచుర్యం పొందాయి. OTHER GODS అనే ఈ నవల వీరి గొప్ప నవలగా ప్రస్తావనకు రాదు. కాని నాకు చాలా ఇష్టమయిన నవల ఇది. మనిషిని దేవునిగా మార్చి అతన్ని ఒక అసాధారనమైన స్థితికి తీసుకువెళ్ళి అతన్ని మనిషిగా హత్య చేసే మూఢ ప్రేమ, అభిమానాలను కథా వస్తువుగా తీసుకుని రాసిన నవల ఇది. భారతదేశంలో మనకు నచ్చిన వ్యక్తిని దేవునిగా ఆరాధించడం అతి సామాన్యమైన విషయం. నటులకు గుడులు కట్టడం, వారిని దేవతలుగా కొలవడం మనం సర్వసాధారణంగా చేసే పని. అయితే ఇది అభిమానం కాదని ఆ వ్యక్తుల జీవితాన్ని నియంత్రించడం అని, మనల్ని మనం మోసం చేసుకోవడం అని మనకు అర్థం కాదు.. ఒక రకంగా ఈ మూఢ భక్తి, ప్రేమ, అభిమానం వెనుక వ్యాపార కోణం ఉంటుందని అది ఆ వ్యక్తి జీవితాన్ని హరించి వేస్తుందని, విపరీతమైన నాటకీయతకు కారణం అవుతుందని, అబద్దపు జీవితానికి ఆధారం అవుతుందని చెప్పే నవల ఇది.

మానవుడు తన కలల ప్రపంచంలో తాను అభిమానించే వ్యక్తులకు భగవంతుని స్థానం ఇస్తాడు. సాధారణంగా యుక్తవయసులో ఈ వెర్రి అభిమానం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అభిమానించే వారంతా సాధారణంగా గ్లామర్ ప్రపంచానికి సంబంధించిన వారయి ఉంటారు. అయితే ఈ అభిమానం తీవ్రమైన భక్తిగా మారిపోతూ ఒక ఉన్మాద స్థితికి చేరుకునే సందర్భాలు అనేకం. ఇది ఆధునిక సమాజంలో గొప్ప వ్యాపారంగా మారిపోతుంది. ఈ వ్యాపారం ఆధారంగా మీడియా బ్రతుకుతుంది. కాని మనం భగవంతుని స్థానం ఇచ్చిన వారు సాధారణ మనుష్యుల స్థాయిలో కూడా కొన్ని సార్లు ఉండక తీవ్ర నిరాశకు గురి చెసిన సందర్భాలు ఉంటాయి. అయితే ఈ నిరాశకు కారణం వారు కాదు, వారిపై మనం పెట్టుకున్న అబద్ధపు ఆశలు. మనం పెట్టుకున్న అంచనాలు నమ్మకాలు వమ్ము అవుతాయే తప్ప వారిలో మార్పు అన్నది అబద్ధం. ఈ అంచనాల మీద మార్కెట్‌లో వ్యాపారాలు సాగుతాయి కాబట్టి ప్రజల అంచనాలు తప్పకుండా ఒక నాటకీయ వాతావరణాన్ని ఆ వ్యక్తి చుట్టూ ఉన్న సమాజం నిర్మిస్తుంది. దీన్నే ప్రమోషన్ అనవచ్చు. ఒక సెలెబ్రిటీని ప్రమోట్ చేయడానికి తీవ్ర స్థాయిలో పని జరుగుతుంది. ఆ ప్రమోషన్‌పై బ్రతికే వాళ్ళూ చాలా మంది ఉంటారు.

మన కలలను ఆశలను, అంచనాలను కూడా వ్యాపారాత్మకం చేసే అసహజమైన సమాజంలో మనం జీవిస్తున్నాం. మన కలలను ఆ సమాజం బ్రతికి ఉంచే ప్రయత్నం చేస్తుంది. నిజాలు తెలీయకుండా మన కళ్ళకు అందమైన పరదాలు కట్టి ఉంచుతుంది. అది చూపించే వాటినే నమ్మి అదే జీవితం అనుకునే స్థాయిలో అభిమానులు వెళ్ళిపోతారు. ఇది ఎలా ఒక క్రమంలో జరుగుతుందో ఈ నవలలో రచయిత్రి చాలా బాగా రాస్తారు.

ఈ నవలలో రచయిత్రి బర్ట్ హొల్మ్ అమే ఒక అందమైన యువకుని జీవితాన్ని పరిచయం చేస్తారు. అతనికి అందం ఉంది కాని ప్రతిభ, కనీస ఇంగిత జ్ఞానం శూన్యం. హిమాలయాలో ఒక పర్వత శిఖరాన్ని అనుకోకుండా అతను ఎక్కడం జరుగుతుంది. మిగతా పర్వతారోహకులు కష్టపడ్డా చేయలేని పని ఇతను ఒక సమయంలో అనుకోకుండా చేస్తాడు. అక్కడ నుండి  తిరిగి స్వదేశం అమెరికా వెళ్ళడానికి చైనా గుండా ప్రయాణించవలసి వస్తుంది. ఆ ప్రయాణంలో ఒక గౌరవనీయమైన కుటుంబంలోని ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆమె అప్పుడే తన ప్రియునితో విడిపోయిన విషాదంలో ఉంటుంది. పర్వతారోహకుడిగా అప్పుడే అతను సాధించిన విజయం దాని ద్వారా అతనికి లభించిన పేరు విని ఆ కుటుంబం అతని అందాన్ని చూసి అతని మత్తులో పడిపోతుంది. ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని అతను అడిగితే అందరూ సంతోషంగా అంగీకరిస్తారు. తన పాత విషాద ప్రేమ కథను మరిపించే అందగాడు వచ్చాడని కిట్ సంబరపడుతుంది. అలా కిట్ అమెరికా హీరో బర్ట్‌ని పెళ్ళి చేసుకుని అతనితో అమెరికా వస్తుంది. 

బర్ట్‌కి అతని స్వగ్రామంలో గొప్ప స్వాగతం లభిస్తుంది. కిట్ బర్ట్ తల్లి తండ్రులను అప్పుడే మొదటిసారి చూస్తుంది. తాను ఆ కుటుంబంలో ఎప్పటికీ సర్దుకోపోలేనని ఆమెకు అప్పుడు అర్థం అవుతుంది. వారిది అతి సాధారణ అమెరికన్ల కుటుంబం. అందులో ఏ రకమైన ఆకర్షణలు లేవు. వారికి కీర్తి కాంక్ష ఎక్కువ. బర్ట్ కీర్తి దాహంతో కొట్టుకుంటూ ఉంటాడు. అతని కొచ్చిన పేరుపై ఆధారపడి ఆ కుటుంబం బ్రతకాలని అనుకుంటుంది. ఎవ్వరికో స్వంత వ్యక్తిత్వం అన్నది లేదు. బర్ట్ పెద్ద బద్దకస్తుడు. తెలివి లేని మూర్ఖుడు, అతనితో జీవితం చాలా మందకోడిగా సాగుతుంది. అతనికి అంతకు ముందే వివాహం అయిందని, అతని మూర్ఖత్వాన్ని భరించలేక అతని మొదటి భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయిందని కిట్‌కి అప్పుడు తెలుస్తుంది. ఈ సంగతి బెర్ట్ కిట్‌కి అంతకు ముందు చెప్పడు. కిట్ తల్లి తండ్రులు తమ అల్లుడి చీప్ పబ్లిసిటి చూసి అది భరించలేక అతని కోసం ఒక సెక్రెటరీని నియమిస్తారు. ఆ సెక్రటరీ పని బెర్ట్‌ని సమాజం దృష్టిలో ఒక హీరోగా నిలపడం. అతని ఒక క్లాస్ మనిషిగా ప్రపంచానికి చూపడం.  జనానికి కావలసిన మసాలాను అందిస్తూ బెర్ట్‌కి ప్రచారం కల్పిస్తూ అతనికి ఒక హీరో హోదా అంటగట్టే గొప్ప ప్రయత్నం చేస్తాడు ఆ సెక్రెటరీ.

కిట్‌కి అమెరికా వచ్చిన కొద్ది రోజులలోనే తన వివాహం ఒక పెద్ద తప్పిదం అని తెలుస్తుంది. ఆ అందమైన మూర్ఖపు భర్తతో జీవితం ఘోరంగా ఉంటుంది. కుటుంబం పట్ల అతనికి కనీస భాధ్యత ఉండదు. చుట్టూ ఉన్న వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలో కూడా అతనికి తెలీదు. కాని అతనికిచ్చే పబ్లిసిటీతో ప్రజలు అతన్ని ఒక హీరోలా పూజిస్తూ ఉంటారు.

బర్ట్ చేసిన పర్వతారోహణ పాత సంఘటన అయిపోతుంది. హీరోగా ఉండాలంటే అతను మళ్ళీ ఏదో ఒకటి చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. లేదా ప్రజలు అతన్ని మర్చిపోవచ్చు. అందుకని ఒక టీంని ఎంచుకుని మళ్ళీ పర్వతారోహణకు బయలుదేరుతాడు బర్ట్. కిట్ కూడా భర్తతో పర్వతాన్ని అధీరోహించడానికి బయలుదేరుతుంది. దేశమంతా ఆ ప్రేమ జంటకు హారతులు పడుతుంటారు. కాని ఆ యాత్ర మొత్తంలో బెర్ట్ స్వార్థం కనిపిస్తూ ఉంటుంది. అతనిలోని పిరికితనం నిత్యం బయట పడుతూ ఉంటుంది. బర్ట్‌ని ఆరాధించే ఒక యువకుడు పిచ్చ అభిమానంతో బర్ట్‌తో కలిసి ప్రయాణీంచి అతని స్వార్థానికి ప్రాణాలు పోగొట్టుకుంటాడు. మరో మంచి పర్వతారోహకుడు బర్ట్ మూర్ఖత్వం కారణంగా ప్రమాదంలో పడి మరణిస్తాడు. కొంతమంది తెలివైన రిపోర్టర్లు నిజాన్ని గ్రహించి ఈ మరణాల వెనుక కారణాల్ని అడుగుతూ ప్రశ్నించినప్పుడు బర్ట్ సెక్రెటరీ, అతని ఫాన్స్ నిజాలు బైటికి రాకుండా కష్టపడి రిపోర్టర్ల నోర్లు మూయిస్తారు. బర్ట్ మళ్ళి ప్రజల దృష్టిలో హీరో అయిపోతాడు. అతని మీద ప్రజల అభిమానం కోండంత పెరిగిపోతుంది. కీట్ ఈ జీవితాన్ని అసహ్యించుకుంటుంది. కాని ఒక ఆదర్శవంతమైన భార్యగా నటిస్తూనే పోతుంది. అమెకు ఆ పరిస్థితులలో ఏం చేయాలో పాపం అర్థం కాదు.

మనుషులు తయారు చేసే హీరోలు, వారి ఇమేజ్ చట్రంలో నలిగిపోయిన నిజాలు ఇవన్నీ చర్చకు తీసుకువస్తారు రచయిత్రి. మనం కావల్సినట్లుగా మన హీరోల చుట్టూ ఒక ప్రపంచం మనమే నిర్మిస్తాం. ఆ ఇమేజ్‌లో వారిని ఉంచి పూజిస్తాం, దేవతలను చేస్తాం. ఒక్క సారి ప్రమాదవశాత్తు వారిలో ఒక్క గొప్ప గుణం కనిపిస్తే అదే మన జీవనాధారంగా మార్చుకుంటాం. ఒక ఊహా ప్రపంచంలో జీవిస్తాం. దీన్నే ప్రస్తావిస్తూ ఈ గుడ్డి హీరో వర్షిప్ గురించి రచయిత్రి అంటారు. “ఇది అంతా అర్దం లేని సెంటిమెంట్, మాబ్ మూర్ఖత్వం. సమూహంలో ఎప్పుడు నిజమైన దేవుడిని, గొప్పవాడిని మనం గుర్తించలేం. ఒక మత్తులో పడి సమూహం కొట్టుకుపోతుంది. ఆ మత్తు మనిషి ఆలోచనను మింగేస్తుంది.” కిట్ కూడా బర్ట్ అభిమానుల గురించి ఆలోచించి ఆశ్చర్యపోతుంది. అతన్ని పూజించే ఆ అమాయకులను చూసి జాలి పడుతుంది. జనానికి ఆరాధించడానికి ఒక వ్యక్తి కావాలి. వారికి కావలసిన గుణాలని ఆ వ్యక్తికి ఆపాదించి గుడ్డి భక్తిలో ఆనందాన్ని వెతుక్కుంటారు వాళ్ళు. ఇలా జనం తయారు చేసిన దేవుళ్ళు ఎందరో. వారికి దేవుళ్ళుగా బ్రతికే అర్హత ఉందా అన్నది ఎవరూ ప్రయత్నించి తెలుసుకోవాలనుకోరు. బర్ట్ భార్యగా తనను చూసి అసూయపడే స్త్రీలకు బర్ట్ ఒక దద్దమ్మ అని తెలిస్తే తట్టుకునే శక్తి ఉండదని అందుకని వారంతా ఆ కలల మధ్య బ్రతకడమే మేలు అని కిట్ అనుకుంటుంది. ఆ జనం కోసం వారి కలల కోసం కిట్ బర్ట్ భార్యగా ఉండిపోవడానికి నిశ్చయించుకుంటుంది. అతన్ని వదిలివేసి అతని నిజస్వరూపాన్ని ప్రపంచానికి చూపించి ఎందరి కలలను ఆశలనో తాను హత్య చేయవలసి వస్తుందని వారి ఆనందం కోసం మూర్ఖపు భర్తతో మిగిలిపోతుంది.

ఈ నవల చదువుతున్నంత సేపు ప్రజల అభిమానాన్ని ఆస్వాదించే రచయితలు, నటులు, వారిని పరిచయం చేసుకున్నాక  వ్యక్తిగా నాకు కలిగిన నిరాశ, గుర్తుకు వచ్చాయి. నిజంగా మనం చేసిన దేవుళ్ళ నిజ స్వరూపాలను మనం చూస్తే తట్టుకోలేం. వారి చుట్టూ అందమైన పందరి నిర్మించి అందులో వారిని కూర్చోబెట్టి ఆరాధించడంలో ఒక ఆనందం ఉంది, ప్రపంచంపై ఆశ ఉంది. ఆ ఆశ వమ్ము అవడం ఎవ్వరం ఇష్టపడం. అందుకే మన దేవుళ్ళను కాపాడడానికి ఎంత దూరమైన వెల్తాం. బ్రూస్లీ మరణం నుంచి మైఖేల్ జాక్సన్ పతనం దాకా ఎన్నీ ఉదాహరణలు మన ముందున్న గానీ మనం మన దేవుళ్ళను తయారు చేసుకుంటూనే ఉంటాం. వారే మన జీవితానికి శక్తి, ఆసక్తి కూడా, లేదా మన జీవితాలు కూడా అనాసక్తిగానే మిగిలిపోతాయి. అది భరించలేకే మనం తయారు చేసుకుంటాం ఈ OTHER GODS ని.

మానవ బలహీనతలను, ప్రేమ అభిమానం అనేవి బలహీనతలు గానే మిగిలిపోతే సమాజంలో జరిగే తప్పులను, మనిషి పొందే నిరాశను చర్చిస్తారు రచయిత్రి ఈ నవలలో. పర్ల్. ఎస్. బక్. నవలలో గొప్పతనం వారి శైలి. ప్రతి పేజీని ఆసక్తికరంగా మలచడంలో వీరు దిట్ట. అందుకే వీరి నవలలు ఇప్పటికీ కొన్ని వేల ప్రింట్లు అవుతూనే ఉన్నాయి. వారిని అభిమానించే వారి సంఖ్య ప్రతి పుస్తక ప్రియుల కొత్త తరంలో పెరుగుతూనే ఉంటుంది.

Exit mobile version