Site icon Sanchika

తెలంగాణ మలితరం కథకులు – కథనరీతులు -15: పి. యశోదారెడ్డి కథలు

[box type=’note’ fontsize=’16’] “యశోదారెడ్డి కథల్లో వస్తువు, కథనం, కథనశైలి, వ్రాతలు, సంభాషణలు, స్వగతాలు, ప్రకృత్యాది వర్ణనలు అన్న విలక్షణంగా కనబడతాయి. వీరి కథల్లో వ్యక్తులు ఇతివృత్తం కన్నా, కథనం పాఠకుల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది” అంటున్నారు కె.పి. అశోక్ కుమార్. [/box]

[dropcap]ప్రా[/dropcap]చీన సాహిత్యంపై లోతైన పాండిత్యం, సంస్కృతంపై ఆధిపత్యం వుండి కూడా మాండలిక భాషపై మక్కువ ఎక్కువ గల విద్వాంసురాలు, విమర్శకురాలు, కథారచయిత్రి, గొప్ప వక్త ఆచార్య పి. యశోదారెడ్డి.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యశోదారెడ్డి ఎం.ఏ. తెలుగు, సంస్కృతంలను పూర్తిచేశారు. వీరు 1955 జూలైనుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా వున్నారు.

డా. పి. యశోదారెడ్డి గొప్ప పరిశోధకురాలు. “తెలుగులో హరివంశములు” అనే పరిశోధనాగ్రంథం వీరి పరిశోధనలో అత్యుత్తమమైనది. “మహాభారతంలో స్త్రీలు” అనే పరిశోధనా గ్రంథంలో భారతాన్ని స్త్రీల కోణంలో పరిశీలించారు. వారు 22 పుస్తకాలను ప్రచురించారు. వందలాది వ్యాసాలు వున్నాయి. ఇందులో పరిశోధన, విమర్శ, దృశ్య, శ్రవ్య నాటకాలు, కవులు – గల్పికలు, కవిత్వము, బాల సాహిత్యము ఉన్నాయి.

యశోదారెడ్డి సాహిత్య జీవితం కథలు, ముచ్చెట్లు రచనలతోనే ఆరంభమైంది. 1950 దశకారంభం నుంచే ఆమె ఆలిండియా రేడియోలో ‘మహాలక్ష్మి ముచ్చట్లు’ అని వినిపించేది. అవి ఆమె పుట్టిన పాలమూరు జిల్లా బిజినేపల్లి గ్రామం భాషలో – యాసలో వుండేవి. తర్వాత ‘మా వూరి ముచ్చట్లు’ పేరుతో కథల సంపుటి ప్రచురించారు. ఆమె కథలు అచ్చమైన మాండలికంలో వుంటాయి. మాండలిక పదాలను ప్రజలు ఎట్లా పలుకుతారో అదే విధంగా ఆమె కథల్లో వ్రాశారు. అందుకే ఆమె కథలు మనకు మనం చదువుకున్న దానికన్నా, ఆమె చదివి వినిపిస్తుంటే, చాలా రక్తి కట్టాయి. మాండలిక పదాలను చక్కని యాసలో భావయుక్తంగా చదివి వినిపించడం ఆమెకున్న విద్యల్లో ఒకటి. అలా తెలంగాణ మాండలికం అంటే యశోదారెడ్డి అని పేరు తెచ్చుకున్నారు.

యశోదారెడ్డి కథారచన 1950 దశకంలో ఆరంభమై 1956 తర్వాత 1960, 70వ దశకాల్లోనే ఎక్కువగా సాగిందని చెప్పాలి. ఆమె మొదట కథల సంపుటి ‘మా ఊరి ముచ్చట్లు’ 1973లో అచ్చయింది. ఆ తర్వాత ఆమె 1999లో ‘ధర్మశాల’, 2000లో ‘ఎచ్చమ్మ కథలు’ అచ్చయ్యాయి. పబ్లిషర్లు ఎక్కువగా మార్కెట్టున్న నవలలను అచ్చువేసినట్లుగా కథలను వేయడానికి ముందుకు రాలేదు. ఆమె సొంతంగానే కథలను అచ్చు వేసుకోవలసి వచ్చింది. కాబట్టి ఆమె కథలు తెలంగాణ కథకులందరి కథల్లాగానే ఆలస్యంగానే పుస్తకరూపంలో వచ్చాయి.

అక్షరాస్యత లోపించడం వలన, సంస్కృతం – ఉర్దూల ప్రభావం లేకపోవడం వలన గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అచ్చమైన తెలుగు వినిపిస్తుంది. గ్రామాల్లో కూడా ఉర్దూ ప్రభావం పెరుగుతున్న రోజుల్లోనే, తెలుగువారందరూ ఏకమై విశాలాంద్రగా రూపొందినారు. కాని ఈ రెండూ ప్రాంతీయ భాషలకు సరియైన సమన్వయము కుదరలేదు. సరికొత్తగా వ్యవహార భాష ఏర్పడినది. దీని ప్రభావం వల్ల తదితర ప్రాంతాల వలెనే తెలంగాణ తెలుగు కూడా తన నిజస్వరూపాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకని అమూల్యమైన ఆ పదబంధములు కాలగర్భంలో కలసిపోకుండా ఆ భాషను – యాసను కాపాడవలెనను తాపత్రయంతో ఈ కథలను రాశానని రచయిత్రి ‘మా వూరి ముచ్చట్లు’ ముందుమాటలో తెలియజేశారు.

‘మా వూరి ముచ్చట్లు’ సంపుటిలో పది కథలున్నాయి. మొదటికథ “గంగిరేగి చెట్టు”లో కాశిరెడ్డి తన చెల్లెలు ముత్యాలమ్మ కొడుకైన రఘునాధరెడ్డికి తన కూతురు ఎచ్చమ్మనిచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. మేనరికం పైగా ఆస్తిపరుడైన అన్నగారి అండ వుంటుందని ముత్యాలమ్మ వారి పెండ్లికి ఒప్పుకుంటుంది. అప్పట్లో బాల్య వివాహాలు మామూలే. ఇంటివెనుక వున్న గంగిరేగి చెట్టు పండ్లు తెంపుకోవడానికి పిల్లలైన ఎచ్చమ్మ, రఘునాధరెడ్డి ఇద్దరూ చెట్టు ఎక్కుతారు. ఎచ్చమ్మకు కిందకి దిగడానికి రాకపోతే రఘునాధరెడ్డి వంగితే, వాడి వీపు మీద కాలుపెట్టి ఎచ్చమ్మ దిగడం ముత్యాలమ్మ చూసి హడలిపోతుంది. ఇప్పుడే పిల్లవాడ్ని వాజమ్మను చేసి ఆడిస్తున్నది. రేపు పెళ్ళయితే దీన్ని తట్టుకోగలమా? అని ఆలోచించి ఆ సంబంధం మానుకుని వెళ్ళిపోతుంది. “మ్యానరికం” కథలో పండుగకు వచ్చినా చెల్లెలు అలిగి ఏడుస్తూ వెళ్ళీపోతుంటే, అన్న వచ్చి ఓదార్చి తప్పకుండా తన కూతుర్ని ఆమె కొడుకుకిచ్చి పెళ్ళి చేస్తానని వాగ్దానం చేసి, ఇంటికి తీసుకువస్తాడు. “నాగి” ఆకలితో, దారిద్ర్యంతో పనులు లేక మగాడిలా తిరుగుతూ దొంగతనాలకు అలవాటుపడుతుంది. పట్నంలో చదువుకుని వచ్చిన రాంరెడ్డి ఆమె సంగతి తెలుసుకుని చేరదీస్తాడు. ఆమెకు పని ఇచ్చి ఆశ్రయం కల్పిస్తాడు. నాగి నమ్మకంగా కష్టపడుతూ పనిచేసి, ఇంటిదొంగలను పట్టించి తన స్వామిభక్తి నిరూపించుకుంటాడు. “పీర్ల పండుగ” సందర్భంగా ఆ వూళ్ళో జరిగే హడావుడి – వైభవాన్ని వర్ణించడమే ఇందులో కనిపిస్తుంది. “మొమైన కథ”లో ఎచ్చమ్మ బడినుండి తిరిగివస్తుంటే మూల మలుపు దగ్గర అమరుసింగ్ కనిపించి పూలు తీసుకోమని పిలుస్తుంటే, వాడి భీకరాకారం చూసి, పిల్లల్ని ఎత్తుకుపోయేవాడిగా భావించి భయపడి, పరుగుతో ఇంటికి వచ్చి దాక్కుంటుంది. చివరకు తెలుస్తుంది అసలు విషయం. అమరుసింగు తన బాల్యంలో ఇంట్లో జీతగాడుగా పనిచేస్తూ, ఎప్పుడూ తన భుజాల మీద వేసుకుని తిరిగేవాడట. ఇక్కడ పని మార్చేసి పట్నం వెళ్ళి, మళ్ళీ ఊరికి తిరిగి వస్తాడు. ఎచ్చమ్మను గుర్తుపట్టి ఆమె పట్ల ప్రేమతో ఆమెకు పూలు ఇష్టం అని ఇవ్వబోతే, ఆమె అపార్థం చేసుకుంటుంది. తర్వాత వాళ్ళిద్దరు మంచి స్నేహితులైపోతారు. హిందీ, ముస్లిం సమైక్యతను ప్రబోధించే కధ “జతగాళ్ళు” కాగా, సన్యాసి సంసారిగా మారిన వైనాన్ని “జోగుళయ్య” తెలియజేస్తుంది. “మా పంతులు” కథలో నైజాం ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వస్తుంది. ఈ రాజకీయాల వల్ల ఊళ్ళో వచ్చిన మార్పుల గురించి ఈ కథలో తెలియజేస్తారు. ఆ వూళ్ళో ఉన్న ఒక బడిని అప్‍గ్రేడ్ చేస్తారు. బాలశిక్ష చెప్పే పంతులు ఇప్పుడు పనికిరాడు. అతనికి ఆంగ్లం రాదనే మిషతో తొలగించి, ఏరవతల వున్నవాడ్ని (ఆంధ్ర నుండి) పిలిచి అక్కడ ఉద్యోగం ఇస్తారు. నాలా కాకుండా మీరు బాగా చదువుకుని, బాగుపడండని చెప్పి పంతులు బడి విడిచి వెళ్ళిపోతాడు. “ఎంకన్న” అనే కోడె, సీతమ్మ అనే ఆవు మానవులలాగా ఆదర్శ దాంపత్యాన్ని నెరపాయనే నమ్మశక్యం కాని విషయాన్ని ఒక కథలా మలచడం ఆశ్చర్యం. “మురారి” తాను ప్రేమించిన శాంత దూరం కావడంతో తన జీవితానికి అర్థం, పరమార్థం వెదుక్కుంటూ, ఆమె పుట్టి పెరిగిన ఊర్లోనే తను వుంటూ, ఆ ఊళ్ళోని మనుషుల్లో ఒకడుగా అందరికి అండగా నిలుస్తాడు. ప్రేమ విఫలమైనా, సామాజిక లక్ష్యాలతో గ్రామం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శవ్యక్తిగా “మురారి” నిలిచిపోతాడు.

“మా వూరి ముచ్చట్లు” సంపుటిలోని కథలన్నీ 1950-65 మధ్యకాలానికి చెందినవి. ఆ కాలానికి సంబంధించిన సామాజిక అంశాలు, మానవ సంబంధాలు, సంస్కృతి ఈ కథల్లో చిత్రించబడినాయి. ఇందులో తెలంగాణ అమ్మలక్కలు, ముసలివాళ్ళు, ఇతర గ్రామీణులు పెట్టే ముచ్చట్లు మౌఖిక కథాకథనశైలిలో రూపొందాయి. సర్వసాక్షి కథనంగా చెప్పిన “గంగిరేగి చెట్టు, నాగి, మ్యానరికం, మా పంతులు, ఎంకన్న, ముమ్మై కథలు ఎదుటివారిని సంబోధించి చెప్పే జానపద శైలిని అనుసరించి ఉత్కంఠ భరితంగా సాగాయి. ఇందులోని కథల్లో ఎన్నో పలుకుబడులు, సామెతెలు, జాతీయాలు, ప్రజల నోట్లో నానే గ్రామీణ పదాలు ఎంతో చక్కగా ఒదిగిపోయాయి. ఒక పరిశోధకురాలిగా తానే ఆయా పదాలను, జాతీయాలను, సంస్కృతిని, సామెతలను, మాండలికంలో భాషా ధ్వనుల మార్పులను అనుబంధంలో వివరించారు. అందుకనే ఈ సంపుటిని గ్రామీణ సంస్కృతి జీవన సౌరభాన్ని అక్షరబద్దం చేసిన విజ్ఞాన సర్వస్వంగా చెప్పుకోవచ్చు. యశోదారెడ్డి భర్త ప్రఖ్యాత చిత్రకారుడు పి.టి. రెడ్డి ఈ కథలకు పెయింటింగ్స్ లాంటి చిత్రాలను వేయడం, వారే గీసిన రచయిత్రి చిత్రాలు కూడా మొదట్లో చేర్చడం ఈ పుస్తకానికి మరింత శోభను చేకూర్చాయి.

“ఎచ్చమ్మ కథలు” 2000లో వెలువడింది. ఒంటరిగా మిగిలిపోయిన ఆడపిల్లలను వేశ్యలుగా మార్చే విషవలయం నుండి “మోనా” తప్పించుకుని కొత్తజీవితాన్ని ప్రారంభించడమే మొదటి కథ. కుక్కల్లా పోట్లాడుకుంటూ చెత్తకుండీల మీద ఆధారపడి బతికే నికృష్టజీవుల బతుకులు ఎంతో ఘోరంగా వుంటాయో? దీనికి కారణం ఎవరని తర్కించడం “తరాల నాటి తెగులు”లో కనిపిస్తుంది. పద్మినిని ప్రేమించిన విజయబాబు, తన తల్లిదండ్రుల ఆమోదాన్ని పొందడానికిగాను, ఆ అమ్మాయిని తమ ఇంట్లోనే పనిమనిషిగా ప్రవేశపెట్టి, అనుకున్నది సాధిస్తాడు. కోటిలింగం “ఆ రెండు నావి” అని ఎల్లమందకు ప్రామిస్ చేసినప్పుడు, ఏంటో అనుకున్న బుచ్చిబాబు ఆ రెండు “బరువు, భారం” అని తెలుసుకుంటాడు. దసరా పండుగ వేడుకలు, ఊరి రాజకీయాలను “జమ్మి” కథలో వర్ణించారు. ఎలమంద కుటుంబానికి దొర చేసిన సాయాన్ని సహించలేని దొరసాని, దొర తదనంతరం అన్నీ లాక్కుని ఆ కుటుంబాన్ని రోడ్డుపాలు చేస్తుంది. కొంతకాలానికి ఆ వూరికి డిప్టి కలెక్టరుగా వచ్చిన కోదండం – ఎలమంద కొడుకునీ, అతని హోదా ముందు, అతని హృదయవైశాల్యం ముందు తామెంత అల్పులో దొరసాని తెలుసుకుంటుంది. ఆస్తులు వుండగానే సరికాదు. దాన్ని కాపాడుకునే తెలివి కావాలి. చెడు అలవాట్లతో అన్నీ పోగొట్టుకుని బిచ్చగాడిగా మారిన బాబయ్య కథే “సందె బిచ్చం తల్లీ” దుర్మార్గుడైన బాలారెడ్డిలాంటి స్నేహితులు వలన “సీనయ్య” లాంటి కష్టజీవులు కూడా నాశనమవుతారని ఒక కథ తెలియజేస్తుంది. “నిశ్చితార్థం” కథలో, తెలంగాణ పెళ్ళి సంబంధం చూడటానికి రైలు ప్రయాణం చేసి వచ్చిన కోస్తావారికి – పెళ్ళికూతురు తరపున వాళ్ళంతా అనాగరికులని, వాళ్ళ భాష – యాస – సంస్కృతిని అవమానిస్తూ మాట్లాడటంతో, పెళ్ళికూతురు ప్రభ ఆ సంబంధాన్ని తిరస్కరిస్తుంది. పెద్దల ప్రవర్తనకు విసిగిపోయిన పెళ్ళికొడుకు ప్రసాద్, సామరస్యంగా కాపురం చేసుకునేది మనమే కదా అని నచ్చజెప్పి ప్రభను పెళ్ళిచేసుకుని వస్తాడు. మనసులు కలవడమే ముఖ్యం కాని మిగతావి కాదని తేల్చేస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పెట్టిన పేర్లు రకరకాలుగా వుంటాయి. తర్వాతకాలంలో కొంతమంది తమపేర్లు మార్చుకుంటారు. పేరుని బట్టి మనిషిని అంచనా వేయలేం. అందుకని ” పేర్లేముందని పెద్దర్కెం” అని రచయిత్రి చెబుతారు. అందరి అభిప్రాయాలు, ఆలోచనలు, కోరికలు ఒక రీతిగా వుండవు. భార్యాభర్తలలోనైనా, పిల్లలలోనైనా, పండితులలోనైనా ఎవరి అభిప్రాయాలు వారివి. అందుకే “పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి” అన్నారు. అందరి రుచులు ఒక్కటయితే ఇన్ని రుచులెందుకని ప్రశ్నిస్తారు. కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు ఇలా ప్రతిదానికి తప్పులు తీస్తూ కోడలును రకరకాలుగా వేధించుకు తినే అత్తగారింట్లో “కోడలమ్మ ఎతలు”ను తెలియజేస్తారు. పెండ్లికంటా సంబరపడిపోవడం రేపు “ఎదుర్కోళ్ళు” అనగా అంతా పెండ్లి ఇంటికి పోతారు. అక్కడ ఆడపిల్లలు చేసే హంగామా, హడావుడి అంతా ఇంతా కాదు. అలా అక్క పెళ్ళి హడావుడిలో చెల్లెలికి సంబంధం కుదరడం అందరికీ సంతోషాన్ని కలుగజేస్తుంది. “ఓర్పు బండ” రాయి వెనుకగల కథను వివరిస్తూ, ఆ వూళ్ళో ఎన్నికల సందర్భంగా జరిగిన సభను, హంగామాను తెలియజేస్తారు. ఎన్నికలు వస్తున్నాయని కొట్లాటలు లేకుండా అన్ని పార్టీలు కలసి చెరువుకట్ట మరమ్మత్తుల పనిని పంచుకోవడం “బుక్కిందే దక్కింది”లో కనిపిస్తుంది. పట్నం పోకడలకు అలవాటుపడి వూళ్ళో పొలాలన్నీ అమ్ముకుని, పట్నంలో కంట్రాక్టరుగా మారిన దొర తన కుటుంబాన్ని రక్షించుకోవడం “దొరా! నన్ను అమ్ముకోకు”లో చూడవచ్చు. ఇద్దరు పెళ్ళాల మధ్య నలిగిపోయిన “మిఠాయి రాములు” కథ కూడా ఇందులో ఉంది.

తెలంగాణ సంస్కృతిని – సంస్కృతిలో వస్తున్న మార్పులను తెలియజేయడానికి వ్యాసం లాంటి కథలను కూడా కొన్ని రాశారు. వాటిలో దసరా పండుగ వేడుకలు – ఆ వూరి రాజకీయాలను “జిమ్మి” కథ తెలియజేస్తుంది. రైలులో రచయిత్రి టూటైర్‍లో చేసిన ప్రయాణం. ఆ పెట్టెలో వున్న ప్రయాణీకులు, వారి వారి స్వభావాల గురించిన వర్ణన రెండు కథల్లో కనిపిస్తుంది. అర ఎకరం పొలాన్ని ఆక్రమించి వెలసిన “పెద్దమర్రి” ముచ్చట కూడా ఇందులో వుంది. ఎయిర్‍పోర్టులో జరిగే తతంగం, విమాన ప్రయాణీకులు నడవడికను “సీతమ్మ విలాయత్”లో తెలియెజేశారు. “మా ఊరి ముచ్చట” పేరుతోగల మూడు వ్యాసాలలో ఎన్నో విశేషాలను తెలియజేస్తారు. తెలంగాణలో కనిపించే రకరకాల నగలను ఆడా-మగ విడివిడిగా ధరించేవాటిని వివరంగా “సొమ్ము – సొమంతం”లో తెలియజేశారు.

యశోదారెడ్డి తన బాల్యస్మతుల్ని, అనుభవాలను దృష్టిలో పెట్టుకుని – తమ జీవితంలో జరిగిన సంఘటనలను తీసుకుని, తెలంగాణ మాండలికంలో కథలుగా తీర్చిదిద్దారు. ఈ కథలోని ‘ఎచ్చెమ్మ’ ఎవరో కాదు, తానేనని రచయిత్రి ఎన్నో సందర్భాలలో వివరించారు. ఉత్తరాల రూపంలో రాసిన ఈ కథలు మౌఖిక శైలిశిల్పాలతో కూడుకుని వున్నాయి. ఈ కథలు ఉత్తరాల ప్రక్రియ ద్వారా సెకండ్ పర్సన్ ఎదుటివారికి కథ చెబుతున్నట్లుగా కొనసాగుతాయి. ఈ కథలు 1965-80 మధ్యకాలంలో మహబూబ్‍నగరు, కరీంనగర్ జిల్లాల సామాజిక పరిణామాలను చిత్రించాయి. భాష కూడా “మా వూరి ముచ్చట్లు” కథా సంపుటి నుండి కాస్త మారిన క్రమం ఇందులో కనబడుతుంది. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు ఆ దశాబ్దాల తెలంగాణ ప్రజలను, సంఘటనలను, సంస్కృతిని ప్రతిఫలిస్తాయి.

“ధర్మశాల” కథాసంపుటి 1999లో వెలువడింది. ఇందులో గణపతి చతురస్రాకారంలో కట్టిన ఇంటిని “ధర్మశాల” పేరుతో నాలుగు భాగాలుగా చేసి, నాలుగు కుటుంబాల వారికి అద్దెకిస్తాడు. నాలుగు వేరువేరు కులాలకు సంబంధించిన వారు అద్దెకు దిగడం మొదట్లో కొంత ఇబ్బందిని, తర్వాత కొన్ని సమస్యలు ఎదురైనా తర్వాత అంతా సఖ్యమైపోతారు. దొరల ఇండ్లలో వుండే కుక్కల వైభవాన్ని “లూరా” కథ తెలియజేస్తుంది. కొత్తగా పెళ్ళయిన శ్రీనివాసరావుకు పట్నంలో ఇల్లు దొరకక రెడ్‍లైట్ ఏరియాలో అద్దెకు తీసుకుంటాడు. అతని పల్లెటూరి భార్య, భర్తను ఆకట్టుకోవాలనే కోరికతో బజారు ఆడవాళ్ళు చేసే చేష్టలను అనుకరిస్తుంది. అది వికటించి ఎవరో విటుడు వచ్చి, ఆమెను మానభంగం చేసి పోతాడు. తెలిసిచేసినా, తెలియక చేసినా, “నిప్పుతో చెలగాటం” వల్ల జీవితాలు నాశనమవుతాయని ఈ కథ చెబుతుంది. రామారావు బ్రతికి చెడ్డవాడు. “అక్కాయ్‍ను కొనండి – చెల్లాయిని తీసుకెళ్ళండి” అనే ప్రకటన స్పూర్తితో తన ఇద్దరు కూతుళ్ళకు పెళ్ళిచేసిన విధానం చాలా గమ్మత్తుగా ఉంటుంది. రంగడు హెల్మెట్ లేకుండా పోలీసులకు దొరకడం, ఎదురు తిరిగి దెబ్బలు తిని, హాస్పిటల్‍కు చేరానని చెబుతాడు. అసలు విషయం అందరికి తెలిసి ఇదా “రంగడి ప్రయోజకత్వం” అని అంతా నవ్వుకుంటారు. ధనవంతుడైన సీతారామరాజు ఇంట్లో శోభనం వద్దని భార్య “ప్రమీల”ను తీసుకుని హనీమూన్‍కు వెళ్తాడు. హనీమూన్‍కు వెళ్ళిన ప్రమీల శవంగా వస్తుంది. కడుపునొప్పితో చనిపోయిందని అందర్ని నమ్మిస్తాడు. నపుంసకుడు, శాడిస్టు అయిన్ సీతారామరాజు తన రహస్యం తెలియకుండా ఆమెకు చంపివేశాడని గ్రహించిన శ్రీనివాసబాబు, తెలివిగా ప్లాన్‍ వేసి వాడ్ని రెడ్ హండెడ్‍గా పోలీసులకు పట్టిస్తాడు. సీత, జానకి మంచి స్నేహితురాళ్ళు. వాళ్ళకు పరిచయమైన రఘును ఎవరు పెళ్ళిచేసుకున్నారో తెలుసుకోవాలంటే “గుళ్ళోగంటలు” చదవాల్సిందే. అరుణకు ఉదయం రేడియో స్టేషన్‍లో రికార్డింగ్ ఉంటుంది. బస్‍లు రష్‍గా ఉన్నాయని రిక్షాలో ఎక్కితే వాడు అసలుతోవ వదిలేసి, వేరే తోవలో తీసుకుపోవడంతో ఆమె కీడు శంకించి వాడిపై ఆగ్రహిస్తుంది. తనకు తొందరగా వుందని. వాడు షార్ట్ కట్‍లో తీసుకుపోతున్నాడని తెలుసుకుని, తన తొందరపాటుకు చింతించడం “తియ్యెటి తీగలు”లో కనిపిస్తుంది. మనం ఎంత ఎదిగినా కన్నతల్లిని, పుట్టిన గడ్డను, ఆదుకున్న మట్టిని, మన భాషను మరిచిపోకూడదు. అదే మన సంస్కారానికి చిహ్నం అని “దిబ్బరొట్టె”లో తెలుసుకుంటాం. ప్రశాంత్ నర్సింగ్ హోమ్‍లో “రూం నెంబర్ త్రీ”లో దెయ్యం వుందని పుకారు లేపి, ఏ పేషంట్ అందులో వుండకుండా చేస్తారు. ఎవరూ చేరని ఆ గది రహస్యాన్ని కొత్తగా వచ్చిన డా. వేణుగోపాల్ కనిపెట్టి, పరిస్థితి చక్కబెడతాడు. వేశ్యావృత్తిలో పడబోయే అనసూయను రక్షించి, ఆమె దీనగాథ విన్న శారద ఆమెకు దైర్యం చెప్పి, చదువుకుని బాగుపడమని బోధిస్తుంది. అంతా ఆమెకు అండగా వుంటామని వాగ్దానం చేయడం “బరిబత్తల బొమ్మ” లో చూడవచ్చు. తమ ఇంట్లో పెరిగిన “సంది” వయసులోనికి రాగానే ఆమె పట్ల ఆకర్షితురాలైన తండ్రి, మేనమామల కామదాహం నుండి రక్షించడానికి కొడుకే ముందుకు వచ్చి ఆమెకు పెళ్ళిచేసుకుంటాడు. “పరిత్యక్త” లో ప్రేమించినవాడు మోసం చేయగా, తల్లి కాబోతున్న అమ్మాయిని ఇంట్లోంచి గెంటివేస్తే ఆమె పిచ్చిదైపోతుంది. తర్వాత కాలంలో తనను గుర్తుపట్టిన ఆ పిచ్చిదాని బారినుండి ఆ ధనంవంతుడు తెలివిగ తప్పించుకోగా, జనమంతా కలిసి ఆ పిచ్చిదాని కొడుకును అనాథాశ్రమంలో చేర్పిస్తారు. ఇక కోయగూడెంలో ఉన్న కోయల ఆచారాలు ఎంత విచిత్రంగా వుంటాయో “సంకు దేముడు” తెలియజేస్తుంది. తమ స్వార్థం తమ ప్రయోజనాలే తప్ప సామాన్యుల గోడును పట్టించుకోని రాజకీయ నాయకుల ఎన్నికల ప్రచార ఆర్భటాన్ని, ప్రజాసొమ్మును దుర్వినియోగం చేయడాన్ని “రాజుగారి ఒక్కనాటి ప్రచారం”లో వివరించారు. రాజకీయ నాయకుడ్ని రాజుగా మార్చి వ్యంగ్యంగా కథను నడిపించారు. మన సాహిత్యంలో, నిత్యవ్యవహారంలో అసలు పేర్లు కాకుండా ఎన్ని మారుపేర్లు, ముద్దుపేర్లు, కలం పేర్లు ఎన్ని వున్నాయి. “పేరులో ఏముంది” పేరిట వీటన్నింటిని విఫలంగా చర్చించడం కనిపిస్తుంది. “ఎదల్లోని పొరలు”లో రైలులో ఫస్ట్ క్లాస్‍లో ప్రయాణంచేస్తున్న రచయిత్రికి ఒక NRI జంట కనిపిస్తుంది. అందులో ఆధిక్యత ప్రదర్శించే భార్యను చూసి అహంకారిగా భావిస్తుంది. చివరకు ఆమెను సభ్యత, సంస్కారం వున్న మనిషిగా గుర్తిస్తుంది. అలాగే మరో రైలు ప్రయాణంలో స్త్రీల పెట్టెలో వెంకాయమ్మ గారి ఉత్తమ సంస్కారాల, మనవతావాదం రచయిత్రిని ఆకర్షిస్తుంది. అక్కడ జరిగిన సంభాషణల్లో “దేవుడున్నాడా?” అనే చర్చకు శేషుసాంబగారు ఇచ్చిన సమాధానం రచయిత్రిని ఆశ్చర్యానికి, ఆలోచనకు గురిచేస్తుంది. ఆ సంవత్సరం ఎండలకు సుందరమ్మ గారింట్లో వున్న బావికూడా ఎండిపోతుంది. పూడిక తీయిస్తే ఆ బావిలో నీటికి కొరత వుండదు. ఆచారాలు, సంప్రదాయాల పట్ల ఎక్కువ పట్టింపు వున్న సుందరమ్మ దానికి ఒప్పుకోదు. విశాల హృదయుడైన కొడుకు రాధాకృష్ణమూర్తి నాటకమాడి తల్లి కళ్ళు తెరిపించడం “ఊరి అవతల బావి” లో చూడవచ్చు. “సౌభాగ్యవతి” అంటే సంసారానికి పనికిరాని మొగుడ్ని అప్రదిష్ట పాలు చేయలేక ముత్తయిదువుగా చనిపోయిన లక్ష్మీనర్సు కథ. “కల కల్ల కాలేదు” ట్రయాంగిల్ లవ్ స్టోరీ. “అందిన కందిరీగ”లో యమున ఎదుర్కొంటున్న సమస్యలను, మోస్తున్న బరువు, బాధ్యతలను అర్థం చేసుకుని సునీత, ఆమెకు తోడునీడగా ఉండటానికి ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. ఇక మొదటిసారి విమానంలో అమెరికా వెళ్ళడానికి సీతమ్మగారు చేసిన ఆర్భాటం, హంగామాను “సీతమ్మగారి సీమ ప్రయాణం”లో వివరించారు. భార్యభర్తల సంబంధం అంటే కేవలం సెక్స్ కాదు. ప్రేమ, అనుబంధం, ఆత్మీయతలు కూడా అందులో కలగలసి వుంటాయని రచయిత్రి భర్త తెలుసుకోవడమే “మాధవీలత నవ్వింది”.

“ధర్మశాల”లోని కథలు వ్యావహారిక భాషలో రాయబడ్డాయి. “మా వూరి ముచ్చట్లు” కథల సంపుటిలోని తెలంగాణ భాష “ఎచ్చమ్మ కథలు”కు వచ్చేసరికి తెలంగాణ భాషను, పత్రికా భాషగా మార్చేకృషి కనబడుతుంది. “ధర్మశాల” కథల్లో పూర్తిగా పత్రిక భాష, వ్యవహారిక భాష వుంటుంది. ఇలా మారుతున్న తెలంగాణ సమాజం – భాష వాటి పరిణామాలు వీరి కథల్లో కనిపిస్తాయి.

ముగింపు:

యశోదారెడ్డి తన కథల గురించి “నా కథలన్నింటిలో వస్తువు ఎక్కడో మిన్నులు వడ్డ తావుల నుండి రాలేదు. నేను పెరిగి పెద్దవైన పల్లెపట్టులూ, చూచిన గుట్టలూ, కొండవాగులు, తిరిగి చూసిన పట్టణ నాగరికతలు, తెలిసీ తెలియని మూడనమ్మకాలు, రాజసాలు, అహంకారాలు, యువకులు, పరిత్యక్తలు, పతివ్రతలు, ధూర్తులు ఎందరెందరో – అప్పుడప్పుడు నేను విని, చదివి, చూచిన విషయం భూమిక కాగా ఇంతవరకు మస్తిష్కంలో దాగిన స్మతిజ్ఞానంతో జతపరచి కథలు అల్లడం జరిగింది. అంతేగాని వాస్తవం లవలేశం లేకుండా, స్వేచ్చగా ఊహాగానం చేస్తూ గిరగిరా రంగురాట్నం తిరగలేదు. తిప్పలేదు” అని చెబుతారు. అందుకే యశోదారెడ్డి కథల్లో ఆమె చిన్ననాటి పల్లెటూళ్ళు, అక్కడి మనుషులు, పేర్లు, అప్పటి జీవితం – సంస్కృతి ప్రతిబింబించాయి.

యశోదారెడ్డి కథల్లో వస్తువు, కథనం, కథనశైలి, వ్రాతలు, సంభాషణలు, స్వగతాలు, ప్రకృత్యాది వర్ణనలు అన్న విలక్షణంగా కనబడతాయి. వీరి కథల్లో వ్యక్తులు ఇతివృత్తం కన్నా, కథనం పాఠకుల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. కథలో ఒక్కొక్కసారి వస్తువుకు ప్రాధాన్యం లేనట్టు కనిపిస్తుంది. కథలో వస్తువుకన్నా సన్నివేశాలు, సంఘటనలు తక్కువగా వుంటాయి. కథనం, వర్ణనలు ఎక్కువగా వుంటాయి. పాత్రల మనోగత భావాల వర్ణనలు, స్వగతాలు చాలా దీర్ఘంగా వుంటాయి. ఎక్కువగా కథలు సర్వసాక్షి కథనంలో కొనసాగినా, కొన్ని కథలు ఉత్తమ పురుషలో కూడా కనిపిస్తాయి.

మాండలికంలో కథలను రాసిన ఏకైక రచయిత్రి యశోదారెడ్డి. కథల్లో వీరు అచ్చమైన తెలంగాణ భాషను ఉపయోగించారు. అయినా ఆ భాష యాసలను చదవడంలో పాఠకులకు ఎటువంటి ప్రయాస కలుగదు. ఒకవైపు మట్టివాసనలతో కూడిన పల్లె ప్రజల జీవితాలు, వాళ్ళు నిత్యజీవితంలో మాట్లాడుకునే భాష – యాసలు కథల్లో వున్నాయి. ఇంకోవైపు మాండలిక యాసలో అడుగడుగునా సామెతల నుడికారాలు, ఉపమానాల సొంపులు చేరి, ఆమె కథల్లోని రచనాశైలికి జీవకళను తెచ్చిపెట్టారు. అలా తెలంగాణ జనజీవన చరిత్రకు – సంస్కృతికి యశోదారెడ్డి కథలు సాక్ష్యంగా నిలుస్తాయి.

Exit mobile version