Site icon Sanchika

పాకానపడిన ప్రేమకథ

[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘పాకానపడిన ప్రేమకథ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ప[/dropcap]రిచయం వద్దనే ఆ ఇద్దరికీ
‘నచ్చటం’ అనేది కొద్ది కొద్దిగా మొదలైంది
అభిరుచులు ఇష్టాఇష్టాలు
అటూఇటూ మార్పిడి అయిపోయాయి

వాళ్ళిద్దరి మధ్యన..

పొద్దు పొద్దున్నే శుభోదయం చెప్పి
మాట, మౌనాన్ని నిద్దుర లేపుతుంటే
చిరాకుగా చూసే చీకటికి బెదిరిన మౌనం
గుడ్‌ నైట్ చెప్పి మాటను జోకొడుతోంది

కబుర్లాడుకుంటుంటే
పందెపు పరుగులు పెడుతోన్న కాలం
వేచిచూపుల వేళ మాత్రం
విసుగెత్తే పెళ్ళి నడకలు నడుస్తోంది

మొన్నా ఆ ముందంతా
మాటల్లో చెడతిరిగిన ‘మీరు’
గౌరవం మేకప్పును తుడిచేసుకుని
నిన్నటి నుంచి ‘నీవు’ అయిపోయింది

అవును.. అదేంటి..?

హద్దుల వద్ద మొహమాటం
కాపలా మరికాస్త తగ్గించినట్లుంది
ఇకఇకలూ పకపకలూ
ఇచ్చి పుచ్చుకోవడాలూ
ఇప్పుడు బాహాటమయినట్టున్నాయి

ఇరుగుపొరుగుల గుసగుసలు
‘ఊరంతా అనుకుంటున్నారు’ స్థాయికి
ఉన్నట్టుండి చేరుకున్నట్టున్నాయి

పాకాన పడిన ఈ ప్రేమకథ
కంచికెళ్ళేందుకు ముస్తాబై కూచున్నట్టుంది

Exit mobile version